May 19, 2024

తాత్పర్యం – పరిథి

రచన- రామా చంద్రమౌళి

“నీకేమి కావాలో నీకు తెలుసా రామక్రిష్ణా” అన్నాడు ఆ రోజు అన్నయ్య…అకస్మాత్తుగా.
అర్థం కాలేదు. అభావంగా…శూన్యంగా చూశాను.
“డబ్బు…పెద్ద ఉద్యోగం…విశాలమైన సుందర భవనం…కార్లూ వగైరా సుఖాలూ…బ్యాంక్ బ్యాలెన్స్ లు…పేరు ప్రతిష్ట…ఆరోగ్యం…ప్రశాంతత…ఇలా చాలా ఉన్నాయి కదా…వీటిలో నీకేమి కావాలో నీకు స్పష్టంగా తెలుసా?” అన్నాడు మళ్ళీ.
తెలియదు…నిజానికి అన్నయ్య ఈ ప్రశ్న వేసేదాకా నాకేమికావాలో నాకే తెలియదనే విషయం తెలియదు.
“తెలుసుకోవడం అవసరమనే విషయం తెలుసా?”
“ఔను…తెలుసుకోవడం అవసరమే”అన్నాను చటుక్కున అప్రయత్నంగానే.
“ఇది…మనిషి ఒక ఊరికి వెళ్తున్నపుడు దారితప్పకుండా సరియైన దారిని తెలుసుకోవడం లాంటిది. ఖచ్చితమైన దారి తెలియకుంటే చేరవలసిన గమ్యానికి చేరలేము…కదా”
“ఔను”
మధ్య నిశ్శబ్దం.
అప్పుడు నేను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బి టెక్ ఫనలియర్ లో ఉన్నాను.
అన్నయ్య నాకన్నా రెండు సంవత్సరాలు పెద్ద. పేరు చంద్రుడు. అప్పటికి అతను ఉస్మానియాలో ఫిలాసఫీ పి జి చేస్తున్నాడు.
“ప్రతిమనిషి చుట్టూ ఒక ఆవరణ ఉంటుంది రామక్రిష్ణా వృత్తంవలె. నువ్వు జీవితం గురించి ఎంత విస్తృతంగా, లోతుగా తెలుసుకుంటావో అంత మేరకు నీ పరిధి విస్తరించి ఉంటుంది. బియాండ్ దట్…ఆ పరిధిని దాటి నువ్వు చూడలేవు. పరిధి వైశాల్యం నువ్వు నీ గురించీ, ఈ సమాజం గురించీ, నీ సహమానవులపట్ల నువ్వు స్వీకరించే బాధ్యత గురించీ…అంతిమంగా ప్రకృతిలో పుట్టి ప్రకృతితో మమేకమై మళ్ళీ విముక్తమయ్యే నీ సంస్కారం గురించీ జరిపే చింతనపై ఆధారపడి ఉంటుంది. పరిధిని పెంచుకోవడ మంటే… నువ్వు నీ స్పెక్ట్రంను విశాలపర్చుకోవడమే. పరిధికి సూత్రం ఏమిటి. టు పై ఆర్ కదా. అంటే వ్యాసార్థం పెరుగుతున్నకొద్దీ పరిధి పెరుగుతుందన్నమాట. ఔనా”
ఆ క్షణం అన్నయ్య నాకు కొత్తగా…ఇన్నాళ్ళూ తెలిసిన అన్నయ్యకంటే భిన్నంగా కనిపించాడు.
అప్పుడు మేమిద్దరం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరి గోవిందరాజుల గుట్టపై ఉన్నాం. ఆ సాయంత్రం మేమిద్దరం ప్రక్కనే ఉన్న పార్కు కు వెళ్ళి చిన్ననాటినుండి ప్రతి వేసవికాలం గోవిందరాజుల గుట్టపైకి పోయి సొరికెల్లో చల్లనిగాలిలో పడుకుని చదువుకున్న స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ. ,
“ప్రతి మనిషీ వాడికి వాడు ఒక కేంద్రం. వాడి సంస్కారయుతమైన ఎదుగుదలను బట్టి వాడి వ్యాసార్థమేర్పడి…పరిధీ… వైశాల్యం…ప్రపంచం…జీవితం…జీవిత నాణ్యత…అంతిమంగా ప్రశాంతత ఏర్పడ్తాయి. డబ్బున్నవాళ్ళంతా ప్రశాంతంగా ఉండట్లేదు. చివరికి…సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనే ఆత్మాన్వేషణ స్థితి…”అన్నయ్య ఆగి అటు పశ్చిమాకాశం దిక్కు చూస్తూ,
అక్కడ…అప్పుడు సూర్యుడస్తమిస్తున్నాడు.
“నిన్న రాత్రి మనిద్దరం చూశాంకదా…నాన్న తన జీవితమంతా ఒక కీలకమైన బాధ్యతాయుతమైన ప్రభుత్వోద్యోగంలో ఉండి అవసాన దశలో మనకు తెలియకుండా రహస్యంగా కూడబెట్టిన డబ్బును ఎంత ఆబగా తడుముకుని చూచుకుంటున్నాడో. కొద్దిగా డిమెన్షియాకు గురౌతున్న ఆయన ఇన్నాళ్ళూ దాచిన వేయి రూపాయల కట్టలను…బంగారాన్ని…వెండి, స్థలాల దాక్యుమెంట్లు వంటి విలువైన ఇతర సంపదను ఎలా ఎంత ఆత్రంగా పొదువుకుంటున్నాడో”
నాకు నిన్న రాత్రి ఒంటిగంట తర్వాత మా ఇంట్లో జరిగిన సంఘటన జ్ఞాపకమొచ్చింది.
చటుక్కున మాకు మెలకువొచ్చి చూద్దుముకదా నాన్న తన గదిలో పక్కనిండా గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు…బోలెడు బంగారు ఆభరణాలు…అనేక డాక్యుమెంట్స్…మధ్యలో తను కూర్చుని…ముఖం నిండా పిచ్చి ఆనందం…వెలుగు.
అమ్మ చచ్చిపోయి మూడేళ్ళయింది.
నేనూ…అన్నయ్య. మేమిద్దరమే. ఆడపిల్లలెవరూ లేరు కూడా.
కస్టమ్స్ లో పని చేశాడాయన.
గత కొద్దిరోజులుగా మతిమరుపుతో బాధపడుతూ…డిమెన్షియా.
ఈ స్థితిలో ఈ మనిషికి సంపదపై ఇంత పిచ్చి ఏమిటి. ? అని.
ఎక్కడిదింత డబ్బు ఈయనకు. ఇన్నాళ్ళబట్టి ఈ డబ్బూ బంగారం ఇవన్నీ ఎక్కడ దాచాడు. మనిషిలో మరో మనిషి దాక్కుని రహస్యంగా ఉన్నట్టు ఇన్నిరోజులుగా తామెవరికీ తెలియకుండా…నాన్నలో గుప్తంగా. ,
ఆ క్షణం నాన్న ముఖం. విహ్వలంగా…ఉద్వేగంగా…ఆపేక్షగా…ఏమిటది.
“నాన్నకు తెలుసా తను డబ్బుకోసం అంతగా తపిస్తున్నాడని. తెలియదు. తన కెరీర్ ప్రారంభంలో అవినీతికంగానైనా ఇంత డబ్బు సంపాదించే అవకాశాలొస్తాయని ఊహించలేదతను. కాని వస్తున్నకొద్దీ అమ్మక్కూడా చెప్పకుండా గుప్తమైపోయాడు…ఐతే మనిషి తనను తాను ముందే నిర్వచించుకుని ఉంటే…”
అన్నయ్య ఆ ధోరణిలో చాలా చాలా ఆసక్తికరమైన అర్థవంతమైన విషయాలు చెప్పాడు.
అన్నయ్య చంద్రుడిలో ఒక రకమైన విలక్షణ మార్పు వెల్లువలా గత కొద్ది నెలల్లో వస్తూండడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను.
ఆ రోజునుండి ఎక్కువ మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రుడు ఒకరోజు నిష్క్రమించాడెటో. ఎవరికీ ఏదీ చెప్పలేదు. ఎటు వెళ్ళాడు…దేనికోసం…ఏ అన్వేషణలో ఎక్కడున్నాడు…ఏదీ తెలియలేదు.
ఒక రోజు ఒక ఉత్తరం వచ్చింది నాకు కొరియర్లో.
సారాంశం ఏమిటంటే…”నా కోసం ఎవరూ ఎక్కడా వెదకొద్దు…నన్ను నేను అన్వేషించుకుని…నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. సెలవు” అని.
ఆకాశంలోనుండి ఒక ఉజ్జ్వలమైన నక్షత్రం రాలిపోయిన అనుభూతి నాకు.
ఇదంతా గడిచి ఐదేండ్లై. ,
నాన్న గతించిపోయాడు. ఇక మిగిలింది నేనొక్కడినే. బోలెడు ఆస్తి. వైట్…బ్లాక్. నాన్న తెలిసి ఇచ్చింది…తెలియకా సంక్రమింపజేసిందీ. అంతా కలిపి కొన్ని కోట్లు.
నేనొక సాఫ్ట్ వేర్ కంపనీ పెట్టాను. కష్టపడి పని చేయడం…నీతివంతంగా వ్యాపారాన్ని ప్రజాహితంగా చేస్తూ పోవడం.
అన్నయ్య…చంద్రుడు చెప్పిన మాట ఎప్పుడూ మదిలో మెదిలేది. “నీకేమి కావాలో నువ్వు తెలుసుకో…నిన్ను నువ్వు నిర్వచించుకో”అని.
నన్ను నేను స్పష్టపర్చుకున్నాను.
“ఏ రూపంలో చెందినా, ఈ సంపదనంతా ఈ సమాజమే నాకిచ్చింది. కాబట్టి నా ధర్మబద్ధమైన జీవికను కొనసాగిస్తూ మళ్ళీ ఈ సంపదనంతా అంతిమంగా సమాజానికే చెందేలా చేయాలి. “అని.
కాని…ఈ సంపద నా ఒక్కడిదే కాదు. దీంట్లో అన్నయ్య వాటా కూడా ఉంది. చంద్రుడు వచ్చి తన భాగాన్ని తను తీసుకుని నన్ను ఋణవిముక్తున్ని చేస్తే బాగుండును. కాని రాలేదు అన్నయ్య.
ఆరేండ్ల తర్వాత ఇదేవిధంగా వినాయక చవితి నాడు ఇదే బాల్కనీలో వీధిలోకి చూస్తూ నిలబడ్డాను. వినాయక చవితి అంటే చంద్రుడికి చాలా ఇష్టం. చిన్నప్పుడు తనే స్వయంగా గణపతి పూజ చేసేవాడు ఆర్భాటంగా…లీనమై మనస్పూర్తిగా.
చాలా అనూహ్యంగా వీధిలోనుండి చంద్రుడన్నయ్య నడుస్తూ నా ఇంటిదిక్కే రావడం కనిపించింది. గుర్తుపట్టాన్నేను. చకచకా పరుగెత్తి ఎదురెల్లి దగ్గరగా చూచి పలకరించి వెంట తోడ్కొని ఇంటిలోపలికి తీసుకొచ్చాను పొంగిపోతూ.
అన్నయ్య ఒక్క మాటకూడా మాట్లాడలేదు. వచ్చి ఆ రోజు నిర్వహించాల్సిన గణపతి పూజను తనే ఇదివరకటిలా నిష్టగా నిర్వహించి…అదేరోజు రాత్రి వెళ్ళిపోయాడు.
ఎక్కడికెళ్ళిపోయాడు…ఎక్కడుంటున్నాడు…ఏం చేస్తున్నాడు…ఇవేవీ తెలియదు.
అప్పటినుండి ప్రతి వినాయక చవితినాడు చంద్రుడన్నయ్య తప్పనిసరిగా తానంతట తనే వచ్చి…పూజ నిర్వహించి. ,
ఈ ముప్పై ఏళ్ళలో చంద్రునిలో చాలా మార్పొచ్చింది.
గత సంవత్సరమొచ్చినపుడు…ఒక మాట చెప్పాడు. “రినౌన్స్…పరిత్యాగించు. క్రమంగా ఒక్కొక్క భౌతిక బంధంనుండి విముక్తమైపో…ఒక కొత్త ప్రపంచం…కొత్త దివ్యానుభూతి…తన అంటూ ఏదీ లేని నిసర్గ అస్థిత్వంలో ఉన్న మహానందం తెలుస్తుంది రామక్రిష్ణా…”అని.
మన వారసత్వ ఇతిహాస పురాణాల్లో ప్రవచించబడ్డ “దానం”గురించిన స్పృహ కలిగింది నాకు.
ఇవ్వడం…ఇవ్వడం…ఇవ్వడమే…ఈ సృష్టిలోని సకల పశు పక్ష్యాదులు, నదులు, పర్వతాలు, భూమి, చెట్లు, చేమలు, అన్ని ఇస్తూనే ఉన్నాయి. తీసుకోవడమే లెదు. కాని ఒక్క మనిషిమాత్రం సృష్టి ధర్మానికి విరుద్ధంగా కేవలం తీసుకోవడమే తప్ప ‘ఇచ్చే’ గుణాన్నే అలవర్చుకోవడం లేదు.
ఇవ్వడం…తీసుకోవడం. విభిన్నమైన కీలక కార్యాలు.
పరిత్యాగ సిద్ధాంత ఆచరణ లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ నాకు ఏవో కొత్త సత్యాలు బోధపడ్తున్న అనుభూతి…అవ్యక్తమైందీ…భాషకూ, వ్యక్తీకరణకూ అందనిది…తెలుస్తోంది.
మళ్ళీ ఈరోజు… ఐదారేళ్ళ తర్వాత ఆశగా వీధి మలుపు దిక్కు ఎదురు చూస్తున్నాను…అన్నయ్య కోసం…చంద్రునికోసం. ఎప్పుడో అన్నింటినీ పరిత్యజించిన యోగికోసం.
ఈ వినాయక చవితికి అన్నయ్య వస్తే ఎంత బాగుండును.
కాని చీకటీ…వెలుగూ…జననమూ…మరణమూ…ఇవేవీ రమ్మన్నప్పుడు రావు. అవి ఎప్పుడు రావాలో అప్పుడుమాత్రం తప్పక వస్తాయి.
నా చూపులు వీధి మలుపుపై తచ్ఛాడుతున్నాయి…వెదుకుతూ.

***

1 thought on “తాత్పర్యం – పరిథి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *