March 19, 2024

సారు ఏం చేస్తారు?

రచన. పంతుల ధనలక్ష్మి.

శారద తన మనవలని చూస్తోంది. పాప, బాబు పోటీలు పడి ఇసుక కోటలు కడుతున్నారు. పెద్ద కెరటాలు వచ్చినప్పుడల్లా అవి కొట్టుకుపోతున్నాయి. ”అంతేకదా! అడ్డుకోలేనివి వస్తే అలాగే వెళ్ళిపోతాయి. మనుషులయినా!అయినా బంధాలు ఎదురీదమంటాయి. ఎదురీదితే మాటిమాటికీ ఎదుర్కోవాలి. ఎంతకాలమో తెలీదు.”అనుకుంటోంది.
అలా ఎంతసేపు చూసిందో ! పిల్లలిద్దరూ అమ్మానాన్నలతో చిన్న కెరటాలలో గెంతుతూ అరుస్తున్నారు.
“ఇంక ఇంటికెళదాము పదండి. చీకటిపడింది. ”అన్నది సుస్వర.
కారులో ఇంటికొచ్చినా శారదకి ఆలోచనలు తగ్గలేదు. ఏదయినా పుస్తకం చూద్దామని ఒక నవల తీసింది. కానీ అందులో తన జీవితం అద్దంలా కనిపిస్తోంది.
మరచిపోలేని గతం. కళ్ళముందే !
శారద తండ్రి ఒక మామూలు గుమస్తాగా తక్కువ సర్వీసు చేసి రిటైరయ్యారు. ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరబ్బాయిలు. పెద్ద కొడుక్కి ఉద్యోగం రాగానే అతని పినతల్లి వచ్చి “మా మనవరాలిని చేసుకో నీ కోడలుగా! అక్కయ్య మరీమరీ చెప్పిందనే అడుగుతున్నాను.”అన్నది పిన్ని.
అంటే శారద చిన్ననాయనమ్మ.
అసలు ఉద్యోగం వచ్చిన వెంటనే ఉత్తరప్రదేశ్ కి వెళ్ళి పోవడం అక్కడే చిన్న నాయనమ్మ ఉండటం వలన
“సరే” అన్నారు అన్నయ్య పెళ్ళికి. వదిన వాళ్ళమ్మ చాలా గడుసుది. మిగతా ఆడపిల్లల భారం తన కూతురు అల్లుడు పై పడుతుందని పూర్తిగా అటుపక్కే బదిలీలు అయేటట్టు అన్నయ్య మావగారి ఏర్పాట్లు.
అప్పటికి శారద తండ్రి ఉద్యోగములో ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదు. కాని తండ్రి రిటైరయ్యేసరికి కొడుక్కి నలుగురు పిల్లలు.
ఉత్తరం రాస్తే “ నెలనెలా మీకు డబ్బు పంపిస్తే మా పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళూ ఎలా చేస్తాం?” అంటూ కోడలే ఉత్తరం రాసేది.
ఏమీ అనలేకపోయారు శారద తండ్రి. ఉత్తరం కొడుక్కి చూపించలేదన్న విషయం తెలుసుకోలేకపోయారు.
ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో శారద తల్లి చనిపోయింది. నిజానికి వైద్యం చేయించలేకపోయారు. పోయాక టెలిగ్రామ్ ఆఫీసుకిస్తే అన్నయ్య కుటుంబం అంతా వచ్చి కర్మ పూర్తి చేసి వెళ్ళిపోయారు. ఇద్దరాడపిల్లలనయినా తనవెంట తీసికెళ్తాడని అనుకున్నారు.
“అక్కడ ఇల్లు చిన్నది. అన్నిటికీ ఇబ్బందే! ఏదో నలుగురు పిల్లలతో నేను నెట్టుకొస్తున్నాను.” అని చెప్పింది కోడలు. వాళ్ళు వెళ్ళి పోతుంటే ఏమీ చెయ్యలేని అసహాయస్థితికి బాధతో మౌనం వహించారు.
దిగులుగా కూర్చున్న తండ్రిని కనీసం ఓదార్చలేదు. శారద అక్కని తండ్రి పని చేసిన ఆఫీసులో ప్యూను పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో బంధువుల సహాయంతో పెళ్ళి చేసారు. ఇంకా శారద చెల్లెళ్ళు, చిన్నన్నయ్య ఉన్నారు. చిన్నన్నయ్యకి మంచి మార్కులు రాక టీచరు ట్రెయినింగ్ లో సీటు రాలేదు. ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నించినా రాలేదు. ఎంప్లాయిమెంటు ఆఫీసుచుట్టూ తిరగడమే. ఒక్క కాల్ రాలేదు. చివరికి ఎలాగో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. ఏడాదిన్నర అయేసరికి ఏదో సమ్మె గొడవలు వచ్చి ఆ ఉద్యోగం పోయింది.
అదో బెంగ రామనాథంగారికి.
ఈ లోపు శారద చెల్లికి ఎవరింటిలోనో వంటకి రోజూ సాయం చేస్తే నెలకి ఎంతో కొంత అని రోజూ వెళ్ళేది. వాళ్ళింటికి ఒకరోజు చుట్టాలు వచ్చేరు. ఆ అబ్బాయికి శారద చెల్లి సరళ నచ్చడంతో పెళ్ళి చేసుకుంటానన్నాడు. చాలా సామాన్యంగా పెళ్ళి అయిపోయింది. కానీ వేరే వూరు అవడంవలన ఆ సంపాదన కూడ లేదు. ఇక ఉద్యోగం పోయిన అన్నయ్య విసుగుతో కోపముతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దిక్కుతోచని పరిస్థితి.
“ఏమే శారూ! నువ్వు ఇంటర్ లో చేరుతావా?” లలిత రాజులమ్మాయి అడిగింది. అట్లతద్దికి వాళ్ళింటికి సరదాగా రమ్మంది. కాసేపు ఆటలాడుకుని గోరింటాకు పెట్టుకుని కూర్చున్నారు.
“ఎలా చేరుతాను? మా నాన్నగారు చదివించలేరు.”బాధగా అంది శారద.
“మా కుటుంబంలో కాలేజీలకు పంపరు.”
“మరి ఎలా చదివావు?
“మెట్రిక్ చదివించారు. ఇంటికే ఒక టీచరు వచ్చి చెప్పేవారు. లెక్కలు సైన్సు ఇంకో టీచరు వచ్చి చెప్పేవారు.”
లలిత పరిచయం విచిత్రంగా జరిగింది. శారద వాళ్ళింటి ముందునుంచి వెళ్తుంటే
వాళ్ళింటి నుండి బయటకు వస్తున్న తనతో టెన్త్ చదివిన రాజా ఇంత పుస్తకాల కట్ట పట్టుకుని బయటకు వస్తూ కనిపించేడు. “ ఏయ్! శారదా ఏ కాలేజీలో జాయినయేవు?”
“నేను జాయినవలేదు. నువ్వు?”
“నేను కృష్ణా కాలేజీలో చేరేను. ఈ యింట్లో మా అన్నయ్య ఫ్రెండ్ వద్ద ఎమ్ పి. సి
పుస్తకాలున్నాయంటే ఇస్తాడని వచ్చేను.” అన్నాడు.
“నాకు ఇంటర్ పుస్తకాలు ఎవరయినా ఇస్తే బాగుంటుంది. ఇంటర్ ప్రయివేటుగా చదువుతాను.” అన్నది శారద.
“వాళ్ళింటిలోనే ఉన్నాయి. ఇంకో తమ్ముడివి. అతను సియిసి గ్రూప్. ” అన్నాడు.
“నేనడిగితే ఇస్తారా? వాళ్ళు నాకు తెలీదు” అన్నది.
“నేను చెబుతాను.” అని వెంటనే లోపలికి వెళ్ళి అతనిని తీసుకొచ్చాడు.
“రాజా చెప్పాడండీ! కానీ మా చెల్లి చదువుతానంటోంది. ఇద్దరూ కలిసి చదువు కోండి. ప్రైవేటుగానే కదా!”అన్నాడు.
వెంటనే లోపలికి రమ్మని లలితను పరిచయం చేసాడు. అలా అయింది.
రోజూ ఇంట్లో వంటచేసి వాళ్ళింటికి వెళ్ళేది. ఇద్దరూ డాబామీద కూర్చుని కొబ్బరాకుల నీడలో చాప వేసుకుని చదువుకునేవారు. అర్థమైనవి చదివేసుకుని నోట్సులో రాసేది శారద.
ఇంగ్లీషు పాఠాలు తండ్రినడిగి తెలుసుకుని మరునాడు లలితకి చెప్పేది. ఎక్కడికైనా వెళ్ళాలంటే శారదతోనే కలిసి పంపేవారు. బయటకు వెళ్ళేటప్పుడు తన లంగా వోణీలు ఇచ్చి కట్టుకోమనేది.
పరీక్ష ఫీజు కట్టాలంటే తన మెట్రిక్ మార్కులు కాపీ పెట్టాలి. శారదకన్నా రెండేళ్ళముందు రాసింది. ఆ నెంబరు గుర్తులేదు. అప్పుడు మార్కులు తెచ్చుకోలేదు. శారదకి తెలిసిన ఒకాయన యూనివర్సిటీలో వుంటే వెళ్ళి అడిగింది. ఆయన అతికష్టంమీద ఫైల్ తీసి చూస్తే లలితవి రెండు సబ్జక్టులు ఉండిపోయాయి. తనకి ఇంటర్ రాయటం కుదరదు. ఇద్దరూ ఎంతో కష్టపడి చదివినా ఫలితంలేదు.
సరిగ్గా అప్పుడే తాతగారు పోయారని లలితని ఊరు తీసికెళ్ళిపోయారు.
శారదకి పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఎవరూ సాయం చెయ్యలేదు. ఫైన్ తో కూడ టైమయిపోయింది. ధారాపాతంగా ఏడ్చింది. ఆ మరునాడు ఎదురింట్లో చిన్నపిల్లలకి ప్రైవేటు చెప్పమన్నారు.
“అయ్యో! ముందే కుదిరితే ఇంటర్ పరీక్షలు రాసేదాన్ని కదా!” అనుకుంది. ఇంటికి వస్తుండగా లలిత వాళ్ళ పక్కింటాయన ఆయన ఏదో ఆఫీసరే!
“ఏమమ్మా! మీ ఫ్రెండు దగ్గరకి రావట్లేదు? “అడిగారు.
ఏమనాలో తోచక ఫెయిలయిందని చెప్పటమెందుకని “వాళ్ళు ఊరెళ్ళారు.”అని చెప్పేసింది.
వెంటనే ఆయన “మీరు చదూకోడం నేను రోజూ వింటున్నాను. బాగా చదువు తున్నారు. నీకో విషయం చెప్పాలి”అన్నారు.
“మా ఆఫీసులో టెంపరరీగా పోస్టుంది. ఆరునెలలు చెయ్యవచ్చు. చేరతావా? మీ మాటలు విని అడుగుతున్నాను. నీకు అవసరం అని” అన్నారు.
తండ్రిని అడిగింది. “అతను నాకు తెలుసు. పరవాలేదు చేరు.” అన్నారు.
అలా ఉద్యోగ ప్రవేశం. ఫైల్స్ వేరే వేరే ఆఫీసులకి పట్టికెళ్ళి పెద్దాఫీసరుచేత సంతకం పెట్టించి తీసుకురావాలి. అవి లేనప్పుడు కార్బన్ పేపరు పెట్టి రెండో మూడో కాపీలు రాయమంటే చూసి చేతితో రాయాలి.
“అన్నట్టు సెప్టెంబరులో ఇంటరు పరీక్షలు రాయి. ఈలోపు ఆఫీసులో నాలుగు మిషన్లున్నాయి టైపు నేర్చుకో. మన ఆఫీసువాళ్ళు రోజూ ఎవరోవొకరు చెబుతారు” అన్నారు.
అందరూ సరే అన్నారు. నెలకి మూడువందల జీతంతో ఇల్లు గడుస్తోంది. పరీక్ష ఫీజు కట్టింది.
ఒక రోజు ఆఫీసుకి వెళ్ళేసరికి అందరూ కంగారుగా వున్నారు. ఏదో పేపర్ కనపడలేదని వెతికేరు. ఈ లోపు జీపు వచ్చింది. “కమీషనర్ గారొచ్చేరు.” అన్నారు.
వెతుకుతున్న పేపరు దొరకలేదు “అంత నిర్లక్ష్యమా? నేను ఇంటర్వ్యూలు చెయ్యాలి. ఒక గంటలో నాకు ఫైలు కావాలి. లేకపోతే” అని ఆపేరు.
యుడిసిని అడిగింది శారద. ఆవిడ ఏడుస్తూ చెప్పింది.
“సాయంత్రం రాసిపెట్టిన పేపరు. ఇవ్వకపోతే ఉద్యోగాలూడతాయి. ”
వెంటనే శారద ఒక ఫైలు వెతికి “ఇదేనా?”అడిగింది.
అందరూ “అవును అదే”!
స్వీపరు పడేసిన పేపర్లు తుడుస్తుంటే టైపు నేర్చుకోడానికి పనికొస్తాయని తీసుకుంది. ఒక పక్క ఖాళీగావున్నాయని.
వెంటనే ఆఫీసరుకి ఇచ్చి విషయం చెప్పగానే అక్కడేవున్న కమీషనరుకి చెప్పేరు. ఆయన వెంటనే మెచ్చుకుని శారద చేస్తున్న పోస్టుకి ఆర్డరునిచ్చేరు.
అదే ఆఫీసుకి మరొక రికార్డు అసిస్టెంటు బదిలీమీద వచ్చేడు.
శారదకి చాలా విషయాలు చెబుతూ “పెళ్ళి చేసుకుంటాను”అన్నాడు.
ఆఫీసరుతో సహా సంతోషించి రామనాథంగారితో చెప్పేరు.
“అతనిది మన కులం కాదని” అన్నారు.
అంతవరకు ఉద్యోగం పోయిందని వెళ్ళిన చిన్నన్నయ్య తెలిసినవాళ్ళద్వారా ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ అమ్మాయిని పెళ్ళికూడ చేసేసుకుని వచ్చేడు.
శారదకి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. ఇంకా చెల్లెళ్ళ బాధ్యత, పురుళ్ళూ అవీ చూడాలని తప్పించుకోడానికి వేరు కాపురం పెట్టారు.
శారదకి వచ్చిన సంబంధం కుదిరితే పెళ్ళిఖర్చు పెట్టాలని వచ్చినవాళ్ళకి “శారదకి చాలా గర్వమని, టెంపరని ఉద్యోగం మానదని”రహస్యంగా చెప్పసాగారు వదినలు.
సంబంధాలు నచ్చేయని చెప్పటం వెళ్ళేక అది తప్పిపోవటం జరిగింది.
ఒకరోజు వదినలు పండగ పేరుతో ఇంటికి వచ్చి మాట్లాడుకుంటే శారద విన్నది.
పెళ్ళి చెడగొడుతున్నారని తెలిసి బాధపడింది.
ఆఫీసులో పనిచేసే బాబ్జీనే చేసుకుంటానని చెప్పింది.
అన్నావదినలు పెళ్ళి ఆపడానికి ప్రయత్నించేరు. ఆఫీసువాళ్ళు రిజిష్టర్ పెళ్ళి జరిపించారు.
ఆ కోపంతో “ఇంటి పరువు తీసింది. నాన్నా!మేమే చూసుకుంటాము నిన్ను. ఇంటికి రానివ్వద్దు దాన్ని” అన్నారు.
బాబ్జీ రూమ్ కి చేరుకుంది. “మీ అమ్మగారు చెల్లి వాళ్ళకి చెప్పరా?”ఇంటికి రాగానే అడిగింది.
“నా పెళ్ళి నాయిష్టం. ఆళ్ళకెందుకు?”అన్నాడు.
పడిపోయిన కాగితాలతో చిందరవందరగా ఉంటే చీపురుతీసి తుడిచింది.
“నేను బయటికెళ్ళి హోటలునుండి భోజనం తెస్తాను. నీదగ్గర డబ్బులు ఉన్నాయా?”అని నా బాగ్ తీసుకుని గబగబ డబ్బు తీసాడు. అది ఇంట్లో ఇవ్వగా కిరాణా షాపుకి ఇవ్వాల్సిన డబ్బు.
“అంతెందుకు?” అడిగింది. వినిపించుకోలేదు. వెళుతూ “మా ఫ్రెండ్స్ వస్తారు పార్టీ యివ్వాలి.” అన్నాడు. వాళ్ళు నలుగురు వచ్చేరు కలిసి. రెండు పెద్ద బాటిల్స్ సోడాలు మిరపకాయబజ్జీలు తింటున్నారు, తాగుతున్నారు, భార్య వుందన్న ధ్యాస లేదు. ఏమీ చెయ్యలేక ఊరుకుంది మాట్లాడే అవకాశం లేదు. తప్పు చేసానన్నభావం కలిగింది. కనీసం భోజనం తేలేదు. అర్థమైంది. ఆఫీసులో కొంతమందికి ఎలాటివాడో తెలిసినా చెప్పలేదు. కలిసి తాగేవాళ్ళు లంచాలు తీసుకునేవాళ్ళు అందుకే మరునాడు ఆఫీసుకి తయారయింది. ఆ యింటివారు వింతగా అనుమానంగా చూసేరు. పలకరింపుగా నవ్వింది. గుసగుసలు విని అర్థం చేసుకుంది. నెల గడిచింది. ఇంటిలోకి సరుకులు ఏమీ తేవటం లేదు. తనకి వచ్చిన జీతం తాగుడికే. అదిగాక అప్పులు తీర్చడానికి పెళ్ళిచేసుకున్నానని చెప్పేడు. ప్రతిరోజు బలవంతంగానే…
ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఆఫీసుకు వెళ్తోంది కొంచెం తయారయినా
“ఎందుకు? ఆ స్టెనోగాడి కోసమా? రోజూ నా ముందే నీ అందం పొగిడేవిడు. ఆడు ఈడు కోసమా?” అంటూ బయలుదేరేముందు జుట్టు పీకేసేవాడు. ముందే వెళ్ళి పోయేవాడు.
నరకం అంటే ఏమిటో చూపెట్టేడు. యముడు ఎలా పెడతాడో తెలీదు గానీ కనిపెట్టి కొత్త హింసలు పెట్టేవాడు. మూడునెలలు తిరిగేసరికి గర్భవతి.
ఆ రోజు ఆఫీసులో ఇన్స్పెక్షన్. ఆఫీసులో ఎంతమాత్రం ప్రవర్తన తేడా కనిపించదు. ఏమయినా ముందు జాగ్రత్తగా ఉండేవాడు ఎవ్వరికీ అనుమానం రాదు. చెప్పినా తన మీద నింద రాకుండా చూసుకుంటాడు.
ఆఫీసులో జరిగిన పెద్దతప్పును పట్టుకున్నారు. అది తెలిసి ఆఫీసరుకి “మీరు వర్రీ అవకండి. నేను చూసుకుంటాను.” అన్నాడు.
ఆ రాత్రి పదిగంటలకి ఇన్స్పెక్టరుతో వచ్చేడు.
“సార్!నా వైఫ్!”అన్నాడు. ఎర్రటికళ్ళతో చూసేడు.
అర్థమైంది. అంటే ఆ రాత్రికి.. !
వాళ్ళు తాగుతున్నారు. ఇంటిగలావిడ విషయం తెలుసుకుని ఆవిడ అతను కలిసి పోలీసుకంట్రోల్ రూముకు ఫోను చేసారు. వెంటనే పోలీసులొచ్చి తాగుతున్న ఇద్దరినీ తీసికెళ్ళేరు. శారద పెళ్ళయిన దగ్గరనుండీ జరిగినవి కంప్లయింటు రాసింది. ఇంట్లో వుండగానే చెయ్యిపట్టి లాగడం వలన చేతిగాజులు పగిలిన ముక్కలున్నఆధారంతో తీసుకెళ్ళారు. శారదని పిలిచి అడిగారు. ”జైలుశిక్ష పడుతుంది. విడాకులు తీసుకుంటే ఇద్దరూ సంతకాలు పెట్టి పరస్పర వొప్పందం మీద తొందరగా విడాకులు వస్తాయి”అన్నారు.
ఈ విషయం ఆఫీసులో తెలిసి “అలాటివాడిని పెళ్ళి చేసుకోడం తప్పునీదే” అన్నారు.
తనకి ఉద్యోగమిచ్చిన ఆఫీసరు “ సారీ! అమ్మా అతనిలాటివాడని నాకు తెలీదు. లేకపోతే పెళ్ళి చేసేవాళ్ళం కాదు. పోలీసుస్టేషనులో ఉండటంవలన సాక్ష్యాలతో తీసికెళ్ళటం వలన సస్పెండ్ చేసారు. పోలీసులే లాయర్లని ఏర్పాటు చేసారు. విడాకులకి పెట్టుకోవటం వలన, ఆఫీసరు సలహాతో “జైలుశిక్ష వేయిస్తే తిరిగొచ్చేక నీ మీద పగతో ఏమైనా చేస్తాడు. అందుకని నీకు ఏమి జరిగినా బాధ్యుడవుతాడని రాయించుకుని ఆఫీసుకి అన్నిచోట్లా యిచ్చి ఉంచేక వదలమని చెప్పు” అన్నారు.
అదీ నిజమేననిపించింది. ఆరునెలల తరువాత కోర్టుకి పిలిచారు ఇద్దరినీ.
కోర్టులో చేసినవి అన్నీ వప్పుకున్నాడు. ”భరణం కావాలా?”అని అడిగేరు.
“ఏమీ వద్దు. విడాకులు యిచ్చి నా జోలికి రాకుండా వుంటే చాలు”అన్నది.
విడాకులు వచ్చేయి. ఉద్యోగం పోవటంవలన, బైండోవరు రాయటంవలన దూరంగా వెళ్ళిపోయాడు.
అది తెలిసి వదినలు బాధపడుతూ వచ్చి ఇంటికి రమ్మని పిలిచేరు.
వేరే వూరుకి బదిలీ చేసారు. తండ్రిని చెల్లెళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడే సుస్వర పుట్టింది. పుట్టిన నాలుగేళ్ళకి చెల్లెలికి సంబంధం వస్తే తనకి చెప్పకుండా కుదిర్చేరు. బంధువులలో ముఖ్యమైన వారిని పిలిచి పెళ్ళి ఎలాచేయాలి? ఎవరు ఎంత ఖర్చుపెడతారు?”మాట్లాడటానికి శారదని పిలిచేరు. ఏదీ కాదనకుండా అడిగినదే కాకుండా మధ్యలో ఇవికావాలి అంటే అన్నీ సద్దుబాటు చేసింది. కానీ పెళ్ళిలో శారదని ఒక ముత్తైదువగా చూడలేదు. ఏది ముట్టుకున్నా తప్పే అని బంధువులే అవమానించారు. అన్నవదినలు సరేసరి.
మరో ఏడాదికి తండ్రి రామనాథంగారు చనిపోయారు.
ఆస్తిపాస్తులు ఏమీ యివ్వలేని తండ్రికి కర్మకాండలు జరిపించడానికి దెబ్బలాడు కున్నారు. చివరికి శారదే ఆ డబ్బు సద్దింది.
అలా బదిలీలమీద ఊళ్ళు మారుతూ సీనియారిటీ మీద ఒక చిన్న బ్రాంచికి ఆఫీసరయింది. దేనికీ లోటులేదు. సుస్వరని చదివించింది. కానీ చిన్నతనంలో స్కూల్లో “మీ నాన్నగారి పేరేమిటి?ఎక్కడుంటారు?”అని అడుగుతుంటే ఇంటికొచ్చి అడిగేది.
“వస్తారు.” అని చెప్పేది శారద.
హైస్కూల్ లో చదువుతున్నప్పుడు మాత్రం ఒకరోజు ఇంటికొచ్చి “నేను స్కూలుకి వెళ్ళను” అన్నది.
ఇక అసలు విషయం చెప్పాలని జరిగిన విషయాన్ని చెప్పింది.
అంతే ఆ రోజునుండీ ప్రతీదీ వాదించడం ఇష్టం వచ్చినట్టు ఖరీదయిన బట్టలు వస్తువులు కావాలని పేచీ పెట్టడం.
ఇంకోవూరికి బదిలీ అయింది. అద్దెకి ఇంట్లో దిగినప్పుడల్లా “సారు ఏంచేస్తారు? ఎక్కడుంటారు?” ప్రశ్నలు.
సారు ప్రైవేటుగా పనిచేస్తారని చెప్పేది. అప్పుడప్పుడూ కూతురిని తీసుకుని ఎక్కడో అక్కడికి తీసికెళ్ళి భర్త దగ్గరకు వెళ్ళి వచ్చేనని చెప్పేది. ఈలోపు ఇదివరకు పని చేసినచోట చేసినవాళ్ళు బదిలీమీద వచ్చి ఆఫీసులో అందరికీ ఊళ్ళోని చెప్పి ఆఫీసులో అవమానపడేటట్టు చేసేవారు.
ఆఖరుకి పేపరు బోయ్ కూడ పేపరు బిల్లు ఇచ్చి “సారు లేరా?”అడిగి రేపు వస్తాలెండి” అనేవాడు.
“ఏం? ఆడవాళ్ళు పేపరు బిల్లు ఇవ్వకూడదా” అడగాలనిపించేది.
ఆఫీసుకి వచ్చేవాళ్ళు “ సారు ఎక్కడుంటారు? సార్ కూడ ఈ డిపార్ట్ మెంటేనా?” అని అడిగేవారు.
రిటైర్మెంటు వస్తోందని ఒక సొంతయిల్లు కట్టుకుని బదిలీ చేయించుకుని మారిపోయింది. తన అక్కచెల్లెళ్ళని అన్నవదినలని బంధువుల్ని పిలిచింది. అందరూ వచ్చేరు. భోజనంచేసి వెళుతూ “ధైర్యం అంటే నీది. ఒక్కర్తివీ పిల్లని పెంచుకుని నిలబడ్డావు” అని మెచ్చుకున్నారు.
అప్పటికి శారదను అవమానపరచిన బంధువులలో చాలామందికి పిల్లలకి సరి అయిన ఉద్యోగాలు లేకపోవడం, కొడుకులు కూతుళ్ళు కులాంతర వివాహాలు చేసుకోవడం, కొంతమంది విడిపోవటం, ఎన్నో జరిగేయి. ముఖ్యంగా శారదని ఎవరు బాగా అవమానించేరో వాళ్ళ కుటుంబాలలోనే కొడుకులకి ఉద్యోగాలులేక, కూతుళ్ళు కులాంతర వివాహాలు పీటలమీద పెళ్ళిళ్ళు ఆగిపోవడం పెళ్ళికాకుండా గర్భవతులవడం ఇలాటివి జరిగేయి.
శారద వారికి అలా జరగాలని కోరుకోలేదు. అయినా వాళ్ళకి జరిగేయి. ఎప్పుడూ వాళ్ళని కించపరచలేదు. కూతురుకి ఒక సంబంధం వచ్చింది. సుస్వరకి బాగా నచ్చింది. సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం. వాళ్ళకి పిల్లనచ్చింది. “కట్నం వద్దు గానీ ఆడపడుచు లాంఛనాలు, అత్తగారు లాంఛనాలు, అన్నీ వెండివస్తువులు, బంగారం ఉంగరాలు రెండు దగ్గర బంధువులకు ఖరీదయిన బట్టలు పెట్టాలి” అన్నారు.
పెళ్ళి మాటలయాక వాళ్ళతో మాట్లాడుతూ చిన్నవదిన “ మా ఆడపడుచుది కులాంతర వివాహమండీ! మీ పద్ధతులు తెలియవు. మేమన్నీ చెబుతాములెండి” అన్నది.
దాంతో వాళ్ళు “ఆ!అవునా?అలా అయితే కన్యాదానం ఎవరు చేస్తున్నారో వాళ్ళని దత్తత తీసుకోమనండి! లేకపోతే మేము చేసుకోము” అన్నారు. దత్తత కార్యక్రమం జరిపించి ఫోటోలు వీడియోలు పెట్టమన్నారు.
ఆ కార్యక్రమం అవగానే “ శుభలేఖలలో కన్యాదానం చేసేవారి పుత్రిక అని రాయండి!” అన్నారు.
పెళ్ళి మానుకోడం ఇష్టంలేక శారద సరే అన్నది. కానీ పాత ఆఫీసు వారికి తన ఆఫీసువారికి శుభలేఖ ఇస్తుంటే, వారు “ అదేమిటి? సుస్వర మీ అమ్మాయి కాదా? పెంచుకున్నారా? పెళ్ళికి లోను తీసుకున్నారు?
ఇలాటి ప్రశ్నలతో అవమానించేరు. ఏం చేయగలదు? కూతురి పెళ్ళి అయిపోతే చాలనుకుంది. అవమానం భరించింది.
సుస్వర పెళ్ళయ్యాక రెండుసార్లు సీమంతం చేసి పురిటి ఖర్చులు శారదనే పెట్టుకోవాలన్నారు. వాళ్ళు బారసాలకి వచ్చేరు. ఏదో చిన్న గొలుసు పెట్టి శారదని మాత్రం బాలతొడుగు చేయించమన్నారు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంకతో అవమానించేవారు. ఎంత ఖర్చు పెట్టినా “ ఇంకా అది కావాలి. ఇది మాకు ఆనవాయితీ ఇది పెట్టండి “ అనటమే పని. కూతురి జీవితం గురించి ఆలోచించి ఏమీ అనలేక పోయేది శారద.
పిల్లలని చూసుకోడానికి శారదని రిటైరయియాక కూతురు తన ఇంట్లోనే ఉండమంది.
మనవలని చూస్తూ ఆనందంతో గడుపుతోంది శారద. పెన్షను గురించి పట్టించు కోలేదు. మొత్తం అల్లుడికి కూతురికి వదిలేసింది. ఏవో చదువుకోవటం, సర్దుకుని తినటం. తనకంటూ ఏమీ కావాలని అడగలేదు.
అయినా ముఖాన బొట్టు, మెడలో తాడు చూసి పని మనుషులు, ఇంటికి వచ్చినవారు “సారు ఏంచేస్తారు? ఎక్కడుంటారు?” అనడిగేవారు.
ఇవే ప్రశ్నలు! ఎనభై ఏళ్ళు వచ్చినా జవాబు చెప్పలేని ప్రశ్నలు. మనసు చివుక్కుమనే ప్రశ్నలు.
అలా సముద్ర తీరంలో పైన తేలియాడే అలల ఆనందం మనవలతో. లోపల సముద్రపు లోతులలో ఎన్నో విషాదాల అనుభవాలు దాచుకున్న మనసుతో శారద జీవనం!!
దూరంగా సముద్రంలో నడుస్తున్న నావ. ఉండుండి గబగబ కదులుతోంది, మునిగిపోతుందేమో అనిపిస్తోంది.
కానీ మళ్ళీ నిలబడుతోంది. తీరానికి చేరేవరకూ ఇంతేనేమో!
శారద కూడ ఎవరయినా అడిగితే కదిలిపోయే నావలా! మళ్ళీ తీరం చేరడానికి నడిచేనావలా!
కానరాని లోకం చేరడానికి శారద జీవితనావ పయనిస్తోంది!
తీరం ఎప్పుడు చేరుతుందో!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *