May 19, 2024

అమ్మమ్మ – 40

రచన: గిరిజ పీసపాటి

వసంత చెప్పిన విషయం విన్నాక నాగ కూడా నిర్ఘాంతపోయి “అదేంటి వసంతా! మీ నాన్న ఇంటికి కూడా రాకుండా అలా ఎలా వెళ్ళిపోయారు? అసలు మనం చేసిన తప్పేంటి? ఆ రోజు మీ తాతకి కూడా మరీ మరీ చెప్పాను కదా! ఒక్కసారి మీ నాన్నను ఇంటికి పంపమని. ఆయన ఈ విషయం మీ నాన్నకి చెప్పలేదం టావా!? ఒక వేళ మీ తాత చెప్పినా నాన్నే వినలేదా!? ఇప్పుడు మనం ఏం చేయాలి?” అంటూ బాధపడసాగింది.
“ఇప్పుడు మనం వెళ్లాలన్నా ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం అమ్మా! అక్కడికి వెళ్లినా, మనం ఏదో తప్పు చేసినట్లు ఊరందరి ముందు పంచాయతీ పెడతారు తాత. ఊరిలో ఒక్కరికి కూడా ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కనుక, నాన్న చెప్పిందే నిజం అంటారు. అదీ కాక తాతని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేరు”.
“మనం ఏ తప్పూ చేయకపోయినా చేసినట్లు చూసేవాళ్ళ మధ్య ఉండలేం. దాని కన్నా ఇక్కడ బతకడమే మేలు. లేదంటే అందరం కలిసి చావడం మంచిది” అంది వసంత.
“అది కాదు వసంతా!” అని నాగ అంటూ ఉండగానే “నువ్వు ఊరుకో అమ్మా! నీకేం తెలియదు. ముందు నువ్వు షాప్ కి వెళ్లి రా! అవతల షాప్ తెరిచే టైం అవు తోంది. ఏం చెయ్యాలో రాత్రికి ఆలోచిద్దాం” అంది వసంత తల్లిని కసురుతూ.
అన్యమనస్కంగానే షాప్ కి వెళ్ళి, అన్న కృష్ణమూర్తిగారికి జరిగిన విషయం చెప్పింది నాగ. ఆయన అంతా విని” వెర్రివాడు కాకపోతే ఉద్యోగానికి రాజీనామా చెయ్యడం ఏంటి చెల్లీ!? రాజీనామా చేసే కన్నా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్ల యితే రిటైర్మెంట్ బెనిఫిట్ గా డబ్బుతో పాటు పెన్షన్ కూడా వచ్చేది కదా!”

“బుధ్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడా? అసలు వాడిని కాదు, వాడికి ఈ వెధవ సలహా ఇచ్చినవాడిని అనాలి. మా చిన్న బుచ్చి మామ (పీసపాటి తాత) కి ఇంత లోకజ్ఞానం లేదు. ఇది ఎవడో ఇచ్చిన సలహానే, సందేహం లేదు” అని బాధపడ్డాడు.
రాత్రి ఇంటికి వచ్చాక తల్లి, పిల్లలు మేడ మీద కూర్చుని ‘ఏం చేయాలా!?’ అని చాలా సేపు తర్జనభర్జనలు పడి, రాముడువలస వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఊరిలో ఒక పశువులాంటి వ్యక్తి గిరిజ, నాగ ఎప్పుడు తనకు ఏకాంతంగా చిక్కుతారా, తన పశువాంఛను తీర్చుకుందామా అని వావి వరుసలు కూడా మరచి ఎదురుచూస్తున్నాడు.
చిన్నతనం అంతా తాతా, మామ్మల దగ్గరే పెరిగిన గిరిజ, తన పన్నెండవ ఏట వైజాగ్ వచ్చేయడానికి ముఖ్య కారణం కూడా ఆ వ్యక్తే. మళ్లీ వెళ్తే తిరిగి ఆ వ్యక్తి వల్ల గిరిజకి, నాగకి కూడా ముప్పు తప్పదు. ఆ విషయం నాగ గతంలోనే తన భర్తకి చెప్పినా, ఆయన ‘ఈసారి మన ఊరు వెళ్లినపుడు మీ జాగ్రత్తలో మీరు ఉండండి’ అని చెప్పి ఊరుకున్నాడు.
పైగా అతను తమకు బంధువే కాక తమ కుటుంబంలోని వారందరికీ చాలా ఆప్తుడు, నమ్మకమైన వ్యక్తి కావడం వల్ల, తను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు సరి కదా!, తిరిగి తామే అతని మీద నింద వేసామని తిడతారు. ఆ విషయం విజ్ఞురాలు అయినా నాగకే కాదు, చిన్నపిల్ల అయిన గిరిజకు కూడా బాగా తెలుసు.
అక్కడికి వెళితే తాను పెద్దది కనుక ఎదిరించో, భయపెట్టో, చాకచక్యంగానో, ఎలాగోలా ఆ వ్యక్తి నుండి వచ్చే ఆపదను తప్పించుకోగలదు. కానీ, అమాయకు రాలు, భయస్తురాలు అయిన పదిహేనేళ్ల గిరిజ ఇవేవీ చేయలేదు. ఈ విషయాన్ని, అక్కడికి వెళితే తమకు జరిగే అవమానాన్ని, వసంత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టు కొని వైజాగ్ లోనే ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చారు.
అయితే వైజాగ్ లోనే ఉండిపోతే బతకడానికి సరిపడా డబ్బు ఎలాగా? అనే
సమస్యకు నలుగురు తలో పని చేసి, డబ్బు సంపాదించి, బతకడం పరిష్కారంగా భావించారు. అలా బతకలేనిరోజున నలుగురూ కలిసి బలవంతంగా చనిపోదామని నిర్ణయించుకున్నారు.
ఒక నిర్ణయానికి వచ్చాక భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. గిరిజ, నాని నిద్ర పోయాక నాగ, వసంత చాలాసేపు ఇక్కడ ఉండిపోతే ఎదురయ్యే సమస్యల గురించి, సాధకబాధకాల గురించి, వాటి పరిష్కారం గురించి చర్చించుకున్నారు.
అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించుకున్నాక, గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించి, చాలా రోజుల తరువాత వారిద్దరూ కూడా ప్రశాంతంగా నిద్రపోయారు.
గిరిజకు వాడిన ఐబుప్రోఫిన్ 800 ఎంజి మాత్రల ప్రభావమో లేక, తర్వాత వాడిన ఆయుర్వేదం మందు ప్రభావమోగాని అప్పటికి సరిగ్గా వారంరోజుల నుండి నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయి, ఇదివరకట్లా మామూలుగా తిరగగలుగుతోంది.
మర్నాడు ఉదయం ఎప్పటిలానే అన్నపూర్ణమ్మగారు పేపరు చదువుకుంటూ వీధి గుమ్మం వద్ద కూర్చుని ఉండగా, నాగ ఆవిడతో తన భర్త ఉద్యోగం ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయిన విషయం చెప్పింది. ఆ స్కూల్లో పని చేసే ఒక వ్యక్తి అన్నపూర్ణమ్మగారి దగ్గరి బంధువు కావడం చేత ఎప్పటికైనా ఆవిడకి విషయం తెలియక తప్పదు కనుక, తానే ముందుగా ఆవిడకి తెలియజేయడం మంచిదని భావించింది.
తాను పిల్లలు ఈ ఊరిలోనే ఉండిపోదలుచుకున్నామని చెప్పి, రోజూ ఒకసారి న్యూస్ పేపర్ ఇస్తే, వారి గుమ్మం వద్దే వాంటెడ్ కాలమ్స్ చూసి, అడ్రస్ నోట్ చేసుకొని, తిరిగి ఇచ్చేస్తామని రిక్వెస్ట్ చేసింది. ఆవిడ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించి, లోకల్ వాంటెడ్ కాలమ్స్ ఉన్న పేపర్ ను నాగకు ఇచ్చింది.
గిరిజ చేతికి ఆ పేపర్ అందిస్తూ టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఉద్యోగం ఇస్తామని
ఉన్న అడ్రస్ లను నోట్ చేసుకొని, ఆంటీకి పేపర్ ని వెంటనే తిరిగి ఇచ్చేయమని
చెప్పింది నాగ.
గిరిజ ఒక పెన్ను, పుస్తకం తెచ్చుకొని అడ్రస్ లు నోట్ చేసుకొని ఆంటీ కి ‘థాంక్స్’ చెప్తూ పేపర్ ను తిరిగి ఇచ్చేసింది.
“ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా?” అని అడిగిన తల్లితో “ఉన్నాయమ్మా! రెండు షాప్స్ లో సేల్స్ గర్ల్స్ కావాలట. టెన్త్ క్వాలిఫికేషన్ చాలట” అంది.
“ఆలస్యం చేయకుండా వైట్ పేపర్స్, ఎన్వలప్ కవర్స్ తమ్ముడు చేత తెప్పించుకొని, నీ సొంత హ్యాండ్ రైటింగ్ తో బయోడేటా రాసి అప్లయ్ చెయ్యు”.
“ప్రింటెడ్ బయోడేటా ఫామ్స్ ఫిలప్ చేసి పంపే కన్నా, ఇలా నీ హ్యాండ్ రైటింగ్ తో బయోడేటా రాసి పంపితే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ విషయం బాగా గుర్తుంచుకో” అని చెప్పిన తల్లితో ‘సరే’ అన్నట్లు తల ఊపి “వైట్ పేపర్స్ అక్కర్లేదమ్మా! నా వైట్ పేపర్స్ నోట్ బుక్ లో చాలా పేజెస్ ఖాళీగా ఉన్నాయి. ఎన్వలప్ కవర్స్ చాలు” అని చెప్పింది.
తమ్ముడు కవర్స్ తేగానే, నోట్ బుక్ లోని ఒక వైట్ పేపర్ మీద తప్పులు, కొట్టివేతలు లేకుండా నీట్ గా తన బయోడేటా రాయసాగింది. మొదటిసారి ఉద్యోగానికి అప్లయ్ చేస్తుండడం వల్లనేమో, బయోడేటా రాస్తుండగా చెయ్యి విపరీతంగా వణకసాగింది. అది చూసి వసంత ఒకటే నవ్వసాగింది.
“బయోడేటా రాయడానికే ఇంత వణికిపోతోంది. ఇక ఇది ఉద్యోగం ఏం చేస్తుంది అమ్మా!?” అంటూ తమ్ముడితో కలిసి చెల్లిని ఆట పట్టించసాగించింది.
తల్లి వాళ్ళిద్దర్నీ మందలించి “నువ్వు కూడా ఒక అప్లికేషన్ రాయి వసంతా! ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం వచ్చినా మంచిదే కదా! ఇద్దరికి వస్తే మరీ మంచిది” అంది.
తనకు అక్కను తిరిగే ఆట పట్టించే అవకాశం ఇచ్చిన తల్లికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ “అసలే అక్క హ్యాండ్ రైటింగ్ నూనెలో పకోడీలు వేసినట్టు ఉంటుందని రత్నక్క (వసంత క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్) ఎప్పుడూ అంటుంది కదమ్మా! ముందు అక్క హ్యాండ్ రైటింగ్ చూడగానే వాడు భయపడి చస్తాడు. ఇద్దరి అప్లికేషన్లలోనూ ఒకే అడ్రస్ ఉండడం గమనించాడంటే నాకు కూడా ఉద్యోగం ఇవ్వడేమో” అంది గిరిజ.
“అబ్బో పిట్ట కూత పట్టిందే!?” అంటూ వసంత తిరిగి అనడంతో, గిరిజ మళ్ళీ అక్క మీద అలగబోయి, అలక స్థానాన్ని నవ్వు డామినేట్ చేయగా గట్టిగా నవ్వేయ డంతో, మిగిలిన ముగ్గురు కూడా గిరిజతో పాటు గట్టిగా నవ్వసాగారు.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *