April 19, 2024

నంజనగూడు, దొడ్డమల్లూరు ఆలయాలు

రచన: రమా శాండిల్య

ఈ సారి నా కర్ణాటక యాత్రానుభవాలులో రెండు క్షత్రాలను గురించి వ్రాస్తున్నాను. అవి మొదటిది నంజనగూడు, రెండవది దొడ్డ మల్లూరు.
1. శ్రీ నంజుండేశ్వర స్వామి, కర్ణాటక, మైసూర్! నంజన గూడు!
కర్ణాటక యాత్రలలో భాగంగా, నంజనగూడు యాత్ర అనుకోకుండా ఈ మధ్య చేసాము.
చాలా మంచి యాత్రగా దీనిని చెప్పుకోవచ్చు!
భక్తజన సులభుడు ఈ నంజనగూడు శ్రీ కంఠేశ్వరుడు.
దక్షిణ కాశీగా పిలవబడే ఈ నంజనగూడు, భక్తుల సర్వ రోగాలనూ పోగొట్టే ధన్వంతరిగా కూడా పిలవబడుతున్న ఆదిశంకరుడే ఇక్కడి పరమేశ్వరుడు.
పరమశివుడు లింగరూపంలో శ్రీకంఠేశ్వరస్వామి పేరుతో, కొలువుదీరిన అత్యంత సుందర ప్రదేశమిది.
దర్శించినంతనే భక్తులను అనుగ్రహించే భక్త సులభుడుగా పేరుపొంది, అశేషభక్తుల ఆరాధనలందుకుంటూన్న మహిమాన్విత క్షేత్రం ఇది. పేరుపొందిన ప్రాచీన దివ్యక్షేత్రంగా, ‘నంజనగూడు’ విలసిల్లుతున్నది.
కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో, మైసూరు నగరానికి సుమారు ఇరవైమూడు కిలోమీటర్ల దూరంలో కపిలానదీ తీరంలో, నంజనగూడు క్షేత్రముంది.
ఈ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీకంఠేశ్వరస్వామివారిని శ్రీ నంజుండేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. ‘నంజుండ’ అనే పదంలోని, ‘నంజు’ అంటే ‘విషము’ అనీ, ‘ఉండు’ అంటే ‘మింగినవాడు’ అనీ కన్నడంలో అర్థాలున్నాయి. విషం మింగిన స్వామి కనుక నంజుండేశ్వరుడు అనీ, నంజుండేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం కనుక, ‘నంజనగూడు’ అనే పేరు ఏర్పడినట్లు ఇక్కడి స్థలపురాణం.

*****

ఇక్కడి నీలకంఠేశ్వరస్వామికి ఆయుర్వేద ఔషధంతోనూ, అన్నంతోనూ నిత్యాభిషేకం ఉంటుంది.
ఆయుర్వేదం ఔషధం అంటే… శొంఠి, బెల్లం, తేనె, పటికబెల్లం, వెన్న, ఇంకా మనకు తెలియని ఎన్నో ద్రవ్యాలతో వాటితో తయారు చేసిన పదార్థంతో శివలింగానికి పూతగా అభిషేకం చేస్తారట. ఈ ఔషధాన్నీ, ‘సుగంధిత సక్కరై’ అంటారుట. ఈ పేరుతో మనం కూడా అక్కడ స్వామికి అభిషేకం చేయించవచ్చట. దానిపైన అన్నంతో అభిషేకిస్తే, ఆ విష ప్రభావం తగ్గుతుందనే నమ్మకంతో, అనాదిగా వస్తున్న ఆచారమట. ఇక్కడ ప్రతీరోజూ ఈ అభిషేకం ఉంటుందట. అందుకే ఇక్కడి ఈ శివుడిని ధన్వంతరిగా కూడా కొలుస్తారట.
ఈ ఆలయం గురించి, ఇక్కడి తోటి యాత్రికుల ద్వారా, ఆలయ అర్చకుల ద్వారా, కపిలా నదిలో తెప్పలు నడిపే అతని ద్వారా విన్న స్థలపురాణాలు ఆసక్తిగా అనిపించాయి.

మీకు గుర్తుందా? మనం చిన్నతనంలో ఒక ఎర్ర పళ్ళపొడిని పళ్ళు తోముకోవటానికి వాడే వాళ్ళం.
నంజనగూడులో స్థిరపడిన తెలుగు వ్యాపారస్థుల తెలివి వలన భారతదేశం మొత్తం ఈ పళ్ళపొడి ద్వారా ఈ పేరు గురించి తెలిసింది.

****
స్వామివారు ఈ క్షేత్రంలో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. కృతయుగంలో అమృతం కోసం దేవ దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథించారు. మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకీ సర్పాన్ని ఆ కవ్వానికి తాడుగా చేసుకుని చిలుకుతున్న సమయంలో పాలసముద్రం నుంచి ముందుగా హాలాహలం జనించిందని మనందరికీ తెలుసు కదా!

లోకాలన్నింటినీ దహించి వేయగల ఆ కాలకూట విషాన్ని, దేవతల కోరిక మేరకు పరమశివుడు స్వీకరించాడు. అయితే పార్వతీదేవి కోరికతో, శివుడు హాలాహలాన్ని మింగకుండా గొంతులోనే ఉంచుకుని నీలకంఠుడుగా ఈ క్షేత్రమున్నచోట వెలసాడని చెబుతారు.

****

తర్వాత కొంత కాలానికి గౌతమ మహర్షి ఈ ప్రాంతానికి చేరుకుని, ఈ విషయాన్ని(శివుడు వెలసిన) గుర్తించి పరమశివుడిని లింగరూపంలో ప్రతిష్టించి, పూజలు జరిపినట్లు ఇంకొక కథనం. ఈ విధంగా నంజనగూడు క్షేత్రంలో పరమశివుడు శ్రీకంఠేశ్వరస్వామిగా కొలువు దీరినట్లు స్థలపురాణం వెల్లడిస్తున్నది.

*****

మరొక కథనం పడవ అబ్బాయి చెప్పాడు. ఈ క్షేత్రాన్ని పరశురాముడు దర్శించినట్లు చెబుతారు. తండ్రి ఆజ్ఞమేరకు, తల్లితల నరికిన తర్వాత, తనకు సోకిన మాతృహత్యాపాతకాన్ని పోగొట్టుకునేందుకు, పరశురాముడు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ చివరకు ఈ క్షేత్రానికి వచ్చి తన ఆయుధమైన పరశువును (గొడ్డలిని) కపిలానదిలో కడుగుతూ ఉండగా అది నదిలో ఉన్న శివుడికి తగిలి రక్తం కారడం ప్రారంభమైందని, దీనితో ఉన్న పాపానికి తోడు ఈ పాపము కూడా తనకు సోకిందని భావించి, పాప విముక్తి కోసం, పరశురాముడు ఈ క్షేత్రంలో శివుడిని గురించి తపస్సు చేసాడట. పరశురాముడి తపస్సును మెచ్చిన శ్రీకంఠేశ్వరస్వామి పరశురాముడిని అనుగ్రహించాడట.

సమీపంలో శ్రీ ఆదికేశవస్వామిని ప్రతిష్టించి ఆలయం నిర్మించమని సూచించాడట. పరశురాముడు అక్కడ ఈ క్షేత్రం నిర్మించినట్లుగా పడవబ్బాయి చెప్పాడు. అందుకు నిదర్శనంగా నేటికీ పరశురాముడిని కూడా ఈ నంజనగూడు ఆలయంలో దర్శనం చేసుకోవచ్చును.

శ్రీకంఠేశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించిన భక్తులు తర్వాత పరశురాముడిని దర్శించుకోవడం సంప్రదాయం. నంజనగూడులో శ్రీకంఠేశ్వరస్వామి వారి ఆలయం, కపిలానదీతీరంలో తూర్పు అభిముఖంగా విశాలమైన ప్రాంగణంలో, శిల్పకళాశోభితమై దర్శనమిస్తుంది. ఆలయ ప్రధాన ప్రవేశద్వారంపై గోపురం నిర్మింపబడినది. సుమారు నూట పాతిక అడుగుల ఎత్తు కలిగి, ఏడు అంతస్తులతో ఉన్నదీ గోపురం. గోపురం పై భాగంలో ఏడు గోపుర కలశాలు బంగారు రంగుతో సూర్యకాంతికి మిలమిలలాడుతున్నాయి.

ప్రతిష్టింపబడిన ఆ శిల్పకళాశోభకు కనులు మరలటం లేదు. భక్తులను ఆలయానికి ఆహ్వానిస్తూ ఈ గోపురం స్వాగతిస్తున్నట్లుగా దర్శనమిస్తుంది. ఈ గోపుర ద్వారంగుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రధానాలయం కనిపిస్తుంది.

వివిధ మండపాలు, ప్రధానాలయానికి ఎదురుగా ధ్వజ స్తంభం దర్శనమిస్తాయి. అక్కడి నుంచీ పైకి ఆకాశంలోకి చూస్తుంటే బిల్వ పత్రాలతో నిండిన బిల్వవృక్షం కనిపిస్తుంది. కానీ దేవాలయమంతా వెతికినా దాని మొదలు మనకు కనిపించదు. ఇక్కడ అది మహావిశేషంగా ఒక భక్తురాలు చెప్పింది.

ప్రధాన గోపుర ద్వారానికి ఎదురుగా ఆలయం వెలుపల నందీశ్వరుడి పెద్ద విగ్రహం ప్రతిష్టింపబడి ఉంది. అక్కడి విశేషం, చర్మరోగాలు, ఉలిపిరులు మొదలైనవి వచ్చినవారు, ఇక్కడి అర్చకులకు, పచ్చ పెసలు, ఉప్పు దానం చేస్తే ఆ రోగాలు నయమౌతాయని చెబుతుంటారు.

సమీపంలో ఆలయ పుష్కరిణి ఉన్నది. ఆలయానికి దగ్గరలో కపిలానది ఉన్నది. నదీతీరంలో శ్రీ పరమశివుడు ధ్యాన భంగిమలో ఉన్న విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ దర్శనమిస్తుంది. ప్రధానాలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలతో ఉన్న అతి పురాతనాలయం ఇది.

ముఖమండపం, సాలమండపం, ఈ మండపాల్లోని స్తంభాలపై అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు శిల్పాలుగా చెక్కి ఉన్నాయి. శ్రీ వినాయకుడు, శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ నటరాజస్వామి, శ్రీ గిరిజాకల్యాణం, సోమసుందరమూర్తి మొదలైన అనేక మూర్తులు ముఖమండపంలో దర్శనమిస్తాయి. భక్తులు వీటన్నింటినీ దర్శించుకుని వాటికి కూడా పసుపుకుంకుమలతో పూజలు చేస్తారు.

ముఖమండపంలో అనేక శివలింగాలు ప్రతిష్టింపబడి వున్నాయి. పంచభూతలింగాలు, ద్వాదశలింగాలు వంటి అనేక శివలింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి.

ఇక ప్రధాన గర్భాలయంలో నేలమట్టానికి వున్న పానవట్టంపై పరమశివుడు లింగరూపంలో శ్రీకంఠేశ్వరస్వామి పేరుతో కొలువు దీరి ఉన్నాడు. ఆ సుందర మూర్తిని దర్శించవలసినదే గాని మాటలకందని వాడు ఈ స్వామి.

నంజానగూడు స్వామి రథం గురించి వ్రాయాలంటే ఒక గ్రంధమే వ్రాయవచ్చును.
అద్భుతమైన దేవదారు వృక్షము యొక్క చెక్కతో చేసిన అద్భుతమైన చెక్కరథం అది. ఇక్కడ ఇలాంటివి,
మొత్తం మూడు రథాలు ఉన్నాయి.
అద్భుతమైన కార్వింగ్ తో అలరారుతూ ఉంటాయవి.
జగన్నాథుని రథ యాత్రలాగే ఉంటుంది ఇక్కడి రథ యాత్రకూడా. అలాంటి ఆ రథాల పై స్వామిని ఊరేగిస్తారు.
గురువాయూరు లాటి ప్రసిద్ధ క్షేత్రాలలో ఉన్నట్లే ఇక్కడి ఈ స్వామికి ఏనుగుల శాల ఉంది. అక్కడ ఇప్పటికి ఒక భద్రగజం ఉందట.

*****

స్వామివారిని భక్తులు శ్రీ నంజుండేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ పార్వతీదేవి వంటి దేవతామూర్తులను దర్శించుకోవటం మా అదృష్టంగా భావించాము.

ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయానికి సమీపంలో పరశురాముడి ఆలయాన్ని దర్శించవచ్చు. చారిత్రకంగా పరిశీలిస్తే నంజనగూడు శ్రీకంఠేశ్వరస్వామి వారి ఆలయాన్ని క్రీ.శ.365 నుంచి 1000వ సంవత్సరాం వరకు పరిపాలించిన గాంగేయులనే చక్రవర్తులు పాలించిన సమయంలో, ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తూ ఉన్నాయి. తర్వాతి కాలమైన, పదకొండూ, పన్నెండో శతాబ్దాలలో, ‘హోయసాల చక్రవర్తులు’ శిథిలమౌతున్న ఈ ఆలయాన్ని పునర్నిరించారట.

తరువాతి కాలంలో, ‘విజయనగర చక్రవర్తులు’ ఆలయాభివృద్ధికి కృషి చేయడంతోపాటూ, స్వామివారిని సేవించి తరించారట.

ఈ మధ్య కాలంలో, మైసూరు సుల్తాన్ అయిన టిప్పుసుల్తాన్ ఈ స్వామివారిని ‘హకీం సంజుడేశ్వరుడు’ అని పిలిచి ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. టిప్పుసుల్తాన్ ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్న సమయంలో తన పట్టపుటేనుగుకు చూపు కనిపించకుండా పోవడంతో, అతను ఈ స్వామి వారిని ప్రార్థించడంతో చూపు తిరిగి వచ్చినట్లు, అందువల్ల స్వామి వారిని ‘హకీమ్’ (వైద్యుడు) అని పిలిచి ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. తన పట్టపు ఏనుగు కంటిచూపు బాగైన కారణంగా పార్వతీ అమ్మవారి ప్రక్కనే ఒక, నవరత్నాలలోని ‘పచ్చ’తో శివలింగాన్ని ప్రతిష్టించటానికి బహుమతిగా ఇచ్చినట్లు అక్కడి ఆలయం మీద వ్రాసి ఉన్నది.

అక్కడి సర్వాలంకార భూషితయైన పార్వతీ అమ్మవారిని దర్శించాము. అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో ఆమెకు అలంకరించిన ఆ నగల ధగధగలు చూసి తీరవలసినదే, కానీ చెప్పటానికి మాటలు సరిపోవు.

*****

మొదట ఈ నంజనగూడు చేరగానే, నిండుగా ప్రవహిస్తున్న, ‘కపిలానది’ రారమ్మని ఆహ్వానించింది. అక్కడికి చేరుకుని బుట్టలాంటి పడవ (పల్టీ) లో నౌకా విహారం చేసి, సూర్యాస్తమయం దర్శించుకున్నాము. మాతో పాటు అనేకమంది ఆ నదిలో తెప్పల్లా ఠెలుతుంటే ఆ నదీ సౌందర్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ గడిపాము. తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని ఆ ప్రదోష కాలంలో శివదర్శనానికై ఆలయ ప్రవేశం చేసాము.

ప్రతిరోజూ కపిలానది నుంచి ఏనుగు పైన నీటిని తెచ్చి, ఆ నీటితో స్వామివారిని అభిషేకించడంతో నిత్యపూజలు ప్రారంభమవుతాయిట. ప్రతిరోజూ పూజలు, అభిషేకాలు జరుగుతాయట.

నంజనగూడు శ్రీకంఠేశ్వరస్వామి వారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం చాలా విశేషంగా జరుగుతుందని చెప్పుకోవచ్చునుట. కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి నెలా మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయిక్కడ. నంజనగూడులో భక్తులకు వసతి సౌకర్యాలు బాగానే లభిస్తాయి. మైసూరుకు ఇరవైమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంజనగూడుకు మైసూరు నుంచి విరివిగా బస్సు సౌకర్యాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు, గుత్తి, తిరుపతి, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి మైసూరుకు సరాసరి రైలు సౌకర్యాలు కూడా ఉన్నాయి. బెంగళూరు నుంచి మైసూరు చేరుకుని అక్కడి నుంచి నంజనగూడు వెళ్ళవచ్చును.

భక్తసులభుడుగా ప్రసిద్ధిచెందిన నంజనగూడు శ్రీకంఠేశ్వరస్వామిని దర్శించిన మేము, మా కారులో తిరిగి బెంగుళూరుకు ప్రశాంతమైన మనసుతో తిరుగు ప్రయాణమయ్యాము.

***

2. అప్రమేయస్వామి దేవాలయం :

ఈ మధ్య కర్ణాటకలోని దేవాలయాలు, అవి కూడా బెంగుళూర్ చుట్టు ప్రక్కల ఒక వంద, రెండువందల కిలోమీటర్ల లోపు దేవాలయాలు దర్శించాలనుకుంటున్నాను. ఎందుకంటే, బెంగుళూర్ లో ఉన్నాను కనుక.

అందులో భాగంగా ఈ మధ్య మేల్కొటే, మైసూర్, నంజనగూడు, రామనగర్, చెన్నపట్న చూసాను.

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం చెన్నపట్నలోని, ఒకచిన్న పల్లెటూరు, ‘దొడ్డ మల్లూరు’లో కొలువై ఉన్న, ‘అరవిందవల్లీసమేత అప్రమేయస్వామి’ దేవాలయం గురించి.

ఈ ఆలయం బెంగుళూర్ నుంచి మైసూర్ వెళ్ళేటప్పుడు ఆ హైవే మీదనే డెభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నపట్న అనే పట్నం వద్ద ఉన్న ఒక గ్రామంలో ఉన్నది.

ఈ దేవాలయంలో ఉన్న స్వామికి నవనీత చోరుడని, అంబేగళు అంటే పాకే, పారాడే కృష్ణుడని పేర్లున్నాయి. ప్రధానంగా మాత్రం అప్రమేయస్వామి అనే అంటారు.

ఈ ఆలయం ఉన్న చెన్నపట్న కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిచెందినది. పూర్వకాలం మనం చూసే కొయ్యగుర్రం, కొయ్య ఉయ్యాల, దశావతారాలు, వృద్ధ దంపతులు మొదలైన ఎన్నో బొమ్మలు కనువిందు చేస్తుంటాయి.

కర్ణాటకలోని కన్నడీగులు తమ ఇళ్లల్లో జరిగే వివాహాలలో సంప్రదాయ ప్రకారం పెళ్లికూతురికి, వృద్ధ దంపతుల కొయ్య బొమ్మల సెట్టు పెళ్లి బహుమతిగా ఇచ్చి అత్తవారింటికి పంపిస్తారట. పెళ్లికూతురు, ఆ బొమ్మలను ప్రతీ సంవత్సరం బొమ్మల కొలువులో పెట్టుకుంటుందట. అది ఒక సంప్రదాయమని, నా కన్నడ స్నేహితురాలు చెప్పింది.

****

ఇక చెన్నపట్న దాటి దొడ్డ మల్లూరులో ఉన్న దేవాలయానికి వచ్చాము. దేవాలయాన్ని చూడగానే అతి పురాతన దేవాలయమని తెలుస్తున్నది. ఎత్తైన శిఖరాలు, పెద్దపెద్ద చెక్క దర్వాజాలు, స్వామివారి గోపురమూ, లోపలి వెండి వాకిలి గుమ్మంపైన, నల్లరాతి దశావతారం బొమ్మలతో అతి సుందరంగా ఉన్నది. లోపల విశాలమైన మంటపాలున్నాయి. కానీ మేము వెళ్లేసరికి గుడి మూసివేస్తూ ఉన్నారు.

లోపల శ్రీమహావిష్ణువు నాలుగు చేతులతో, ఒకచేత గద, రెండవ చేత కమలం, మరో రెండు చేతుల్లో శంఖు, చక్రాలతో హృదయంలో లక్ష్మీదేవితో దర్శనమిచ్చాడు. మరొక ప్రక్క అరవిందవల్లీసమేత అప్రమేయస్వామి అద్దంలో దర్శనమిచ్చాడు.

వెనుక ఉపాలయాలలో ఆంజనేయస్వామి, రామానుజ స్వామి ఉన్నారట. అలాగే పాకే నవనీత చోరుడి మూర్తి కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇక్కడి నవనీతస్వామి (పారాడే కృష్ణుడి) దర్శనం చేసుకుంటే, పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారనే నమ్మకమట. అందుకోసం ఇక్కడ ఊయల కడతామని మొక్కుకుంటారట. అలా మొక్కిన దంపతులు, తిరిగి వారి కోరిక ఫలించి అక్కడ కోరికలు తీరిన సంతోషంతో శక్తి కొలది కొయ్యది గానీ, వెండిది గాని ఊయల కడతారట.

ఈ మధ్యవరకూ పెద్ద చెరువు, దాని నిండా అరవిందాలు ఉండేవట. అందుకే అక్కడి అమ్మవారి పేరు అరవిందవల్లియట.

ఇక ఉత్సవాలప్పుడు ఊరేగించే వాహనాలు, రథాలు, పల్లకీలతో పురాతనమైన ఆలయమని తెలుస్తోంది. ముఖ్యంగా హనుమంతప్ప వాహనం భలే బావుంది.

ఇంకొక ముఖ్యవిషయం, కన్నడ కీర్తనలు ఎన్నో రచించిన కన్నడ వాగ్గేయకారుడైన శ్రీ పురందరదాసు తన అపురూపమైన కీర్తన, బహుళ ప్రాచుర్యం పొందినది, ఇక్కడ స్వామి ముందే రచించారట.

ఆ కీర్తన, ‘ ‘జగదోద్ధారణ అడిసిదళు యశోదా’ అనే కీర్తన అది. ఇక్కడ ఉన్న బాలకృష్ణుడిని కీర్తిస్తూ, రచించారట. ఈ ఆలయంలోని మూలమూర్తి, ‘అప్రమేయస్వామి’ కనుక ఆయనను కీర్తిస్తూ, అణోరణీమీయన మహాతో మహీయన… అప్రమేయన… అడిసిదళ యశోదా’ అని ఒక చరణంలో కీర్తించాడట. ఆ కీర్తనను మన MSM అమ్మ పాడగా మనమందరం విని ఉన్నాము.

ఈ ఆలయంలో, ప్రతీ ఏకాదశి, కార్తీకమాసం, ధనుర్మాసం, సంక్రాంతి చాలా బాగా జరుపుతారట.

ఈ ఆలయం, ఉదయం 7.30 నుంచి, మధ్యాహ్నం 12.30 వరకు, సాయంత్రం 4.00 నుంచి రాత్రి 8.15 వరకూ తెరచి ఉంటుంది. హారతి అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది.

మేము వెళ్లినరోజు వెన్నముద్దలా చేసిన పెరుగన్నం ముద్ద, పూర్తి నెయ్యి, జీడిపప్పు వేసిన రవ్వకేసరి పెట్టారు. అవి, చాలా రుచికరంగా ఉన్నాయి.

మధ్యాహ్నం మహానైవేద్యానంతరం పులిహోర, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు పెడతారట.

నాలాంటి ప్రసాదం భక్తులైతే, ఆసమయంలో వెళ్లొచ్చని ఇలా వ్రాస్తున్నాను.

అలాంటి ఈ పురాతన దేవాలయం ఎప్పుడైనా బెంగుళూర్ మైసూర్ హైవే మీద ప్రయాణం చేస్తుంటే ఒక గంట సమయం చేస్తూ ఉంటే, తప్పకుండా దర్శించి తీరాల్సిందే!

******

1 thought on “నంజనగూడు, దొడ్డమల్లూరు ఆలయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *