April 19, 2024

జీవన వేదం -3

రచన: స్వాతీ శ్రీపాద

“పిల్లను తీసుకు వెళ్తే బాగుండేది” అది ఏ నూటొక్కసారో అతని తల్లి అనడం.
“ఉన్నపళంగా తీసుకువెళ్ళడం అంటే కుదిరే పనేనా? నేనా ఇద్దరు ముగ్గురితో కలిసి ఉంటున్నాను. మరో ఇల్లు వెతుక్కోవాలి. కొత్త ఉద్యోగం తీరిక దొరకాలి. ” అంటూ నసిగాడు.
సీతకూ దిగులు దిగులుగానే ఉంది. కాని అతను చెప్పినదీ నిజమే.
చదువులు ఇంకా పూర్తికానట్టే మరి.
జీవితంలో ఎదగాలన్న కాంక్ష ఉన్నప్పుడు దాన్ని అదిమి పెట్టడం మంచిది కాదుగా.
రవికిరణ్ అమెరికా వెళ్ళిపోడం, సీత డిగ్రీలో చేరడం యాంత్రికంగా జరిగిపోయాయి.
అయితే ఎక్కడ ఏ మలుపు పొంచి ఉందో ఎవరికి తెలుసు.
ఇద్దరి జీవితాలు రెండు విభిన్న దారులవెంట వెళ్తాయని ఒక్కళ్ళూ ఊహించలేదు.
రవికిరణ్ ఉద్యోగం చేస్తూనే మంచి పేరున్న కాలేజీలో ఎమ్. బి. ఏ లో చేరాడు.
సీత హైదరాబాద్ లో డిగ్రీ లో చేరింది.
*****
సుమబాల మెరుపు తీగలా ఉంటుంది. మోకాళ్ళు దాటిన జుట్టు, గాలి తగిలితేనే కందిపోయే పచ్చని పసిమి రంగు. నాజూగ్గా నాలుగు మల్లెల బరువేమో అనిపిస్తుంది.
ఎమ్. బి. ఏ క్లాస్ లో మొదటి సారి సుమబాలను చూడగానే కళ్ళు చెదిరిపోయాయి రవికిరణ్ కు.
ఏళ్ళకేళ్ళు ఊహించుకున్న అప్సర కన్య సుమ బాల అనే అనిపించింది. ఫార్మల్ గా పలకరింపులు పరిచయాల మధ్య ఇద్దరూ పని చేస్తున్న కంపెనీ ఒకటే నని తెలుసుకున్నారు. చిత్రంగా రవికిరణ్, సుమబాల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు కూడా పెద్ద దూరమేమీ కావు, పది నిమిషాల నడక కార్లో వెళ్తే రెండు నిమిషాలు.
“ఇండియాలో ఎక్కడ ఉంటారు?” అడిగింది సుమబాల.
” వరంగల్ దగ్గర చిన్న ఊరు. . . ”
” మేం హైదరాబాద్ లో ”
అంటూ సంభాషణ ఆరంభమై చదువులు హాబీలూ ఇష్టాలు అయిష్టాలు అన్నీ పంచుకునే వరకూ వచ్చాయి.
” చెస్ అంటే ప్రాణం”
“నాక్కూడా”
రెండు మూడుసార్లు తీరిక దొరికినప్పుడు స్టార్ బక్స్ లో కూచుని చెస్ బలాబలాలు చూసుకున్నారు. మొదటిసారి ఆట ముగింపుకు మూడు గంటలు పట్టింది.
“గట్టిపోటీనే ఇచ్చారు” నవ్వుతూ అన్నాడు.
“అయినా ఏం లాభం? ఓడించారుగా?” కొంచం బుంగమూతి పెట్టుకుంది.
“సరే లెండి, ఇదేమీ ప్రపంచ కప్ పోటీ కాదుగా? సరదాగా ఆడాం. చాలా ఆలస్యం అయింది. ఎక్కడైనా డిన్నర్ చేసి వెళ్దాం” అంటూ ప్రతిపాదించాడు రవికిరణ్.
అసలు సంగతి ఆమెతో మరికాస్సేపు కలిసిఉంటే బాగుండునని అనిపించడం.
“దగ్గర్లోనే ఆలివ్ గార్డెన్ ఉంది. అయ్ లవ్ ఆలివ్ గార్డెన్” అంటూ సమ్మతం తెలియ జేసింది సుమబాల.
అయిదు నిమిషాల దూరంలో ఉన్న ఆలివ్ గార్డెన్ చేరుకున్నారు కాని టేబుల్ దొరకడానికి అరగంట నిరీక్షణ.
పేరు రిజిస్టర్ చేసుకుని పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో నడకకన్నట్టుగా వెళ్లారు. తిరిగి వచ్చేముందు తాజాగా కనిపించిన రెడ్ రోజెస్ కొన్నాడు రవికిరణ్. తీరిగ్గా తిరిగి అరగంటకు వెనక్కు వెళ్ళక కార్నర్ లో ఒక టేబుల్ కేటాయించారు.
పాస్తా ఆర్డర్ చేసి ఫ్రీగా ఇచ్చిన బ్రెడ్ స్టిక్స్, సాలడ్ తింటూ ఎన్నో విషయాలు పంచుకున్నారు.
“మా అమ్మ గురించి తలుచుకుంటేనే గుండె నీరైపోతుంది” అంటూ ఆలోచనల్లోకి జారిపోయింది సుమబాల.
చినుకు చినుకుగా మొదలై అంతలోనే నేల మీద ప్రవహించే పిల్ల కాలువగా మారి కురుస్తూనే ఉంది మధ్యాన్నం నుండీ.
“సమయం కాని సమయంలో ఈ వర్షాలేమిటో…” ఇప్పటికి పదహారోసారి అనుకుంది పారిజాతం.
కరెంట్ వస్తూ పోతూ ఉంది.
తలుపు తీసి పెడితే చిందిన నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి, అందుకే తలుపు వేసుకుంటే లైట్ లేకపోతే ఇల్లంతా చీకటి మయం.
ఇన్వర్టర్ ఉన్నా పగలు లైట్ వేసుకుంటే రాత్రికి బాటరీ చార్జ్ అయిపోతే ఇబ్బంది పడాలి.
వర్షం కాబట్టి బయటి దోమలు లోనికి ఎగిరివచ్చే అవకాశం లేదు.
లోపలి దోమలను అప్పటికే బాట్ తో పేల్చేసింది.
”ఇహ ఈ వాన తగ్గేటట్టు లేదు’’ అనుకుని లేచి సంధ్యా దీపం వెలిగించింది.
అమ్మ గుర్తుకు వచ్చింది. సాయంతం నాలుగు దాటితే చాలు, సంధ్య కసువులు ఊడ్చి ఇంటి ముందు మట్టి లేవకుండా ఓ చెంబుడు నీళ్ళు చల్లుకుని, కాళ్ళూ చేతులూ కడుక్కున్నాక దీపాల వేళ పువ్వొత్తి వేసి దేవుడి దగ్గర దీపం వెలిగించటం పుట్టినప్పటినుండీ చూసిన గుర్తే.
పిల్లలు కొంచం పెరిగాక, ఆడపిల్లలు గనక పనులు పంచుకునేవారు.
ఏ కోరికా లేకుండా దీపం వెలిగించి చేతులు జోడించి
“ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం –
దీపం కురు తమోపహం
దీపేన సాధ్యతే సర్వం –
సంధ్యాదీపం నమోస్తుతే ”
సంధ్యా దీపం నమోస్థుతే ” మరో మారు అనుకుని హాల్లోకి వచ్చింది.
కరెంట్ ఉన్నా లేకున్నా లైట్లు వాడక తప్పదు.
“ఈ పూటకు ఇహ దుర్గమ్మ రాదు- నాలుగు చినుకులు పడితేనే మొక్క మొలిచి పోతానేమోనని రాదు. ఈ వానకు బయట అడుగు పెడుతుందా?”
ఎలాగూ ప్రిజ్ లో ఇడ్లీ పిండీ – కొబ్బరి పచ్చడీ ఉన్నాయి. కాస్సేపాగి నాలుగు ఇడ్ళీలు చేసుకుంటే చాలు.
ఏదైనా చదువుకుందామంటే మొదట్లో పెద్దగా తెలియలేదు కాని కాటరాక్ట్ ఆపరేషన్లు అయ్యాక రాత్రి పూట చదవడం కష్టంగానే ఉంది. కాస్సేపు చదివేసరికి కళ్ళవెంబడి నీళ్ళూ, కళ్ళు మంటలు వస్తున్నాయి.
ఇహ మిగిలినది ఇష్టం ఉన్నా లేకపోయినా టీ వీ చూడటమే.
హిందీ సినిమాలూ, ఇంగ్లీషూ బాగానే ఉంటాయి, నిజమే కాని, కాలక్షేపం కూడా పర రాష్ట్రంలో, పరాయి దేశంలో ఉన్నట్టు. . . అవే చూడాలా?
ఎలాగూ సగం జీవితం ఆ లోకాల్లోనే గడిచిపోయింది.
కాస్త తెలుగు మాట వినబడితే సందడిగా అనిపిస్తుందని పెట్టినా. . .
కాస్సేపటికే వెర్రి తలకెక్కినట్టు అనిపిస్తుంది.
గ్రాండ్ గా పెళ్ళీ అంతలోనే విడిపోడాలు, అనుమానాలు, పాతివ్రత్యాలు, విడాకులు అబ్బో అసంబద్దమైన విషయాలన్నీ చొప్పిస్తేగాని అది సీరియల్ కాదు. అన్నిటినీ మించి సెంటిమెంట్లు.
అన్ని చానెల్స్ ఒకసారి తిప్పితిప్పి ఏం వస్తోందని చూసిందో లేదో కరెంట్ పోయినట్టుంది.
ఎనిమిది కూడా కాలేదు. పారిజాతం వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ తయారు చేసుకునే ప్రయత్నంలో పడింది.
ముందు ఫ్రిజ్ లో చట్నీ ఒక నాలుగు స్పూన్లు ఒక బౌల్ లోకి తీసి టేబుల్ మీద పెట్టుకుంది. ఇడ్లీ ఉడికే లోగా కాస్త వేడెక్కుతుంది.
ఒక ప్లేట్ లో అయిదు ఇడ్లీలు వస్తాయి. ఎక్కువే కాని, తీరా తినే సమయానికి ఎవర్రైనా వస్తే,
నవ్వొచ్చింది పారిజాతానికి. ఈ సమయంలో, ఈ వానలో ఎవరొస్తారు?
అయినా అలవాటయిపోయింది, ఉన్నది ఒక్కతే అయినా రెండు గ్లాసుల టీ చేసుకోడం, ఇద్దరికి సరిపడా వండటం -అసలు మొత్తం జీవితంలో ఒక్కరోజూ చిన్న వంట చేసుకున్న జ్ఞాపకమే లేదు.
ఎప్పుడూ ఓ పది మందికి వండటమే.
ఇడ్లీ గిన్నె స్టౌ మీద పెట్టి కాస్సేపు సర్దడంలో పడింది. పొరబాటున వంట గది వదిలి వెళ్ళిందా గోవిందో గోవింద
మరావిషయమే గుర్తుండదు. గిన్నెమాడి పెంకై, ఇల్లంతా పొగలు వచ్చినా తెలీదు. ఏ పాటలోనో లీనమై పోతే అంతే.
పాట గుర్తుకు వచ్చినప్పుడు నైటింగేల్ అండ్ రెడ్ రోజ్ కవిత గుర్తుకు వస్తుంది. కళ్ళు చెమరుస్తాయి.
ఇప్పుడూ అలాగే కళ్ళు చెమర్చాయి. అదేమిటో గొంతు చిదిమేసినట్టు ఏదో మంట.
పెదవులు వణికాయి.
అమ్మ, నాన్న, ఆ తరువాత మెరుపు మరకలా మూన్నాళ్ళ ముచ్చట. . . .
సర్రున మనసులో మెదిలాయి.
తలవిదిలించి, స్టౌ వంక కళ్ళు తిప్పింది. అబ్బో అప్పుడే పదినిమిషాలు గడచిపోయాయి. ఇడ్లీలు ఉడికి ఉంటాయి. స్టౌ ఆపి ముందుగదిలో అడుగు పెట్టిందో లేదో ఇన్వర్టర్ చార్జ్ అయిపోయినట్టుంది. లైట్లు ఆరిపోయి ఇల్లు చీకటిమయం అయింది. అవును పగలంతా కూడా వర్షం కదా కరెంట్ ఆపేసి ఉంటారు, బాటరీ చార్జ్ అయి ఉండదు.
ఏవీ కొట్టుకోకుండా, ఒక్కో అడుగూ వేస్తూ వెళ్ళి ఎమర్జెన్సీ లైట్ ఆన్ చేసి వచ్చి కుర్చీలో కూచుందో లేదో ఎవరో తలుపు కొట్టిన శబ్దం.
దుర్గమ్మ వచ్చిందేమో అనుకుంది కాని ఈ వానలో రాదని బాగా తెలుసు. మామూలుగా ఆరింటికల్లా వచ్చి రాత్రి తినడానికి ఏదో ఒకటి చేసి ఉదయం అయిదువరకూ తోడుగా ఉంటుంది. అదీ ఈ మధ్యనే. మూడు నెలల క్రితం బాగా జ్వరపడ్డాక, ఎందుకయినా మంచిదని దుర్గమ్మను ఒప్పించింది.
దుర్గమ్మకూ చిన్న ఇల్లు. ఇద్దరు కొడుకులకూ రెండు గదులు వారికే ఇచ్చేస్తే, దుర్గమ్మకు వరండానే మిగిలేది. సర్దుకోవచ్చు కాని అది సర్దుబాటే.
అందుకే సంతోషంగా ఒప్పుకుంది. అయితే అప్పుడప్పుడు రాకపోడమూ మామూలే.
ఈసారి తలుపు బాదిన శబ్దం. పారిజాతం కాలు సవరించుకుని లేచి తలుపువైపు కదిలిందో లేదో అపకుండా తలుపు బాదడం.
“అబ్బబ్బ, వచ్చేవరకూ ఆగలేరా?” విసుక్కుంటూ ముందుకు కదిలింది, ఒక మోకాలు నొప్పితో గబ గబా నడవటం కష్టమే. ఒక చేత్తో ఎమర్జెన్సీ లైట్ పట్టుకుని తలుపు తీసిందో లేదో, చల్లగాలి చరిచినట్టు మొహాన్ని తాకింది.
ఆ వెన్నంటే గుమ్మంలో ఉన్న మనిషి చటుక్కున తోసుకుంటూ లోనికి వచ్చి పారిజాతం తేరుకునే లోగానే తలుపు మూసి రెండదుగులు వేసి కుప్పకూలిపోయింది.
ధనామన్న శబ్దంతో నేలవాలి పోయింది.
పారిజాతం కొయ్యబారిపోయింది.
****
అరగంట తరువాత, కరెంట్ వచ్చింది. అప్పటికి కుర్చీలో కూర్చుని ఉంది తులసి.
స్పృహ తప్పి పడిపోయిన మనిషిని లేపి కుర్చీలొ కూచోపెట్టి వణికిపోతున్న ఆ పిల్లకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగించేసరికి పూర్తిగా అలసిపోయింది పారిజాతం. అవును ఈ మధ్య కాలంలో ఇంత శ్రమ పడినది లేదు. ఈ లోగా కరెంట్ వచ్చింది.
“నా పేరు తులసి. భయపడకండి. గత్యంతరం లేక నా వెనక పడిన వాళ్ళను తప్పించుకుందుకు మీ ఇంటి తలుపు కొట్టాను. ఇబ్బంది పెట్టాను”
గుమ్మంలో కుప్పకూలి పడి పోయిన ఆమెకు స్పృహ రాగానే,
“ఎవరమ్మాయ్? ఎవరిల్లు కావాలి?” అని అడిగిన పారిజాతానికి చెప్పిన జవాబు అది. తేరిపార జూస్తే, పట్టుమని పాతికేళ్ళు కూడా లేని పిల్ల. పీక్కుపోయిన మొహం, గుంటలు పడిన కళ్ళు, చామన చాయ. ఏమీ అనబుద్ధి కాలేదు.
“ఈ పూట ఉండనిస్తే…” చేతులు జోడించింది ఆ అమ్మాయి.
జవాబివ్వకుండా తలుపు మళ్ళీ గడియ పెట్టి ఉందా లేదా చూసి లోపలికి నడుస్తూ తనవెనక రమ్మని సైగ చేసింది
పారిజాతం.
బాత్ రూమ్ చూపించి బీరువా తెరిచి చూసింది, అన్నీ చీరలే. . .
కాని రాత్రంతా ఆ తడి గుడ్డల్లో ఎలా ఉంటుంది?
ముందు ఒక ఉతికిన టవల్ తీసి ఆ పిల్లకు అందించింది.
అరలనిండా ఎప్పటెప్పటి చీరలో. . .
ఒక చీర లాగి కింది అరలో ఉన్న లోపలి లంగా ఒకటి, తీసింది.
నల్ల లంగా, లేత నీలం చీర, ఈ రాత్రికి ఏదైతేనేం అనుకుని, తలతిప్పి ఆ పిల్ల వంక చూసింది, సన్నగానే ఉంది. తన జాకెట్ లూజ్ అవుతుంది. అయినా జాకెట్ లేకుండా ఎలా?
సన్నగా నవ్వుకుంది ఆ పిల్లను జాకెట్ లేని చీరలో ఊహించుకుని.
ఆ బట్టలు తులసికి ఇచ్చి, కాఫీ తేడానికి వంటగదిలోకి వెళ్ళింది పారిజాతం.
ఫిల్టర్ లో కాఫీ డికాషన్ సగం పాలు సగం కలిపి వేడి చేస్తూ అలోచించింది. ఈ పిల్ల ఏమైనా నాటకాలు ఆడుతోందా? ఏ దొంగతనానికో వచ్చిందా?
దొంగతనం చేసేందుకు ఏమున్నాయి? చీరలు, వంటగిన్నెలు తప్ప. వెండి బంగారాలు లేవు. డబ్బు కూడా వందల్లో తప్ప వేలల్లో ఉండదు.
వేడీ కాఫీ గ్లాస్ తీసుకుని వెళ్ళేసరికి తులసి బట్టలు మార్చుకుని, తడి బట్టలు బకెట్లో వేసి జాడించాలని చూస్తోంది.
“అవలా ఉండనీ, పొద్దున చూడవచ్చు. ఇదిగో కాఫీ తీసుకో” అంటు పిలిచి టీపాయ్ మీద్ద గ్లాస్ ఉంచి “ముందు ఆ తల తుడుచుకో” అంటూ మెత్తని వాయిల్ చీర ముక్క అందించింది.
సన్నగా, కాదు మరీ సన్నగా ఉంది. జాకెట్ చాలా వదులుగా షర్ట్ లాగా వేళ్ళాడుతూ ఉంది.
“వంట మనిషి రాలేదు. ఇడ్లీ నే ఈ పూటకు”
“అయ్యో, ఏదైనా ఆకలికి కడుపుకు ఇంత తిండి చాలండి. బయటకు పంపి తలుపులు వేసుకోకుండా ఈ చీకటి రాత్రి ఆశ్రయం ఇచ్చారు. అంతకన్న ఎక్కువా? ” తులసి కళ్ళలో నీళ్ళు.
ఇడ్లీలు అంది కాని తనంటే వయసు మళ్ళి రెండు తిని కడుపు నింపుకునే మనిషి. ఆ పిల్లకూ రెండు పెడితే ఎలా?
మళ్ళీ మరో ప్లేట్ ఇడ్లీ స్టౌ మీద పెట్టి వచ్చింది పారిజాతం.
టీ వీ ఆన్ చేసి తులసి వంక చూసింది. సన్నగా, కోల మొహం పలచని పెదవులు చూడగానే విలక్షణంగా కనిపిస్తుంది.
“ఎందుకిలా అర్ధరాత్రి, వర్షం వేళ ముక్కూ మొహం తెలియని ఇంటికి వచ్చి తలుపులు బాదావు?” అని అడుగుదామనిపించింది. కాని బలవంతాన తమాయించుకుంది.
మొహం చూస్తే విజ్ఞత ఉన్న పిల్లలా అనిపిస్తోంది. మరీ ఇప్పుడే అడిగెయ్యటమా? అనుకుంది.
” మిమ్మల్ని ఆంటీ అని పిలవవచ్చా?” కాస్త బెరుగ్గా అడిగింది తులసి.
” సందేహం ఎందుకు? అలాగే పిలు”
” ఆంటీ నా గురించి ఏమీ అడగరా?”
“ఏం అడగమంటావు?”
“అరగంట మాత్రమే కలిసి ప్రయాణించే సిటీ బస్ లో పక్క వాళ్ళు నూటపదహారు ప్రశ్నలు వేస్తారు. పక్కింటివాళ్ళు రోజుకో పదహారు ప్రశ్నలూ జవాబులూ సిద్ధంగా ఉంచుకుంటారు. చెప్పినవీ చెప్పనివీ పోగేసుకుని ఎవరికి తోచిన కధలు వాళ్ళు అల్లుకుంటారు. అలాటిది, మీ ఆశ్రయం కోరి మీఇంటి తలుపులు కొట్టి వచ్చానంటే మీకే అనుమానాలూ లేవా? ”
“ఉన్నాయి అయినా చెప్పవలసిన బాధ్యత నీదే అయినప్పుడు, నేనెందుకు అడగాలి, చెప్పవలసిన విషయాలు నువ్వే చెప్తావు కదా” గంభీరంగా ఉంది పారిజాతం స్వరం.
” నా పేరు తులసి. చదువుకున్నాను. తప్పని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నాను. అలాగని ఎవరికీ ఏమీ హాని చేసే ఉద్దేశ్యం లేదు. ఒకటి రెండు చేదు అనుభవాలు దారిలో ఎదురయ్యాయి, వర్షంలో తడుస్తూ రాత్రి ఎక్కడుం డాలో తెలియక కళ్ళు తిరుగుతుంటే ఎదురుగా కనిపించిన మీ తలుపు తట్టాను.”
“అయ్యో, అనుకున్నాను ఎన్ని ఇబ్బందుల్లోనో ఉండి ఉంటావని. . .
సరే, మిగతావి తరువాత, ముందు మన డిన్నర్ కార్యక్రమం చూద్దాం”

****

లైటార్పి పడుకున్నారే కాని ఇద్దరికీ నిద్రపట్టడం లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు. ఇద్దరి మధ్యా ఒకతరం తేడా ఉన్నా సమస్యలు మాత్రం ఒకటే.
ఇద్దరికీ నిద్రపట్టడం లేదని ఇద్దరికీ తెలుసు.
ఒకరిది వయసు మళ్ళిన బెరుకుదనం, మరొకరిది పడుచు్దనపు తడబాటు.
చివరికి పారిజాతమే పలకరించింది.
“నిద్రపట్టడం లేదా తులసీ?”
” అవును మీరూ నిద్రపోలేదా?”
“లేదు. పెద్ద వయసు కద తొందరగా నిద్రపట్టదు” అంటూ కప్పుకున్న బ్లాంకెట్ పక్కకు తప్పించి లేచి కూచుంది.
చెయ్యి చాపి బెడ్ పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేసింది.
పావుగంటలో వేడి వేడిగా గ్రీన్ టీ తాగుతూ ఇద్దరూ సోఫాలో ఒదిగి కూచున్నారు.
“చెప్పు తులసీ చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు, ఎందుకిలాటి రిస్క్ తీసుకున్నావు? ఎక్కడి నుండి పారిపోతున్నావు? ఎవరినుండి? ఎందుకు?”
దెబ్బ తిన్న పావురంలా చూసింది తులసి.
“నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా”
“మీకు చెప్పుకుందుకు అభ్యంతరం ఏముంటుంది చెప్పండి, కాదంటే ఎక్కడి నుండి చెప్పాలా అన్నదే ఆలోచన”
పారిజాతం లోలోనే అనుకుంది “అవును ఎవరిని చెప్పమన్నా ఎక్కడి నుంచని మొదలు పెడతారు? చివరికి నన్నడిగినా?”
చివరికి నన్నడిగినా?” పెదవి చివర ఒక విరుపు కదిలింది.
“నిజానికి మిమ్మల్ని ఈ రోజే కలుసుకున్నట్టుగా లేదు, జన్మ జన్మలనుమ్డి పరిచితులం అనిపిస్తోంది.”
నిజమే అందరూ ఒకరికి ఒకరు ఏనాడో సుపరిచితులే అయి ఉండాలి
లేకపోతే అలా ఇదే ఇంటికి చిమ్మ చీకటి రాత్రి కరెంట్ లేనివేళ వానలో వెదుక్కుంటూ వస్తారా?
నేను మాత్రం అలా అదాటున తలుపు తీసేస్తానా? అదీ ఒంటరిగా ఉండి, దుర్గమ్మకూడా రానప్పుడు?
“మా అమ్మా నాన్నకు నేను మూడో సంతానం.”
“నాలాగే ” అనుకుంది పారిజాతం.
అవును మూడో సంతానానికే ఇలా జరుగుతుందా?
“ముగ్గురమ్మాయిల్లో చివరిదాన్ని, కాని నాకంటే చిన్న ఒక తమ్ముడూ, అందరికన్నా పెద్ద ఒక అన్నయ్యా ఉన్నారు”
అవును, మా ఇంట్లో ఇంకా ఎక్కువ మందే ఇద్దరు అన్నయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు, నలుగురు చెల్లాయిలు. గంపెడంత సంసారం.
చిన్నప్పుడు. . . అంటూ ఆ కాలంతో మమేకమైపోయింది తులసి.
నిత్యానందం పెద్దగా చదువుకోలేదు
అతను పుట్టేసరికే తల్లికి నలభై దాటాయి, ఇద్దరక్కలకూ, ఇద్దరన్నలకూ పెళ్ళిళ్ళు జరిగాయి, ఇంకా పెళ్ళి కావలసిన ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. . తండ్రి రూపు రేఖలే గుర్తులేవు.
అవును ఏడాది వయసున్నప్పుడే పోయాడాయన. దారిద్ర్యలేఖకు దిగువన ఉన్న కుటుంబం, ఏ రోజు సంపాదనతో ఆ రోజు గడవడం తప్ప పెద్దగా ఉన్న కుటుంబం కాదు.
పెద్ద పుస్తక జ్ఞానమూ లేదు ఎవరికీ.
ఆడపిల్లకు పదేళ్ళు దాటితే పెళ్ళి మొగపిల్లాడు పదిహేను దాటితే సంపాదన- అదే లక్ష్యం అయిన జీవితాలు.
పెద్దక్క ఇద్దరు కూతుళ్ళ కన్నా చిన్న వాడు. మూడో సారి గనక అక్క అత్తారింట్లోనే పురుడు పోసుకుంటే ఇక్కడ పుట్టిన బిడ్డ నిత్యానందం.
ఎవరి జీవన సమరంలో వాళ్ళు నిమగ్నమై నిత్యానందం చదువు గురించి కాని అతని జీవితం గురించి కాని పెద్దగా ఎవరూ పట్టించుకున్నదే లేదు.
ఏ పూట ఏ అక్క ఇంట్లో ఉంటే అక్కడే భోజనం. వీధి అరుగు మీద చింకి దుప్పటి కప్పుకుని నిద్ర.
అలాగే పదిహేనేళ్ళు గడిచాయి. ఈలోగా మిగతా వారిపెళ్ళిళ్ళూ జరిగాయి. ఎవరింటికి వెళ్ళినా
“ఆ ఏం చేస్తున్నావ్ రా? ఏదైనా పనికి పోరాదా?” అనడమే తప్ప ఎవ్వరూ సరైన దారి చూపిన వారే లేరు.
అప్పట్లో మిగతా వారంతా చిన్నా చితకా పనుల్లో ఉన్నప్పుడూ కాస్త డబ్బుండీ, వ్యాపారం చేస్తున్నది చిన్న బావ ఒక్కడే.
ఇంట్లో అక్కకు సాయంగా ఉండమని అడగడంతో వెళ్ళాడు. వాళ్ళపిల్లలను ఎత్తుకు తిప్పడం మొదలు ప్రతి చిన్నపనికీ ఒక నౌకరు కుర్రాడిలా మారిపోయాడు. మధ్యమధ్యన పోరి పరీక్షలు రాయించినా పదో క్లాసు దాటడం అతనికి తలకు మించిన భారమయింది.
అవును మరి, కుదురుగా కాస్సేపు కూచుని చదువుకునే సమయమూ స్థలమూ రెండూ లేవు మరి.
షాప్ లో వ్యాపారంలో మెళుకువలూ, ఇంట్లో పనులూ అక్క విసుగు, బావగారి తిట్లూ అప్పుడప్పుడు తాగినప్పుడూ కోపం హద్దు మీరి వేసే దెబ్బల మధ్య పదేళ్ళ జీవితం దుర్భరంగా గడిచిపోయింది.
తల్లి అసహాయత, అన్నల అనాదరణ ఏమీ చెయ్యలేని స్థితి.
అలాటి సమయంలో ధైర్యం చేసి బయటపడి స్వతంత్ర్యంగా చిన్నగా వ్యాపారం మొదలుపెట్టాడు. అదీ అయిదు వందల రూపాయలతో. . .
అలాటిది ఈ రోజున అయిదుకోట్ల ఆస్థితో కుటుంబంలో అందరికన్నా ఉన్నతంగా ఉన్నాడు.
“ఒక్క నిమిషం ఆంటీ” కప్పులు తీసుకుని వెళ్ళింది తులసి.
పారిజాతం పరధ్యాన్నంలో పడిపోయింది.
చిన్నతనం గుర్తుకు వచ్చింది, తల్లీతండ్రీ గుర్తుకు వచ్చారు. కత్తి మీద నడచినట్టు గడచిన బాల్యం. . . అవును
బాల్యం ఎంతో మధురమైనదీ, మరపురానిదీ అని అంటారు చాలా మంది కాని అది ఎంతవరకూ నిజం?
సక్రమమైన కుటుంబం, బాధ్యత గల తలిదండ్రులూ ఉన్నప్పుడే బాల్యం పట్టాల మీద నడుస్తుంది.
లేదంటే. . .
అటు బయటకు వెళ్ళి రోజు కూలీ సంపాదించుకుని తిండీ తిప్పలూ చూసుకునే సామాజిక స్థితీ కాదు, అలాగని బాధ్యత లేని భర్తను కాదని తన బ్రతుకు తను బతకగలననే అవగాహనా, ధైర్యమూ లేని మధ్య తరగతి మిధ్యా జీవితం తల్లివెంకట రత్నం ది. ఆ బాధ్యతలేని తండ్రి నవీన్ చంద్ర.
ఎన్ని తెలివితేటలున్నా, తల్లి లేక పెద్దగా పట్టించుకునే అదుపు లేక ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచిన జీవితం నవీన్ చంద్రది. తండ్రి పొలం చూసుకోడం, తిండీ తిప్పలు చూడటం మినహా పిల్లల గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇల్లు చూసుకుందుకు చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన చెల్లెళ్ళూ, పెద్ద వదినగారూ ఉండనే ఉన్నారు. చదువూ సంధ్యా అనే రోజులు కావు.
అయినా ఇంటికి పెద్దకొడుకు నవీన్ మొదటిసారే ఎసెసెల్సీ గట్టెక్కేసాడు. తాతగారి తో కలిసి ఉండటాన ఆయుర్వేదంపై పట్టు బాగానే సాధించాడు. ఆ ఆసక్తి తోనే, పనిలో పని ఆయుర్వేదంలో ఒక పట్టా కూడా సాధించాడు.
వీటితో పాటు తాతగారి రసికత కూడా పట్టుబడింది.
ఆడవాళ్ళు ఎవరైనా వైద్యానికి వస్తే చాలు, వచ్చినది పరువం గడప తొక్కని పసిపాపా, చివరిగట్టు మీద ఉన్న వయోవృద్ధురాలా అన్న ధ్యాసే ఉండదు, నాడి చూసే పేరున చెయ్యి నొక్కడం, గుండెల మీద చెయ్యి వేసి కళ్ళు పరీక్షించటం, అడ్డమైన ప్రశ్నలూ అడగటం. నిజమే. ఇంట్లో ఆడవాళ్ళు మడిబట్ట కట్టుకుని వంటిల్లుదాటి బయటకు వచ్చే అనుమతినివ్వరు. పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి ముగ్గేసినట్టుగానే, పొద్దుపోయాక పడక గదిలో చివరి డ్యూటీ నిర్వహించటం జీవన పరమావధి అనుకునే కుటుంబాలూ – రోజులూ.
అందులోనూ పచ్చని పసిమి చాయ, ఆరడుగుల అందగాడు – కన్ను తిప్పుకోలేని రూపం చూడగానే ఎందరో మనసు పారేసుకునేవారు.
మనవడి అడుగులు తన అడుగు జాడల్లో పడుతున్నాయని గ్రహించి కొడుకుని పోరడం మొదలుపెట్టాడాయన-ఇరవై దాటాయి, ఇంటికి ఒక ఇల్లాలు లేదు ఎవరు గొమ్మం తొక్కినా మొహాన చిటికెడు కుంకం పెట్టుకోమనే వారు లేరు. తలనిండా ముసుగేసుకున్న ఆ తెల్లచీరలు వంటిల్లు దాటి బయటకు రారు, కొడుక్కి పెళ్ళి చేస్తే కదా ఆడదిక్కు వచ్చేది అంటూ.
నిజానికి ఆడదిక్కు లేదని ఏదీ ఆగిపోలేదు ఆ ఇంట్లో. . . అన్ని సరదాలూ సంబరాలూ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రహస్యంగా, మరికొన్ని బాహాటంగా.
వీధి వాకిలి మగవారికి కేటాయిస్తే పెరటి తలుపు స్త్రీ జనాలకు. తలుపు చాటునుండి మాట్లాడినా, పెద్దగా చదువు సంధ్యలు లేక పోయినా చాణుక్య నీతి వంట పట్టించుకున్న వాళ్ళు ఆ ఇంటి స్త్రీలు,
ఎవరి సుఖ సౌఖ్యాలు వాళ్ళు బాగానే చూసుకోగలరు.
ఉదయం మగవాళ్ళు పొలాలకో పనులకో బయటకు వెళ్ళడమే తరవాయి,
కట్టుకున్న తెల్ల గుడ్డలు ఓ మూలకు వెళ్ళిపోతాయి.
నవీన్ చంద్ర ఇద్దరు మేనత్తలూ, పెద్దమ్మా పెద్ద వయసున్న వారేమీ కాదు, గట్టిగా లెక్కేస్తే యాభై లోపే.
బాల్య వివాహాలు – పర్యవసానంగా కాపరానికి రాకుండానే మొగుణ్ణి పోగొట్టుకోడం, పెద్ద వదినగారి దగ్గర ఇమిడిపోడం జరిగింది. అయితే పెద్దవదినగారికీ ఇద్దరు కూతుళ్ళు పుట్టాక పొలం గట్టున పాము కాటుకు గురై పెద్దన్న స్వర్గస్థుడవడంతో ముగ్గురి ప్రపంచమూ ఒకటిగా మారింది. అందుకే ఆ పిల్లలకు ముగ్గురు తల్లులు. పెరిగి పెద్దవగానే పెళ్ళిళ్ళు చేసి పంపేసారు.
బిందెలు పట్టుకుని చెరువుకు వెళ్లడం, గంటా గంటన్నరకు ఇల్లు చేరి వంటా వార్పూ. . . అసలు ఆ వేషాల్లో వారిని ఇంట్లో వాళ్ళు చూసినా గుర్తుపట్టలేరు.
పెరటి తోటలో పెంచిన కాయగూరలు, పూలూ చుట్టు పక్కల వారికి అమ్మించడం, రెండూ గేదెలు, రెండు ఆవులున్న గొడ్ల చావిడి లో ఇద్దరు పనివాళ్ళూ, బయటి పనులకు పాలూ పెరుగూ అమ్మకాలకూ మరొకడు. ఒక్క భర్తలేడన్న మాటే గాని మిగతా ఏ విధంగానూ ఇబ్బంది లేదు వారికి.
రెండు కుటుంబాల మధ్య మాటలు తప్ప పెద్దగా పెళ్ళిచూపులు జరిగే రోజులు కాదు. ఏకపక్షంగా తండ్రి నిర్ణయిం చేశాడు కొడుకు పెళ్ళిని.
అయిదుగురాడపిల్లల్లో పెద్దపిల్ల. నాగరత్నం. చెల్లెలికి పిల్లలు లేరని పెంపకానికి ఇచ్చాడు తండ్రి. మేనత్త తాలూకు రెండెకరాల పొలం చిన్న పెంకుటిల్లు పిల్లకే చెందుతాయి. పిల్లకూ పదహారు దాటాయి.
పొడుగ్గానే అనిపించినా కొంచం చామన చాయ. అయితేనేం కుదురులేని కొడుకు జీవితంలో స్థిరపడతాడని ఆ తండ్రి
ఆశ.
పెళ్ళై నాగరత్నం కాపరానికి వచ్చింది.

ఇంకా వుంది.

1 thought on “జీవన వేదం -3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *