April 23, 2024

పరవశానికి పాత(ర) కథలు – యువర్ సీట్స్ ఆర్ సేఫ్ విత్ మి

రచన: డా. వివేకానందమూర్తి

వాన దంచేస్తోంది. టాపుమీద పడే ధారల శబ్దం సిట్యుయేషన్ మ్యూజిక్ లా వుంది.
కారు దీపాల వెలుగులో ప్రహరీ గోడ ప్రస్ఫుటంగా కనబడుతోంది.
అగ్గిపుల్ల వెలగ్గానే గీసిన శబ్దం. కాంతి కంటే ధ్వని లేటయింది. సిగరెట్టు తుదముట్టించి పుల్లని తుది ముట్టించేడు. ఒక్కసారి దమ్ము లాగేడు. కాస్త వంగి స్పీడో మీటర్ లైటు వెలుగులో మణికట్టు చూసుకున్నాడు. ఫణి పదకొండున్నర నుదురు బిగించి రెప్పలు పైకి విప్పి చూశాడు. వాన వినిపిస్తోంది. చూపు కదిపి ముందు లైట్ల కాంతిని చూపేడు. కిరణాలింకా ధారల్లో తడుస్తున్నాయి. వాన కన్పిస్తోంది. సీట్లోంచి హేండ్ గన్ చేతికి తీసుకున్నాడు. నల్లగా మెరిసింది. ఒకసారి ప్రహరీ కేసి చూసి ఇంజన్ హెడ్ లైట్స్ తో సహా ఆఫ్ చేసి డోర్ తెరిచేడు. వాన వుధృతి శబ్దం ఒక్కసారి వాల్యూమ్ పెంచినట్టయింది. తలకి కేప్ తగిలించుకుని, వొంటి మీద రైన్ కోటు సర్దుకుని సిగరెట్ గట్టిగా ఒకసారి పీల్చి పారేసాడు. కారు దిగి డోర్ వెనక్కి తోసేడు. జుబ్ మని పడింది. మెల్లగా ప్రహరీ వైపు నడిచేడు.
గేట్ దగ్గరికి వెళ్ళి జేబులోంచి టార్చి తీసి దాని వెలుగుతో నేమ్ ప్లేట్ వెదికాడు. అనుమానం లేదు. అదే యిల్లు, వానలో స్తంభంలా తడుస్తూ క్షణం అలాగే నిలబడ్డాడు. వర్షాన్ని లెక్కచేసే దృష్టి అతడి కున్నట్టులేదు. మెల్లగా గేటుతీసి లాలో ముందుకి నడిచేడు. యిల్లు దగ్గరవుతోంది. అద్దాల వెనుక లైట్ల కాంతి తెలుస్తోంది.
తలుపు సమీపించి ఏదో మెడిక్ చేసేడు. కాస్త తోసి సన్నటి సందులోంచి చూశాడు.
లోపలికి ఓ మూలగా డైనింగ్ టేబుల్, అతను భోంచేస్తున్నాడు. ఆమె వడ్డిస్తోంది. తను ముందుగా ముగించినట్టుంది.
తలుపుని పూర్తిగా తోసేడు. చప్పుడవలేదు. కుడిచేత్తో గన్ పట్టుకుని వారి వేపు నిదానంగా నడిచాడు! కొన్ని గజాల దూరంలో ఆగేడు. యిప్పుడతని ముఖం మీద లైటు పడి గుర్తు తెలుస్తోంది. వాళ్ళిద్దరూ గమనించలేదు.
“ఇది ఎన్నో సారో చెప్పటం. ఎంత టైము. ఎంత చెప్పినా ఎక్కువగా చెప్పటమే కనిపిస్తోంది. పులుసులో దుంప ముక్కలు కనిపించడం లేదా? ఆ చక్రవర్తి మాత్రం కనిపించడు. రోజూ నన్ను బోర్ చైడానికి మీకు మరో పద్ధత తెలీదు లాగుంది.”
“నీ ముఖం! చక్రవర్తి పులుసులో కనిపిస్తాడా, పూరీలో వుంటాడు గానీ, పూరీ నుంచి కల్కటా ట్రాన్స్ఫర్ కావచ్చని రాశాడు. ఏమయిందో! మజ్జిగ వెయ్యి, వాడు పెరుగు తప్ప వేసుకోడు”
“తెలుసు. చాలా సార్లు తోడెట్టమని నా ప్రాణాలు తోడేడు. అంత స్నేహితుడైతే అర్జంటుగా ఓసారి వచ్చి మీ విరహవేదన తీర్చ…” సడెన్‌గా ఆగిపోయి, శపిస్తే బొమ్మయిపోయినట్టు దిమ్మెరబోయింది ఫణిని చూడగానే ఉమాదేవి. పార్థసారథి తలతిప్పి చూసేసరికి ఫణి చేతులు పైకెత్తి చిరునవ్వుతో కనిపించేడు. పార్ధసారధి హఠాత్సంతోషంతో లేచి – “ఒరే చక్రవర్తీ” అంటూ ఫణి చక్రవర్తి దగ్గిరిసా వెళ్ళి భుజం మీద ఎడంచెయ్యి వేసి భార్యకేసి తిరిగేడు – “నే చెప్పలేదూ ఉమా! థింక్ ఆఫ్ ది డెవిల్! వీడే చక్రవర్తిగాడు. ఎలా వూడిపడ్డాడో చూశావా! రారా, ఓ టవలియ్యి. తల తుడుచుకుంటాడు. కాళ్లూ చేతులూ కడుక్కు రా – మరో ప్లేట్లో అన్నం వడ్డించు” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి నడిచేడు.
ఫణి “నమస్తే” అంటూ టవల్ అందుకున్నాడు. కేప్, గన్, రైన్ కోటు తీసి సోఫా అంచున ఉంచేడు.
ఉమాదేవి ప్రతి నమస్కారం. నోట్లో నలిగిపోకపోయినా అతను పట్టించుకోనేలా లేడు.
పార్ధసారధి పిలిచేడు. “రారా, వడ్డిస్తోంది.”
“రాత్రిళ్లు అన్నం మానేశాను.” అని ఉమాదేవిని చూసి జేబులోంచి సీసా తీస్తూ సోఫాలో కూర్చున్నాడు ఫణి.
నేపకిన్ తో కడుక్కున్న చెయ్యి తుడుచుకుని, మూతి అద్దుకుంటూ “ఇదో కొత్త ఇంప్రూవ్మెంటన్నమాట” అంటూ తనూ వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు పార్ధసారధి.
ఫణి సీసా మూత విప్పుతున్నాడు.
“నన్ను చూడకుండా చచ్చిపోతా వనకున్నాను” సీసాకేసి దీనంగా చూస్తూ అన్నాడు పార్థసారథి.
“యింకా మధ్యాహ్నం భోజనం మానలేదు… గ్లాసు!” ఉమాదేవి ఐస్ వాటర్ సీసా, ఖాళీగ్లాసు తెచ్చి, టీపాయ్ మీద పెట్టింది.
“నా అలవాటు. క్షమించక తప్పదు. అందామనుకున్నా. కానీ తేలిగ్గా క్షమించేశారు” అన్నాడు. ఫణి ఉమాదేవిని క్రీగంట చూస్తూ. ఉమాదేవి ఆ చూపుని కలుపుకోలేక తన చూపు తిప్పి ఆధారం కోసం భర్తని చూస్తే పార్ధసారధి తల వంచి సిగరెట్టు వెలిగించుకుంటున్నాడు. ఆమె వెనక్కి తిరిగింది.
ఫణి గ్లాసులో విస్కీ పంపి, నీళ్ళు కలుపుకున్నాడు. పార్థసారథి పిలిచేడు. “రా! ఉమా! – కూచో!
“గిన్నెలు సర్ది వస్తా!” ఆమె తిరక్కుండానే చెప్పి కదిలింది.
పార్థసారథి మాటలు మొదలెట్టాడు.
“ఊఁ. అసలేవిట్రా నీ వుద్దేశం? మా పెళ్ళి కెలాగూ రాకుండా సాకు చెప్పి తప్పించుకున్నావు. అన్నిసార్లు వస్తానని అరవైసార్లు మానేశావు. నీ గురించి తల్చుకోని రోజు లేదు.”
“యిప్పుడేనా యిలా కల్పినందుకు సంతోషించు. అసలు నేవచ్చిన పని వేరు. గిన్నెలు సర్దడం ఆగింది. వేటకని వస్తే పిడకల వేటలా నువ్వు తగిలావు.”
సర్లే వెధవ జోక్స్, నన్ను వెతుక్కోవాలని అనిపించకపోతే రాగలవా చెప్పు! ఉమకి చాలాసార్లు చెప్తున్నా నీ గురించీ, నీ తత్త్వం గురించి, వానలాగో, వరదలాగో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పడతావని, పార్థసారథి సిగరెట్ దమ్ము లాగేడు. “అది సరే గానీ ఏవిటీ రావటం? సామానేది విలన్‌గా ఆ గన్ చేత్తో పట్టుకు తిరగడమేవిటీ. ఆహా, వేట నీ హాబీ కదూ, ఏ అడవికైనా పోయి తిన్నగా ఇటే వస్తున్నావా?”
ఫణి నవ్వేడు “నువ్వున్న ఈ ప్రదేశం అడవి కాదూ?
“అంటే వెధవా? నీ ఉద్దేశం నేను జంతువుననా?”
“కాదు, అయినా నాకిప్పుడు జంతువ్వేట కాదు. వెన్నెల వేట అడవి కాసిన వెన్నెల వేట. ఐ మీన్ అడవిలో కాసే వెన్నెల వేట. ఉమాదేవి టాబ్లెట్ మింగినట్టు గుటక మింగి గొంతు తడిచేసుకుంది.
“నిజమేరా చక్రీ. మనిద్దరం బాగా దూరమయిపోయాక మన స్నేహం అడవి కాచిన వెన్నెలే అయింది. దాన్నెలాగైనా వేటాడాల్సిందే, భోజనం అయిపోయింది. కానీ లేకపోతే నేనూ ఓ పట్టు పట్టేవాణే – ఊఁ యింతకీ యిదేనా రావటం!”
“లేదు. ఉదయం వూళ్ళో టి.బి లో దిగా ఉద్యోగరీత్యా, యివాళా రేపూ కేంపు. నీ ఎడ్రసు రేపు కనుక్కుందామనుకున్నా. రేపు కాస్త ఖాళీ చాలా రోజులైంది షికారీ చేసి, సాయంత్రం సరదాగా బల్గేరితే వాన ముంచుకొచ్చింది. కారు కూడా కాస్త ట్రబులిచ్చేసరికి చీకటి పడిపోయింది. నేను నీ దగ్గర కొచ్చిపడ్డాను”
“ఒరేయ్! యీ వూళ్ళో నేనున్నానని తెల్సు. నీ కోసం కనిపెట్టుకున్నానని తెల్సు. తిన్నగా ఇంటికి రాకుండా టి.బి లో దిగుతావా?” ఆగి అన్నాడు. “వెధవా కనీసం నా తృప్తి కోసమన్నా నీ కోసమే వచ్చాన్రా అని అబద్దం చెప్పొచ్చుగా.”
ఉమాదేవి వచ్చి భర్త పక్కన కూర్చుంది.
ఫణి అన్నాడు “అబద్దం దేనికిరా ఫూల్” ఉమాదేవి కేసి చూస్తూ, “ నే వచ్చింది నీ కోసమే. ఉద్యోగం నెపం మీద వచ్చాను. అందుకే అక్కడ దిగాను. లేకపోతే…” ఉమాదేవిని సనసన్నగా చూస్తూ- “నిన్ను చూడ్డమే వీలుపడేది కాదు.” ఉమాదేవి ముఖంలో నెత్తురు చుక్క లేదు.
“ఏరా! నువ్విక పెళ్ళిచేసుకోదల్చుకోలేదా?” పార్ధసారధి అడిగేడు –
“డ్రాపిటి! నా సంగతి అలా వదిలేయ్. మరికాస్త తాగి, అడగడం, మరిచా, నీ కెంత మంది పిల్లలు?” “ఏదీ! ఎక్కడా?”
“యిదుగో యిక్కడా” అంటూ పార్థసారధి ఉమాదేవిని భుజం తట్టి చూపిస్తూ నవ్వేడు. ఫణి పగలబడి నవ్వేడు. ఉమాదేవి నవ్వలేదు.
ఫణి గ్లాసు ఖాళీ చేస్తూ లేచాడు. ఆమెని చూసి వస్తా! ఎడ్రసు తెల్సిందిగా! రేపంతా కలుద్దాం”. అతని మీద పూర్తి చేసాడు.
పార్ధసారధి “ఎక్కడి కోయ్? నీ ముఖం?”
“లేదురా వెళ్ళాలి. ఎర్లీ మాణింగ్ ఎంతో ముఖ్యమైన పని వుంది.”
“టెన్-టెన్ థర్టీకి ఫ్రీ అవుతా. ఆ పైన అంతా ఖాళీ. రేపంతా నీతో వుండి ఎల్లుండి తెల్లారకట్టే వెళా, సరేనా!”
“వర్షం రా!”
“రెయిన్ కోటుంది. కారుంది పర్లా, నన్నింక చంపకు. పొద్దుటే అఫీషియల్ వర్క్ చూసుకుని వస్తా. నువ్ ఆఫీసుకి సెలవు పెట్టి వచ్చేయ్. పగలూ, రాత్రీ మజా చేద్దాం – వస్తా మరి.”
“సరే మరి.”
“అయినా వెధవ కొంప. ఈ మూల అడవిలో ఒంటరిగా ఏడవకపోతే కాస్త టౌన్ దగ్గరగా తీసుకోవచ్చుగా?”
“ఏం చేస్తాంరా. నాకు ఎలాట్ చేసిన క్వార్టర్స్. నా ఆఫీసుక్కూడ దగ్గర.”
“సరే వుండు మరి. గుడ్ నైట్.”
ఫణి కదిలాడు. ఉమాదేవి కదలకుండా చూస్తోంది. తలుపు దగ్గర ఆగి అతను తల తిప్పి, ఆమెను చూసి మరోసారి “గుడ్ నైట్” అని కదిలేడు.
కాని తనకీ రాత్రిలా గడ్డురాత్రిగా మారుతుందనుకోలేదు ఉమాదేవి.
* * *
పార్ధసారధి ఆఫీసుకి తయారవుతున్నాడు. ఉమాదేవి డ్రస్సు వగైరా సర్ది పెడుతోంది. ఆమె ప్రతి కదలికలోనూ కంగారు కనబడుతోంది. చీటికి మాటికి వీది వేపు చూసే ప్రతి ఎదురుచూపు బెదురుచూపే అవుతోంది.
పాంటు మడత విప్పుతూ పార్ధసారధి “వీడింకా రాలేదే?” అన్నాడు. ఉమాదేవి ఏమీ అనలేదు.
ఆఫీసుకి బయల్దేరుతూ, “వాడొస్తే లంచికి వుంచెయ్యి. నే వచ్చేదాకా వుండమను. సెలవు పెట్టి వచ్చేస్తా. వాడు పుస్తకాల పురుగు. నవల్పు పడెయ్. నే వచ్చేదాకా తింటూ వుంటాడు.” అని చెప్పి వెళ్ళాడు.
ఉమాదేవి సోఫా అంచు పట్టుకుని అలాగే కాసేపు నిలబడింది. ఉదయం ప్రశాంతంగా వున్నా ఆమెకు వుత్పన్నమవుతున్న ప్రళయంలా వుంది. రేడియో ట్యూన్ చేసి, నెమ్మదిగా ఆలోచిస్తూనే కిచెన్లోకి వెళ్ళింది. స్టా వెలిగించి కాఫీ తయారుచేసుకుంది. కప్పులో పోసుకుని సౌ ఆర్పేసి మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. ఆగి ఆగి రెండుసార్లు సిప్ చేసింది. ఆ సిప్ చెయ్యడంతో కాఫీలో ఏదో కలపడం మరిచిపోయానన్న భావం కనబడుతోంది. ఆగి ఆలోచించింది. అంతుబట్టలేదు. అరక్షణం తర్వాత హఠాత్తుగా స్ఫురించినట్టయి తలతిప్పి రేడియో కేసి చూసింది. అది పలకట్లేదు. తలెత్తి చూసింది. ఫాన్ ఆగి పోలేదు. తిరుగుతోంది. చేతిలో పేపర్లో కప్పు శబ్దం చేస్తోందిప్పుడు, టీపాయ్ మీద పెట్టేసి భయంగా లేచి నిలబడింది.
“భయపడకు ఉమా! నాకా పాట నచ్చలేదు” బుక్ షెల్స్ దగ్గర మోడా మీద కూర్చుని, ఏదో పుస్తకం తిరగేస్తూ అన్నాడు ఫణిచక్రవర్తి,
ఉమాదేవి ఉలిక్కిపడింది. కాస్త తేరుకొని “ఎప్పుడొచ్చావ్?” అనగలిగింది.
ఫణిలేచి ఆమె దగ్గరకు వస్తూ “ఏవన్నావ్? నాకు వినబడలేదు” అన్నాడు. అతను మరీ దగ్గరయితే, ముఖం పక్కకు తిప్పుకొంది.
ఫణి తాపీగా కూర్చుని, యింకా తాపీగా జేబులోంచి బాటిల్ తీసి టీపాయ్ మీద రక్కుమనిపిస్తూ పెట్టేడు.
ఉమాదేవి తలతిప్పకోపోయినా, అతను టేబుల్ మీద బాటిల్ పెట్టాడని ఆమె చూపు మార్పులో రిజిస్టరయింది.
“ఖాళీ గ్లాసు – ఐస్ వాటర్” అన్నాడు.
ఉమాదేవి యిప్పుడు విసురుగా తిరిగి చూసింది. “తెచ్చిస్తావా?” అన్నాడు.
ఆమె విసురుగానే వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఐస్ వాటర్ సీసా, బల్లమీంచి ఖాళీ గ్లాసు తెచ్చి అతని ముందు పెట్టింది.
ఫణి సీసా మూత తెరిచి గ్లాసులోకి విస్కీ వొంపి ఐస్మటర్ కలుపుకుంటు న్నాడు. ఆ కలిపే నీళ్ళ శబ్దం కూడా ఆమెను కలవర పెడుతోంది. ద్రవం, వుపద్రవం తోడవుతున్నాయి. ఏం జరుగుతుందో? ఫణి తాగడం మొదలెట్టాడు.
ఉమాదేవిలో క్రమేపీ ఏదో ఆలోచన నిశ్చయానికొస్తోంది.
అతను మరోసారి సిప్ చేసి, సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం జేబులు తడుముకున్నాడు. సిగరెట్ నోట్లోంచి తీసి పట్టుకుని “చూడు ఉమా”
“ఎందుకొచ్చావ్ చెప్పు?” గట్టిగా, సూటిగా అడిగింది. ఫణి ఒక్క క్షణం ఆగి, చూసి మెట్టుమీద మెట్టుగా నవ్వుతూ ఒక్కసారి పెద్ద పెట్టున నవ్వేడు. ఉమాదేవి చూపు మార్చలేదు.
ఫణి నవ్వు ఆపి, “ముందు అగ్గిపెట్టె యివ్వు” అన్నాడు. ఇస్తే ఆ రహస్యమేదో చెబుతానన్నట్టు, ఆమె వెళ్ళి తెచ్చి యిచ్చింది. అతను సిగరెట్టు వెలిగించుకుని ఒక దమ్ములాగి తీరిగ్గా పొగవదుల్తూ, “కూర్చో” అన్నాడు.
ఆమె కూర్చోలేదు. నా ప్రశ్నకి సమాధానం కావాలి అన్నట్లు స్థిరంగా అతని కళ్ళలోకే చూస్తోంది.
ఫణి మళ్ళీ జేబులు వెదుక్కుని ఓ కాగితం వెతికి తీసి ప్రారంభించేడు.
“ఎప్పట్నించో కలుద్దాం అనుకుంటూ కలియలేకపోతున్నాం నా ప్రాణ మిత్రుడివి నువ్వొక్కడివే రా. కనీసం ఒక రోజేనా సరదాగా గడుపుదాం. పైగా నీ మీద బెంగతో రోజూ మా ఆవిడతో నేను నీ గురించే మాట్లాడేస్తున్నాను. నీ ఫొటో అయినా చూసుకుంటూ దానికి చూపిద్దామంటే నా దగ్గర లేదు. నువ్వు మగాడివైనా, మా ఆవిడ నిన్ను ‘పెళ్ళయినా మరువలేని నా పాత ప్రేయసి’ అంటూ జోక్ చేస్తోంది. దానిది చాలా మంచి మనసు. నేను ప్రాణంగా ప్రేమిస్తే నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తుంది. మాది చింతలు లేని కుటుంబం. ఒకసారి వచ్చి చూచిన నీవే సంతసింతువు. మైకంలో మంచి మిత్రుడ్ని మరువకు దేవదా! నీ పారు.”
ఉత్తరం ఆమె చేతికిచ్చి మరో గుక్క మింగేడు. ఆమె అందుకుని అందులోకి చూసింది. అద్దంలాంటి తెల్లకాగితం తెల్లబోయింది. తేరుకుంది. తీక్షణంగా చూసింది.
తను తీరుబాటుగా నవ్వుతూ చెప్పేడు – “వుత్తరం నాతో తేవడం అనవసరం అనుకున్నా. అంచేత… ఆగి అన్నాడు.” అలాగే రాశాడు. ఆగి వద్దామనుకున్నా, అనుకున్న ఆఫీసు పని కాన్సిల్ అయింది. అంచేత తొరగా వచ్చేశా, మీ ఆయన సెలవు పెట్టి రాడానికి లేటవుతుందేమో, నేను ఒక సారలా వెళ్ళొస్తా!” సీసా ఖాళీ చేసి లేచేడు ఫణి.
“భోజనానికి ఉండమన్నారు”.
“రాత్రికి కూడా వుంటా” ఖాళీ సీసాకేసి చూస్తూ. “తొందర్లోనే వస్తా”, మరో సీసా తెచ్చుకునే వుద్దేశం ప్రకటించినట్టుగా చెప్పి కదిలేడు.
కారు కదిలివెళ్ళిపోతున్న శబ్దం ఫేడ్ అవుతూంటే ఆమె తను గతంలోకి జారిపోతున్నట్టుగా ఫీల్ అయింది.
వాలు కుర్చీ కిటికీ పక్కనే వుంది. ఉమాదేవి అందులో కూర్చుని వూచల మధ్యకి చూస్తోంది. వాకిట్లో గన్నేరు చెట్టు కన్నీరు చెట్టులా కనబడుతోంది. ఆకులు టపటపలాడుతూ వానకి మిగిలి నిలిచిన నీటి బిందువుల్ని రాలుస్తున్నాయి. ఉమాదేవి రెప్పలు రెపరెపలాడుతూ కన్నీటి బిందువులు రాల్చేయి.
కిటికీ ఫ్రేములో గతాన్ని చూడటం మొదలెట్టింది :
బీచ్ లో వెన్నెల్లో ఫణీ, తనూ దగ్గరగా కూచున్నారు. చేయి వేసి దగ్గరగా తీసుకోబోయాడు. తను తప్పించుకుంటూ అంది – “పెళ్ళయేదాకా మనం హద్దులు మీరద్దు. మనసుల్ని కాస్త హద్దులో వుంచుకుందాం.
ఫణి – “మన ప్రేమ మనసు హద్దులు దాటి నా వొళ్ళంతా ఆక్రమించింది. అనుభవానికి ఆత్రుతపడుతోంది.”
“నువ్వు మరీ వుండబట్టలేకపోతున్నావు ఫణీ. కాస్త వుండు.”
“మగాణ్ణి. నిన్ను అర్ధం చేసుకున్న వాణ్ణి. అర్ధం చేసుకున్న వాళ్ళు అనుభవానికి అర్హులు” మళ్ళీ చెయ్యి వెయ్యబోయాడు.
“నాక్కోపం వస్తుంది.”
“నాకు రాదు.”
“నాది కేవలం ఆరాధన కాదు. మనసునీ, శరీరాన్ని సమానంగా ప్రేమించే సామాజిక దృష్టిగల ప్రేమవాదిని.”
“నవల్సు చదివే పిచ్చి కాస్త తగ్గించు. అక్కడికి నాది సెన్సారు బలి అయిన ప్రేమయినట్టు” లేచి నిలబడింది.
“అప్పుడే లేచావేం ?”
“ఇవాళ పౌర్ణమి, కెరటాలు చూడు. ఎలా ముందు ముందుకొస్తున్నాయో. ప్రేమలో ఇలాగే మునిగి కూర్చుంటే, కాళ్ళకి చుట్టుకుని లాక్కుపోతాయి.” అంటుండగానే పెద్ద కెరటం ఒకటి పెద్ద హోరుతో వువ్వెత్తున లేచి దగ్గిరకంటా వస్తోంది. తను అడుగు వెనక్కి వేసింది.
ఆ కెరటం కిటికీ ఫ్రేమంతా ఆక్రమించి పెద్ద శబ్దంతో మీదపడినట్టయి ఉమాదేవి త్రుళ్ళిపడింది.
ఫణి కోపంగా అంటున్నాడు. “నువ్వు నాకు చేస్తున్నది. నే నెక్కడా నిరూపించుకోలేని అన్యాయం. ఉమా! తప్పు చేస్తున్నావు. తప్పటడుగు వేస్తున్నావు. నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు.”
“నా పరిస్థితి అర్థం చేసుకో. అన్యాయం అయితే యిలా సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాన్న వాళ్ళకి మాటిచ్చాడు. నాకు జన్మిచ్చాడు. నా అన్నవాళ్ళకి దూరం కాలేను.”
“నిస్సహాయతవల్ల ప్రేమికుణ్ణి బాధగా వదిలిపోవాల్సి వస్తోందని చెప్పడానికేగా, మోసమూ చెయ్యాలి. నిర్దోషిగానూ బ్రతకాలి, ఉమా! ప్రేమకి ప్రేమే కారణం కావాలి. కారణాల్లో కదిలేది ప్రేమ కాదు. నీది నిజమైన ప్రేమ అయితే మీ నాన్న గారితో నేను మాట్లాడుతా.”
“లాభం లేదు. ఆయన నా మాటే చెవిని పెట్టలేదు. కోపిష్టి. మాటలు మిగిలితే నువ్వు సహించలేవు. నేను భరించలేను.”
“నన్ను వదిలి బ్రతకడం భరించగలవు”
“అవును ఉమా! త్రాసులో చెరో ప్రక్క నువ్వూ, నేనూ కూర్చుంటే మన ప్రేమ సరితూగేది. కానీ ఓ పళ్ళెంలో నన్ను కూర్చోబెట్టి మరో పళ్ళెంలో ఎవరినో కూర్చోబెట్టావు. ఆ వ్యక్తి గెలిచి తూగాడు. నేను తేలిపోయాను. తేలికైపోయాను.”
“ఫణి యిక మాటల్లో నన్ను వేధించకు. నేనింక నీకు చెప్పలేను. దయచేసి నన్న మర్చిపో.” చాలా సేపు మౌనం.
“ఉమా! నేను నిన్ను తప్ప ఏదీ కోరను నువ్వూ లభించలేదు. నీ నిశ్చయం యిక మారదు. వెళ్తాను. దూరంగానే వెళ్తాను. నీ ఆలోచన కందనంత దూరం కాదు. నా ఆలోచనకందనంత, అదీ కాదు. నా పరిస్థితి లాగే మాటలు తలక్రిందులవుతున్నాయి. సరే, పోనీ, నీ జీవితానికి అడ్డు రాను. విడిపోయే ముందు నాదొక్కటే కోరిక.”
“ఏమిటి?”
“కోరిక.”
“ఫణి” “మనం స్నేహితులుగా విడిపోదాం .”
“నన్ను చాలా నీచంగా అంచనా వేస్తున్నావ్ ఫణి!” “అంతేనా?”
“నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూవుంటారు” తను అతనికి దూరంగా కదలసాగింది.
వెనకనుంచి ఫణి గట్టిగా మాట్లాడుతున్నాడు- “ఉమా! నా ప్రేమని వురి తీశావు. నా జీవితం నాశనం చేశావు. ఉమా! నేను పిరికివాడిలా చచ్చిపోను. నిన్ను మర్చిపోను. నువ్ చేసిందీ మర్చిపోను. జీవితంలో ఎక్కడో ఎప్పుడో నాకు తారసపడకపోవు, నువ్వు నాకు చేసిన మోసానికి నా బాధ ఎలాంటిదో నీచేత అనుభవింపచేసి తీరుతాను ఉమా! అప్పుడు ఎందుకూ పనికిరాని పశ్చాతాపం నిన్ను నిలువునా దహిస్తుంది. నీ చివరిదాకా నిన్ను పగలూ, రాత్రి క్షోభ పెడుతుంది. పగ” ఒక్కసారి వీచినగాలికి వూగిన గన్నేరుకొమ్మ ఫ్లాష్ బాక్ ని వైప్ చేసేసింది.
“ఆ వెధవింకా రాలేదా?” అంటూ పార్థసారధి ప్రవేశించాడు.
“ఆం” అని నిద్రలోంచి లేచినట్టు లేచి “యిప్పుడే వస్తానని వెళ్ళారు” అంది.
“కూర్చోమని చెప్పకపోయావా?”
“చెప్పా, అయినా వచ్చేస్తా అని వెళ్లారు”
పార్ధసారధి టై విప్పుతూ అడిగేడు- “యివాళ ఏవిటి స్పెషల్స్?” ఉమాదేవికి అప్పటిగ్గానీ గుర్తు రాలేదు. వంట చెయ్యడం మరిచినట్టు. “వస్తున్నా” అంటూ పరాగ్గా అని గబగబా కిచన్ లోకి పరుగెట్టింది.
మధ్యాహ్నం ఫణి కాస్త ఆలస్యంగానే వచ్చేడు.
యిద్దరికీ భోజనాలు వడ్డించింది. “నువ్ కూడా కూర్చో” అన్నాడు పార్ధసారధి. “మీరు కానివ్వండి. వంటింట్లో పని మిగిలింది. తర్వాత తింటాను” అనేసింది ఆమె.
వాళ్ళిద్దరూ భోజనాలు ముగించి అదే పనిగా కబుర్లు కలబోసు కుంటున్నారు.
ఉమాదేవికి అన్నం హితవుగా లేదు. ఎలాగో అయిందనిపించి పక్క గదిలోకి వెళ్ళి నడుం వాల్చింది. నిద్రనీడలో సేద తీర్చుకుందామనుకుంది. కాని నిద్ర నీటివ్వలేదు వాళ్ళ కబుర్లే చెవులు రిక్కించి వింటోంది.
– ఫణి తన పాతకథ ఎప్పుడు చెప్పేస్తాడా? అని భయంగా వుంది. తప్పకుండా తన జీవితం సర్వనాశనం చేసే వెళ్తాడు. అన్నమాట ఆచరిస్తాడు. అయినా వినక తప్పదు. ఆయన ఫణి మాటకి ఎంత విలువిస్తారో యిన్నాళ్ళూ, భర్త మాటల్లో బాగా అర్థం చేసుకుంది. యింకా చెప్పడం లేదు. తను వింటాడని తెలుసుకుంటా. అసలే వేటగాడు. పొంచి చూసి బాణం విసురుతాడు. అది తన గుండెలో సూటిగా గుచ్చుకుపోతుంది. భగవాన్! ఈరోజు గట్టెక్కించు. ఎలా? ఈ ప్రమాదాన్ని ఆపేదెలా?” ఎంత ఆలోచించినా అతన్ని విడిగా కలిసి అన్నీ ఒప్పుకొని కాళ్ళా వేళ్ళా పడటం తప్ప మార్గం కనబడటం లేదు. కనికరిస్తాడా? అసలే ఫణి. ఆదిశేషువులా ఆదుకుంటాడో? కాల సర్పంలా కాటువేస్తాడో! కోరిక మన్నిస్తాడో! తన కోరిక మన్నించగోర్తాడో, ఏమైనా సరే కాపురం నిలబెట్టుకోవాలి. దానికోసం దేనికైనా సిద్ధపడాలి. లేకపోతే చావే శరణ్యం అవుతుంది. తనకి చావాలని లేదు. ఆయన కావాలని వుంది. ఏంచేసేది? ఫణి ఒక్కడూ విడిగా దొరకడం లేదు. ప్రొద్దుట వచ్చినపుడు దొరికిన అవకాశాన్ని తెలివితక్కువగా ప్రవర్తించి పాడుచేసుకున్నా –
ఆలోచనలు అలా భయపెడుతుంటే ఉమాదేవికి మెదడంతా ఘనీభవించి పోతున్నట్టుంది.
రాత్రి పదిదాకా కొండచిలువలా పాకిందారోజు,
స్నేహితులిద్దరూ అంతవరకూ స్నేహాన్ని స్కాచి వడబోసుకున్నారు.
భర్త తనకి, ఫణికి వరండాలో పక్కలు వేయమంటే వేసింది. ఇద్దరూ యింకా కబుర్లు చెప్పుకుంటారు. ఫణి వొంటరిగా పడుకుంటే, రాత్రి భర్త బాగా నిద్రపోయాక వెళ్ళి వేడుకుందామనుకుంది. కానీ తన ప్రాణానికి కబుర్లు వచ్చిపడి తన క్లయిమాక్సు సంగతి తేల్చేస్తామంటున్నాయి. వాళ్ళిద్దరూ వరండాలో మంచాలెక్కారు. వాళ్ళ మాటలు వినేందుకు తను భయం వంక చెప్పి, హాల్లో పక్కేసుకుంది.
అన్నీ అక్కర్లేని మాటలే మాట్లాడుకుంటున్నారు. ఆయనకి కాస్త ఎక్కువైనట్టుంది. మాట రేడియో డిస్టర్బెన్స్ వస్తోంది. ఫణి అదుపులోనే వున్నాడు. కానీ ఇంకా చెప్తాడనుకున్నది చెప్పడం లేదు. తనకి నిద్ర యివాళపట్టదనీ, తను వాళ్ళ మాటలు వింటున్నానని తెలిసిపోయుంటుంది.
ఉమాదేవి మనసు అలిసిపోతోంది.
గడియారం రెండు కొట్టింది.
తనకి నిద్ర రాలేదు. రాదు తన పాత కథ. నిద్రపోయే వరకూ రాదు. ఫణి కూడా నిద్రపోడు. అనుకున్నది చేసే వరకూ ఆలోచనలు అతన్ని నిద్ర పోనీయవు. ప్రొద్దుట తను పనిలో వుండగా ఏ కాఫీ కలిపేప్పుడో నన్నా చెప్పక మానడు. లాభం లేదు. ఆలస్యం చేస్తే అమృతం లాంటి బ్రతుకు విషం అవుతుంది. భర్త గురక వినిపిస్తోంది. ఆయన నిద్ర తనకి బాగా తెలుసు. తన భర్త ప్రాణానికి ఈశ్వరుడు నిద్రకి బ్రహ్మ.
ఉమాదేవి నిశ్చయానికొచ్చేసింది. మెల్లగా లేచింది… నెమ్మదిగా తలుపు తీసింది.
వరండాలో చీకటి చిక్కగా వుంది. భర్త పార్ధసారధి గాఢనిద్రలో వున్నాడు. తను మెల్లగా ఫణి చక్రవర్తి మంచం దగ్గరకి నడిచింది. మోకాళ్ళ మీద కూర్చుని అతని తల దగ్గరకి వంగింది. విస్కీ వాసన గుప్పుమంటోంది.
“ఏయ్! ఫణీ!” రహస్యంగా పిలిచింది. గుండె కొట్టుకుంటోంది. “ఊఁ” అన్నాడు వెంటనే. తన ఊహ నిజమే. తనూ నిద్రపోవడం లేదు. మెలకువగానే వున్నాడు.
“లేవకు, అలాగే – ఒక్కసారి నే చెప్పేది శ్రద్ధగా విను. యిప్పుడే వినాలి ప్లీజ్! – ఏయ్ వింటున్నావా?” అంది.
“ఊం” అన్నాడు ఫాలో అవుతున్నట్టు. తాగడం వల్లేమో కంఠం తేడాగా అదోలా వినిపించింది.
ఉమాదేవి వుద్వేగంగా చెప్పింది.
“ఫణీ! నేను – నేను ఓడిపోయాను” ఆగి ఆగి మాటలు కూడదీసుకుంటూ అంటోంది. నీ మనసు నా మనసు కంటే చాలా గొప్పది. నన్ను క్షమించగలవు. ఇప్పుడు నా బ్రతుకు నీ చేతుల్లో వుంది. నన్ను రక్షించి నా కాపురం నిలబెట్టు. ఫణి! ఎటు చూసినా నాకు ఒకటే దిక్కు. ఆయనొక్కడే దిక్కు నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకు’ ఉమాదేవి దుఃఖం కట్టలు తెగింది. వెక్కి వెక్కి నిశ్శబ్దంగా ఏడవటం ప్రారంభించింది. మళ్ళా అంతలోనే అదుపులోకి తెచ్చుకుంటూ అంది. “ఫణీ! ఆయన కోసం, నా కోసం” ఏడుపు ఆగడం లేదు. “అంతా నువ్ చెప్పినట్టే మనం స్నేహితులుగా విడిపోదాం. కాదు. స్నేహితులుగా కలుద్దాం’ అతని వొంటి మీద చెయ్యి వేసింది.
“ప్లీజ్ మాట్లాడవూ! నా రహస్యాలు భద్రంగా కాపాడవూ!” ఆమె గొంతు బొంగురు పోయింది.
అతను కదిలేడు. ఉమాదేవిని పసిపాపలా మంచం మీదికి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కన్నీరు తుడిచేడు. ముంగురులు సవరించేడు. వీపు మీద చేయి వేస్తూ “డోంట్ వర్రీ! యువర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ మి ఉమా!” అంటూ యింకా దగ్గరకు తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు ఉమాదేవిని ఆమె భర్త పార్ధసారధి.
అవతలి మంచంమీద ఫణి చక్రవర్తి గురక వారి అన్యోన్యతకి బేక్ గ్రౌండ్ మ్యూజిలా వినబడుతోంది?”

* * *

1 thought on “పరవశానికి పాత(ర) కథలు – యువర్ సీట్స్ ఆర్ సేఫ్ విత్ మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *