March 19, 2024

కాసులపేరు

రచన: సావిత్రి దుడ్డు

నాన్నమ్మగారు చూపిస్తున్న నగ చాలా బావుంది. చిన్న బంగారు చాక్లెట్ బిళ్ళలు వరుసలా ఉంది. వదిన కోసం చేయించాలి అని బంగారం కొట్టు పెద్దయ్యని రమ్మన్నారు. మా అమ్మ పక్కన కూర్చుని, తన చీర నలిపేస్తూ తనని ఊపేస్తూ “అమ్మ, నాకు ఎప్పుడు కొంటావు?” అని అడిగాను. పెద్దయ్యిన తర్వాత కొనుక్కుందాము అంది అమ్మ. యెంత పెద్ద అవ్వాలి? నేను పెద్దదాన్నయ్యాను అన్నావు కదా. గొడవ చెయ్యకూడదని! అని అన్నాను. ఏమి సమాధానం చెప్పాలో తెలియక, పదిహేను ఏళ్ళు వస్తే పెద్దదానివి అయినట్టు. లెఖ్ఖలు రావని తొమ్మిది నుండి పదిహేను ఏ ఏడాది అవుతుందో లెక్కపెట్టమని వంటింట్లోకి వెళ్ళిపోయింది.

పదిహేను ఏళ్ళు వచ్చాయి. లంగా ఓణి కట్టుకుని, కాసులపేరు పెట్టుకుని వరలక్ష్మి పూజ చేసుకున్నాము, తాంబూలానికి రండి అని వీధిలో అందరిని పిలిచి వచ్చాను. పసుపు రంగు లంగా, ఇటుక రంగు ఓని, పెద్ద జరి, కాసులపేరు, నేను. అందరు నన్ను చూస్తున్నారో లేదో తెలియదుకాని, మా అమ్మ నన్ను చూస్తూనే ఉంది, ఎక్కడ అల్లరి చేస్తూ ఆ నగ పారేసుకుంటానో అని భయపడుతూనే ఉంది. ఆలా ఎలా పారేసుకుంటాను! అది నా కాసులపేరు. నా కోసం అమ్మ నాన్న కష్టపడి చేయించారు. ఆ రోజు చాలా బుద్ధిగా ఉన్నాను అని రాత్రి అమ్మ అంటే, రోజు కాసులపేరు పెట్టుకుంటే ఇంకా బుద్ధిగా ఉంటాను అన్నాను. స్కూల్ కి బావుండదు అని, బ్యాంకు లాకెర్ లో పెట్టేసారు. మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే, ఎవరైనా పెళ్ళికి వెళితే పెట్టుకుందువుగాని, అని సమాధానమిచ్చి పడుకుంది.

నాన్నమ్మగారు ఇంటికి వస్తారు, త్వరగా స్కూల్ నుండి వచ్చేయి. మగపిల్లలతో ఆడుకుంటూ కనిపించకు, బుద్ధిగా, నెమ్మదిగా ఉండు, ఎక్కువ మాట్లాడకు, ఒక్క రెండ్రోజులు, అమ్మ ఆర్డర్ వేసింది. సరే అని తలా ఊపి, స్కూల్ కి వెళ్లిపోయాను. సాయంత్రం, నాన్నమ్మగారు కుర్చీ లో కూర్చుని అమ్మ తో మాట్లాడుతున్నారు, నేను నమస్కారం చెప్పి, స్కూల్ బట్టలు బాత్రూం లో విప్పి, స్నానం చేసి, ఇంట్లోకి వచ్చి, అమ్మ చేసిన టిఫిన్ తింటూ టీవీ చూస్తున్నాను.

కాసులపేరు పెట్టుకుంటున్నావా? అని నానమ్మగారు అడిగితే, లేదు, ఎవరు పెళ్లి చేసుకోవటం లేదు అని సమాధానం ఇచ్చాను. ఆవిడ ఖంగారు పడి, అదేమిటి, పదహారు ఏళ్లైనా లేవు, అప్పుడే కాసుల పేరు వేసుకోవడం కోసం పెళ్లి కావాలా నీకు అని అడిగారు. అమ్మ ఇంకా ఖంగారు పడి, ఎవరైనా పెళ్లి చేసుకుంటే నగ పెట్టుకోవచ్చు అన్నానండి, అందుకని ఆలా పెళ్లి అని మాట్లాడుతోంది. నానమ్మగారు, ఏమనుకున్నారో ఏమో, చదువు సరిగ్గా లేదుకదా, పెళ్లి కావాలంటోందేమో అనుకున్నా, అన్నారు. అమ్మకి ఉక్రోషం ఎక్కువ. పైకి ఏమి అనకపోయినా, లోపల బాధపడింది. నాన్నమ్మగారు రెండ్రోజులు తర్వాత ఊరికి వెళ్లిపోయారు.

ఆ రోజు రాత్రి పడుకునే ముందు అమ్మ చెప్పిన మాట, ఎన్ని నగలు ఉన్నా, ఎలాంటి నగలు ఉన్నా, చదువు అనే నగ లేకపోతే ప్రపంచంలో నెగ్గలేవు. ఇంకా ఎం చెప్పాలో ఎంత చెప్పాలో, చెప్పిందో లేదో తెలియదు. ఎన్నో సందర్భాలు వచ్చాయి వెళ్లాయి, కాసులపేరు వేసుకున్నాను కానీ, ఆ ఆనందం, మళ్లీ రాలేదు.

వరలక్ష్మి పూజ చేసుకున్నామని, వీధిలో అందరిని పిలిచి రామ్మా అన్నారు అత్తయ్యగారు. నగలు పెట్టుకో, మరీ కాసులపేరు కాదు, మావయ్యగారు చేయించిన వరాహలపేరు పెట్టుకో. చదువు పదిమందిలో ఎలా ఉండాలో నేర్పింది, సమాధానం ఎక్కడ చెప్పాలో నేర్పింది. అత్తగారిదగ్గర మౌనం నేర్పింది. వరాహలపేరు వేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి, నగతో, నగువతో సాయంత్రం గడిచింది.

దేశంకానిదేశం, ఇక్కడ ఎవరికీ తెలుసు నీ కాసులపేరు గురించి. అది బ్యాంకు లాకెర్ లో ఉండని. ఆ సొలిటైర్ పెట్టుకో, అందరికి దాని విలువ అర్ధం అవుతుంది అన్న భర్తగారితో నగ గురించి యుద్ధం ఎందుకని చదువుకున్న చదువు మారు మాట్లాడకుండా చేసింది.

పది ఏళ్ళ తర్వాత, ఇండియా లో ఉన్నాం. కూతురు తో, వరలక్ష్మి పూజ చేసుకున్నాను. లంగా జాకెట్ వేసుకుని కాసులపేరు పెట్టుకుని కూర్చో, అందరు తాంబూలానికి వస్తారు. వచ్చి రాని తెలుగు మాట్లాడితే నవ్వుతారు. కానీ, ఎంత వచ్చో అంత సరిగ్గా మాట్లాడు అని చెబుతున్న నాకు, స్టాప్ అమ్మ స్టాప్. ఐ విల్ టేక్ కేర్ అఫ్ టాకింగ్ పార్ట్ (మాట్లాడడం గురించి నేను చూసుకుంటాను). ఆ చైన్ నాకు వద్దు అంది. ఇట్స్ ఓల్డ్. ఇట్స్ బోరింగ్ అంటున్న పిల్ల మాటలకి సమాధానం ఏమివ్వాలా అని ఆలోచిస్తున్న నాకు, సమాధానం తానే ఇచ్చేసింది.

మామ్, డెకరేట్ వరలక్ష్మి విత్ యువర్ చైన్, అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మవారికి పెట్టమ్మా అని చెప్పిన తన ఇంగ్లీష్ మాటలకి ఇంక మారు మాట్లాడలేదు. కాసులపేరు వేసుకోవాలి ఆనుకున్నప్పటి తొమ్మిది ఏళ్ళ నాకు, అమ్మవారికి వెయ్యమన్న నా తోమ్మిది ఏళ్ళ కూతురికి, ఆలోచనలలో ఎన్నో అంతరాలున్నాయి.

ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి సర్దుకుని, వరలక్ష్మి దేవిని తరతరాలకు ఆలోచన పెంచే చదువు ఉండేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటూ, కాసులపేరు అలంకరించి, మంగళహారతి ఇచ్చి నమస్కరించాను. 🙏

1 thought on “కాసులపేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *