April 24, 2024

చంద్రోదయం – 33

రచన: మన్నెం శారద

సారథి బేంక్‌నుండి వస్తూనే “స్వాతీ!” అంటూ పిలిచేడు.
నానీ గబగబా పరిగెత్తుకొచ్చి “డాడీ! అమ్మ హాస్పిటల్లో వుంది. జ్వరమొచ్చిందట” అన్నాడు అమాయకంగా.
సారథి అర్ధం కానట్లు చూసేడు.
“ఏమయ్యింది?” అన్నాడు పనిపిల్లనుద్దేశించి.
“నాకు తెల్దయ్యా! జానకమ్మగారే అమ్మగార్ని రిచ్చాలో తీసికెల్లేరు” అంది పనిపిల్ల.
“ఏ ఆసుపత్రో తెలుసా?”
“చెప్పలేదయ్యా. కాని డాక్టర్ చాకోమ్మగారు కామాల” సార్థి ముఖమైనా కడుక్కోకుండా చెప్పులు తొడుక్కుని హడావుడిగా హాస్పిటల్‌కి బయల్దేరేడు.
“నేనూ వస్తాను డాడీ” నానీ కూడా రాబోతే వారించాడు సారథి.
“అమ్మకెలావుందో ముందు నన్ను చూసి రానీ, తర్వాత తీసికెళ్తానుగా”
సారథి నచ్చచెప్పి వడివడిగా హాస్పిటల్‌వేపు సాగిపోయేడు. ‘స్వాతికి ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. ముఖంలో ఎంతో తేడా వచ్చేసింది. రక్తం లేనట్టు పాలిపోతోంది. ఉన్నట్టుంది ఏం జరిగిందో. దేవుడి దయవల్ల స్వాతికి ఏం కాకుంటే బాగుణ్ణు” సారథి ఆలోచిస్తూ హాస్పిటల్‌కి చేరుకున్నాడు.
అతను వెళ్ళేటప్పటికి డాక్టర్ చాకో అవుట్ పేషెంట్సుని చూస్తూ బిజీగా వుంది.
“ఎక్స్‌క్యూజ్‌మి! ఇక్కడ స్వాతి అనే ఆవిడ జాయినయ్యిందా?” అంటూ అడిగాడు.
చాకో ఓ క్షణం ముఖం చిట్లించి “ఎవరూ! ఎబార్షన్ కేసా?” అంది.
అతను కాదన్నట్టు చూసేడు.
“మీరు కాస్సేపు విజిటర్స్ రూంలో కూర్చోండి. మాట్లాడతాను”అంది.
“నర్స్, స్వాతి అనే ఆమె ఈ రోజున జాయినయిన ఇన్‌పేషెంట్స్ లిస్టులో వుందేమో చూడు” అంది.
నర్స్ లిస్ట్ వెరిఫై చేసి, “రూం నెంబర్ 32, ఓవర్ బ్లీడింగ్ కేస్ మేడం” అంది.
డాక్టర్ సారథి వైపు తీక్షణంగా చూసింది.
“మీరు కాస్సేపు కూర్చోండి, మాట్లాడాలి” అంది కటువుగా.
సారథి తెల్లబోయి చూసేడు. “ఏవిటీ వీళ్లనేది? ఎబార్షన్, ఓవర్ బ్లీడింగ్ అంటరేమిటీ? ఈ స్వాతి మరొకరు కావొచ్చు. స్వాతి అసలు ప్రెగ్నెంట్ కాందే ఎబార్షనేమిటి?’అతను ఓ నిశ్చయానికి వచ్చినవాడిలా లేచాడు.
అదే సమయంలో జానకమ్మ డాక్టర్ డగ్గరకు హడావిడిగా పరిగెత్తుకొచ్చింది. “ఆ అమ్మాయి కళ్లు తేలవేస్తోంది డాక్టర్. నాకేదో భయంగా వుంది” అంది గాభరాగా.
సారథి అర్ధం కానట్లు చూసేడు.
డాక్టర్ చాకో హడావుడిగా రూంలోకి వెళ్ళింది.
సారథి కూడా వెళ్లబోతుంటే నర్స్ రానివ్వలేదు.
సారథి పిచ్చెక్కినట్లు అక్కడే తిరుగుతూ నిలబడ్డాడు.
ఏమయ్యింది?స్వాతికేమయ్యింది?
అతని మెదడులో నరాలు చిట్లిపోతాయేమోనన్నత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
మరో అరగంట తర్వాత డాక్టర్ చెమటలు తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది.
“ఆమెకెలా వుంది డాక్టర్?” సారథి ఆత్రుతగా అడిగేడు.
“డెడ్ బాడీ హేండోవర్ చేస్తాం. కాస్సేపు కూర్చోండి” అందామె తీవ్రంగా.
సారథి నిరుత్తురుడయి చూశాడు.
డాక్టర్ ఓ క్షణం తేరిపార చూసిందతనివైపు. మరో క్షణానికామె మామూలు మనిషయి మిగతా పేషెంట్సుని చూడ్డం మొదలుపెట్టింది.
పావుగంట తర్వాత బెంచీలు ఖాళీ అయ్యేయి.
చేతులు బేసిన్‌లో కడుక్కొని టవల్‌తో తుడుచుకుంటూ ఆమె సారథిని నిశితంగా చూసింది. బేలగా బెంచీకి జేరబడి కూర్చున్న అతన్ని చూస్తే ఆమెకు ఏమనిపించిందో మరి.
“మీరామెకు ఏమౌతారు?” ఆ కంఠం తీవ్రంగా లేదు.
“ఆమె భర్తని!”
“వ్వాట్? మీరామె హస్బెండా?” ఆమె ఆశ్చర్యచకితురాలయింది.
“మీరు చదువుకున్నారా?”
“ఎం. కాం”
చాకో కళ్ళు పెద్దవి చేసి చూసింది. “ఏం ఉద్యోగం?” అంటూ.
“బేంక్‌లో ఆఫీసర్ని”
“మీకెంతమంది పిల్లలు?”
సారథి ఓ క్షణం జవాబు చెప్పటానికి తికమకపడి, ఆ వెంటనే సర్దుకుంటూ “ఒక్కడే” అన్నాడు.
“ఒక్కడే మీకెక్కువయ్యాడా?”అందామె హేళనగా.
“అంటే?” సారథి అర్ధం కాక ఆడిగేడు.
“అంటే ఏముంది? ఒక్కడే మీకు చాలనిపిస్తే మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు. లేదా ఏవైనా పద్ధతుల ద్వారా కొన్నాళ్లు ఓపిక పట్టొచ్చు. ఈ రోజుల్లో యివి తెలియనిదెవరికి. అంతే కాని ఇలా మోటుపద్ధతులనవలంబించి ప్రాణానికి ముప్పు తెచ్చుకోవడం. మీలాంటి చదువుకున్నవాళ్ళు చెయ్యాల్సిన పని కాదు. ప్రతిసారి ప్రాణానికి తెగించి ఎబార్షన్ చేయించుకోమనటం మీలాంటివారికి తగదు” అంది తీవ్రంగా.
సారథి క్రొత్త విషయాలు వింటున్నట్లు తెల్లబోయి చూసేడు.
“ఇదివరకే రెండుసార్లు ఆమె ఎబార్షన్ కోసం వచ్చింది. రెండవసారి చేస్తూనే చెప్పేను. ఈసారి ప్రయత్నిస్తే ప్రాణానికే ముప్పని. విన కుండా మూడవసారి కూడా వచ్చింది. కేకలేసి పంపించేను. కాని, నా మాట లక్ష్యపెట్టకుండా ఏవో నాటు మందు మింగింది. ప్రాణం పోయేదాన్ని తీసుకొచ్చి నా ముందు పడేసేరు. అదృష్టం బాగుండి అదే గ్రూప్ బ్లడ్ నా దగ్గర రెడీగా వుండబట్టి బ్రతికిపోయింది. లేక పోతే ఏమయ్యేదో ఆలోచించండి” అంది.
సారథి షాక్ తిన్న మనిషిలా బెంచీ కతుక్కుపోయేడు.
“ఆ ముసలావిడ ఎవరూ? మీ అమ్మగారా? అవిణ్ని కాస్త దూరంగా వుంచండి. చూస్తే యిదంతా ఆవిడ పనిలా వుంది” అంది చాకో చివరిగా.
స్వాతిని ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేరు. సారథి ఆమెని ఇంటికి తీసికొచ్చేడూ.
నాల్గురోజులు సాయంగా రమ్మంటే సావిత్రమ్మ గుంటూరునుంచి వచ్చింది. ఆమెక్కూడా సంగతేమిటో చెప్పలేదు సారథి.
స్వాతికి ఎబార్షనయ్యిందని మాత్రమె చెప్పేడు. ఆవిడ చాలా బాధపడింది. తన కొడుకు సంతానం చూడాలని ఆమెకు కూడా చాలా సరదాగా వుంది. స్వాతి సారథికి ఒంటరిగా కన్పించటానికి భయపడ్తోంది. అతన్ని తప్పించుకు తిరుగుతోంది.
స్వాతి ఒంట్లో బాగాలేదన్న నెపంతో అతను బయట హాల్లోనే పడుకొంటున్నాడు.
స్వాతిని అతని మౌనం విపరీతంగా భయపెట్టి బాధపెడ్తోంది. డాక్టర్ అతనికంతా చెప్పేసిందని జానకమ్మ చెప్పింది. అయినా తననేమీ అడగడేమిటి? తను చేసిన తప్పుకు రెండు చెంపలూ పగిలేలా కొట్టొచ్చుగా. గట్టిగా మందలించొచ్చుగా. అలా తనకేం పట్టనట్లు యేదో ఆలోచిస్తూ వుంటాడేం? కొంపదీసి అతని మనసు విరిగిపోలేదు కదా. స్వాతి ఆ వూహ రాగానే నిలువెల్లా వణికిపోయింది.
చివరికి అతని ప్రేమానురాగాలకు కూడా తను దూరమై పోయిందా?
ఆమె కళ్లు అశ్రుపూరితాలయ్యేయి.
‘స్వాతిని జాగ్రత్తగా చూసుకో. రెండుపూటలా పళ్లరసం యివ్వటం మరచిపోకు. పనులేవీ చెయ్యనివ్వకు. నేను వారం రోజుల్లో వచ్చేస్తాను” తల్లికి సారథి చెబుతుంటే స్వాతి వింది.
“నానీ, నువ్వు రోజూ హోంవర్కు చేయాలి. నేను లేను కదాని అమ్మని ఏడిపించగూడదు. అమ్మకి రెండుపూటలా మందులు యివ్వటం మరచిపోకు.తెలిసిందా?” అన్నాడు సారథి నానీని ఎత్తుకొని ముద్దుపెట్టి దింపుతూ.
స్వాతి గుమ్మం దగ్గరగా వచ్చి నిలబడి అతన్నే చూస్తోంది. క్షణం ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి.

ఇంకా వుంది

1 thought on “చంద్రోదయం – 33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *