June 14, 2024

వెంటాడే కథ -13 … విందు!

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

****

సమీరా బెన్ బంగ్లా విపరీతమైన హడావుడిగా ఉంది.
పరిచారికలు, పరిచారకులు ఉరుకులు పరుగులు పెడుతూ పనులు చకచకా చేస్తున్నారు. కిచెన్లో వంట మనుషులు రకరకాల గుజరాతీ పిండి వంటలు, ఇతరత్రా సంప్రదాయ వంటకాల తయారీతో ఇంటిని ఘుమఘుమలాడిస్తున్నారు. పనివాళ్ళకి, వంట వాళ్ళకి పనులు పురమాయిస్తూ డైనింగ్ టేబుల్ సర్దిస్తూ, గుమ్మాలు, కిటికీల తెరలు మార్పిస్తూ, సోఫాలు బాలీసుల కవర్లు కొత్తవి వేయిస్తూ సమీరా క్షణం తీరిక లేకుండా ఇల్లంతా కలయతిరుగుతోంది… మరొకపక్క చీటికి మాటికి వచ్చే ఫోన్లు! వాటినందుకుని నవ్వుతూ జవాబులు ఇస్తూ తన స్నేహితురాళ్ళందర్నీ విందుకు ఆహ్వానిస్తోందామె.
ఆమె భర్త భగవంత్ రాయ్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నతాధికారి. కొత్తగా ఆ జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన మధుమతి చటర్జీని – సమీరా బెన్ ఈ రోజు తమ ఇంటికి లంచ్ కి ఆహ్వానించింది.
కలెక్టర్ గారితో లంచ్ అంటే మాటలా! హై సొసైటీ లేడీగా, పలు సేవా సంస్థలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ నగరంలో అప్పటికే ఎంతో పేరు గడించిన సమీరా తన సంపన్న స్నేహితురాళ్ళను, ఇతర ఉన్నతాధికారుల భార్యలను కూడా లంచ్ కి ఆహ్వానించింది.
సాక్షాత్తు కలెక్టర్ గారిని విందుకు ఆహ్వానించి ఆమె పక్కన కూర్చుని భోజనం చేయడం ఒక గొప్ప స్టేటస్ గా భావిస్తోంది సమీరా. తన స్నేహితులు కూడా తన స్టేటస్ చూసి కుళ్ళుకోవాలని ఆమె మనసులో ఆలోచన. అందుకే ఎవరినీ వదలకుండా ఉన్నత వర్గాలకు చెందిన సంపన్న మహిళలందరికీ విందు ఆహ్వానం పంపింది. వారి ముందు తన దర్పాన్ని, తన గొప్పతనాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతోందామె.
అలాగే కలెక్టర్ గారి ముందు తన హై సొసైటీ లేడీస్ వింగ్ లో, సోషల్ సర్వీస్ సంస్థలలో తనకున్న పేరు ప్రతిష్టలు తన గౌరవం తన లీడర్షిప్ క్వాలిటీస్ చూపించుకోవాలన్న తపన కూడా ఆమెను ఈ భారీ పార్టీకి సిద్ధం చేసింది.
అంతా బాగానే ఉంది…
షాండిలియర్స్ సహా అన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేయించి, గోడల నిండా వివిధ రాష్ట్రాల పెయింటింగ్ లను గొప్పగా అలంకరించి తను ఎంత కళాభిమానిగానో కలెక్టర్ ని ఇంప్రెస్ చేయాలనుకుంది. భర్త భగవంత్ రాయ్ ద్వారా ఆమె కలెక్టర్ గారు కళాభిమాని, సంఘసేవాతత్పరురాలు అన్న విషయాలు ముందే తెలుసుకుంది.
అందుకే ఈ అలంకరణలు. . ఈ అట్టహాసాలు!
అంతా సిద్ధంగా ఉందనుకున్న తరుణంలో సమీరాకు కింద గదిలో దగ్గు వినపడటంతో మొహం అప్రసన్నమైంది.
ఆ దగ్గు ఎవరిదో కాదు సమీరా అత్త సరళా బెన్ గారిది.
దాదాపు 70 ఏళ్లు పైబడిన అత్తగారిని అతిథులు ఉన్నంతసేపు ఆ గది నుంచి బయటికి రాకుండా చూడాలని సమీరా ఆలోచన. అందుకే తన నమ్మకస్తురాలు అయిన పనిమనిషి సోలంకిని కాపలా ఉంచి ఆమె తిండి తిప్పలు అక్కడే జరిగే ఏర్పాట్లు చేసింది. అయినా కాలుకదపలేని అత్తగారు నిత్యం వీల్ చైర్ లో దర్జాగా కూర్చుని హాల్లోకి రావడం మిగతా గదుల్లోకి తిరగడం వంటివి చేస్తుంటారు.
అదే సమీరకు నచ్చదు. ఆమె ఇప్పటి అప్రసన్నతకు కూడా అదే కారణం.
వద్దని చెప్పినా ఆవిడ వినదు. . మొండి మనిషి. .
పెళ్ళైన రోజునుంచీ కూడా అత్తగారంటే సమీరకు అలర్జీ!
సరళకు కూడా కోడలంటే డిట్టో డిట్టో!
కనీసం ఈ రోజన్నా అత్తగారు గదిలో నుంచి బయటకు రాకుండా ఉంటే మేలని పనిమనిషిని కాపలా ఉంచింది సమీర. ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్, టీవీ, ఇతర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి.
అలాంటప్పుడు హాయిగా అక్కడే కూర్చోవచ్చు కదా? లేవలేని మనిషి ఇల్లంతా తిరగడం ఎందుకు అనేది సమీరా ప్రశ్న.
ఇది నా ఇల్లు. నా కొడుకు ఇల్లు. నేను కని పెంచిన, చదివించి ప్రయోజకుడిని చేసిన కొడుకు కన్నతల్లి ఇల్లు. నాకు ఏ గదిలోకి వెళ్లాలన్నా ఎక్కడికి తిరగాలన్నా ఎవరి అనుమతులు అక్కర్లేదు… నా కొడుకుని వలలో వేసుకుని ప్రేమ పేరుతో పెళ్ళాడి ఇంట్లో తిష్ట వేసిన కోడలు తనపై పెత్తనం చేయడానికి ప్రయత్నించడం ముసలావిడకు అసలు నచ్చదు.
భగవంత్ రాయ్ తండ్రి కూడా పెద్ద ఆఫీసర్ హోదాలో పనిచేశాడు.
అప్పుడు ఇల్లు మొత్తం సరళ అదుపులోనే ఉండేది. తను కూడా ఎన్నో రకాల ఎంబ్రాయిడరీలు, కుట్టుపనులు గొప్ప గొప్ప డిజైన్లు తయారుచేసి అప్పటి అధికారులు ఎందరినో మెప్పించింది. వారి ప్రశంసలు పొందింది. ఇప్పుడు అంటే వయసు అయిపోయింది గాని తనకేం తక్కువ? బిహారీ కళాకారులను పిలిపించి వారిదగ్గర మధుబని పెయింటింగ్స్ వేయడం అభ్యసించింది.
ఇప్పటికీ మధుబని పెయింటింగ్ వేయడంలో ఈ నగరంలో తనకు పోటీ ఎవరు? అప్పట్లో తన పెయింటింగులు చూసి సాక్షాత్తు ప్రధాని నెహ్రూగారి కార్యదర్శి కళ్ళు తేలవేశాడు. తన ప్రతిభకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.
ఇప్పటికీ రోజుకి ఒకటి రెండు కుట్టు పనులు అద్భుతంగా చేస్తుంది. ద్వార బంధాల కర్టెన్లు, కిటికీలు తెరలు, డైనింగ్ టేబుల్ మీద వేసే కవర్లకి సంబంధించిన బట్టల మీద తన కుట్లు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో కొత్తగా వచ్చిన ఈ పిల్ల కాకికి(కోడలు పిల్ల) ఏం తెలుసు అనుకుంటుంది సరళ బెన్. కుళ్ళు మొహంది… తను వేసిన పెయింటింగ్ లన్నీ తీయించి స్టోర్ రూమ్ లో పడేయించింది అని కోడల్ని మనసులోనే తిట్టుకుంది ముసలావిడ.

***

మధ్యాహ్నం ఒంటిగంట!
కలెక్టర్ మధుమతి చటర్జీ తన అధికార అనధికార మిత్రులతో హడావిడిగా వేంచేశారు.
అప్పటికే సమీరా బెన్ హై సొసైటీ స్నేహితురాళ్ళందరూ చక్కగా అలంకరించుకుని దర్జాగా వచ్చి కలెక్టర్ గారి ఆగమనం కోసం ఎదురుచూస్తున్నారు.
భోజన ఏర్పాట్లని చూసి కలెక్టర్ గారు ముచ్చట పడిపోయారు. పదే పదే సమీరాను ప్రశంసించారు. ఆమె డిసిప్లిన్, ఆమె ఈస్తటిక్ సెన్స్ అమోఘం అన్నారు. వంటలు అద్భుతంగా ఉన్నాయని పొగిడారు. సమాజానికి వివిధ సంస్థల ద్వారా ఆమె అందిస్తున్న సేవలను గురించి తెలుసుకుని మరింత ప్రసన్నం అయ్యారు.
సమీరా స్నేహితురాళ్లు పైకి నవ్వుతూ ‘అవును. . అవును’ అంటున్నా లోలోపల కుళ్లుకుంటున్నారు. ఎందుకంటే ఇక మరుసటి రోజు నుంచి సమీరా నేల మీద నిలబడదని వారందరికీ బాగా తెలుసు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతున్నారు. . కరతాళ ధ్వనులు చేస్తున్నారు. . కలెక్టర్ గారికి పరిచయం చేయమని సమీరతో గుసగుసలాడుతున్నారు.
సమయం రెండున్నర!
భోజనాలు ముగిశాయి. అందరూ ఐస్క్రీములు తింటూ హాల్లో సోఫాలో కూలబడి కబుర్లలో పడ్డారు.
ఒక ఆవిడ సమీరా మెప్పుకోసం, కలెక్టర్ గారి గుర్తింపు కోసం అన్నట్టు “మా సమీర మంచి కళారాధకురాలండి. . ఎందరో కళాకారుల్ని ప్రోత్సహిస్తుంది. . అందుకే తన ఇంటి గోడల నిండా దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారుల పెయింటింగులతో నింపేసింది. . ఖరీదెంతైనా లెక్కచేసే మనిషి కాదు” అని చెప్పింది.
ఆ ప్రస్తావన ఎలా తెద్దామా అని అనుకుంటున్నా సమీరకు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది.
అ స్నేహితురాలి వంక ప్రసన్నంగా చూసింది.
తర్వాత కలెక్టర్ గారి వైపు చూసి వినయంగా “అంత లేదు మేడం. . మీ అంత అసలు కాదు. . అయినా రండి చూద్దురుగాని …” అంటూ లేచింది హుందాగా.
కలెక్టర్ గారు ఇతర అతిథులు కూడా లేచారు. ఒక మ్యూజియాన్ని చూసినట్టు ఒక గది తర్వాత ఒకటి చూసుకుంటూ ఆ గదుల్లో ఉన్న షో పీసులు, ఇతర కళాఖండాలు, పెయింటింగులు అన్నింటి గురించి ముచ్చటించుకుంటూ తిరగటం మొదలుపెట్టారు కలెక్టర్ గారు. సమీరా అంటే ఆమెగారికి బాగా గురి కుదిరింది. ఆమె గొప్పతనాన్ని ఆమెలోని సౌందర్యారాధనని ప్రశంసిస్తూ మాట్లాడుతూ కళాఖండాల్ని పరిశీలిస్తూ ఉన్నారు.
అంతలో కలెక్టర్ బృందం పై అంతస్తులు తిరుగుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కలెక్టర్ గారు చొరవగా కుడివైపు వరండాలోకి నడిచారు. అటు వద్దని చెప్పాలనుకున్నా సమీరకి కుదరలేదు. ఏం చేయాలో తోచలేదు. కానీ ఏం చేయగలదు కలెక్టర్ గారు నడవటంతో అందరూ ఆ వైపుకే నడిచారు.. వారితోపాటు సమీర కూడా!
అది సమీరా అత్తగారు సరళ బెన్ గది వైపుకి దారితీసింది. ఆ గది తలుపు మూసి ఉంటే “ఇందులో ఏముంది సమీరా?” అని అడిగారు కలెక్టర్.
“నో మేడం… నో! అందులో ఏమీ లేవు అది సర్వెంట్స్ రూమ్” సమీరా తడబడుతూ.
అదే ఆమె కొంపముంచింది.
ఆమె నోటి నుంచి ఆ మాట వచ్చిందో లేదో తటాలున ఆ గది తలుపు తెరుచుకుంది.
సోలంకిని నెట్టేస్తూ వీల్ చైర్ లో బయటికి వచ్చింది ముగ్గుబుట్ట తలతో నైటీలో ఉన్న సరళ.
“కలెక్టరమ్మా ఇది సర్వెంట్స్ రూమ్ కాదు… ఇది నా రూము! అంటే ఈ ఇంటి యజమానురాలి రూము! అంటే మీ ఆఫీసులో పనిచేస్తున్న భగవంత్ రాయ్ తల్లి రూము” అని పెద్ద గొంతుతో అంది.
కలెక్టర్ సహా అందరూ బిత్తరపోయారు.
కలెక్టర్ గారు వెంటనే తేరుకుని “అమ్మా … మీరు భగవంత్ రాయ్ తల్లిగారా? నమస్కారం… మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు మాకు ఉండాలి” అని సమీరా వైపు తిరిగి “ఏంటి సమీరా… అత్తగారి గదిని పట్టుకుని సర్వెంట్స్ రూమ్ అన్నావు? తప్పు కదూ ?” అని నిలదీశారు.
సమీరా ఏం మాట్లాడలేకపోయింది. నీళ్లు నములుతోంది. కలెక్టర్ సమీరను పట్టించుకోకుండా ముసలావిడకి దగ్గరగా వచ్చి ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంది.
“కలెక్టరమ్మా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో కానీ నా భర్త ఉన్నప్పుడు సాక్షాత్తు అప్పటి ప్రధాని నెహ్రూగారి పిఏ మా ఇంటిని సందర్శించి నేను చిత్రించిన మధుబని కళాఖండాలను చూసి నివ్వెరపోయారు. నా కుట్టు పనులు, చేతి అల్లికల డిజైన్ లు, ఎంబ్రాయిడరీలు అంటే అప్పటిలో ఉన్నతాధికారులందరికీ ఒక క్రేజ్! నేను డిజైన్ చేసిన డైనింగ్ టేబుల్ క్లాత్ లు, కర్టన్ క్లాత్ లు ఎందరో అధికారులు తీసుకుని వెళ్లి తమ ఇళ్లలో అపురూపంగా అలంకరించుకున్నారు. చూడాలనుకుంటే నా గదిలోకి రా” అని కలెక్టర్ గారిని లోనికి తీసుకెళ్ళింది. కలెక్టర్ గారితో పాటు సమీర మిత్ర బృందమంతా లోపలికి వెళ్లారు. ఆవిడ కుడుతున్న. . . సగం కుట్టి పడేసిన డిజైన్లు ఎంబ్రాయిడరీ డిజైన్లు వాటి మీద సీతాకోకచిలుకలు ఇతర పక్షులు చూసి ఆమె నైపుణ్యాన్ని అందరూ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. .
అందరూ అత్తగారి గదిలో దూరితే గది బయటే ఒంటరిగా నిలబడిపోయింది సమీర ముఖం మాడ్చుకుని.
ఇదే సమయంలో గదిలో కలెక్టర్ గారి పొగడ్తలతో సరళ మొహం వెలిగిపోతోంది. నా మధుబని పెయింటింగ్ లన్నీ కోడలు తీయించి స్టోర్ రూమ్ లో పడేసిందమ్మా” అని చెప్పింది సరళ గద్గద స్వరంతో.
వెంటనే కలెక్టర్ గారు సమీర ఇంటి సర్వెంట్లను పిలిచి ఆ స్టోర్ రూమ్ తలుపులు తీయించి అందులో ఉన్న పెయింటింగ్ లని బయటికి తీయించింది. దుమ్ము కొట్టుకుపోయి కొన్ని, శిధిలమై కొన్ని పెయింటింగులు ఉండడం చూసి చాలా బాధపడింది. ఆ తర్వాత నుంచి ఆమె సమీర వైపు చూడటమే మానేసింది. కలెక్టర్ లో వచ్చిన మార్పు సమీర స్నేహితురాళ్ళతో సహా అందరూ గమనించారు.
కలెక్టరమ్మ ఆ పాతకాలపు పెయింటింగులన్నీ శుభ్రం చేయించి “అమ్మా వీటిలో కొన్ని నేను తీసుకెళ్లవచ్చునా? మీకు ఏమైనా అభ్యంతరమా?” అని ముసలావిడను వినయంగా అడిగింది.
కోడలికి జరిగిన పరాభవానికి ఎంతో ఆనందిస్తున్న ముసలావిడ “అయ్యో అంతకంటే భాగ్యం ఏముంది తీసుకెళ్లండమ్మా. . ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా అడగండి వేసి ఇస్తాను. . కాకపొతే ఇదివరకంత వేగం లేదు ముసలిదాన్ని అయ్యాను కదా !” అని బోసి నోరు తెరిచింది సరళ.
విందు కార్యక్రమం అంతా సజావుగా జరిగి క్లైమాక్స్ అడ్డం తిరిగేసరికి సమీర కృంగిపోయింది. ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ‘ఎంత పని చేసింది ముసలిది? తను గొప్పలు చెప్పుకోవడమే కాకుండా నన్ను పనికిమాలిన దానిగా కలెక్టర్ ముందు స్నేహితుల ముందు చిత్రించిందే’ అని దిగులు పడిపోయింది.
సాయంత్రం 5:00 అయింది.
మరోసారి పనివాళ్ళు అందరికీ తేనీరు బిస్కెట్లు అందించారు. ఈసారి ఆ బృందంలో వీల్ చైర్ లో సరళా బెన్ కూడా ఆనందంగా, అంతకు మించి గర్వంగా కూర్చుని తేనీరు సేవించింది.
అక్కడ ఉన్నంతసేపు కలెక్టర్ గారు సరళ బెన్ తోనే ముచ్చటించారు ఆనాటి సంగతులు తెలుసుకున్నారు. ఆమె ప్రతిభను మాటి మాటికి ప్రశంసించారు.
కలెక్టర్ గారే ప్రశంసిస్తుంటే స్నేహితురాళ్ళు ఎందుకు ఆగుతారు?
‘మీరింత కళాకారిణి అని మాకు తెలియదు ఆంటీ ‘
‘మాకు ఒక మంచి మధుబని పెయింటింగ్ వేసి ఇవ్వండి ఆంటీ ఎంత ఖర్చైనా పర్వాలేదు’
‘మనమెంత మూర్ఖులమో ఇప్పుడే తెలిసింది రోజూ సమీరా ఇంటికి వస్తూ కూడా ఈ కళాజ్యోతిని గుర్తించలేదు”
ఇలాంటి మాటలతో ప్రశంసలు గుప్పించారు.
అందరి దగ్గర సెలవు పుచ్చుకొని కలెక్టర్ గారు బయలుదేరారు.
బయలుదేరే ముందు మరోసారి ముసలావిడకి పాదాభివందనం చేసి బయలుదేరారు.
వెళ్లే ముందు సమీరాను పిలిచి “సమీరా నీ విందు చాలా బాగుంది! కానీ మీ అత్తగారి రూముని మీరు సర్వెంట్ క్వార్టర్స్ అని చెప్పి చాలా బాధ పెట్టారు… మిమ్మల్ని ఎంతో గొప్పగా ఊహించుకున్న నా మనసులో మీ స్థానం దిగజారింది. అఫ్ కోర్స్ తప్పులు అందరం చేస్తాం. . దయచేసి ఇకనైనా ఆమెను గౌరవంగా చూడండి. ఆమెలోని కళను ప్రోత్సహించండి మీలోని నిజమైన కళా సేవను వెలికి తీయండి ఇంతకుమించి ఏమీ చెప్పలేను” అంటూ మొక్కుబడిగా ఒక హగ్ ఇచ్చి కారు ఎక్కేశారు.
సమీరాకు నచ్చలేదు గాని ఈ క్లైమాక్స్ సమీరా స్నేహితురాళ్ళు అందరికీ కనుల విందుగాను, వీనుల విందుగాను అనిపించింది. పైకి సానుభూతి వాక్యాలు మాట్లాడారు కానీ మనసులో అందరూ సంతోషించారు.
అందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాక సమీరా కాళికాదేవి అయింది
ఇంట్లోని క్రోకరి సామాను గాజు సామాను నేలపై బడి ముక్కలు చెక్కలు అయిపోయింది.
పనివాళ్ళు గజగజలాడిపోయారు.
సోలంకికైతే ఉద్యోగమే ఊడింది.
విజయదరహాసంతో ఈ దృశ్యాన్ని చూస్తూ వీల్ చైర్ లో తన గదిలోకి వెళ్ళిపోయింది ముసలావిడ.

***

నా విశ్లేషణ:

తరాల నడుమ అంతరాలను, మనుషుల మధ్య అహం ప్రభావం ఎలా ఉంటుందో అది ఇంటి పరువు ఎలా తీస్తుందో తెలియ చెప్పిందీ కథ. నాకు గుర్తున్నమేరకు ఇది గుజరాతీ కథ అని అనుకుంటున్నాను. సాధారణంగా అత్తాకోడళ్ల బంధం వైర బంధంగా ఉంటుంది. ఇంటికి యజమానురాలిని నేను అని కోడలు అనుకుంటుంటే, నేను బతికి ఉండగా నువ్వెలా యజమానురాలివి అవుతావు నీ మొగుణ్ణి కన్నది నేను పెంచినది నేను అనుకుంటుంది అత్త.
సంపన్నుల కుటుంబాలైనా సాధారణ కుటుంబాలైనా ఇదే స్టోరీ! సమీరా స్నేహితులు కూడా మీరు గమనించే ఉంటారు. మొక్కుబడి స్నేహాలు. అక్కడ కూడా ధన ప్రదర్శన, డాబుసరి ప్రదర్సనలే తప్ప స్నేహభావం అన్న మాట కలికానికి కూడా కనబడదు. మానవ స్వభావాలను ఈ కథలో అద్భుతంగా చెప్పాడు రచయిత. ఇందులో నిజాయతీ కల పాత్ర ఒక్క కలెక్టర్ గారిదే అనిపిస్తుంది.

***

2 thoughts on “వెంటాడే కథ -13 … విందు!

  1. మీ విశ్లేషణ అక్షర సత్యం. కథ చాలా బాగుంది.

    1. ధన్యవాదాలు అనసూయ గారు కథ హృదయాన్ని బాగా గ్రహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *