March 19, 2024

కురువంశ మూల పురుషుడు “వసు (ఉపరిచరుడు) చక్రవర్తి”

రచన: శ్యామసుందరరావు

ఒకసారి వేటాడాలన్న ఆసక్తితో చేది రాజు వసు తన పరివారముతో వేటకు బయలుదేరాడు కొంచము సేపు వేటాడినాక అలసిపోవటం వల్ల ఆ ప్రాంతములోని ఒక ఆశ్రమాన్ని చేరి అక్కడి ఆశ్రమ ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణానికి సంతోషపడి తాను ప్రస్తుతము గడుపుతున్న జీవితము మీద విరక్తి కలిగింది.ఈ భోగభాగ్యాలు సుఖాలు అన్ని అశాశ్వతమని పరమాత్ముడే శాశ్వతమని నిర్ణయించుకొని అన్నిటిని త్యజించి తపస్సు ప్రారంభించాడు.ఈ తపస్సు తన ఇంద్రపదవికి అన్న అనుమానంతో రాజు కోరకుండానే ఇంద్రుడు ఇతర అష్ట దిక్పాలకులు ప్రత్యక్షమైనారు. ఇంద్రుడు రాజుతో ,”రాజా నీ వంటి వారి వలననే భూమి మీద సుఖసంతోషాలు వెల్లి విరుస్తున్నాయి నీవు నీ రాజ్యానికి వెళ్లి రాజ్యపాలన సాగించు, వర్ణాశ్రమ ధర్మాలను నిలబెట్టు. నీవు నాకు మంచి స్నేహితుడివి, నీకు నాకు మధ్య ఏమి భేదము లేదు, నీవు ఎప్పుడు కావాలను కుంటే అప్పుడు నా వద్దకు రావటానికి వీలుగా నీకు ఈ విమానమును బహుకరిస్తాను, నీకు దేవతల మాదిరిగానే అమరత్వ సిద్ది కలుగుతుంది” అని అనేక రకాలుగా ఇంద్రుడు వసు మహారాజును ప్రశంసించాడు ఇంద్రుడు అనేక బహుమానాలను పద్మాలను, వేణుయష్టిని బహుకరించగా రాజు నిత్యమూ ఆ పద్మమాలను ధరించేవాడు
అప్పటినుండి వసు మహారాజు ఇంద్రుడిచ్చిన బహుమానాలతో రాజ్యానికి చేరి యధావిధిగా రాజ్యపాలన మొదలుపెట్టాడు. అలాగే అప్పుడప్పుడు ఇంద్రుడు బహుకరించిన విమానంలో ఇంద్రలోకానికి వెళ్లి వస్తుండటం వలన అప్పటినుండి వసు మహారాజుకు ఉపరిచరుడు అనే పేరు వచ్చింది అంటే ఉపరి తలములో (పైన ఆకాశములో) దేవతలవలె విహరించేవాడు అని అర్ధము. ఇంద్రుని అశీస్సులతో ఉపరిచరుడు చేది రాజ్యాన్ని జయించాడు శక్తిమతి నదీ తీరాన ఒక నగరము నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడిచ్చిన పద్మములను మాలగా ధరించి వంశయష్టికి యధావిధిగా పూజ జరిపించి మహా వైభవముగా దేవేంద్రోత్సవము జరపటముతో ఇంద్రాదులకు ఉపరిచరుడు ఆప్త మితృడైపోయినాడు.
శక్తిమతి నదికి సమీపాన గల కోలాహలుడు అనే పర్వతము ఉంది ఈ నది పర్వతము ఒక్కొక్కసారి సజీవత్వము పొందినట్లు ప్రవర్తించేవి. ఒకసారి ఈ పర్వతము నదీ ప్రవాహానికి అడ్డుపడగా, శక్తిమతి కోలాహాలుని చేతిలో బందీ అయింది. అప్పుడు ఆ నది చేసిన ఆక్రందన ఉపరిచరుని చెవిన పడింది. అప్పుడు ఉపరిచరుడు ఆగ్రహముతో కోలాహాలుని ఒక తన్ను తన్నగా వాడు ఎగిరి దూరముగా పడ్డాడు. శక్తిమతి కోలాహాలునితో గడిపిన కొద్దిక్షణాల ఫలితముగా శక్తిమతి గర్భవతి అయింది ఫలితముగా ఆమెకు వసుప్రదుడు, గిరిక అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరిని శక్తిమతి ఉపరిచరునికి అప్పగించింది. తరువాతి కాలములో ఉపరిచరుడు వసుప్రదుడిని తన సర్వసైన్యాధకుడిగా నియమించు కున్నాడు గిరికను వివాహమాడాడు.
ఉపరిచరుని భార్య గిరిక ఋతుమతి అయినప్పుడు ఆమెకు మృగ మాంసము ఆహారముగా ఇమ్మని పితృదేవతలు ఆదేశిస్తే ఉపరిచరుడు జింకను వేటాడటానికి బయలుదేరుతాడు. ఆ సమయములో ఆయన మనస్సు అంతా అందాల సుందరి గిరిక ఆలోచనలతో నిండి రేతస్కలనం అవుతుంది ఆ రేతస్సును వృధా చేయరాదని తలంచి దానిని ఒక దొన్నెలో ఉంచి ఆకాశములో ఎగురుతున్న ఒక గద్దకు ఇచ్చి తన భార్య గిరికకు అందజేయమని ఆదేశిస్తాడు ఆ గద్ద తీసుకు వెళ్తున్నదొన్నెను మాంసఖండముగా భావించి మరో గద్ద దాడి చేయగా ఈ పోరులో దొన్నెలో ఉన్న రేతస్సు (వీర్యము) యమునానది జలాల్లో పడుతుంది. ముని శాపము వలన చేపగా మారిన అద్రిక అనే అప్సరస ఆ రేతస్సును మింగుతుంది ఫలితముగా చేప రూపములో ఉన్న అద్రిక గర్భవతి అవుతుంది. ఒకనాడు ఆ చేప జాలరి వలలో చిక్కుంటుంది. జాలర్లు ఆ చేపను వారి రాజుకు అందజేస్తారు ఆ చేపను కోయగా లోపల మనుష్య ఆకృతిలో ఉన్న పిల్లవాడిని గుర్తిస్తారు. చేప శాపవిమోచనం పొంది అద్రికగా మారి దేవలోకాలకు వెళ్ళి పోతుంది
మత్స్యగర్భములో జన్మించిన పిల్లవాడే మత్స్యరాజుగా మత్స్యదేశా ధీశుడై మంచి పాలకుడిగా పేరు పొందాడు ఆ పిల్లను దాసరాజు పెంచి పెద్ద చేస్తాడు. ఆవిడే సత్యవతి. మత్స్య గర్భములో జన్మించింది కాబట్టి మత్స్యగంధి అని, ఆమె శరీరమునుండి వచ్చే సువాసనలు యోజన దూరము వ్యాపిస్తాయి కాబట్టి యోజనగంధీ అనే పేరు కూడా ఉంది.ఈ సత్యవతియే పరాశరుని ద్వారా వేద వ్యాసునికి జన్మనిస్తుంది. ఆ తరువాత శంతన మహారాజును పెళ్లి చేసుకొని భీష్మునికి జన్మనిస్తుంది. ఆ విధముగా సత్యవతి కురువంశానికి మూల కారకురాలు.
ఉపరిచరుడు, గిరికలకు బృహద్రధుడు, ప్రత్యాదహుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు అనే ఐదుగురు కుమారులు కలిగారు. బృహద్రధుడే మగధ దేశాధీశుడైన జరాసంధుని తండ్రి. అలాగే ప్రత్యద్రహుడు చేది రాజ్యాధీశుడు. అతని కుమారుడే శిశుపాలుడు. వారిని వేర్వేరు రాజ్యాలకు అధిపతులను చేసి ఉపరిచరుడు మహారాజర్షిగా ప్రసిద్ధి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *