March 19, 2024

జీవన వేదం -1

ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా – భారతీయత ఔన్నత్యమే వేరు. భారతీయ జీవన విధానం అపూర్వం అద్వితీయం. వేరు పురుగుల్లా, బురదలో దొర్లే జీవాల్లా ఎందరున్నా అక్షయ పాత్రల్లా ఆర్తులకు అండగా నిలిచేవారు, ధర్మాన్ని మరచిపోని మహాత్ములు ఉన్నంతవరకు ఈ ధర్మపధం ఈ యాత్ర కొనసాగుతాయి.
బ్రతుకు బ్రతకనివ్వు అదే జీవన వేదం.

రచన: స్వాతీ శ్రీపాద

ఆది దేవ నమస్తుభ్యం ….
ప్రసీద మమ భాస్కరః
ప్రభాకర నమస్తుభ్యం
దివాకర నమోస్తుతే ….

సరిగ్గా ఉదయం సూర్యోదయం జరిగే వేళకు పెరట్లో తూర్పుకు అభిముఖంగా నిలబడి కళ్ళు మూసుకుని చేతులు జోడించి మంద్ర స్వరంలో సూర్యాష్టకం చదువుకున్నాడు రవికిరణ్.
తొలి కిరణాలు కనురప్పలపై వాలాక కళ్ళు తెరిచాడు.
ఉదయం నాలుగున్నరకు నిద్రలేవడంతో వారి దినచర్య మొదలవుతుంది.
సీత కూడా ఉదయమే నిద్రలేచి ముందుగా బ్రష్ చేసుకుని దినవారీ కార్యక్రమం ఆరంభిస్తుంది. ముందుగా ఇంట్లో పనులు -ఇల్లు ఊడ్చి, ఉప్పూ నిమ్మరసం, కలిపిన నీళ్ళతో తుడుచుకున్నాక, సింక్ లో ఉన్న గిన్నెలు తోమి చక్కని టవల్ తో తుడిచి బోర్లించుకున్నాక కాఫీ కోసం నీళ్ళ కెటిల్ ఆన్ చేసి, మరో పక్క స్టౌ మీద పాలు సిమ్ లో పెట్టి, బయట ఇంటి ముందు తుడిచి నీళ్ళు చల్లి ముగ్గు వేస్తుంది.
సన్నటి వేళ్ళ మధ్య నుండి మరింత సన్నగా జారే ముగ్గుపొడి అందమైన రంగవల్లిని తీర్చిదిద్ది వాకిలిని అలంకరిస్తుంది.
ఈ లోగా రవికిరణ్ ఉదయం తన వంతు పనులుగా పెరట్లో కూరగాయల మడుల సంరక్షణ పూర్తి చేసి, అప్పటికే ఆకలితో సిద్ధంగా ఉన్న ఆవుదూడను వదిలి దానికి కావలసినన్ని పాలు తాగిందనిపించాక పెద్ద పాల చెంబు తీసుకుని పాలు పితికి సీతకు అందిస్తాడు.
ఆ వెనక స్నాదులు ముగించుకుని సరిగ్గా సూర్యోదయ సమయానికి ఉదయించే రవి బింబం ఎదురుగా సరిగ్గా ఎనిమిది నిమిషాల సమయం గడపడం అలవాటు.
ఇంట్లోకి వచ్చేసరికి సీత స్నానం ముగించి దేవుడి ముందు దీపం వెలిగించి ఇద్దరికీ కాఫీ గ్లాస్ లు సిద్ధం చేస్తుంది. ఇద్దరూ పెరట్లో సిమెంట్ సోఫా మీద కూచుని కాఫీ తాగుతూ మధ్యమధ్యన మాటలు కలబోసుకుంటారు.
” ఈ మల్లె చెట్లేమిటీ ఇంకా ఫిబ్రవరి వచ్చీ రాక ముందే మొగ్గతొడుగుతున్నాయి?” ఆశ్చర్యంగా అడుగుతుంది సీత. కొమ్మ కొమ్మనా పొటమరిస్తున్న చిరుమొగ్గలను చూస్తూ …
“పాపం కాస్త వేడి పెరిగే సరికి తికమక పడుతున్నాయిలా వుంది. అయినా చీడ పడుతోందని ఆకు దూసేశానుగా అది కూడా ఒక కారణం కావచ్చు. లేదూ వెండి తీగల్లా మెరుస్తున్న నీ వేలెడు జారు ముడి లోకి చేరాలన్న ఆత్రం కూడా కావచ్చు…”
మూతి ముడుచుకుని చిరు కోపం నటించింది సీత. అంతలోనే అందుకుంటూ-
“అక్కడికి మీ తలమీద ఏదో నల్ల రేగడి మాగాణి ఉన్నట్టూ ..” సాగదీసింది.
నవ్వుకున్నాడు రవికిరణ్.
“ఎంత ఉక్రోషం, అయినా ఎంత సౌమ్యం వచ్చేసింది సీతా నీకు… ఒక్క సారి “రవీ” అని అరుస్తా వనుకున్నాను.”
ఖాళీ కాఫీ గ్లాస్ అందుకుంటూ –
“ఇది మరో జన్మ కదా … గతం ఎప్పుడో విస్మరించేసా … సరే … ఇహ ఈ రోజు కూరలు సేకరించాలి కదా … పదిన్నర అయే సరికి పాకెట్స్ తయారు చెయ్యాలి. లేవండి బుట్టలు తెస్తాను…” అంటూ లేచింది సీత.
అవును ఇద్దరూ ఇంటి వెనకాల ఉన్న ఎకరం స్థలం లో కూరలు పండిస్తారు సేంద్రియ విధానాన. వారానికో సారి ఆ కూరగాయలు సేకరించి కొంత ఇంటికి ఉంచుకున్నా మిగతావి ఆర్గానిక్ స్టోర్ కి సప్లై చేస్తారు.
లుంగీ మోకాళ్ళ వరకు పైకి ఎగకట్టి, లేచాడు రవికిరణ్ సాలోచనగా బాల్యంలోకి భౌతికంగా తోటలోకి సాగుతూ…

*****

పెద్ద నగరమూ, పట్నమూ కాని ఆ టవున్ లో ఆరో తరగతిలో చేరాడు రవికిరణ్.
ముగ్గురక్కల తరువాత లేకలేక పుట్టిన వాడు.
ఆదిత్య హృదయం చదివి ఆదివారాలు పాఠించాక సూర్యోదయం వేళ పుట్టాడని రవికిరణ్ అని పేరు పెట్టుకున్నారు.
ఊహ తెలిసే వరకూ ఇంట్లో ఏం జరుగుతోంది అని పెద్దగా తెలిసేది కాదు.
లంకంత ఇల్లు అయినా ఏ సౌకర్యాలూ లేని ఇల్లు. కనీసం ప్రాధమిక సౌకర్యాలు కూడా.
మట్టిగోడలు పైన రేకులు
ఎలెక్ట్రిసిటీ లేదు. లాంతర్లు, కిరసనాయిల్ దీపాలు.
అయినా వంశోద్ధారకుడు కాబట్టి అరచేతుల మీదే చూసుకునే వారు వీర వెంకట సత్య మూర్తి, వరహాలమ్మా, అతని తల్లీ తండ్రీ.
అతని అమ్మా నాన్నా కూడా పెద్ద కుటుంబాల్లో పుట్టినవారే.
ఏ కుటుంబం లోనూ పదిమందికి తక్కువకాని సంతానం.
రెక్కల కష్టం తప్ప పెద్ద సంపదలూ ఆస్తిపాస్తులూ లేనివారే.
ఆప్యాయతలకు మాత్రం తక్కువ లేని కుటుంబాలు. పెట్టిపోతలు ఉన్నా లేకున్నా ప్రేమలకు మాత్రం కొదవలేదు.
ఆ రోజులు మళ్ళీ ఒకసారి రవికిరణ్ కళ్ళముందు నడయాడాయి.
పనిమనిషి అన్న మాట తెలియని రోజులు. వరహాలమ్మ ఉదయమే నిద్రలేచేది, సూర్యోదయం కాకమునుపే.
బయటకు వెళ్ళాలన్న బెంగలేదు, పరుగులు పెట్టాలన్న ఆత్రుతా లేదు. స్కూల్ కి వెళ్ళే పిల్లలకోసం రాత్రే కాస్త ఎక్కువ అన్నం వండేసేది.
నూతి గట్టు మీద స్నానాలు చేసి ఉదయం చద్దన్నం నిమ్మకాయో, మాగాయో కొంచం నూనె చుక్క, ఆ తరువాత మజ్జిగన్నం తిని స్కూల్ కి వెళ్ళేవారు.
స్కూల్ అయిదు నిమిషాల నడక దూరం గనక మధ్యాన్నం ఇంటికి వచ్చి అన్నం పప్పుచారు, కూర తో భోజనం ముగించుకుని మళ్ళీ స్కూళ్ళకు వెళ్ళే వారు.
అప్పట్లో స్కూల్ టైమింగ్స్ ఉదయం పది నుండి ఒంటిగంట వరకూ మళ్ళీ రెండు నుండి నాలుగు వరకూ ఉండేవి. పిల్లల మీద ఎలాటి ఒత్తిడీ ఉండేది కాదు. వరహాలమ్మ ఉదయం లేచి చల్ల కవ్వం తీసుకుని పెరుగు చిలికేది.
సరిగ్గా అది ఒక గంట పని. చిలుకుతూ రుక్మిణీ కల్యాణం, గజేంద్రమోక్షం ఆసాంతం వల్లెవేసేది. పెద్ద చందమామ ముద్దంత వెన్న తీసి నీళ్ళలో వేసేలోగా ఆవిడ వల్లెవెయ్యడం పూర్తయేది. ఈ లోగా పెద్దమ్మాయి వాకిలి చిమ్మిముగ్గు వేస్తే రెండో పిల్ల మూడో పిల్ల గిన్నెలు తోమే వారు.
అన్నీ ఇత్తడి గిన్నెలే. బంగారం మెరుపు వచ్చేలా వెలిబూడిద సన్నని ఇసుక కలిపి తోమే వారు.
అప్పుడప్పుడే వస్తున్న స్టీల్ మాత్రం మెత్తటి బూడిదతో తోమే వారు.
పెరట్లో ఎండిన చెట్లకొమ్మలు రాలిన ఆకులతో ఇత్తడి కాగు పెట్టి నీళ్ళు కాచుకునే వారు. అదీ శీతాకాలం లో.
అసలు నూతి నుండి తోడుకున్న నీళ్ళు వేసవిలో చల్లగానూ, చలికాలాన వెచ్చగానూ ఉంటాయి. స్నానం చేస్తూనే ఎవరి బట్టలు వాళ్ళు ఉతికేసుకోడం, ఎండలో ఆరేసుకోడం అయిపోయేది.
ఆరుగురు ఉన్న ఆయింటికి నెలకో అరబస్తా బియ్యం మిగతా పప్పు దినుసులు, కిరోసిన్ రెండు మూడు సబ్బులు తప్ప పెద్దగా ఖర్చు ఉండేది కాదు.
ఇంట్లో రెండు గేదెల పాడి, పండించుకునే కూరగాయలు ఆదరువులను అందించేవి.
ఎప్పుడో పండగలకు తప్ప నూనె మూకుడు పొయ్యి ఎక్కేది కాదు.
అల్లాగే కొత్త బట్టలూ పండగలకే.
జాడీలు జాడీలు ఊరగాయలు ఉండేవి. నిమ్మకాయ, చింతకాయ, ఆవకాయ, మాగాయ.
మూడు వందల అరవై అయిదు రోజులూ మొదలు ఎర్రటి ఆవకాయతో భోజనం మొదలు పెడితే గాని కుదరదు వీరవెంకట సత్యమూర్తికి.
ఉదయం అంతా తోటపని, బజారుపని, అపరాహ్ణం వేళ సుష్టుగా భోజనం, మధ్యాన్నం ఒక కునుకు, నిద్రలేచి అరకప్పు కాఫీ తాగి తన హోమియో క్లినిక్ కి వెళ్తే రాత్రి తొమ్మిదింటికి తిరిగి రాడం, రాత్రిపూట అందరూ ఒకే సారి భోజనాలు.
ఓ గంటపాటు పిల్లలకు తోచిన కధలు చెప్పేవారు.
రాత్రి పదిలోపల నిద్ర ఉదయం అయిదుకల్లా లేవడం ఎప్పుడో ఆరోగ్యం బాగా లేకపోతే తప్ప ఈ దినచర్యలో మార్పు ఉండెది కాదు.
సావకాశంగా వంట చేసేది వరహాలమ్మ.
రెండు గేదెలు ఉండేవి. ఇంటికి సరిపడా పాలు ఉంచుకుని మిగతావి ఒకరిద్దరికి వాడుకగా పోసేవారు. వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్ళే వాళ్ళు. అలాగే కొంతపెరుగు, నెయ్యి కూడా అమ్మి పొదుపు చేసేది.
“ఆడపిల్లలున్నారు పెళ్ళీ పేరంటాలు ఎంత పొదుపు చేస్తే అవ్వాలి?” అనేది ఎవరైనా ఎద్దేవా చేస్తే.
ఆ పాలు పెరుగు చెంబులు గిన్నెలు శుభ్రంగా తోమి బోర్లించుకోడం, పెరట్లో కూరలు తెచ్చి, స్నానం పూజా ముగించి వంటా వార్పూ చేసే సరికి సరిగ్గా ఒంటిగంట.
అందరి భోజనాలు ముగిసి అన్నీ సర్దుకుని వంటింటి గడప మీద తలపెట్టుకుని ఓ గంట కునుకు తీసేది.
వరహాలమ్మ ఆ రోజుల్లో ఏడో తరగతి వరకూ చదువుకుంది. ఇంత పొదుపు చేసినా రెండు వారపత్రికలు కొనడానికి వెనుకాడేది కాదు.
ఆ పత్రికలు చదవడం, ఇరుగు పొరుగుకు సాయం అవసరం అయితే చేయూతనివ్వడం అదే కాలక్షేపం.
సాయంత్రం వంట చీకటి పడకముందే ముగించి పాలు తోడు బెట్టడంతో కార్యక్రమం ముగిసినా ఆడపిల్లలకు తనకు తెలిసిన పాటలు నేర్పేది.
ఇహ పిల్లల విషయానికి వస్తే, ఇంటి ముందు ఇరవై నాలుగు గంటలూ ఇత్తడి గంగాళంలో నీళ్ళు చెంబు ఉండేవి. ఎవరు బయటి నుండి ఇంటికి వచ్చినా కాళ్ళుకడుక్కునే లోపలికి రావాలి.
స్కూల్ నుండి రాగానే బట్టలు మార్చుకుని వాటిని ఉతికి ఆరేసుకోవాలి.
కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కుంటే గాని ఇంట్లో ఏమీ ముట్టుకోకూడదు.
సాయంత్రం ఆరు వరకూ చదువుకోవలసిందే. కదలడానికి వీల్లేదు.
లాంతరు గ్లాస్ లూ , దీపంబుడ్డి గ్లాస్ లూ ముగ్గుపొడితో శుభ్రంగా తుడిస్తే మిలమిలలాడేవి.
ఏ చీకూచింతా లేని కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో…
“ఏమండోయ్” సైరన్ లా వినబడేసరికి ఉలికిపడ్డాడు.
“అబ్బ అంత అరుపేమిటి గుండెలదిరేలా?”
“ఎన్నిసార్లు పిలిచాను? తమరు ఏలోకాల్లో ఉన్నారో … దొండకాయల్తో బాటు ఆకులూ కోసేస్తున్నారు … మనం మనుషులమండి. ఆకులు మెయ్యం”
గతుక్కుమన్నాడు రవికిరణ్. నిజమే కాయలతో బాటు ఆకులూ కోసేస్తున్నాడు.
” ఏదో … పరధ్యానంలో ఉండి… ”
“అమెరికా వెళ్ళిపోయారా ?”
“ఉహు బాల్యంలోకి …”
ఎన్నోమార్లు ఆ విషయాలన్నీ సీతతో పంచుకున్నవే.

*****

స్కూల్ కి వెళ్ళే రోజులు గుర్తుకు వచ్చాయి రవికిరణ్ కు.
సరిగ్గా ఇంటికి నాలుగు నిమిషాల దూరంలో స్కూల్.
మొదటి బెల్ కొట్టాక కూడా పరుగెత్తినా సరిపోయేది.
స్వతహాగా వచ్చిన జ్జాపక శక్తి ఇంట్లో అంతో ఇంతో పెద్ద వాళ్ళు చూపే శ్రద్ధ వల్ల స్కూల్లో ఎప్పుడూ మొదటి అయిదారుగురిలోనే ఉండే వాడు.
సైన్స్, మాథ్స్ బాగా చదివినా సోషల్ చదవడానికి చిరాకు వచ్చేది. అలాగే తెలుగు ఇంగ్లీష్ ఎంతగా నచ్చేవో హిందీ లో కవితలు తప్ప మరొకటి నచ్చేది కాదు.
సోషల్ హోం వర్క్ యమ గండం గా అనిపించేది. అందులో ఆ సోషల్ టీచర్ చాలా స్త్రిక్ట్.
చెప్పిన పని పూర్తి చెయ్యకపోతే గోడ కుర్చీ వేయించే వాడు.
“రేపా సార్ కి జ్వరం వస్తే బాగుండు… ప్రతి శనివారం హోం వర్క్ చూపించమంటాడు” అని తిట్టుకునే వాడు.
ఈ హిందీ పరీక్షలేమిటో జ్వరం వచ్చి , పోనీ పాపం అని మార్కులు ఇచ్చెయ్యరాదూ – అని కోరుకునే వాడు.
ఆమాట అమ్మతో చెప్పాడు ఒక సారి.
“జీవితం అన్నాక నచ్చిన వాటితో పాటూ నచ్చనివీ ఉంటాయి. అందుకే అన్ని సబ్జెక్ట్ లు పెట్టారు. అందరికీ అన్నీ నచ్చవు. నచ్చని వాటిని ఇష్టంగా చేసుకోవాలి” అనేది.
నిజమే.
చిన్నప్పుడు ఎందుకో బీరకాయ కూర నచ్చేది కాదు. అయినా చెప్పే ధైర్యం ఉండేది కాదు. గొంతులో వేసుకుని నీళ్ళతో మింగడమే.
అవును ఇష్టం లేదు అనే మాటకు తావే ఉండేది కాదు.
అయినా చదువులు పెద్ద భారంగా ఎప్పుడూ అనిపించలేదు. స్కూల్ కి వెళ్ళి రాడం సరదాగానే ఉండేది.
ఓ గంట ఆడుకోడం ఉండెది. శనాదివారాలు పుస్తకాలు తెరవాల్సిన అవసమే ఉండేది కాదు. సరదాగా కధల పుస్తకాలు చదవడం, పాటలు పాడుకోడం, కొత్త కొత్తగా పరిచయమైన క్రికెట్ ఆడి ఎన్ని సార్లు కిటికీల అద్దాలు పగల గొట్టడం జరిగిందో …
కాలేజీకి ఎలా వచ్చాడో తెలియకుండా రోజులు గడచిపోయాయి.
అప్పుడు టీవీలు పెద్దగా లేవు. కదలకుండా కూర్చుని చూసే వ్యసనమూ ఉండేది కాదు.
ఏ వంద గడపకో ఒక ఫోన్ ఉంటే ఎక్కువ.
అప్పుడు ఏ రోజునా అనిపించలేదు – ఇంత అనాగరికంగా బ్రతుకుతున్నామా అని.
ఏవీ పెద్ద అవసరంగా కనిపించలేదు.
చదువూ మిత్రులూ ఆటలు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు.
చివరికి ఇంజనీరింగ్ పూర్తయే వరకూ కూడా .
******

కూరగాయల సేకరణ పూర్తయాక, రవికిరణ్ తూకం వేసి పాకింగ్ కు పూనుకుంటే సీత వంట చెయ్యడానికి కదిలింది.
ముదిరినవీ, పుచ్చులు సేకరణ సమయంలోనే ఏరేస్తారు. వాటిని ఎరువుకోసం తవ్విన గుంతలో వేసేస్తారు. అయినా కన్నుగప్పి ఏవైనా సేకరణలో ఉన్నా తూకం వేసే సమయంలోనే మరో సారి పరీక్షించి తీసేస్తాడు. ఈ పనులన్నీ చిన్నప్పుడు అమ్మకు సాయంగా చేసినవే.
అవును చిన్నప్పుడూ ఎప్పుడూ కూరగాయలు కొన్న గుర్తు పెద్దగా లేదు.
ఏదో ఒక కూర పెరట్లోనుండి తెచ్చి వండుకోడమే.
తోటకూర గోంగూర సంగతి చెప్పవలసిన అవసరమే లేదు.
రోజూ ఏదో ఒక ఆకు కూర వండాల్సిందే.
అమ్మ తోటకూరను ఎన్ని రకాలుగా వండేది- తోటకూర పొడి పప్పు – పెసరపప్పుతో, కూర వడియాలతో, తోటకూరపులుసు, తోటకూర కందిపప్పుతో గరిట జారుగా, పోపులో వేసిన తోటకూర … అస్సలు విసుగనిపించేది కాదు. మధ్య మధ్యలో గోంగూర, సన్నగా కోసి నూనెలో మగ్గించిన నూనె గోంగూర, శనగపప్పు ఉడికించి చేసిన గోంగూర శనగపప్పు, గోగూరపచ్చడి. వేటికవే సాటి.
ఇప్పుడూ ఆకు కూరలు వేసుకున్నరు కాని ఇంటి అవసరానికే. మిగిలి పోతే మిత్రులకు పంపుతారు. కొత్త ఆకు కూరలు వచ్చి చేరాయి, చుక్కకూర, గంగవాయిలు కూర, పుదీనా కొత్తిమీర…
చిన్నప్పుడు,
ఎందుకో ఒకసారి అమ్మ విసుక్కుంది రెండు రోజులకో సారి కొత్తిమీర కారం లేకపోతే నాన్నకు ముద్ద దిగదనీ, పావలా కొత్తి మీరకోసం నాలుగు మైళ్ళు నడిచి వెళ్ళి వస్తాడనీ.
అంతే పెరట్లోకి వెళ్ళి ఓ మూలన మడి సిద్ధం చేసి గబగబా ధనియాలు చెల్లేసాడు.
అసలు కొత్తిమీర పెరిగే వరకూ చెప్పకూడదనుకున్నాడు. రోజూ రెండు పూటలా మడికి నీళ్ళు పెట్టే వాడు. వారం తిరిగే సరికి వేలెడంత పెరిగాయి కొత్తిమీర మొక్కలు.
ఈ లోగానే పులి మీద పుట్రలా ఎవరో దాయాదులు ఆస్థి మీద కేస్ పెట్టారట.
సరిగ్గా అప్పుడే అమ్మకంట్లో పడింది
కొట్టినంత పని చేసి పెరుగుతున్న నారును పీకిపారేసింది.
బిక్కచచ్చిపోయాడు రవికిరణ్…
ధనియాలు చల్లితే కొత్తి మీర పెరిగేలోగా ఇల్లు ఖాళీ చేస్తారట…
అదేం నమ్మకమో.
మొత్తానికి ఆ కేసు సమసి పోయినా ఇప్పటికీ రవికిరణ్ కి అర్ధం కాని విషయం కొత్తి మీరకూ ఇంటికీ సంబంధం ఏమిటనేదే?
ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది.
అప్పట్లో నిజమేనేమో అనుకున్న క్షణాలూ ఉన్నాయి.
ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళి వస్తూ పాకింగ్ పూర్తి చేసే సరికి సీత వంటకూడా పూర్తయింది.
రవికిరణ్ పాకెట్స్ పక్కనపెట్టి కాళ్ళూ చేతులూ కడుక్కు వచ్చేసరికి సీత వంటిల్లు మరో మారు ఊడ్చి అరటాకులు పరచింది భోజనాలకు.
సశాస్త్రీయంగా, ఉప్పుతో సహా వంతలు అన్నీ వడ్డించి చివరిగా అన్నం పెట్టక వేడి వేడి నెయ్యి వేసింది.
ఔపోసనపట్టి రెండు ముద్దలు పక్కన ఉంచి విస్తరికి నమస్కరించి భోజనం మొదలు పెట్టాడు.
చుక్క కూర పప్పు, ముక్కల పులుసు, కొబ్బరి పచ్చడి గడ్డపెరుగు… సావకాశంగా ఇద్దరూ భోజనాలు ముగించారు.
ఒక ముద్ద తక్కువైనా నష్టం లేదు కాని ఆహార పదార్ధాలు వ్యర్ధం చెయ్యరాదని వారి నియమం. అయినా ఏవైనా మిగిలిపోతే భోజనాలు కాగానే పశువులను మేపుకు వచ్చే అంజయ్యను పిలిచి ఇచ్చేస్తుంది.
ఒకసారి వంటిల్లు శుభ్రం చేసుకు మధ్యాన్నం ఓ గంట పాటు ఇద్దరూ కునుకు తీస్తారు.
ఎన్ని సార్లో చెప్పాడు సీతకు పనిమనిషిని పెట్టుకోరాదా? అని.
“ఎందుకండీ… ఎన్నేళ్ళు మనం స్వంతగా చేసుకోలేదు ” అంటూ తోసిపుచ్చుతుంది.
“అయినా అక్కడి సౌకర్యాలు వేరు…” నసుగుతాడు.
“అక్కడికి వెళ్ళేవరకూ మనమేమైనా రాజభవనాల్లో బ్రతికామా? ఇక్కడ ఇరవై ఏళ్ళపైన అన్నీ చేసిన వాళ్ళమేగా?” అంటూ నవ్వేస్తుంది.
అవును.
అందులోనూ సీత!
సీత మేనమామ కూతురు.
పట్టుమని వెయ్యి గడపలు కూడా లేని ఊర్లో పుట్టి పెరిగింది.
ఏడాదికోసారి అమ్మతో పాటు తాతగారింటికి వెళ్ళడం అలవాటే.
వచ్చీరాని మాటల రోజుల్లోనే –
“నేను బావనే పెల్లి చేసుకుంతా …” అనేది. పెళ్ళంటే ఏమిటో ఇద్దరికీ తెలియదు.
అయినా మొహం చిట్లించేవాడు రవికిరణ్..
ఆ అయిష్టం పెరుగుతూ వచ్చింది అతనిలో …
ఇష్టం పెరుగుతూ పోయింది సీతలో …
కాస్త హైస్కూల్ కి వచ్చేసరికి సాహిత్యం పట్ల అపరిమితమైన ఆసక్తి, కనిపించిన పుస్తకమల్లా చదివేసేవాడు. అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ సాహిత్యం మొత్తం దున్నేసాడు.
మధ్యలో కొన్ని రోజులు వీణ కూడా నేర్చుకున్నాడు.
వీణ పై గమకాలు పలికించినప్పుడు గాంధర్వ లోకం లో విహరిస్తున్నట్టుగా ఉండేది.
వీటితో పాటు మనసులో గాఢమైన కోరిక ఒకటి రహస్యంగా పొదుగుతూ వచ్చింది.
ఒక రూపం అస్పష్టంగా మనసులో కదిలేది.
చదువయాక గంధర్వ కన్యలాటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి సంగీత సాహిత్య సమలంకృత అయి ఉండాలి. హృదయపీఠం మీద ఆమేను ఉంచి కాళ్ళ దగ్గర కూచుని ఆమె సౌందర్యాన్ని సంగీతాన్ని ఆస్వాదించాలి.
ఇద్దరూ ఒకే పుస్తకాన్ని మనసు ఒకే కన్నుగా చదవాలి.
వెన్నెల రాత్రులు నదీ విహారం, లేదూ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి ఎవరూ లేని దూరతీరాల్లో తనివితీరా రాత్రంతా ఆకులో ఆకులా పూవులో పూవులా గడపాలి.
ఇలా నిమిషానికో కల …
కాని అవి కలలు గానే మిగిలిపోతాయని తెలియదు.
ఇంట్లో మిగతా అందరిదీ ఒక దారి కాని అతని దార్రి మాత్రం అతనిదే.
ఇద్దరక్కల పెళ్ళిళ్ళు ఆ మధ్య కాలాన మామూలుగా జరిగిపోయాయి. పెద్దగా చదివించకపోయినా, హైస్కూల్ చదువుతో పాటు ఇల్లు ఒద్దికగా తీర్చిదిద్దుకోడం ఒబ్బిడిగా గుట్టుగా సంసారం నడపడం అమ్మ దగ్గరే నేర్చుకున్నారు.
ఇంటి ముందు పందిరి వేసి, ఇంట్లో కార్యం లాగే జరిగాయి పెళ్ళిళ్ళు. పట్టుమని ఒక వందమందికి మించరు అటు వాళ్ళూ ఇటు వాళ్ళు అందరూ కలిసి.
ఎంత ఆత్మీయంగా జరిగాయి ఆ పెళ్ళిళ్ళు!
చాలా సహజంగా, పెద్ద అలంకారాలూ ఆడంబరాలూ లేకుండా ..
అన్నీ శాస్త్రోక్తంగా..
మూడో అక్క డిగ్రీ పూర్తి చేసి చిన్న స్కూల్లో టీచర్ గా చేరింది.ఊళ్ళోనే కుదిరిన
సంబంధం ఆ పెళ్ళైన నాలుగు రోజులకు రవికిరణ్ అమెరికా ప్రయాణం.
ఆ పెళ్ళే జీవితంలో అనుకోని మలుపు అవుతుందని అతను అనుకోలేదు.

********

పెళ్ళికి వారం రోజులు ముందుగానే వచ్చారు అతని అమ్మమ్మా, మేనమామ వారితో పాటు సీత.
ఏడాది రెండేళ్లు దాటింది ఆ పిల్లను చూసి.
మోకాలు దాటిన జడ గట్టిగా బిగించి వేసుకుని దానికి చివర బంగారపు జడ గంటలు. వాటికి నల్లని పట్టుకుచ్చులు.
నడుస్తుంటే ఘల్లు ఘల్లు మంటూ కాలి పట్టీలు. అచ్చు బాపు గీసిన ముద్దు గుమ్మలా బొద్దుగా ఉంది.
మాటల్లో తెలిసింది ఎస్సెస్సెల్సీ పరీక్షలు రాసిందట.
కాని రవికిరణ్ మనసుకు నచ్చలేదు.
అతని కలల రాణి వేరు.
పిడికిట ఒదిగే నడుము, పాలరాతి బొమ్మలా చెక్కిన రూపురేఖలు, ఏ మల్లెపందిరి కిందో కురులార బెట్టుకుంటే –నాజూకైన వేళ్ళతో ఆ జుట్టు సవరించుకుంటూ …
కాని ఇలా రోటి ముందు కూచుని పప్పు రుబ్బుతూ కాదు. అక్కతో హాస్యమాడుతూ కాదు. అత్తయ్య వెనకాల గరిట తిప్పుతూ కాదు.
తనలాగే అమెరికా వెళ్ళి చదువుకుని, టకటకా ఇంగ్లీష్ మాట్లాడుతూ ….
అప్పుడప్పుడు కాఫీ తెచ్చి అందించినా, ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడాలని చూసినా అతనికంత ఇష్టంగా అనిపించలేదు.
” ఏరా పిల్లకు ఏవైనా సంబంధాలు చూస్తున్నావా?” వరండాలో కూచుని పనసకాయ కొడుతున్న తమ్ముడిని కదిలించింది అమ్మ.
” ఏం చూడను? నా మొహం. దానికన్నీ మేనత్త లక్షణాలే వచ్చాయి. మొండితనం, మూర్ఖత్వం.”
“మేనత్తా? ఎవరూ?”
“ఇంకెవరూ నువ్వే. కా అంటే కా కీ అంటే కీ. తాపట్టిన కుందేటికి మూడే కాళ్ళు”
అమ్మ మొహం ఎర్రబడింది.
“ఏమంటుంది?”
“నీలాగే. బావను తప్ప మరొకరిని చేసుకోదట. కాదూ కూడదంటే బావిలో దూకుతానంది. నువ్వూ అలాగే అన్నావుగా? వద్దు తల్లీ ఆ సంబంధం వాళ్ళమ్మ గంపగయ్యాళి. కాల్చుకు తింటుందంటే విన్నావా? వేలువిడిచిన మేనమావతో పెళ్ళి చెయ్యకపోతే బావిలో దూకుతానన్నావు కదా?” అమ్మమ్మ అందుకుంది.
అమ్మ నోట మాట పెగల్లేదు.
“అదేమిటే? ఉలుకూ పలుకూ లేదు. కాదంటే దాన్నిక్కడే వదిలేసి వెళ్తాం” బెదిరింపుగా అంది అమ్మమ్మ.
ఇదంతా కొడుకు వింటున్నాడని అమ్మకు తెలీదు.
“ఉండు. కొంచం వెసులు బాటు చేసుకుని మాట్లాడతా” అనేసింది అమ్మ.
“మాట్లాడటం గీట్లాడటం ఏమీ లేదు. పిల్ల ఉసురు మీ కుటుంబానికి తగలకూడదంటే పెళ్ళి జరగాలి” గట్టిగా అంది అమ్మమ్మ.
భయం వేసింది.
నిజంగా కాదంటే ఆ పిల్ల ఏదైనా అఘాయిత్యం చేస్తే.
మనసు డోలాయమానంగా ఉన్న సమయంలో అమ్మ అనునయం.
“మన చేతుల్లో ఏముందిరా? ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో, రేప్పొద్దున ఏదైనా జరిగితే జీవితాంతం మనను అపరాధ భావన వెన్నాడుతుంది”
రవికిరణ్ మెదడు మొద్దుబారిపోయింది.
మౌనం అంగీకారంగా భావించి,
“వాళ్ళకు చెప్పెయ్యనా సరేనని”
“నీ ఇష్టం అమ్మా” అనేశాడు.
ఆ తరువాత అటూ ఇటూ అందరూ సంతోషంగా ఉన్నా తను మాత్రం అన్యమనస్కంగానే గడిపాడు.
పెళ్ళైన నాలుగు రోజులకు అమెరికా ప్రయాణం. తల్లి, అమ్మమ్మ, మేనమామ ఏం మాట్లాడుకున్నారో గాని ఉన్నట్టుండి అక్కను పెళ్ళి కూతురిని చేసే రోజే తమ నిశ్చితార్ధమూ జరపాలని నిర్ణయించారు. పులి నోట్లో తలపెట్టాక ఇక వెరుపేముంది?
ఆ శుభకార్యమూ జరిపి అతని మెడకో డోలు తగిలించారు.
“నిశ్చితార్ధం అంటే సగం పెళ్ళయినట్టే లెక్క. అందుకే ఇహపైన అమ్మడు ఇక్కడే ఉండి చదువుకుంటుంది.” అని కూతురి భారాన్ని మా మీదకు నెట్టేశాడు మామయ్య.
“చదువు తాత్సారం చెయ్యకు నాన్నా అటూ చదువవుతూనే ఇటు వచ్చి పెళ్ళి చేసుకుని నీ భార్యను నువ్వు తీసుకు వెళ్ళాలి” చెప్పింది అమ్మ.
తప్పదు కదా.
సగం ఆనందంగా సగం దిగులుగా నా పై చదువులకు అమెరికా బయలుదేరాను.

*****

రవికిరణ్ ను పక్కకు నెట్టి సాక్షీభూతంలా సమయం ముందుకు వచ్చింది.
ఎప్పుడూ ఒంటరిగా పక్క ఊరికి కూడా వెళ్ళినది లేదు.
ఇప్పుడూ ఏకంగా రాష్ట్రాలూ దేశాలూ దాటి ఖండాంతరానికి రాడం కష్టంగానే ఉంది. అది రవికిరణ్ కే కాదు, అతని మిత్రులకు కూడా.

ఇంకా వుంది

1 thought on “జీవన వేదం -1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *