June 19, 2024

అమ్మమ్మ – 39

రచన: గిరిజ పీసపాటి

అయినా, వచ్చిన కార్యం ముఖ్యమైనది కనుక ప్రసన్నంగానే ఆయనతో “అవన్నీ నిజం కాదు మామయ్యగారు. ఒక్కసారి ఇంటికి రండి. ఇన్నాళ్లు మేమెందుకు అక్కడికి రాలేదో, అసలు ఆయనకి, నాకు మధ్య జరిగిన గొడవేమిటో వినండి. ఆ తర్వాత మీరే శిక్ష విధించినా నేను, పిల్లలు భరిస్తాము. ఈ ఒక్కసారి నా మాట మన్నించండి” అని వేడుకుంది.
“నన్ను అభిమానించేవారు, నేను తమ ఇంటికి వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఈ ఊరిలో ఉన్నారు. మీరేం మాట్లాడాల ను కున్నా రాముడువలస వచ్చి మాట్లాడండి. లేదంటే ఇక్కడే బతకండి. ఏం చూసుకొని ఇన్నాళ్లు ఇంత ధైర్యంగా బతికారో, ఇకమీద ఎలా బతుకుతారో నేనూ చూస్తాను” అన్నారాయన అంతే కోపంతో.
ఈ మాటలు అన్నీ ఆయన పక్కనే ఉండి వింటున్న భమిడిపాటి మూర్తి ఒక వ్యంగ్యంతో, హేళనతో కూడిన నవ్వు నవ్వడం చూసిన నాగ మనసు ఇక తట్టుకోలేకపోయింది. చిన్నతనం నుండి తనని వాళ్ళ అమ్మానాన్నలు సొంత బిడ్డలా చూసుకున్నారు. వీడు, వీడి చెలెళ్లు, తమ్ముళ్లు కూడా తనని వారి పెద్దక్కలా చూసుకునేవారు.
ఆ అనుబంధంతోనే ఈ ఊరిలో కండక్టర్ గా ప్రైవేటు బస్సుల్లో వాడు పని చేసినన్నాళ్ళు తమ ఇంట్లోనే ఉంటూ, తనకి వచ్చిన జీతం మొత్తం ఇంటికి పంపేవాడు. అయినా తను గాని, తన భర్త గాని ఏనాడు వాడిని రూపాయి అయినా ఇమ్మని అడగలేదు. అన్ని సంవత్సరాలు తను వండి పెడితే తిన్నాడు.
ఆఖరికి తను కండక్టర్ గా ఉన్న బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేయడం వల్ల, అందులోని ప్రయాణికులు కొందరు మరణించడం వల్ల, అప్పటి ప్రజలంతా ప్రైవేట్ బస్సులను నిషేధించమని పెద్ద ఉద్యమం లేవదీసి, ధర్నాలు, రాస్తారోకోలు వంటివి చేయడం వల్ల, వీడి ఉద్యోగం ఊడిపోవడంతో తిరిగి రాముడువలస చేరుకున్నాడు. ఇలాంటి వాడు కూడా ఈనాడు అలా హేళనగా నవ్వడం అస్సలు భరించలేకపోయింది.
ఇలా మామయ్య గారితో మాట్లాడుతూ ఉండగానే, రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ గేటు కూడా వచ్చేసింది. ఆయన తమను తిడుతున్న సమయంలో అక్కడి ప్రయాణికులు ఎంతోమంది తమ వంకే వినోదంగా, విచిత్రంగా చూడడం గమనించి, ఇక మాట్లాడినా ఉపయోగం లేదనుకొని, “ఆఖరిగా ఒక్క మాట మామయ్యగారు. మీ అబ్బాయిని ఒక్కసారి ఇంటికి రమ్మనండి”.
“నెల రోజుల్లో నానికి పదవ తరగతి, పాపకి, గిరిజకి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలవం గానే ఆయనతో కలిసి, మేము రాముడువలస వచ్చేస్తాం. ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా వింటాం”.
“ఆయన ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆయనకు, మాకు కూడా గౌరవంగా ఉంటుంది. దయచేసి ఈ ఒక్క మాట నా మాటగా ఆయనకు చెప్పండి. పిల్లల కోసమైనా ఒక్క మారు ఆయనను పంపించండి”.
“సమస్యని ఆయన వైపు నుండే కాక, ఒక్కసారి మా వైపు నుండి కూడా ఆలోచించండి. వెళ్ళొస్తాం మామయ్యగారు” అని చెప్పి మామగారికి నమస్కరించి, పిల్లలతో సహా రైల్వేస్టేషన్ బయటకు వచ్చి, అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటి వైపు నడవసాగింది. ఆటోలో వెళ్లే డబ్బులు మిగిలిస్తే కొన్నాళ్ళు కూరగాయలు వస్తాయి మరి.
పెద్దాయనతో మాట్లాడి ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే గిరిజకు ఉన్నట్టుండి విపరీతమైన నడుము నొప్పి వచ్చి, మంచం పట్టింది. మంచంలో కూడా కాస్త కదలాలన్నా విలవిలలాడిపోసాగింది. దాంతో తిండి తినడానికి కూడా లేచి కూర్చోలేకపోయేది.
నాగ మధ్యాహ్నం షాప్ నుండి వచ్చేటప్పుడు రోజూ ఒక కొబ్బరి బోండాం తెచ్చేది. ఆ నీటిని వసంత ఒక గ్లాసులోకి వంపి, స్పూన్ తో నోట్లో పోస్తే తాగేది. రోజు మొత్తానికి అదే ఆహారం కావడంతో, పడుకుని చదువుకుందమన్నా పుస్తకం పట్టుకునే శక్తి లేక చదవలేక పోయేది.
చదువు అంటే ఎంతో ఇష్టపడే గిరిజ, నడుము నొప్పి కన్నా పరీక్షల సమయంలో చదవలేకపోతున్నానే అనే బాధకి ఏడ్చేది. వసంత, నాని తమ చదువుల్లో ఉండడంవల్ల, నాగ మధ్యాహ్నం పూట తన భోజనం అయ్యాక, కాసేపు గిరిజ ఆరోజు ఏ సబ్జెక్టు చదవాలను కుంటుందో కనుక్కొని, తను పడుకున్న పట్టె మంచం పక్కన కుర్చీలో కూర్చొని, ఆ సబ్జెక్టు పుస్తకాన్ని గిరిజకు ఒక గంట చదివి వినిపించేది. అలాగే రాత్రి భోజనం అయ్యాక కూడా ఒక గంట చదివి వినిపించేది.
ఇలా వారం రోజులు గడిచాయి. అయినా గిరిజ నడుము నొప్పి తగ్గకపోగా, ఇంకా ఎక్కువైంది. నాగ షాప్ కి వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ గిరిజ పడుతున్న బాధను చెప్పి, పెయిన్ కిల్లర్స్ శాంపిల్స్ అడిగి తీసుకొని, గిరిజ చేత మింగించేది. అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది.
ఇంతలో ఎమ్క్యూర్ ఫార్మాసిటికల్స్ కంపెనీ వారు ఐబుప్రోఫెన్ Ibuprofen 800 mg టాబ్లెట్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అవి నడుము నొప్పికి బాగా పనిచేస్తాయని ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ ప్రసాద్ గారు చెప్పడంతో, వాటిని రోజుకి మూడు టాబ్లెట్స్ చొప్పున గిరిజ చేత మింగించింది నాగ.
ఎలాగోలా పరీక్షల సమయానికి గిరిజ కోలుకోవాలని నాగ ఉద్దేశం. ఆ టాబ్లెట్స్ వెయ్యడం వల్ల కేవలం పది నిమిషాలు కూర్చోగలిగేది గిరిజ. ఆ పది నిమిషాల్లోనే కొద్దిగా భోజనం చేసేది. కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలన్న లేవలేని పరిస్థితి. ఇంతలో పరీక్షల తేదీ రానే వచ్చింది.
వాళ్ళ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్లయ్య కాలేజీ వాళ్ల పరీక్షల సెంటర్. వసంత ఇంటికి ఆటోని తీసుకొచ్చి, మెల్లిగా గిరిజని ఆటోలో కూర్చోబెట్టి, కాలేజీ దగ్గర దిగాక, పరీక్ష హాల్లో గిరిజ సీటు దగ్గర తనని కూర్చోపెట్టి, తన పరీక్ష హాల్ కి వెళ్ళేది.
వసంతది ‘HEC గ్రూప్’ తెలుగు మీడియం అవడం వల్ల, గిరిజది ‘CEC గ్రూప్’ ఇంగ్లీష్ మీడియం అవ్వడం వల్ల, అదే కాలేజీలో ఉన్న వేర్వేరు బ్లాక్స్ లో ఉన్న హాల్స్ ఇద్దరికీ పరీక్షల సెంటర్ గా ఇచ్చారు. అతి కష్టం మీద కూర్చొని పరీక్ష రాసేది గిరిజ.
వసంత కూడా తను పరీక్ష రాయడం పూర్తవుగానే, తిరిగి గిరిజ ఉన్న చోటుకు వచ్చి, తనని మెల్లగా నడిపించుకుంటూ ఆటో దగ్గరకు తీసుకొచ్చి, అదే ఆటోలో ఇంటికి తీసుకువచ్చేది. ఆటో డ్రైవర్ కి ముందుగానే పరీక్ష ఏ సమయానికి అవుతుందో చెప్పి, కాలేజ్ గేటు వద్ద వెయిట్ చేయమని చెప్పడంతో, అతను వీళ్ళు వచ్చే సమయానికి రెడీగా ఉండేవాడు.
అటు నాని కూడా తన పరీక్షలు రాయసాగాడు. పది రోజుల్లో ముగ్గురి పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తయ్యాక నాని టిసీ తీసుకోవడానికి ఒక రోజు స్కూల్ కి వెళ్లి పరుగున, వగరుస్తూ ఇంటికి వచ్చాడు.
“ఏం జరిగింది తమ్మూ? ఎందుకంత పరిగెడుతూ వచ్చావు? టిసి తీసుకున్నావా?” అని అడిగిన పెద్ద అక్కకు, తను స్కూల్ కి వెళ్ళినప్పుడు హెడ్ క్లర్క్ ద్వారా విన్న విషయం చెప్పాడు. అది విని వసంత, గిరిజ కూడా నిర్ఘాంతపోయారు.
“సరే! అమ్మ వచ్చేవరకు ఆగండి. అమ్మకు విషయం చెప్పి, ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు మీరు ఈ విషయం గురించే ఆలోచిస్తూ బాధపడకండి. అలాగే అమ్మ రాగానే హడావుడిగా ఈ విషయం చెప్పాలని చూడకండి. భోజనాలు అయ్యాక నేనే అమ్మతో చెప్తాను. లేకపోతే అమ్మ భోజనం కూడా చెయ్యకుండా బాధపడుతుంది” అంది వసంత.
ఇంతలో నాగ షాప్ నుండి రానే వచ్చింది. అక్క చెప్పినట్టుగానే నాని, గిరిజ అసలేం జరిగనట్లే మామూలుగా ఉండడానికి ప్రయత్నించారు. “నువ్వు కాళ్లు కడుక్కొని రామ్మా! త్వరగా భోజనం చేసేస్తే, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు” అంది వసంత.
భోజనాలు అవగానే, తల్లిని కూర్చోబెట్టి నాని తనకు చెప్పినా విషయం చెప్పడం మొదలు పెట్టింది. “అమ్మా! నీకో విషయం చెప్పాలి. కాస్త ప్రశాంతంగా విను. రెండు రోజుల క్రితం నాన్న వైజాగ్ వచ్చి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లారట.”
“ఈ విషయాన్ని టిసి తీసుకోవడానికి స్కూల్ కి వెళ్ళిన తమ్ముడికి హెడ్ క్లర్క్ రామదాస్ గారు చెప్పారట. తాతే నాన్నను స్వయంగా తీసుకొచ్చి, నాన్న చేత రాజీనామా చేయించి తీసుకెళ్లారట” అంటూ జరిగిన విషయం చెప్పింది వసంత.

***** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *