June 14, 2024

గోపమ్మ కథ – 2

రచన: గిరిజారాణి కలవల

గోపమ్మ ఇంట్లో పెరుగుతున్న లక్ష్మి క్రమేపీ తన తల్లితండ్రులని పూర్తిగా మర్చిపోయింది. గోపమ్మ, అంజిలనే అమ్మానాన్నలుగా అనుకుని వీళ్ళతో అనుబంధం పెంచుకుంది.
కొడుకు రమేష్ కి గోపమ్మ తన అన్న కూతురుతో పెళ్ళి చేసింది. విచిత్రం దాని పేరు కూడా గోపమ్మే. మేము కన్ ఫ్యూజ్ అవకుండా అత్త గోపమ్మ , కోడలు గోపమ్మ అని పిలిచేవాళ్ళం. ఆస్తి పంచినట్టూ, కోడలు రాగానే ఇనప్పెట్టె తాళాలు చేతికి ఇచ్చినట్లు, కోడలుకి తను పని చేసే రెండిళ్ళు రాసి ఇచ్చింది అత్త గోపమ్మ. అవి చేసుకుంటూ చల్లగా వుండమని దీవించింది.
వేరు కాపురం పెట్టనీయకుండా అందరూ కలిసే వుండేవారు. రమేష్, కోడలు గోపమ్మలకి పుట్టిన పిల్లలని లక్ష్మి ఎత్తుకుని ఆడించడం, సాకడం ఎంతో ప్రేమగా చేసేది. అప్పటికి లక్ష్మికి సుమారుగా 14/15 సంవత్సరాల వయసు వచ్చింది.
ఇంతలో, నాకు తెలిసినవారొకరు మా ఇంటికి వచ్చినపుడు లక్ష్మిని చూసారు. దాని పనితనం నచ్చి,
హైదరాబాద్ లో తమ ఇంట్లో వుండి పని చేయడానికి లక్ష్మిని పంపమని అడగారు. జీతం కింద నెలకి పదివేలు ఇస్తానని అన్నారు. ఇంటి పనులు, వంటకి సహాయం చేయాలనీ, భార్యాభర్తలం ఇద్దరమే వుంటాము, తనకి ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువ అవడంతో ఇంటి పని కుదరడం లేదని, బయట నుంచి వచ్చే పనమ్మాయి తరచూ నాగాలు పెట్టడంవలన ఇబ్బందిగా వుందనీ చెప్పారు. ఇంట్లోనే పర్మినెంట్ గా వుంచుకుని తిండి , బట్టలు అవసరాలు ఇచ్చి, పదివేలు ఇస్తానని చెప్పగానే గోపన్న సరేనని, ఒప్పుకుంది.
ఆ వచ్చే సొమ్ముతో కొన్ని పాత అప్పులు తీర్చుకోవచ్చు కదా అని ఆశ పడింది అత్త గోపమ్మ. ఇంతకుముందు లక్ష్మి స్వంత తల్లి అలా చేసినందుకేగా, అక్కడ కొట్టి వాతలు పెట్టినందుకే పారిపోయి తన దగ్గరకి చేరింది. మళ్లీ అలాగే ఇప్పుడు కూడా అయితే ఎలా? అని అనుకుంది, కాని ఇప్పుడు లక్ష్మి పెద్ద అయింది. ఫర్వాలేదు అనుకుని లక్ష్మినే అడిగితే…తను వెడతాననే జవాబు చెప్పేసరికి గోపమ్మకి ధైర్యం వచ్చింది. పైగా తెలిసినవారే కదా, ఎటువంటి సమస్యా ఉండదనుకుని, తనే స్వయంగా లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ లో వాళ్ళింట్లో దింపి వచ్చింది. వాళ్ళు లక్ష్మిని చాలా బాగా చూసుకునేవారు. భార్యాభర్తలు ఇద్దరే వుండేవారు. లక్ష్మికి పని కూడా పెద్ద ఎక్కువగా వుండేది కాదు. రెండు రోజులకోసారి మా ఇంటికి ఫోన్ చేసి గోపమ్మని పిలిపించి లక్ష్మితో మాట్లాడించేవారు. ఆవిడ బజారుకి వెళ్ళినప్పుడల్లా లక్ష్మిని కూడా తీసుకువెళ్ళి ఏదో ఒకటి కొని పెడుతూ వుండేవారు. ఇంట్లో పిల్లలాగా చక్కగా చూసుకునేవారు. తనకి ఇక్కడ చాలా బావుందని, మంచి భోజనం పెడుతున్నారని, ఫోనులో ఆవిడ మాట్లాడించినప్పుడల్లా లక్ష్మి, గోపమ్మతో చెపుతూ వుండేది. తండ్రి గురించి, అన్నా వదినని గురించీ, మేనల్లుడి గురించీ , ఎలా వున్నారని అడుగుతూ వుండేది.
అవన్నీ విన్నాక గోపమ్మ స్ధిమితపడింది. హైదరాబాద్ లో లక్ష్మి బాగానే వుంది. ఇలా ఒక కొన్నాళ్ళు అక్కడే వుంచితే
కొంత సొమ్ము జమ అవుతుంది. తర్వాత ఆ డబ్బుతో, అప్పులు తీర్చుకుని, తర్వాత లక్ష్మికి పెళ్లి చేయొచ్చు అని
కలలు కనేది.
ఇలా ఓ రెండు నెలలు గడిచాయో లేదో… హైదరాబాద్ నుంచి లక్ష్మిని తీసుకువెళ్ళిన ఆవిడ , ఒక రోజు ఉదయమే నాకు కంగారు కంగారుగా ఫోన్ చేసారు.
ఆవిడ చెప్పిన మాటలు వినగానే నా గుండె ఒక్కసారిగా ఝల్లుమంది. ఆవిడ చెప్పినదానికి చాలా భయం వేసింది. ఈ వార్త గోపమ్మకి ఎలా చెప్పాలో తెలీలేదు. కాసేపట్లో మా ఇంటికి పని చేయడం కోసం వస్తుంది. చెపితే గందర గోళం చేస్తుంది. చెపితే ఏంటో? చెప్పకపోతే ఏంటో?
చెప్పకుండా వుండకూడదు… ఎలాగా అని ఆలోచనలో పడ్డాను. అసలు ఇలా అయింది? అనుకున్నాను. నా మాట మీద నమ్మకం వుంచి గోపమ్మ పిల్లని హైదరాబాద్ పంపింది. ఏది, ఎలా జరిగినా నాదే బాధ్యత అవుతుంది… ఎలారా భగవంతుడా? అనుకున్నాను.
ఇంతకీ ఆవిడ ఏం చెప్పిందంటే, ఉదయం నిద్ర లేచి ఆవిడ హాల్లోకి వచ్చేసరికి వీధి తలుపు బార్లా తెరిచి వుందట. హాల్లోనే ఓ పక్కగా పడుకునే లక్ష్మి కనపడలేదు. ఆవిడ కంగారుగా ఇంట్లోనూ, బయటా, డాబా మీదా వెతికిందట. అప్పుడప్పుడు బయట ఎవరింట్లో అయినా పువ్వులు కోసుకుని వస్తూంటుంది. అలా వెళ్ళిందేమో! అనుకున్నారట. ఒకవేళ అలా వెళ్ళినా తలుపులు తెరిచేసి వెళ్ళదు, పైగా తనకి చెప్పే వెడుతుంది అనుకుని గంట పైదాకా వెయిట్ చేసారట. అయినా రాలేదు. ఏదో అనుమానం వచ్చి, చూస్తే అలమారలో లక్ష్మి బట్టలు, సంచీ కనపడలేదు. ఒకవేళ ఏదైనా దొంగతనం చేసి పారిపోలేదు కదా అనుకుంటూ, వెంటనే గబగబా ఆవిడ తన బీరువా, మిగతా విలువైన సామాను చెక్ చేసుకుందట. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే వున్నాయట. వాటినేమీ తాకను కూడా తాకలేదు. మనిషి మాత్రం మాయమయింది. ఆవిడ కూడా చాలా భయపడుతూ ఫోన్ చేసారు. ఏం చేయాలో, ఏం చెప్పాలో నాకు పాలు పోలేదు.
ఇదివరలోనూ ఇలాగే తను పని చేసే ఇంటినుంచి పారిపోయి ఈ ఊరు వచ్చి గోపమ్మ కంటపడింది. గోపమ్మ మంచిది కాబట్టి ఆశ్రయమిచ్చి, కన్న కూతురిలా చూసుకుంది. ఇప్పుడు లక్ష్మి వయసు కూడా పెరిగింది. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే, తెలియని ఊరు, హైదరాబాద్ నగరంలో, ఒంటరిగా ఎదిగిన ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో? రోజులు కూడా బావు లేవు.. ఇలా చేసిందేమిటి? ఇప్పుడు నేను , ఆవిడ, గోపమ్మకి ఏం సమాధానం చెప్పాలో? అనుకుంటూ పరిపరివిధాల ఆలోచించసాగాను.
ఆ రోజు గోపమ్మ వంట్లో బావులేదనీ, పనికి రానని కబురు చేసింది.

సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *