June 25, 2024

సాఫ్ట్ వేర్ కధలు – కోమల విలాస్

రచన: కంభంపాటి రవీంద్ర

“ఈవేళ నీ మెయిల్ చెక్ చూసుకున్నావా?” అడిగింది వందన. మా అకౌంట్ మేనేజర్ తను.
“చూసేను” బదులిచ్చేను
“షిర్లే నుంచి వచ్చిన మెయిల్ చూసేవా?” మళ్ళీ అడిగింది
“చూసేను.. షిర్లీ, స్కాట్ మన ఆఫీస్ చూడ్డానికి రెండు వారాల్లో ఇండియా వస్తున్నారట”
“అది నాకూ తెలుసు.. పాయింట్ అది కాదు.. వాళ్ళు ఫ్రైడే రాత్రికి వస్తున్నారు.. వీకెండ్ చెన్నై చూస్తారట.. అంటే మనలో ఎవరో ఒకళ్ళు వాళ్ళని చెన్నై అంతా తిప్పాలి” అసహనంగా అందావిడ
“అవును… నేను ఆ వీకెండ్ వాళ్ళని చెన్నై అంతా తిప్పుతాను. సుధాకర్ రెడ్డి హెల్ప్ తీసుకుంటాను.. ఆల్రెడీ అతనితో మాట్లాడేను” చెప్పేను
“మరి సుధాకర్ రెడ్డికి ఫర్వాలేదా? ప్రతి వీకెండ్ వాళ్ళ వూరు నెల్లూరు వెళ్ళిపోతూంటాడు కదా?”
“ఆ వీకెండ్ కి కొంచెం అడ్జస్ట్ చేసుకొమ్మని రిక్వెస్ట్ చేసేను… సరే అన్నాడు”
“హమ్మయ్య!… ఐ యామ్ కాన్ఫిడెంట్.. నువ్వు, సుధాకర్ రెడ్డి మానేజ్ చెయ్యగలరు” నవ్వుతూ అనేసి వెళ్ళిపోయింది
సుధాకర్ రెడ్డి అన్నా యూనివర్సిటీలో బీటెక్ చేసి, ఆ ముందు ఏడాదే మా ప్రాజెక్ట్ లో చేరేడు. చిన్న కుర్రాడే కానీ, చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్..మూడు భాషలూ ఫ్లూయెంట్ గా మాట్లాడ తాడు, పైగా చెన్నై పరిసరాలన్నీ అతనికి బాగా తెలుసు. అందుకే నాకు చెన్నై ఊరు చూపించాలంటే సుధాకర్ కరెక్ట్ మనిషనిపించింది !

***

తర్వాత రెండు వారాలూ నేనూ, వందన ఆ క్లయింట్ విజిట్ తాలూకు ప్లానింగ్ లో బిజీగా గడిపాము. ఏ టాపిక్స్ మీద ఎవరితో ప్రెజెంటేషన్స్ ఇప్పించాలి, మా సీనియర్ లీడర్షిప్ లో ఎవరెవరితో మీటింగ్స్ ఏర్పాటు చెయ్యాలి లాంటివన్నీ డిస్కస్ చేసి, ఫైనలైజ్ చేసేము.
సుధాకర్ మటుకు ఒకటే చెప్పేడు, “సర్.. ఆ వీకెండ్ మొత్తం మనతో ఉండేలా ఒక ఇన్నోవా అరేంజ్ చెయ్యండి చాలు… నేను చూసుకుంటాను”. అతని మీద నమ్మకం పెట్టి, ఆఫీస్ లో మాట్లాడి ఏర్పాటు చేసేను.
శుక్రవారం రాత్రి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి స్కాట్, షిర్లీ లని నేను, సుధాకర్ రిసీవ్ చేసుకున్నాం. వాళ్ళని తాజ్ కోరమాండల్ హోటల్లో దింపేము. ఆ హోటల్ కి వెళ్ళే దార్లో, స్కాట్ చెప్పేడు, “చెన్నై గురించి, దాని హెరిటేజ్ గురించి చాలా విన్నాము.. మాకు రియల్ చెన్నై చూడాలని ఉంది” అని.
సుధాకర్ నవ్వుతూ బదులిచ్చేడు, “రియల్ చెన్నై అంటే ఇక్కడి ప్రదేశాలే కాదు.. ఇక్కడి ఫుడ్ కూడా మీరు టేస్ట్ చెయ్యాలి”
“తప్పకుండా… కానీ స్కాట్ చెప్పినట్టు.. మాకు అసలైన చెన్నై చూపించాలి” అని షిర్లీ అంటే, “అలాగే.. మేము రేపు ఉదయం ఏడు గంటలకి మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తాము.. రెడీగా ఉండండి.. బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండా” అన్నాడు సుధాకర్ !
***
చెప్పినట్టే, మేమిద్దరం ఆ శనివారం ఉదయాన్నే ఏడింటికి తాజ్ కోరమాండల్ కి వెళ్ళేసరికి, హోటల్ లాబీలో సిద్ధంగా ఉన్నారు షిర్లీ, స్కాట్.
వాళ్ళని కార్లో ఎక్కించుకున్నాక, డ్రైవర్ కి తమిళంలో చెప్పేడు సుధాకర్, తిన్నగా ట్రిప్లికేన్ పార్థసారధి స్వామి గుడికి పోనివ్వమని !
ఎక్కడికి వెళ్తున్నామని అడిగిన స్కాట్ కి చెప్పేడు సుధాకర్ “ఓ పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ కి తీసుకెళ్తున్నాము.. ఏ పనైనా మొదట దేవుణ్ణి చూసి తల్చుకునో మొదలెట్టడం మా ఇండియన్ ట్రెడిషన్”.
పార్థసారథి గుడిని చూసి చాలా సంతోషపడిపోయారా ఇద్దరూ. “అద్భుతంగా ఉంది… ఇదో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్” అని వాళ్లిద్దరూ పదేపదే అంటూంటే, చెన్నై నిండా ఇలాంటి లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సులే. పదండి అంటూ, ఆ గుడి దగ్గర్లోనే ఉన్న రత్నా కేఫ్ కి తీసుకెళ్ళి సాంబార్ ఇడ్లీ, మసాలా దోశ తినిపించి, ఫిల్టర్ కాఫీ తాగించేసరికి అదిరిపోయారా ఇద్దరూ
ఇంత గొప్ప కాఫీ ఎప్పుడూ తాగలేదంటూ, మళ్ళీ రెండోసారి చెరో కప్పూ తాగేరు. అక్కడి నుంచి కపాలీశ్వరస్వామి గుడి, ఆ చుట్టుపక్కల వీధులూ చూపించి, అక్కడి నుంచి మహాబలిపురం తీసుకెళ్ళేము.
‘ఇక్కడి ఎండ మీకు ఇబ్బందిగా ఉందా?’ అని అడిగితే, ‘మేము చూస్తున్న ప్రదేశా లతో పోలిస్తే, ఎండొక ఇబ్బంది కాదు’ అంది షిర్లీ !
***
మహాబలిపురం వెళ్ళేక, అక్కడ అన్నీ చూపించడానికి ఓ గైడ్ ని ఏర్పాటు చేస్తాను అని నేనంటే, “ఏమక్కర్లేదు సర్.. నాకు ఇవన్నీ తెలుసు” అంటూ అక్కడున్న అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం, పంచరథాలు, గుహలు, విష్ణుమూర్తి గుడి అన్నీ దగ్గిరుండి వివరించి మరీ చూపించేడా సుధాకర్.
“ఇదీ… నిజమైన హెరిటేజ్ అంటే” అని షిర్లీ అంటే, “అవున్నిజమే… ఇవన్నీ ఇంత గొప్పగా వివరించిన సుధాకర్ కి మనం థాంక్స్ చెప్పుకోవాలి” అన్నాడు స్కాట్
మధ్యాన్నం భోజనం అడయార్ ఆనంద భవన్ కి తీసుకెళ్ళేము. “ఇవాళ శనివారం కదా… ఈరోజు ఇక్కడ ఎక్కువగా వెజిటేరియన్ మీల్స్ ప్రిఫర్ చేస్తారు…” అని సుధాకర్ అన్నాడు
వెజిటేరియన్ థాలితో పాటు చిట్టి జాంగ్రీ కూడా ఆర్డర్ చేసేము. సాంబార్ అన్నం వాళ్లకి బాగా నచ్చేసింది. “లంచ్ చాలా చాలా బావుంది.. ది బెస్ట్ లంచ్ ఐ ఎవర్ యేట్” అని షిర్లీ అంటే, “ఇదేం చూసేరు ? మా నెల్లూరు రండి.. అక్కడి కోమల భవన్లో లంచ్ తింటే హెవెన్ కనిపిస్తుంది” అన్నాడు సుధాకర్
ఆ సాయంత్రం వళ్ళువర్ కొట్టం చూపించి, డిన్నర్ కి అన్న లక్ష్మి రెస్టారెంట్ కి తీసుకెళ్ళేము. మళ్ళీ అదే మాట అంది షిర్లీ, “అద్భుతం ! డిన్నర్ అంటే ఇలా ఉండాలి”. సుధాకర్ నవ్వుతూ చెప్పేడు, “ఇక్కడ డిన్నర్ బావుంది కానీ.. ఈసారి మా నెల్లూరు రండి.. కోమల భవన్లో తిని చెప్పండి.. చెప్పేనుగా” అంటూంటే, స్కాట్ నవ్వుతూ అన్నాడు “అవును హెవెన్ కనిపిస్తుంది”. అందరం నవ్వేసేము !
ఆ తర్వాత రోజు ఉదయం మురుగన్ ఇడ్లీ షాపులో మల్లెపువ్వుల్లా ఉండే ఇడ్లీలు తినిపించి, శాంతోమ్ చర్చి, కరుమారియమ్మ చర్చి, అష్టలక్ష్మి గుడి చూపించేము
ఈవేళ మీకు నాన్ వెజ్ ఫీస్ట్ అని, ఆ మధ్యాన్నం వాళ్ళని పొన్నుసామి హోటల్ కి తీసుకెళ్ళి అక్కడి నాన్ వెజ్ భోజనం తినిపించేసరికి, ఆ రుచులకి అదిరిపోయేరా ఇద్దరూ. భోజనం చేసి బయటికి వచ్చేక చెప్పేరు, “ఇంక ఊళ్ళో తిరగడం మా వల్ల కాదు.. హోటల్ కి వెళ్ళి పడుకుంటాం” అని ! షిర్లీ అడిగింది, “రాత్రి మనం మళ్ళీ ఆ మురుగన్ ఇడ్లీ షాప్ కి వెళ్ళొచ్చా?” అని
సరేనని వాళ్ళని తాజ్ కోరమాండల్ లో దింపేసి మేము వెళ్లిపోయేము. రాత్రి డిన్నర్ కి వాళ్ళని పికప్ చేసుకుని మురుగన్ ఇడ్లీ షాప్ కి తీసుకెళ్తే, సుధాకర్ చెప్పేడు, “ఈసారి ఇడ్లీతో పాటు పొంగల్ కూడా ట్రై చెయ్యండి..మా కోమలా విలాస్ అంత కాకపోయినా చాలా బాగుంటుంది”.
ఇద్దరికీ అక్కడి లైట్ టిఫిన్స్ బాగా నచ్చేయి !
ఆ తరువాత నాలుగు రోజులూ ఆఫీస్ మీటింగ్స్ తో బిజీబిజీగా గడిచిపోయేయి. శుక్రవారం మధ్యాన్నం షిర్లీ, స్కాట్ తిరుగు ప్రయాణం. వాళ్లకి సెండాఫ్ ఇవ్వడం కోసం నేను, వందన బయలుదేరేము.
“సుధాకర్ కి మేము చాలా థాంక్స్ చెప్పాలి.. ఈ ట్రిప్ ఇంత బాగా జరుగుతుం దనుకోలేదు.. తను ఎయిర్పోర్ట్ కి రావడం లేదా ?” అని స్కాట్ అడిగితే, “లేదు.. తను ప్రతి శుక్రవారం మధ్యాన్నం వాళ్ళ ఊరు నెల్లూరు వెళ్ళిపోతాడు.. వాళ్ళ అమ్మ కి, ముగ్గురు సిస్టర్స్ కి సపోర్ట్ అతనొక్కడే “ అని చెప్పేను
“నైస్ పర్సన్” అంది షిర్లీ.
వాళ్ళు వెళ్ళిపోయిన ఆ రోజు రాత్రి, సుధాకర్ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్, ట్రైన్ దిగి ఇంటికి వెళ్తూంటే, అతన్ని ఏదో పాల వ్యాన్ గుద్దేసిందట. శనివారం మధ్యాన్నం సుధాకర్ పోయేడు !
***
యూకే వెళ్ళేక ఈ విషయం తెలిసి స్కాట్, షిర్లీ ఎంతో బాధపడ్డారు. కంపెనీ నుంచి గ్రూప్ ఇన్సూరెన్సు కింద అతని ఫ్యామిలీకి సపోర్ట్ వస్తుందని చెప్పేను. ప్రాజెక్ట్ లో అతని బదులు మరి ఎవరిని తీసుకుంటున్నావని అడిగేరు, అప్పటికే ఇంకో అమ్మాయిని ఐడెంటిఫై చేసేను అని చెబితే, థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసేరు !
ఆ తరువాత మూడు నెలలకి మళ్ళీ స్కాట్, షిర్లీ ఇద్దరూ ఇండియా వచ్చేరు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. సుధాకర్ ఫ్యామిలీ గురించి అడిగేరు. “కొంచెం కష్టమే, కానీ ఏదో అడ్జస్ట్ అవుతున్నారు… గ్రూప్ ఇన్సూరెన్సు కింద ఓ పది లక్షలు వచ్చింది… జూనియర్ కాబట్టి., పెద్దగా ప్రోవిడెంట్ ఫండ్ సేవింగ్స్ అవీ ఉండవు” అన్నాను
“సరే.. మేము కూడా మా కంపెనీ తరఫున కొంత ఫండ్ రైజ్ చేసేము.. పెద్ద అమౌంట్ కాదు.. కానీ ఏదో మా చేతనైనంత..మన మీటింగ్స్ అయ్యేక, ఓసారి వాళ్ళ ఊరికి వెళ్ళి, ఈ చెక్ ఇచ్చేసి వద్దాము ‘ అన్నాడు స్కాట్
శనివారం ఉదయాన్నే కార్లో నెల్లూరు బయల్దేరేము, ఆ సుధాకర్ ఇంటిని వెతుక్కుని వెళ్ళేసరికి పదిన్నర అయ్యింది. ముందే ఫోన్ చేసి చెప్పేను కాబట్టి ఆ సుధాకర్ తల్లి, చెల్లెళ్ళూ మా కోసం వెయిట్ చేస్తూన్నారు. ఆ చిన్న ఇంట్లో ఉన్న హాల్లో సుధాకర్ ఫోటో చూసి షిర్లీ ఏడుపు ఆపుకోలేకపోయింది. సుధాకర్ తల్లి ఏమీ మాట్లాడలేదు.. మొహంలో ఏ భావమూ లేకుండా అలా చూస్తూందావిడ.

సుధాకర్ గురించి గుర్తు చేసుకున్నారా ఇద్దరూ, తరువాత ఆ చెక్ తీసి అతని తల్లి చేతిలో పెట్టిన షిర్లీ, “ఏదో మాకు వీలైనంత ఇచ్చేము.. ఏ సపోర్ట్ కావాలన్నా చెప్పండి.. మా ఈమెయిల్ అడ్రెస్ ఈ కార్డ్ మీద ఉంది” అని చెప్పింది
“ఫిఫ్టీ థౌజండ్…అంటే యాభై వేల రూపాయలు” అంది అతని చిన్న చెల్లెలు ఆ చెక్ వేపు చూస్తూ!
“నీ మొహం…అవి పౌండ్స్, అంటే…యాభై లక్షలు” అంది కృతజ్ఞత, ఆశ్చర్యంతో నిండిన మొహంతో ఆ అమ్మాయి !
వాళ్ళలా మొహమొహాలూ చూసుకుంటూంటే, “మీకొక చిన్న రిక్వెస్ట్” అన్నాడు స్కాట్
“చెప్పండి” అంది సుధాకర్ తల్లి
“మనందరం ఇప్పుడు కోమల భవన్ కి వెళ్ళి లంచ్ చేద్దాం… అక్కడ భోజనం చేస్తూంటే హెవెన్ కనిపిస్తుంది అన్నాడు మీ అబ్బాయి… మీ అబ్బాయి చెప్పిన హెవెన్ మనందరం చూద్దాం” అంది షిర్లీ!

***

5 thoughts on “సాఫ్ట్ వేర్ కధలు – కోమల విలాస్

 1. చాలా బాగుంది.. విషాదం బాధ అనిపించింది.. వాళ్ళ కు అందించిన సహాయం గొప్పగా ఉంది.. ఇంకా మంచితనం ఉంది అన్న ఆలోచన బాగుంది..

 2. అద్భుతం. మాతృభూమి కన్నా గొప్పది ఇంకేముంటుంది. మనింట్లో తినే మజ్జిగన్నం కూడా పంచామృతమే. చాలా బావుంది కధ.

 3. మా నెల్లూరుని గురించి ఎక్కడ విన్నా చదివినా
  ఏదో అనుభూతులు నీళ్ళ ఊటలా ఊరి
  మనసు పొరల్ని తడిపేస్తాయి
  మీ కథలు ఎప్పుడు చదివినా ఏ మాత్రం
  తాదాత్మ్యతకి లోను కాకుండా ఉండటం
  నా వల్ల కాదు

 4. చాలా బాగుంది. మీ కథలలో అంతర్లీనంగా ఈ ఊరిలో ఎక్కడ రుచికరమైన ఆహారం దొరుకుతుంది అనే సమాచారం కూడా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *