March 29, 2023

పంచనదీశ్వరస్వామి

ధర్మసంవర్థనీసమేత శ్రీ పంచనదీశ్వర స్వామి ఆలయం!!

రచన: రమా శాండిల్య

ఈ మధ్య మేము చేసిన తమిళనాడు, కేరళ యాత్రలో ఒక భాగమైన, ఒకరోజు దర్శించుకున్న క్షేత్రమే ఈ, ‘పంచనదీశ్వర స్వామి’ ఆలయం.
తమిళనాడు రాష్ట్రంలోని, తంజావూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లె ఈ ఆలయం ఉన్న, ‘తిరువయ్యారు’.
తంజావూరు నుంచి ఉదయం ఎనిమిది గంటలకు తిరువయ్యారు బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ, మొదట పంచనదీశ్వరాలయము దర్శించుకున్నాము. దర్శనానికి వచ్చిన తోటి భక్తులనుంచి సేకరించిన సమాచారం ప్రకారం, ఈ ఊరిలో పంచనదులు ప్రవహిస్తూ ఉంటాయని తెలుసుకున్నాము.
కావేరి, వెన్నారు, వేత్తార్, వడవార్, కొడముల్టీ అనే ఐదు నదులు ప్రవహిస్తూ సస్య శ్యామలం చేస్తున్న పవిత్ర ప్రదేశమైన చిన్న కుగ్రామమిది. ఒక్క నది ప్రవహిస్తేనే, ఊరిని సస్యశ్యామలం చేస్తుంది. అటువంటిది, ఐదు నదులు, రెండు ఉపనదులు ప్రవహించే ఆ గ్రామం రత్నాలను పండించేదని చెప్పారు. ఇక్కడే త్యాగయ్యగారు నడయాడిన పవిత్ర స్థలం ఉన్నది. ఆయన చివరగా వ్రాసిన కీర్తనలన్నీపాడుకుని, శ్రీరాముడిని ఆరాధించిన పవిత్ర పుణ్యభూమి కూడా ఇదే!
సెల్వ, కల్వి అనే ఉపనదులు కూడా ఇక్కడ ప్రవహిస్తుంటాయని ఈ గుడి పూజారిగారు క్షేత్ర మహిమగా వర్ణించారు.

ఈ ఊరిలో, అతి పెద్ద దేవాలయం ఇదేనట. శివపరమైన అన్ని పూజలూ నిర్వహిస్తారట. పంచనదీశ్వరస్వామి పెద్ద లింగరూపంలో ఉన్నాడు. అందానికే అందంగా కనిపిస్తున్నది ఆయన మూర్తి. దక్షిణ భారతదేశంలో, అందులోనూ, తమిళనాడులో వేల సంవత్సరాల నాటి ఆ ఆలయాలను చూసేటప్పుడు, ఎవరికైనా, ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం కలగలిసిన భావం కలుగక మానదు. ఆ ఆర్కిటెక్చర్, ఆ శిల్ప సంపద చూస్తుంటే, కనుల నీరు కారక మానదు. ఎత్తైన కోట గోడలవలె ఉన్న గోడలు, బయటవైపు ఒక ప్రదక్షిణ పూర్తిచేస్తే 10000 అడుగులు పూర్తయ్యాయి. అంత పెద్ద దేవాలయమది. ఈ దేవాలయంలో శిల్పసంపద అపూర్వమే! పంచనదీశ్వరస్వామితో పాటు మొత్తం శివకుటుంబమంతా ఉపాలయాలలో కొలువై ఉన్నారు. ఏ మూర్తిని చూసినా జీవకళ ఉట్టిపడుతున్నది. సంవత్సరానికి రెండు మూడుసార్లు ఊరేగే ఉత్సవమూర్తులు, అనేక వాహనాలను దాచిన నేలమాళిగల వంటి గదులు ఆలయం బైట వైపు తాళాలు వేసి ఉన్నాయి. ఈ ఆలయం, మొత్తం రెండు దేవాలయాలుగా ఉన్నది. అమ్మవారికి విడిగా ఆలయం ఉంది.
స్వామి యొక్క దేవేరి, ‘ధర్మసంవర్థనీదేవి’ కొలువైన ఆలయానికి మూడు వీధులు నడిచి, ఏనుగుశాల దాటి వెళ్ళాలి. స్వామివారి ఆలయానికి, ఈ ఆలయం ఏమీ తీసిపోదు. ఈ రెండు ఆలయాలకు నడుమ ఏనుగుశాల ఉన్నది. దానిలో ఏనుగులు కూడా ఉన్నాయి. కొంతదూరం నడిచి వెళ్ళాక అమ్మవారి దేవాలయం ఉన్నది. నిలువెత్తు అందమైన రూపంతో, తమిళులు కట్టుకునే మడికట్టుతో అమ్మవారి విగ్రహం చాలా బావుంది. తప్పక చూడవలసిన మూర్తి ఈమె! తన పిల్లలు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా చక్కగా ఇరువైపులా ఉన్నారు. అక్కడి శివాలయాలలో గమనించిన విషయం, అమ్మవారు, శివుడు, గణేశుడు, కుమారస్వామి కలిసే ఉంటున్నారు. ప్రధాన ఆలయంలో శివుడైతే, మిగిలిన ముగ్గురూ ఆయన ప్రక్కన కొలువవుతున్నారు. పార్వతీదేవి ప్రక్కనే, కుమారులిరువురూ కొలువై ఉంటున్నారు. అలా ఇక్కడి ఈ దేవాలయాలు పూర్వ వైభవాన్ని చాటి చెబుతున్నాయి. ఒకప్పుడు వైభవంతో ఉండే అప్పటి దేవాలయాలను తలుచుకుంటే, ఇప్పుడు మనసంతా దిగులుతో నిండిపోతున్నది.

ఈ ఆలయ ఉత్సవాలకు పెద్ద పెద్ద ఏనుగుల మీద, అమ్మవారు, స్వామివారు ఊరేగుతారట. చాలా పెద్ద దేవాలయమిది. మూడు ప్రక్కల నడవలేనంత ఆవరణతో, ఇరవై నాలుగడుగుల ఎత్తైన గోడలు, కోటగోడలలా ఉన్నాయి. ఇవి, ఎటు చూసినా పూర్వ వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
ఆషాఢ, శ్రావణ మాసాలలో అమ్మవారికి అనేక సేవలు చేస్తారట. అమ్మవారి ఆలయానికి, మేము వెళ్లినపుడు, అనేక వండిన పదార్థాలు తెచ్చి నైవేద్యం పెట్టారు. ఈ ఆలయ ప్రాంగణంలో, ఆమె దర్శనానంతరం భక్తులు, వారి కుటుంబ సభ్యులందరూ కూర్చుని ప్రసాదం స్వీకరిస్తున్నారు. అక్కడి ఇత్తడి పాత్రలు ఎప్పుడూ మనం చూడని కొత్తరకం డిజైన్ లతో అందంగా కనిపించాయి.ఇక్కడ, శివ సంబంధిత ఉత్సవాలన్నీ నిర్వహిస్తారని, కార్తీక పౌర్ణమి, శివరాత్రి పర్వదినాలలో, చాలా పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారని, ప్రదోష కాల పూజలు, ఆరుద్రానక్షత్ర పూజలు నిర్వహిస్తారని, ఇక్కడి పూజారిగారు చెప్పారు.
కళకళలాడుతున్న ఆ రెండు దేవాలయాలు చూడటం మాకు మంచి అనుభావం.
మీలో ఎవరైనా, తిరువయ్యారు వెళితే, ఈ ఆలయాలను దర్శించుకోవటం మరువకండి.

1 thought on “పంచనదీశ్వరస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

October 2022
M T W T F S S
« Sep   Nov »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31