June 24, 2024

తాత్పర్యం – విజాతి మనుషులు వికర్షించబడ్తారు

రచన: – రామా చంద్రమౌళి

“అసలు అందం అంటే ఏమిటి శివరావ్ “..అంది మనోరమ..ఆరోజు రాత్రి..తమ పెళ్ళై అప్పటికి ఒక పదిరోజులైందో లేదో..అంతే.
కొత్తగా..హైదరాబాద్లో..కిరాయి అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన తొలి దినాలు..శీతాకాలం రాత్రి..పదిగంటలు..డిసెంబర్ నెల..సన్నగా చలి..కిటికీలోనుండి చూస్తే..అప్పుడప్పుడే మంచుదుప్పటి కప్పుకుంటున్న నగరం..దూరంగా నిప్పుల కణికల్లా కరెంట్ దీపాల కుప్పలు..మిణుకు మిణుకు.
అప్పుడు మనోరమ తను రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న సిసిఎంబి నుండి ఒక గంటక్రితమే వచ్చి..వంట చేసి..ఇద్దరూ తిన్న తర్వాత..యధాలాపంగా పక్కను సర్దుతూ..దుప్పటిని సరిచేస్తూ.,
శివరావు..డాక్టరేట్ పూర్తి చేసి..ఉస్మానియా లో కొత్తగా లెక్చరర్ గా చేరి..ఒక ఏడాది.,
శివరావు..కిటికీలో నుండి బయటికి..వెన్నెలనిండిన నిర్మలాకాశంలోకి చూస్తూన్నాడు.శివరావుకు ప్రతిరోజూ కనీసం ఓ ఐదారుసార్లన్నా ఊర్కే అలా ఆకాశంలోకి చూడ్డం అలవాటు.అతనికి ఆకాశంలోకి చూస్తున్నప్పుడల్లా సముద్రంలోకి చూస్తున్నట్టో..తన ఆత్మలోకి తనే తొంగి చూసుకుంటున్నట్టో..మనిషికి యుగయుగాలుగా ఈనాటికీ అర్థంకాని ఏదో ఒక మహా రహస్యాన్ని చిన్నపిల్లాడిలా గమనిస్తున్నట్టో అనిపిస్తుంది.నిజానికి ఆకాశం.. అంతరిక్షం మనిషి పుట్టిన నాటినుండీ ఇంతవరకూ ఎవరికీ అర్థంకాని ఒక ప్రశ్న.
“నువ్వు చెప్పు”అన్నాడు శివరావు.
“అందమంటే..ఒక విద్యుత్ తీగలో బయటికి కనబడకుండా ప్రవహిస్తూ మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కరంట్ వంటిది..వెలిగిస్తుంది..కాలుస్తుంది..షాక్ ఇస్తుంది..గిలిగింతలు పెడుతుంది”అంది అలా పక్కపై వాలిపోటూ..శివరావువంక అభావంగానే చూస్తూ.
శివరావు మాట్లాడలేదు..కొద్దిసేపు మౌనం తర్వాత కిటికీలోనుండి నిద్రకుపక్రమిస్తున్న నగరాన్ని చూస్తూనే..వెనుకున్న మనోరమ దిక్కు చూడకుండానే అన్నాడు..” మనోరమా..అందమంటే..ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది అని అర్థం..” అని.
మనోరమ షాక్ ఐంది.ఆమె అతని నుండి అలాంటి సమాధానాన్ని ఊహించలేదు.నిజానికి మనోరమది మగవాణ్ణి పిచ్చివాన్ని చేయగల అత్యంత ఆకర్షణీయమైన శరీర సౌందర్యం.ఆమె వెన్నెల విగ్రహంలా ఉంటుంది.ఆమెకు వీలుచిక్కినప్పుడల్లా తననుతానే అద్దంలో చూసుకుని మురిసిపోవడం అలవాటు.తన అందాన్ని తన ప్రాణకన్నా మిన్నగా..జాగ్రత్తగా..పదిలంగా చూచుకోవడం..అందాన్ని దాచుకోవడం ఇష్టం.
శివరావుకూడా చాలా అందంగా,ఆకర్షణీయంగా..గ్రీక్ యోధునిలా ఉంటాడు.ఆరడుగులపైబడ్డ ఎత్తు అతనిది.నిజానికి మనోరమ అతని అందాన్ని చూచే పెళ్ళి చేసుకుంది.అతని అద్భుతమైన మేధా సంపత్తినిగానీ..మానవీయ పరిమళంతో నిండిన అతని ఆదర్శ భావాలనుగానీ..సమున్నతమైన అతని వ్యక్తిత్వాన్నిగానీ ఆమె ఏనాడూ గమనించలేదు.
ఒకే ట్రాక్ పై పయనిస్తున్న రెండు రైళ్ళు ఒక జంక్షన్ నుండి రెండు భిన్న దిశల్లోకి మారుతున్న దృశ్యం ఎందుకో ఆమె కళ్ళలో మెరిసింది చటుక్కున.
ఇద్దరి మధ్యా భిన్నత.ఆలోచనల్లో..అభిరుచుల్లో..ఆకాంక్షల్లో..లక్ష్యాల్లో..జీవితం గురించిన భావనలో.
ఆమె ఊహించని రీతిలో శివరావన్నాడు..”మనోరమా..నువ్వడిగిన భౌతికమైన అందం గురించి చెప్పాను నేను..ఆ అందం గురించయితే నేను చెప్పిందే పరమ సత్యం.కొద్దిగా వాస్తవిక దృష్టితో చూస్తే నీకే తెలుస్తుందది.ఐతే..ఎప్పటికీ వాడిపోనిదీ..శాశ్వతమై నిలిచేదీ..పైగా రోజురోజుకూ ఇంకా ఇంకా భాసించే అందం ఒకటుంది..” అంటూండగానే,
ఆమె అంది..” అది హృదయ సౌందర్యం కదా..అంతా ట్రాష్..ఒట్టి చెత్త.ఎంజాయ్ ద బ్యూటీ ఫరెవర్..యవ్వనాన్నీ..అందాన్నీ..పరమ సుఖాలనూ అనుభవించలేనివాళ్ళు చెప్పే చెత్త మాటలివన్నీ..ఐ హేట్ ఆల్ దిస్ నాన్సెన్స్”అంది ఉక్రోషంగా.అని మంచంపై అటువేపు తిరిగి పడుకుంది..మూతి ముడుచుకుని.
“మనుషులకు అందమైన శరీరాలతోపాటు దేవుడు అందమైన మనస్సునూ బుద్దినీ ఇస్తే బాగుండేది..కాని అలా ఉండదు సృష్టిలో..చాలామంది అందమైన మనుషులకు వికారమైన మనస్సుంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి..తెలుసా. మనిషికి ఏదైనా శారీరక జబ్బు చేస్తే సరిచేసుకోడానికి డాక్టర్ల దగ్గరికెళ్ళి చికిత్స చేయించుకుంటాం.ఎందుకంటే ఆ డిజార్డర్ మనకు వెంటనే తెలుస్తుంది కాబట్టి..అసౌకర్యంగా కూడా ఉంటుంది కాబట్టి.కాని మనిషి మనస్సుకు జబ్బు చేస్తే మనకు వెంటనే తెలియదు.దానికి చికిత్స చేయించుకుని మనస్సును ఆరోగ్యవంతం చేసుకోవాలనికూడా మనం అనుకోము. మానవీయ లక్షణాలతో తనను తానూ..చుట్టూ ఉన్న సమాజ సంక్షేమాన్నీ..సాటి మనుషుల పట్ల సహానుభూతినీ..కొంత త్యాగాన్నీ అలవర్చుకోని మనస్తత్వం రుజగ్రస్తమైనట్టు లెక్క..”
“ఆపండిక లెక్చర్ ఇక..నిద్రస్తోంది నాకు” దుప్పటికప్పుకుంది తలపైదాకా చిటపటలాడ్తూ..గదినిండా మల్లెపూల పరిమళం.
ఆ పరిమళాన్ని ఆస్వాదించే ఆసక్తీ..యవ్వన జ్వలన..అన్నీ శివరావుకు ఉన్నాయి..వెళ్ళి మంచంపై కూర్చుంటూ.,
తర్వాత్తర్వాత.,
ఈ యేడాది కాపురంలో . . అభిరుచుల వైరుధ్యాలతో. . భిన్నతలతో..విభిన్న తత్వాలతో..ఏదో ఎక్కడో..బీటలు వారుతున్నట్టు..చీలిక ఏర్పడుతున్నట్టు..రేఖలు రేఖలుగా విడిపోతున్నట్టు .. తాడుపురులువిప్పుకుపోతున్నట్టు .. తెలుస్తోంది ఇద్దరికీ.,
నిజానికి..ఈ భిన్నత ప్రతి భార్యాభర్తల విషయంగా..పెళ్ళైన కొత్తలో ఎవరికి వారికి అనుభవంలోకి వచ్చేదే.
పెళ్ళికి ముందు..పెళ్ళి చూపుల హాస్యపూరిత తతంగంలో..మనుషులు చూడగలిగేది ఏమిటి..ఒట్టి శరీరాల ఆకృతినీ..రంగునూ..చదువూ..ఉద్యోగం..ఆర్థిక నేపథ్యం..వీటినేగదా.అసలైన మనస్సునూ..హృదయాన్నీ..తత్వాన్నీ అంచనా వేసే వీలు ఎక్కడ.? . . తీరా పెళ్ళి జరిగి..కాపురం మొదలైన తర్వాత..ఆరంభమౌతుంది అసలు విషయం..ఆమె ఆశించినదానికి భిన్నంగా వీడు..తాగుడు..తిరుగుడు..లంచాలు తీసుకునుడు..స్నేహితులతో నానా బీభత్సమైన వ్యవహారాలు..అవినీతి..అనైతికత..డబ్బుకోసం ఏదైనా చేయగల దుర్మార్గం..ఇవన్నీ,
ఈమె నేపథ్యానికీ..అభిరుచులకూ..ఏవైనా కళాత్మక అభిరుచులుంటే..గానమో..నృత్యమో..రచనో..సామాజిక సేవా గుణమో..ఉంటే..అంతా” నోర్ముయ్” కింద సమాధి.
అంతా రాజీ పడడాలు..సర్దుకుపోవడాలు..పట్టు చీరలకింద..కొన్ని నగల భారంకింద..హూంకరింపులకింద..అప్పుడప్పుడు..దేహ హింసకింద..బెదిరింపులకింద..సమాధి ఐపోయి.,
‘ నా బతుకింతే..దేవుడు ఇంతే రాసిపెట్టాడు నా ఖర్మ..’ అని ఒక స్వయం ఓదార్పు..ఎవరికి వారూ..అటు భర్తా..ఇటు భార్యా.
ఒక్క కుదుపు కుదిపినట్టనిపించి..ఉలిక్కిపడి..కళ్ళు తెరిచి.,
శివరావు ఈ లోకంలోకొచ్చాడు..తను పయనిస్తున్న రైలు ఎందుకో అకస్మాతుగా వేసిన బ్రేక్ తో కీచుమని ఆగినట్టుంది.
ఏదో స్టేషన్ ఔటర్ యార్డ్..కిటికీ ప్రక్కన కూర్చున్నవాడు..తొంగి చూస్తే..చిక్కగా చీకటి..సిగ్నల్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ.
ఎప్పటి జ్ఞాపకం ఇది..ఎప్పటిదో..ముప్పది ఏళ్ళనాటి ఘటన.
శివరావు మనసులో మనోరమ రూపం..జ్ఞాపకం కదిలి ఎందుకో ఒక వికారమైన అనుభూతి కలిగి.,పెళ్లయి..రెండేళ్ళు గడిచి..ఒక పాప పుట్టిన తర్వాత..ఆమెకు తను పి హెచ్ డి చేసిన అదే సి సి ఎం బి లోపలే సైంటిస్ట్ ఉద్యోగం వచ్చి..స్థిరపడిపోయింది.
ఇటు తను..తన సహజమైన ఆసక్తితో విప్లవ ఉద్యమాలు..మానవ హక్కుల పోరాటాలు..మారుమూల గిరిజన హక్కుల పరిరక్షణ కార్యక్రమాలు..వీటిలో దాదాపు పూర్తి స్థాయిలో మమేకమై.,
తనకు ఉద్యోగం సెకండరీ..ఇప్పుడు ఈ దేశంలోని అనేకమంది దీనజనుల సముద్ధరణకై సకల ఐహిక సుఖాలను త్యాగం చేస్తూ దిక్కు మొక్కు లేని జనానికి ప్రతిఘటననూ..ప్రశ్నించడాన్ని నేర్పడమే ప్రైమరీ ఐన దశ..స్పృహ..యూనివర్సిటీకి అవసరాన్ని బట్టి చాలా సెలవులు పెడ్తూ..జీతం కోతలతో కురుచైపోతూంqడగా..దాదాపు తన జీతం ఎనభై వేలైతే ఏ ముప్పై వేలుకూడా చేతికి రాని పరిస్థితి..ఐనా ఏ ఒక్కనాడూ డబ్బు గురించీ ,రాబడి గురించీ ఆలోచించింది లేదు.డబ్బుతో తనకు అంత పెద్దగా అవసరాలూ లేవు. అతి నిరాడంబరమైన జీవితం తనది.అంతా రెండు మూదు అంగీలు..రెండు ప్యాంట్ లు..భుజానికి ఒక బట్ట సంచీ..కాళ్లకు ఒక స్లిప్పర్ల జత.
జీవితమంతా.. గణితం..చిన్నప్పుడు ప్రాథమిక గణితం..తర్వాత ఉన్నత గణితం…కాలేజ్ లో హయ్యర్ ఇంజనీరింగ్ గణితం..అటు తర్వాత అడ్వాన్స డ్ గణితం..లాప్లాస్ ట్రాన్స్ ఫార్మేషన్స్..ఫ్యూరియర్ సీరీస్..టైం థియరీ..చివరికి ప్యూర్ మాథమేటిక్స్..శుద్ధ గణితం..విశుద్ధ గణితం..ఒకటి బై సున్నా ..సున్నా బై ఒకటి ల మీమాంస..అంత అనంతాలగురించిన చింతన..అనంత ఆకాశాన్నీ..అనంతానంత అంతరిక్షాన్నీ..దిగంతాల అవతల ఉన్న శూన్యం గురించీ..ఏమీలేనట్టే అనిపిస్తూ..అన్నీ ఉన్న అభేద్య రహస్యాన్నీ తెలుసుకుంటూనే..ఈ మనుషులు ఎందుకిలా జాతులు జాతులుగా..బీదలు ధనికులుగా..కులాలు కులాలుగా..మతాలు మతాలుగా..విభజింపబడి..భాగింపబడి..విచ్ఛిన్నపర్చబడి.,
చివరికి అన్ని గణితాలనూ పరిత్యజిస్తూ..జీవిత గణితం గురించిన విపులాధ్యయనం.
అడవుల్లోకి పయనం..అడవుల్లో అన్వేషణ..అడవుల్లో అల్లాడుతున్న లక్షల మంది నిరక్షరాస్య జన దుఃఖ మూలాలను తెలుసుకునే వెదుకులాట.
గిరిజనులు సుఖంగా లేరు..వాళ్లకు కనీస సౌకర్యాలు లేవు..అని ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు చెబుతూ..ఊదరకొడ్తూ..వాళ్ళ ఉద్ధరణ పేరు మీద గత అనేక దశాబ్దాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వ అధికారులు..రాజకీయ నాయకులు..మధ్య దళారులు..’ప్రకృతిలో లీనమై,భాగమై జీవించే మేము సుఖంగానే ఉన్నాము..మమ్మల్ని మా మానాన విడిచి పెట్టండి మహాప్రభో ‘ అని మొత్తుకుంటూంటే వినకుండా..వాళ్ల జీవితాల్లోకి దుర్మార్గంగా ప్రవేశిస్తూ..కాంట్రాక్టర్ లు..బహుళజాతి కంపనీలూ..పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ధనిక వర్గపు ప్రయోజనాలకోసం విద్యుత్ ప్రాజెక్ట్ లు..మైనింగ్ తవ్వకాలు..అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా ఖనిజ నిక్షేపాల తరలింపు..గ్రానైట్ ఎగుమతుల పేరుతో గుట్టలకు గుట్టల విధ్వంసం..అంతా బీభత్స భయానకం.
ఇదంతా..ఈ నగరాల..ఈ స్మార్ట్ సిటీల మాయజలతారు మెరుపుల అవతల అడవుల్లో మరో అనాగరిక లోకంగా ఈ దేశంలోనే వర్థిల్లుతున్న మరో చీకటి ప్రపంచపు ఆర్తనాద ధ్వని.
లోతుగా..ఇంకా ఇంకా లోతుగా ఈ గుప్త..అజ్ఞాత విధ్వంసక జీవన బీభత్సాలను అధ్యయనం చేస్తున్నకొద్దీ అన్నీ గాయాలే..రక్తాలోడే గాయాలు.
అసలు ఈ స్థితికి నిషృతీ..వీళ్ళుకు చేయూతా..ఈ సమస్యలకు పరిష్కారం..ఏమిటి.
చదువు..జ్ఞానం..తమను తాము తెలుసుకోగలిగి ఎదుటి మనుషులు చేస్తున్న మోసాలను పసిగట్టగలిగే స్పృహ..లోకంపోకడగురించిన ఎరుక..ఇవి వాళ్ళలో పాదుకొల్పాల్సిన బీజాలు.ఎవరు చేయాలి ఈ పనులు..నాలాంటి వాళ్లం కాక.
మెల్ల మెల్లగా ‘మానవ చైతన్య వేదిక ‘ తో అనుసంధానమై.. అటువేపు జరుగుతున్నకొద్దీ,
ఒక రోజు.,
అప్పటికే సి సి ఎం బి నుండి ఒక ప్రత్యేకమైన డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద మూడేళ్ళ పోస్ట్ డాక్టోరల్ కోర్స్ ను పూర్తి చేసేందుకు పాప నిర్మల ను తన వెంట తీసుకుని అమెరికా వెళ్ళిన మనోరమ..అకస్మాత్తుగా తను వెళ్ళిన ఓ ఏడాది తర్వాత ఒక ఈ-మెయిల్ పెట్టింది..” శివరావ్..సారీ..ఐ యాం నో మోర్ ఇన్ లవ్ విత్ యు..నేను నీనుండి విడిపోతూ విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను.బహుశా నేనిక తిరిగి ఇండియాకు రాక పోవచ్చు.శాశ్వతంగా నేను ఇక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. పాపకూడా నాతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అంటూంటావు కదా..మన అభిరుచులూ..ఆలోచనలూ..లక్ష్యాలూ..తత్వాలూ ఒకటికావని.అది నిజమే..ఎంత చేసినా ఇనుముతో రాగీ..ఇత్తడీ అతకవు. రెండు పదార్థాలు సమగ్రంగా కలిసిపోవాలంటే..హోమోజినిటీ..ఏక రూపత కావాలి. కానిఅవిమనమధ్యలేవు.
నాలాంటి వాళ్లం సామాన్యులం..అంటే అందరిలా సకల వ్యామోహాలకూ క్షణక్షణం లొంగిపోతూ..భౌతిక వాంఛలకోసం పరితపిస్తూ..అంతిమంగా కోటిలో ఒకరమై ఏ ప్రత్యేకతా లేకుండా అనామకంగా చచ్చిపోతాం.నువ్వలాకాదు.నీకు నీ జీవిత లక్ష్యం స్పష్టంగా తెలుసు..నీ దారి..గమనం..గమ్యం..నడక అన్నీ నువ్వు ఉద్దేశ్యించుకున్నట్టుగానే నీ ముందు పరుచుకుని ఉంటాయి.ఒకరంగా చెప్పాలంటే నువ్వొక ఋషివి.
నువ్వు సరే అంటే ఇక్కడి ఒక లాయర్ ద్వారా మన విడాకుల పత్రం పంపుతాను కొరియర్ లో.నువ్వు సంతకం చేసి తిరిగి పంపు.
లేకుంటే కోర్ట్ ద్వారా తీసుకుందామన్నా నేను సిద్ధమే.
కాని..నువ్వు నేను పంపదలుచుకున్న విడాకుల పత్రం పై సంతకం చేసి సహకరిస్తావనే నా అంచనా..విశ్వాసం.
నీ విడాకుల అంగీకార పత్రం రాగానే ఇక్కడి ఒక అమెరికన్ మల్టీ బిలియనీర్ ను నేను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.
మన పాప నిర్మల బాగుంది.అప్పుడప్పుడు నిన్ను చాలా జ్ఞాపకం చేస్తూంటుంది.
– మనోరమ
ఆ మెయిల్ కు తను వెంటనే జవాబిస్తే..అదే రోజు రాత్రి మనోరమ తిరుగు మెయిల్ లో తన అడ్వకేట్ ద్వారా విడాకుల పత్రం పంపింది..ఒకటి కొరియర్ లో కూడా.
నిట్టూర్చి..మొత్తం తమ మూడున్నర సంవత్సరాల కాలం కాపురాన్ని ఒక్క క్షణం మననం చేసుకుని సంతకం చేసి..కాగితాలను కొరియర్ చేసి..తనను తాను విముక్తం చేసుకున్నాడు..ఎందుకో ఆ క్షణం పాప నిర్మల జ్ఞాపకమొచ్చి..ఒక కన్నీటి బొట్టు.
ఇక తను ఒంటరి..స్వేచ్ఛా జీవి.బంధాలన్నీ తెగిపోయాయి.
తర్వాత మిగిలింది..ఉద్యోగం..నెలకు లక్షా ఇరవై వేలొచ్చే అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు.
ఆ డబ్బుతో తనకు అవసరమే లేదు.పైగా తను అనుకున్నట్టు నిరాడంబరంగా జీవించడానికి అదొక ప్రతిబంధకం.
రిజైన్ చేశాడు.
ప్రయాణం మొదలు..పూర్తికాల ఉద్యమకారుడిక తను.అడవిలోకి ప్రస్థానం.తపస్సు కాదుగాని..ఆత్మావలోకనం.ఆత్మాన్వేషణ..భవిష్యత్ రూపకల్పన.
ఎక్కడ మనుషులు తమ గొంతును వినిపించలేరో..అక్కడ తను వాళ్ళ గొంతుకావాలి.ఎక్కడ ప్రజలు సంఘటిలుగా లేరో..అక్కడకు తను చేరి గడ్డిపోచలతో బలమైన తాడును పేనినట్టు సంఘటితం చేయాలి.ఎక్కడ బలవంతులు బలహీనులను దోపిడీ చేస్తున్నారో..అక్కడ తను ప్రత్యక్షమై ‘జనానికి ‘ ప్రతిఘటన విద్యను నేర్పాలి..ఇదీ.
మూడే పనులు..పొద్దంతా ప్రజల్లో ఒకడిగా పర్యటన..ఎవరు ఏమి పెడితే అదే తినుట.రాత్రంతా పుస్తకాలు చదువుట..అడవిని చిన్న నిప్పురవ్వ పూర్తిగా దహించి నిశ్శేషం చేస్తుందనే సత్యాన్ని తెలియజేసే పుస్తకాలను రాయుట.వాటిని ఆయుధాలుగా దిక్కుమొక్కు లేని జనాల చేతులకు అందించుట.
అదే జరుగుతూ వస్తోంది..గత ఇరవై ఎనిమిది సంవత్సరాలనుండి.
శివరావు పేరు ఇప్పుడు..ఉద్యమ మిత్రులందరికీ శివం గా పరిచయం.
శివం అంటే..మీడియాలో ఒక చైతన్య జ్వాల.ప్రభుత్వాలకూ..వాళ్ల తాబేదార్లకూ..శివం సింహ స్వప్నం.కలలో మృత్యువు.ప్రజలకు అతను ఋషి.
ఒక రిపోర్ట్ పంపించాడు ప్రపంచ బ్యాంక్ కు..ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఋణంగా తీసుకుంది..ఇప్పుడు మళ్ళీ ఎన్ని లక్షల డబ్బును అప్పుగా అడుగుతోంది..ఈ డబ్బును ఎలా నాయకులూ,ప్రభుత్వ అధికారులూ పంచుకుని తినబోతున్నారు..చివరికి ఈ ఋణాన్ని చెల్లించాల్సిన సామాన్య జనం పై మనిషికి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలఅప్పు..ఇలా సాగింది..మర్నాడు పత్రికల్లో..ఈ లేఖ విడుదల.పెట్రోల్ బావి అంటుకున్నట్టు ప్రజల ప్రతిఘటన ..ప్రభుత్వ గూడుపుఠానీ బట్ట బయలు.
* * *
ఏడూ నలభై ఐదు..కాని అప్పటికే..రైలుఈ మొదటి స్టాప్ లోనే అరగంట లేట్.
ఈ దేశంలో ఎవడికీ తన వృత్తిపట్ల ధర్మబద్ధమైన నిబద్దత లేదు..పై వాడంటే భయమూ లేదు.నిర్లక్ష్యమూ..ఉదాసీనతా..ఉపేక్షలకు కొదువే లేదు.జనానికిప్పుడు కావాల్సింది క్రమశిక్షణతో కూడిన జవాబుదారీతనంతో నిండిన జీవన సంస్కృతి.కానిదాన్ని నేర్పే ప్రభుత్వాలు ఈ దేశంలో లేనే లేవు.
రైలు..బొంది వాగు..రైల్వే గేట్..క్రిష్ణా కాలనీ..అండర్ బ్రిడ్జ్..వరంగల్లుచేరుతూండగా..సిగ్నల్ లేదు.మళ్ళీ ఆపుడు రైల్ ను ఔటర్ యార్డ్ లో.ఉండీ ఉండీ చటుక్కున కరంట్ పోయింది..నగరమంతా చీకటి. మేఘాలు గర్జిస్తూ..చెప్పా చేయకుండా..గాలి దుమారం..పెద్ద పెద్ద చినుకులతో వాన. ఒక్క క్షణంలో.. అంతా వాతావరణం తారుమారు.
పది నిముషాల తర్వాత..మెల్లగా కొండ చిలువలా కదులుతూ..పొడుగాటి రైలు.
వరంగల్ స్టేషన్ ప్లాట్ ఫాం పైకి ప్రవేశిస్తూందగా..కరెంట్ వచ్చింది భళ్ళున.జనం క్రిక్కిరిసి..పరుగులు ఉరుకులు.అంతా హడావిడి.
శివరావు దిగాడు..ఎస్ 10 బోగీ నుండి భుజాన సంచీతో.వరంగల్ లో రైలు నిలిచే సమయం రెండు నిముషాలే.
చూస్తూండగానే..అనౌన్స్ మెంట్..వర్షం ఒకవైపు కుండపోతగా..రైలు కదుల్తోంది..మెల్లగా,
అప్పుడు చూశాడు శివరావు..తన ఎదురుగా ఎస్ 8 బోగీ దగ్గరనుండి ఒక చేతిలో సూట్ కేస్ తో..మరో చేత్తో పట్టుకుని భుజంపై చిన్న పాపతో..ఒక గర్భిణీ స్త్రీ.. పరుగెత్తుకుంటూ వస్తూండడం..వర్షంలో..రైలు వేగాన్ని అందుకుంటోంది.ఆమె వచ్చీ వచ్చీ..ప్లాట్ ఫాం పై చటుక్కున బోర్లా పడింది దభేలున..”ఆమ్మా..” అని దద్ధరిల్లేలా అరుస్తూ.ఆమె భుజం పైనున్న రెండేళ్ళ పాప ఎగిరి దూరంగా..విరుచుకు పడింది..కెవ్వున ఏడుస్తూ..బోర్లా తూలిపడ్డ ఆమె తన గర్భంపై పడిపోయి..క్షణాల్లో అపస్మారక స్థితి లోకి వెళ్తూ..శివరావు పరుగెత్తాడు..ఆమె దగ్గరకు..ఇంకొందరు సహ ప్రయాణీకులు కూడా.
“అయ్యా..ఈ ముండాకొడుకులు కోచ్ పొజిషన్ బోర్డ్ లు పెట్టరయ్యా..రెండేండ్లయ్యింది..ఎన్నిసార్లు చెప్పానో..నాల్గు బోగీల అవతలినుండి పరుగెత్తుకొస్తున్నా..వీళ్ళ బాడ్ కౌ ఉద్యోగాలు పాడుగాను.అయ్యో నా గర్భం..నా కొడుకు..నా బిడ్డ” అరుస్తూనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.ఆమె నొసలు కూడా చిట్లి రక్తం కారుతోంది.
శివరావుకు అంతా అర్థమైంది.వరంగల్లంటే..హెరిటేజ్ సిటీ..అమృత్ సిటీ..స్మార్ట్ సిటీ..గ్రేటర్ వరంగల్లు హోదా.
రెండేళ్ల క్రితం రాత్రి ఇదే గోదావరిలో..హైదరాబాద్ వెల్తూ..తనుకూడా ప్లాట్ ఫాం పై కోచ్ పొజిషన్ డిస్ ప్లే లేక..స్టేషన్ మాస్టర్ తో చాలా గొడవ పడ్డాడు..వ్రాత పూర్వక కంప్లెయింట్ కూడా ఇచ్చాడు..రెండేండ్ల కాలం గడిచినా..ఇంకా అదే దరిద్రం..మొద్దు నిద్ర..పాలకులదీ..అధికారులదీ..ఛీ ఛీ.
పురమాయించి..తోటి మనుషుల సహాయంతో..ఆమెను స్టేషన్ మాస్టర్ గది దాకా మోసుకెళ్ళి..చుట్టూ వందల మంది గుమికూడి.,
స్టేషన్ మాస్టర్ పరుగెత్తుకొచ్చాడు.. తాపీగా..నత్తలా.
శివరావు..తన మొబైల్ ఫోన్ తో..చక చకా మాట్లాడాడు ఇద్దరితో.
” సర్..రెండేళ్లయింది ఈ మహా నగరంలో..ప్లాట్ ఫాంలపై.కోచ్ పొసిషన్ దిస్ ప్లే లేక. జనం ఎలా రెందు నిముషాలే ఆగే రైళ్ళ కోచ్ ను ఎలా వెదుక్కోవాలి..పాపం ఉరికి ఉరికి ఈమె ఏమైందో చూడండి..గర్భం చితికి పోయింది..ఈమె ప్రాణం ప్రమాదంలో ఉండి..దీనికి మీరే బాధ్యులు..ఈమే మీ కూతురైతే ఏం చేస్తారు మీరు..మేమిప్పుదు మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం..మూడుసార్లు వరంగల్లుకు మీ జి ఎం వచ్చాడు ఇన్స్ పెక్ షన్ కు..మీరు ప్రజల సొమ్ము తింటూ..మా ప్రాణాలనే తీస్తారా.. ” శివరావు గర్జిస్తున్నాడు.ఈ లోగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది..నలువైపుల నుండి కెమెరాలతో..చిలికి చిలికి..ప్లాట్ ఫాంపై..నాల్గయిదు వందల మంది..కేకలు..నినాదాలు..పడిపోయిన స్త్రీని ఆస్పత్రికి హుటాహుటిన తరలింపు..ఒక యుద్ధ వాతావరణం..
పది నిముషాల్లోఅన్ని టి వి చానెళ్లలో..ప్రసారం..” వరంగల్లు రైల్వే ప్లాట్ ఫాం పై… ”
అందరూ కూర్చున్నారు నేలపై…బైఠాయింపు.
కదలిక..అత్యవసర కదలిక..ఫోన్ల మీద ఫోన్లు..ప్రజల సమీకరణ..ప్రజా శక్తి నిర్మాణం..బిగించిన పిడికిళ్ల నినదింపు.
వర్షం..వర్షం.,
తెలతెల వారుతూండగా సికింద్రాబాద్ నుండి ఎ జి ఎం..ఇతర అధికారుల హుటాహుటి ఆగమనం.
“రెండు రోజుల్లో కోచ్ పొజిషన్ డిస్ ప్లే చేయకుంటే.. ” అని లిఖిత పూర్వక హామీ.
సూర్యోదయమౌతూండగా..స్టేషన్ బయటకు వస్తూ..శివరావు..వెంట వందల మంది జనం.
* * *
ఐదేళ్ల తర్వాత,
శంషాబాద్ ఏర్ పోర్ట్ నుండి రేడియో క్యాబ్ లో బయల్దేరి..సి సి ఎం బి లో ఒక ముఖ్యమైన సర్టిఫికేట్ ను తీసుకుని పోయేందుకు..వీసా స్టాంపింగ్ కోసం..రెండు రోజుల సుడిగాలి పర్యటనకు వస్తోంది మనోరమఅమెరికానుండి.
సాయంత్రం నాలుగున్నర .. మేఘాలు ఆకాశం నిండా..వర్షం ఏ క్షణమైనా మొదలవ్వొచ్చు.
కార్ సిటీలోకి రాగానే ఒకచోట ఆపించుకుని రెండుమూడు తెలుగు పత్రికలు కొంది మనోరమ..దిన పత్రికలు.వార పత్రికలు కూడా.ఎన్నాళ్ళయిందో తెలుగు పత్రికలను చూచి.ఈనాడు..అంధ్రజ్యోతి..నవ్య.,
పత్రికలను తిరగేస్తూండగా..లోపలి అనుబంధ పేజీల్లో కనిపించింది ఒకచోట..శివరావు ఫోటో..’ఎడిటర్ తో ముఖాముఖి.’
‘దిక్కు మొక్కు లేని జనం వెంట జీవితాంతం నడుస్తూ..వాళ్ళకు చిటికెన వ్రేలునిచ్చి నడిపిస్తూ..బూర్జువాలకూ..దోపిడీ దార్లకూ గుండెల్లో తుపాకి గుండై..ఎందరో అసాంఘిక వ్యక్తులతో నిత్యం తలపడ్తూ..పలువురిపై ప్రభుత్వాలకూ,కోర్టులకూ బహిరంగంగా పిర్యాదుచేసి..వాళ్ళను జైలుపాలు చేసిన నిజమైన హీరో..డాక్టర్ మెతుకు శివరావుతో ఈ రోజు ముఖాముఖి. ‘. ఒక పూర్తి పేజి aఇంటర్వ్యూ.
“సర్..మీరు గణితంలో డాక్టరేట్ చేసి..అందరిలా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలతో సుఖంగా గడపక..ఈ ఉద్యమాలనీ..ప్రజా చైతన్యమనీ..ఈ గొడవల్లో..” అని ప్రశ్న.
“మీరన్న సుఖం..నాకు ప్రజలను చైతన్య పర్చడంలోనూ..ఈ సమాజానికి హాని కలిగిస్తున్న ద్రోహులను ఏరివేయడంలోనూ ఉంది.సుఖం అన్న పదానికి ఎవరి నిర్వచనం వాళ్ళది..”
“ఇప్పటికే..ఐదారు తిమింగలాలను లీగల్ గా తగు ఆధారాలతో జైల్లోకి తరలించారు మీరు..మరి మీ వ్యక్తిగత భద్రత గురించి మీరు తీసుకునే జాగ్రత్తలేమిటి”
” ప్రజలకోసం పనిచేస్తున్న వ్యక్తులెప్పుడూ ప్రజలయొక్క భౌతిక సంపద.వాళ్ళ సంపదను వాళ్ళే కంటికి రెప్పలా కాపాడుకుంటారు.”
“పేద ప్రజల్లో..గిరిజన ప్రాంతాల్లో మీకు అసంఖ్యాకమైన అనుచరులూ,అభిమానులూ ఉన్నట్టే మీరు విరోధిస్తున్న సోకాల్డ్ నియో-రిచ్ బూర్జువాలనుండి శత్రువులూ,బెదిరింపుదార్లూ ఉంటారుగదా..మరి వాళ్లనుండి..మీకు రక్షణ..”
“జీవితమంటేనే..ఒక నిరంతర పోరాటం.భయపడేవాడు పోరాటాలు చేయలేడు.నేను భయాన్ని కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడే జయించాను..”
ఇలా సాగుతోంది సంభాషణ.
శివరావు గొంతులో నిఖ్ఖచ్చితనం..స్పష్టత..గురితప్పని విశ్వాసం..కళ్ళనిండా విద్యుత్ బల్బ్ లోనుండి విరజిమ్మే కాంతిలా వెలుగు.
శివరావు కొన్ని దశాబ్దాలక్రితం..తనతో మనిషి అందం గురించిన చెప్పిన ‘ నిజమైన అందం’ ఈ కళ్ళలో కాంతేనేమో.
అప్రయత్నంగానే..మనోరమ చటుక్కున తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి మిర్రర్ ను బయటకు తీసుకుని తన ముఖాన్ని తానే పరిశీలనగా చూచుకుంది.ముఖంలోగానీ..కళ్ళలోగానీ ఎటువంటి మెరుపూ..కాంతీ..జీవమూ లేదు.ఒక అందమైన నిర్జీవ..తెల్లగా వెల్లవేసిన శుభ్రమైన గోడలా ఉంది.
ఎబల్బ్ విత్ కరెంట్..వితౌట్ కరెంట్.
మనోరమ దీర్ఘంగా నిట్టూర్చి..తలెత్తేసరికి.,
సాయంత్రం..ఐదు గంటలు..అమీర్ పేట్ చౌరాస్తా దాటి..నింస్ దగ్గరకు రాగానే..”తప్’ మని ఏదో గన్ కాల్చిన చప్పుడు.క్షణం లో..జనం కకావికలై..పరుగులు రోడ్ పై..గుంపులు గుంపులుగా.
” ఏమైంది..”
” ఏమైంది”..ప్రశ్నలు.
” ఎవరో..ఒక మనిషిని గన్ తో కాల్చి పరారయ్యాడిప్పుడే..అంతా రక్తం..మనిషి అక్కడికక్కడే చనిపోయాడు”
” ఎవరో పాపం”
” తెలియదండీ”
పొలీస్ వ్యాన్ చప్పుడు..ఈలలు..హడావిడి..పరుగులు..కుక్కలతోపోలీస్లహడావిడి.
మనోరమ క్యాబ్ కు పదడుగుల దూరంలోనే..అంతా..రక్తపు మడుగు కనబడ్తూనే ఉంది.
‘ఎవరో చూస్తే బాగుండు ‘ అని..ఉత్సుకత.
ఇంకా జనం ప్రోగౌతూనే ఉన్నారు.”మేడం..ఇటునుండి కార్ ను వెనక్కితిప్పుతాను..” అని డ్రైవర్ ఏదో అంటూనే ఉన్నాడు..మనోరమ కార్ ను దిగి ఆ గుంపులోకి నడిచింది.
దగ్గరగా వెళ్ళి..ఇంకా జనాన్ని తోసుకుంటూ..లోపలికి.,
ఎదురుగా..తడి రక్తపు మడుగులో..శివరావు.
” శివరావు చచ్చిపోయాడు..తన ఎదురుగానే.”
” కాదు..శివరావు..చంపబడ్డాడు”
వేలమంది గుండెల్లో దేవునిలా కొలువై ఉండే శివరావుకు కూడా శత్రువులుంటారా.
ప్రపంచంలో..తనలాంటి..అందగత్తెలూ..బిలియనీర్లూ కోకొల్లలు..కాని శివరావులాంటి ప్రజోపయోగ లక్ష్యం తోనే జీవించే..చావును ప్రతినిత్యం ఎదుర్కుంటూ పోరాడే త్యాగమూర్తులు..ఎందరు.
‘ఎప్పటికైనా తప్పకుండా నశించిపోయేది భౌతికమైన అందం. రోజులూ..వయసూ గడుస్తున్న కొద్దీ..ఇంకా ఇంకా సౌందర్యవంతమయ్యే అందం..మనం నిర్మల పర్చుకునే..మన మనసు..హృదయం..ఆత్మ..’
శివరావు..తమ పెళ్ళైన కొత్తలో అన్న మాటలు జ్ఞాపకాల పొరల్లోనుండి ధ్వనిస్తూ.,
మనోరమ కళ్ళలోనుండి..వెచ్చని కన్నీళ్ళు..ధారలు ధారలుగా.,
కన్నీళ్లకుహృదయముంటుందా.?
* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *