March 19, 2024

నింగిని మెరిసిన వర్ణచిత్రం!!

రచన:ముక్కమల్ల ధరిత్రీ దేవి

మిట్టమధ్యాహ్నపువేళ
ఎండ కాస్తున్న సమయాన
మొదలయ్యింది ఉన్నట్టుండి జల్లున…
వాన !! మల్లెలు కురిసిన చందాన !
నేనూహించని ఆనందం !
చేరింది చెంతకు..అతి నిశ్శబ్దంగా…చిత్రం!
నింగిని భానుడి కిరణాల మెరుపు ఒకవంక
చిరుజల్లుతో చల్లని చిరుగాలి మరోవంక
ఆపై…తడిసిన మట్టి సువాసనలింకొంత !
ఆస్వాదిస్తూ ఆరుబయటికొచ్చి
ఆకసం వేపు చూశా ఒకపరి
అరెరే !! రంగు రంగుల హరివిల్లు !!
మెల్లిమెల్లిగా పరుచుకుంటూ ప్రత్యక్షం
విశాల గగనపు ‘కాన్వాసు’ మీద !
కనిపించని ఏ అద్భుత చిత్రకారుడో
కలుపుకున్న రంగుల్ని అలా పైకి వెదజల్లి
అలవోకగా సృష్టించాడా అన్నట్లు
రూపుదిద్దుకుంది క్షణాల్లో
ఓ అద్వితీయ కళాఖండం !!
ప్రకృతి ప్రసాదిత మనోహర దృశ్యం!!
ఏడురంగుల కలబోత…
వీక్షించే జనాలకు అదో వింత !
క్షణకాల దర్శనంతో నయనాలే దర్పణాలై
నా హృదయ ఫలకం మీద ముద్రింపబడ్డది
రమణీయ ఛాయాచిత్రమొకటి !
పరవశిస్తూ పొంగిపోయె మనస్సు
అదిగో, రంగురంగుల ఇంద్రధనుస్సు !
స్పందించే మనసుంటే
ఆ మనసుకు కళ్ళే ఉంటే
విధాత సృష్టిలో కనిపించనిదేముంది ?
కళారాధకుల భావుకతకు లోటేముంది ??

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *