March 19, 2024

పరవశానికి పాత(ర) కథలు – జ్వరం

రచన: డా. వివేకానందమూర్తి

 

భూమికి పాతికేళ్ళు పాతబడిపోయిన పరమహంసకి జీవితంలో మొదటిసారిగా జ్వరం వచ్చింది. జ్వరానికి, పరమహంసకి మధ్యన ఉన్న సంబంధం అయస్కాంతం యొక్క నార్త్ పోల్ నీ, సౌత్ పోల్ నీ గుర్తుకు తెస్తుంది, చీకటికీ, దొంగలకీ, దెయ్యాలకీ, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలకీ చివరికి భార్య మాటకి కూడా భయపడని పరమహంస జ్వరానికి భయపడతాడని తెలిస్తే నవ్వు వస్తుంది. చంటి పిల్లలు బూచాడు ఎత్తుకుపోవడం గురించి, పెద్దవాళ్లు ప్రమాదాల గురించి, రాజకీయ నాయకులు నిజం గురించి భయం భయంగా ఆలోచించినట్టు జ్వరాన్ని గురించి భయంగా ఆలోచిస్తాడు పరమహంస.

అతని తాతగారు జ్వరం వచ్చి పోయారు. తండ్రి మలేరియాతోనూ, తల్లి న్యుమోనియాతోనూ పోయారు. బామ్మ బోదకాలు జ్వరంతో పోయింది. వాళ్ళింట్లో ఎవరేనా ‘జ్వరం’ అన్న మాట తలిస్తే చాలు – సాయంత్రానికల్లా ఎవరికో ఒకరికి వచ్చేసేది. అతను జరీ అంచు కండువాను కండువా అంటాడు. తన మిత్రుడు జగన్నాధాన్ని ‘ఒరేయ్’ అనే పిలుస్తాడు. జనతా హోటల్లో కాఫీ తాగాడు.

పరమహంస జ్వరాన్ని చావుతో పోల్చుకుంటాడు. తనకే కాదు, తన చుట్టు ప్రక్కల ప్రాణికోటిలో ఎవరికి జ్వరం వచ్చినా, చావు తన కోసం వచ్చినట్టు, తన చుట్టూ తిరుగుతూ హైరాన పెడుతున్నట్టు ఫీలవుతాడు.

పెళ్ళయిన కొత్తలో తన భార్య సుశీలకి జ్వరం వచ్చినప్పుడు అతను బెంబేలు పడిపోయాడు. అంతేకాదు – మనస్సుని లోతు చేసుకుని భవిష్యాన్ని ఆలోచించాడు. అప్పుడతని మనస్సులో – సుశీల అమాయకత, పెళ్లాం పోయిన భక్తవత్సలం రెండవ పెళ్ళి – ఇవన్నీ చేరి గొడవ చేశాయి. మనస్సుని వికలం చేశాయి. డాక్టర్ సీతాపతిని తీసుకువచ్చి భార్యకు మందు యిప్పించాడు. డాక్టరు ముందు డీలా పడిపోయాడు. పెళ్ళాం జ్వరం తగ్గేవరకూ పరమహంస డబ్బున్న వాళ్ళ పెంపుడుకుక్క యజమానుల వెనకే తిరిగినట్టు, డాక్టరు సీతాపతి వెనకే తిరిగాడు. భార్య జ్వరం తగ్గింతర్వాత పాత ఆలోచనలు జ్ఞాపకం వచ్చి కాస్సేపటి వరకూ తన్ను తాను తిట్టుకున్నాడు. కాస్సేపయిం తర్వాత అతని మనస్సుకి యెంతో రిలీఫ్ కనిపించింది.

నిజంగా – భార్యకి జ్వరం తగ్గిపోగానే పరమహంస – స్వీటు సంపాదించిన పావలా, అర్ధరాత్రి అరణ్యంలో అనుకోకుండా అందమైన అమ్మాయి కోరికతో తన్ను కోరి వచ్చినప్పటి మగాడిలా, నెలాఖరున నెల జీతంలో సగం లంచం సంపాదించిన తాలుకాఫీసు గుమాస్తాలా – సంబరపడిపోయాడు.

ఇప్పుడు భార్య పక్కన లేదు. తొలికాన్పుకి పుట్టింటికి పంపించాడు. పక్కన భార్య లేనప్పుడు వచ్చినందుకు జ్వరాన్ని తిట్టుకున్నాడు హంస. కారణం- జ్వరం వచ్చినప్పుడు భార్య పక్కన ఉండి సపర్యలు చేస్తుంటే, ‘జ్వరం’ బాగుండకపోయినా ‘జ్వరం రావడం’ బాగుంటుంది – అని భార్య బ్రతికి ఉన్నప్పటి భక్తవత్సలం చెప్పిన జ్ఞాపకం.

డాక్టర్ సీతాపతికి ఫోన్ చేసి వచ్చి పడకకుర్చీలో మేను వాల్చాడు, హంస.

అరగంటయింది.

సీతాపతి ఇంకా రాలేదు. స్నానంచేసి వస్తానన్నాడు. ఇంత సేపా? మగాడి స్నానానికి, ఆడదాని కోపానికి ఆలస్యం బాగుండదు.

సాయంత్రం ఆరున్నర దాటింది.

ఆకాశాన్ని నల్లటి మేఘాలు, పిడిరాయిలాంటి వ్యక్తిని జ్వరంలా ఆవరిస్తున్నాయి. చీకటి టెంపరేచరూ పెరుగుతోంది. నక్షత్రాలన్నీ వెలేసినట్టు ఆకాశంలో ఓమూలగా ఉన్నాడు చంద్రుడు. మరీ సన్నం గాకుండా, మరీ గుండ్రంగా కాకుండా నార్మల్ గా ఉన్నాడు.

ఇంటి ముందు కారిడార్‌లో ఈజీ ఛైర్ లో పరమహంస వాళ్ళు వేడిగా వుంది.

ఎందుకో పరమహంసకి ఆకాశాన్ని చూసేసరికి మనస్సులో ఆలోచనలు బయలుదేరతాయి. దానికి కారణం ఏవిటా? – అని గతంలో హంస ఒక రోజు సాయంత్రం ఆకాశం కేసి చూసి ఆలోచించాడు గాని అంతు పట్టలేదు.

రెండింటికి ముందువున్న ‘ఆ’ లో తప్ప, ఆలోచనలకీ-ఆకాశానికి వున్న సంబంధం ఏవిటో అతను తెలుసుకోలేకపోయాడు. రోడ్డు మీద హారన్ మోగింది. డాక్టర్ కోసం గేటు వైపు చూశాడు. రాలేదు. అతను మొదట్నించి అంతే నెమ్మది.

సీతాపతి ఆర్ట్స్ కాలేజీలో తన క్లాస్ మేట్. మనిషిలో నిదానం, ఓర్పు, శ్రద్ధ యెక్కువ. చలాకీతనం లేదని అప్పుడు అందరూ అతన్ని ‘మబ్బు’ అని పిలిచేవారు. అలాగని అతను ‘మఫ్’కాదు. ఎంతో తెలివైనవాడు. అప్పట్లో అతని మంచితనం, తెలివిచూసి అతన్ని ప్రేమించిన ‘కవిత’ అనే అమ్మాయి కోరి వస్తే ప్రేమించడానికి నాకేం అభ్యంతరం లేదు గాని, నాకు టైము లేదు. చదువుకోవాలి’ అని చెప్పి పంపేశాడు. ఇది అతని మంచితనానికి కొలబద్దీ, లేక అతని అమాయికతకి నిదర్శనమో తెలియదు. అందుకే తను ఆకాశాన్ని చూసి సీతాపతిని తల్చుకొన్నప్పుడల్లా ఆలోచనకి బదులుగా నవ్వు వస్తుంది హంసకి.

తనకి సీతాపతితో పెద్ద స్నేహమేమీ లేదు – హలో అంటే హలో అనుకోడం తప్పిస్తే భార్యకి జ్వరం వచ్చినప్పట్నించీ కొంచెం దగ్గరితనం ఏర్పడింది. పనిలో చుఱుకు పాలు తక్కువగా ఉండటం, తనకు తెలిసిన సీతాపతికి తనకు తెలియకుండా పెళ్ళవటం – ఇవన్నీ హంసతో అతనికి ఎక్కువ స్నేహం లేకపోడానికి నిదర్శనాలు. పతికి పెళ్లయిందని విన్నప్పుడు హంస – ఇంత మందకొడిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడిన ఆమె అమాయకురాలు – అని మనస్సులో జాలిపడ్డాడు. అది ప్రేమ పెళ్ళి’ అని విని నవ్వుకున్నాడు. ఆశ్చర్యపడ్డాడు. కారణం – సీతాపతికి అసలు ఆమె యెవరో తెలియదుట. ఆమెగా ఆమె వెతుక్కుంటూ వచ్చి ప్రేమించానని చెప్పి, పెళ్ళి చేసుకోమని అడిగిందని కూడా తను విన్నాడు.

పరమహంసకి పాత రోజులు స్పురణకొచ్చాయి. నాలుగేళ్ళ తర్వాత ‘కవిత’ తలపుకు వచ్చింది. అవును, తన్ను నిరాకరించిన ‘కవిత’, తనుగా తను వెళ్ళి ప్రేమించానని, పెళ్ళిచేసుకోమని, అమాయకంగా ఆశగా అడిగినప్పుడు తన్ను కాదన్న ‘కవిత’, తను ఎందుకూ కొరగాకుండా పోయాడు? – తను అందంగా ఉంటాడా? – తను తనలాగే వున్నా కొంచెం రాక్ హడ్సన్లో కూడా ఉన్నాడని అప్పట్లో తన్ను ప్రేమించి వచ్చి తనచే నిరాకరింపబడ్డ, అందంగా లేని ఆడ ఇంగ్లీషు లెక్చరర్ ఓసారి అంది. ఆవిడంటే యిష్టం లేకపోయినా, ఆవిడ మాటంటే అతనికి పెద్ద గురి. తను చాలా శుభ్రంగా ఉంటాడన్నందుకు సాక్ష్యంగా వారానికి ఆరుజతల ఇస్తీ బట్టలు వాడతాడు. మూడు జతల కర్చీన్లు వాడతాడు. రోజుకి రెండుసార్లు సింథాల్ సబ్బుతో స్నానం చేస్తాడు. రోజూ గడ్డం గీస్తాడు. తనెందులోనూ తీసిపోడు. తన తక్కువతనం విదితమైంది అప్పటి ఒక్క సంఘటనలో. తన అయోగ్యత, చేతకాని తనం జ్ఞప్తికొచ్చి బాధపడ్డాడు. సీతాపతి ఎవరో తనకు తెలిసి ఉండకపోతే ఈ బాధ ఉండేది కాదేమో. నాలుగేళ్ళ క్రితం మనస్సులో రేగి మనస్సులో అణిగిపోయిన కోపం, కోరిక, ఆశ పరమహంస జ్వరాన్ని ఒక డిగ్రీ పెంచాయి.

విచిత్రం!

తను కోరిన స్త్రీ తన్ను నిరాకరించింది. సీతాపతిని స్త్రీ కోరి వచ్చి వరించింది. హుషారైన హంస కోరిక, ప్రేమ చేతిలో ఓడిపోయింది. కోరికలేని ‘మబ్బు’ సీతాపతిని ప్రేమ కోరి వచ్చింది.

మెడ నొప్పిగా వుంది. మెడ విరుచుకోడానికి తల అటూ ఇటూ తిప్పాడు. ఆకాశంలో నక్షత్రాలూ, థెర్మామీటరులోని పాదరసం మెరుపులా మెరిశాయి.

గేటు దగ్గర కారాగింది. డాక్టర్ సీతాపతి కుడిచేతిలో స్టెత్, ఎడం చేతిలో మెడికల్ చెస్ట్, తలమీద అణిచి దువ్విన జుట్టు, – నల్లపాంటుతో, తెల్లటి షర్టుతో, నెమ్మదిగా, మౌనంగా డాక్టర్ సీతాపతి, మెల్లగా గేటు తెరుచుకుని, భూమి నొచ్చుకుంటుందేమో అన్నట్టు అడుగులు వేస్తూ వచ్చాడు.

“గుడ్ ఈవినింగ్!” మోతాదుగా నవ్వాడు.

“హలో-గుడ్ ఈవినింగ్! ప్లీజ్ బి సీటెడ్” పేము కుర్చీ చూపాడు పరమహంస.

మెడికల్ చెస్ట్ టీపాయ్ మీద పెట్టి సీతాపతి కూర్చున్నాడు.

“ఎప్పుడు వచ్చింది జ్వరం!” నాడి పరీక్షిస్తూ అడిగాడు.

“సాయంత్రం”

“ఎన్ని డిగ్రీలుంది?”

“ఎన్నేవిటీ? – సూటమూడు. చావుకి మూడో నాలుగు డిగ్రీల దూరం.”

అతను చిరునవ్వు నవ్వాడు. క్రింది కనురెప్పలు లాగి చూశాడు. నాలిక చూశాడు. జలుబుగా వుందా? – దగొస్తోందా? – కీళ్ళు వొప్పులున్నాయా? – అంటూ అడిగాడు. అన్నిటికి ఉంది, వస్తోంది, ఉన్నాయి- అని, జవాబు లిచ్చాడు తను.

“మరేం భయపడకండి. తగ్గిపోతుంది. ఈ టేబ్లెట్స్ వాడండి. ప్రతి ఆరుగంటలకీ రెండు చొప్పున మంచి నీళ్ళతో వేసుకోండి. కాఫీ తప్ప మరేం తీసుకోవద్దు.”

పరమహంస కంగారు చూసి సీతాపతి మోతాడు మించి నవ్వాడు.

“ఇందులో కంగారుపడాల్సిన అవసరం లేదు హంసా? బైట కూర్చోకుండా లోపలికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేను మళ్ళీ రేపు ఉదయం వస్తాను. గుడ్ నైట్.”

సీతాపతి లేక పరమహంస పాలిటి దేవుడు – వచ్చి వెళ్ళిపోయాడు.

వాళ్ళావిడ జ్వరం తగ్గినప్పటి నిండుతనం పుంజుకుంది మనస్సు. లోపలికి వెళ్ళి టాబ్లెట్స్ మింగి, వంటవాడిచేత వేడి కాఫీ చేయించుకు త్రాగి పక్కమీద నడుం వాల్చాడు హంస.

వొళ్ళంతా వేడిగా వుంది. మండుతున్న గాడిపొయ్యి మీద మంచం వాల్చుకు పడుకున్నట్టుంది. వేడికోరికలు, పెళ్ళయిన కొత్తలో వేడిరాత్రులు జ్ఞాపకం వచ్చి, బుర్ర ఆలోచనట్లో వేడెక్కిపోయింది. వాతావరణం అంతా వేడిగా వుంది, జ్వరం తగ్గించమని దేవుణ్ని వేడుకున్నాడు. ఓ గంట సేపు అలా దేవుణ్ని వేడి వేడి, వేడి కళ్ళు మూసుకుని వేడిజ్వరం సందిట్లో వేడిగా నిద్రపోయాడు వేడి పరమహంస..

రేపు వచ్చింది. పరమహంసకి మెలుకువొచ్చింది. పక్కమీది నుండి లేచాడు. నీరసంగా వుంది. వొళ్ళు తూలింది. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. స్నానం మాత్రం చేయలేదు.

హాల్లో పడకకుర్చీలో కూర్చుని పొద్దుటి పేపరుచదువుతుండగా సీతాపతి వచ్చాడు.

“గుడ్ మార్నింగ్.”

“గుడ్ మార్నింగ్! రండి కూర్చోండి.”

“ఎలా వుంది?” పరీక్ష చేశాడు. టెంపరేచరు చూశాడు. నూరు ఉంది.

“ఫరవాలేదు. తగ్గిపోతుంది. రేపటికి. నిన్నటికిలాగే ఈ రోజు కూడా టేబ్లెట్స్ వేసుకోండి. అటూ ఇటూ తిరగవద్దు.”

వంటవాడు కాఫీలు తెచ్చాడు. కాఫీలు ముగించి కాస్సేపు ఇతర విషయాలు మాట్లాడుకున్నారు. సీతాపతి మళ్ళా మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

మూడోరోజుకి టెంపరేచర్ నార్మల్ కి వొచ్చేసింది. అతని వొళ్ళంతా సంతోషం అంటుజ్వరంలా పాకిపోయింది. ఎందుకో సీతాపతి రాలేదు ఆరోజు. నాలుగో రోజుకల్లా పరమహంస మామూలు మనిషై పోయాడు. ఖైదు నుంచి తప్పించుకున్న దొంగలా, పంజరంలోంచి బైటపడ్డ హంసలా ‘రిలీఫ్’, ఫీలయ్యి – ఇక భార్యకేం ‘మొగుడు నష్టం లేదు. సుశీల వచ్చింతర్వాత ఇలా జ్వరం వచ్చి తగ్గిన సంగతి చెప్పకూడదు. సీతాపతి యింటికి వెళ్లాలి. తన కృతజ్ఞత చెప్పాలి. బిల్లు మొత్తం చెల్లించాలి. నిజంగా సీతాపతి దేవుడు – ఇదీ అతని మనస్సు.

స్నానం చేసి, లాల్చీ, పైజామా ధరించి గోల్డ్ ఫేక్ సిగరెట్టు ముట్టించి, స్కూటరు ఎక్కి సీతాపతి యింటివేపుగా దారితీశాడు. జ్వరం తగ్గిన హంస మనస్సు ఆనందంతో గంతులు వేస్తోంది.

* * *

అదేవిటి?

సీతాపతి యింటి ముందు అన్ని కార్లు ఉన్నాయేం?

పోర్టికోదాటి లోపలికి వెళ్ళాడు. వాకిటినిండా జనం. ఊళ్ళో పెద్ద డాక్టర్లూ, పెద్ద మనుషులు, పెద్ద పెద్ద జ్వరాలు వచ్చి తగ్గినవాళ్ళు విషణ్ణతని తోడు చేసుకుని తచ్చాడుతున్నారు.

పరమహంసకి ఆయుర్వేద బిషగ్వర యగెన్నగారు ఎదురు వచ్చారు. “ఒరేయ్ పరమం! అయిపోయిందిరా! సీతాపతి యిక లేడు. విషజ్వరం వచ్చి కొట్టేసింది. అంతా అయిపోయింది.” కండువాతో కళ్ళాత్తుకున్నారు జీవితంలో జ్వరం అంటే ఎరుగని యగెన్నగారు.

అందరూ మాట్లాడుకుంటున్నారు.

“హే వజేన్ ఇటెలిజంట్ డాక్టరండీ. పూర్ ఫెలో!”

“ఏం చేస్తాం. అంతా విధికృతం.”

“రియల్లీ, అవర్ సిటీ హేజ్ లాస్ట్ ఎ గుడ్ డాక్టర్.”

“కమాన్ లెటజ్ హేవ్ ఎ కండొలెన్స్ మీటింగ్”

పరమహంస వెదికాడు – సీతాపతి కోసం. అరగంటయింది తీసుకుపోయి.

ఒక్కక్షణం కళ్ళు తిరిగాయి హంసకి.

విచిత్రం! – పాములవాణ్ణి పాము కాటేసింది. మాంత్రికుడ్ని మంత్రం దహించి వేసింది.”

పాపం! పాపం!

డాక్టర్ కి జ్వరం వచ్చింది. ఆరోగ్యానికి జ్వరం వచ్చింది. సీతాపతి బ్రతుకుని జ్వరం మింగేసింది. మబ్బు విడిపోయింది. తను రోజూ చూసే ఆకాశంలాగ, సీతాపతి మెళ్ళో అస్తమానం కనబడే స్టెతస్కోపులాగ, మెడికల్ చెస్ట్ లాగ, థెర్మామీటరు లాగ, మందుల్లాగ, జ్వరాల్లాగ – సీతాపతి కూడా ఎప్పుడూ ఉండి పోతాడనుకున్నాడు హంస. ఉండిపోవాలనుకున్నాడు. హంస. అమాయకుడైన ‘మబ్బు’ సీతాపతి రేపట్నించి కనిపించడు.

హాలుకి అనుకుని ఉన్న గదిలో మూలగా పేముకుర్చీలో ముడుచుకుని, జ్వరం వచ్చి తగ్గి పథ్యానికి సిద్ధమయిన రోగిలా, కూర్చుని చేతుల మధ్య తల దూర్చి హృదయం బ్రద్దలయ్యేలా ఏడుస్తోంది సీతాపతి భార్య,

దగ్గరగా వెళ్ళాడు. అతనికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు.

“విచారించకండి. అయిందేదో అయిపోయింది. నిజంగా సీతాపత్ పోయినమాట విన్న తర్వాత గుండె పగిలింది.”

ఆమె తలెత్తి చూసింది.

ఆమె ‘కవిత’, తన్ను కాదన్న ‘కవిత’, ‘మబ్బు’ సీతాపతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ‘కవిత’. హంస మనస్సు రెపరెపలాడి, ఒక్క క్షణం కళ్ళు తిరిగాయి. మనస్సులో మహారణ్యం తగులబడినట్టుంది.

“ఏమైనా నేను మళ్లా పెళ్ళి చేసుకోదల్చుకోలేదు హంసా! దయచేసి వెళ్ళిపోండి.”

ఏడిచే కళ్లూ, వణికే పెదాలూ – మళ్ళీ పాత ‘కవిత’.

ఉన్నట్టుండి నూటయిదు డిగ్రీల టెంపరేచరుతో జ్వరం వచ్చినట్టయింది హంసకి.

పరమహంస వెనక్కి తిరిగారు.

* * *

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *