April 19, 2024

పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు

రచన: డా. వివేకానందమూర్తి

“మళ్లా కొత్త జావా కొంటావా?” అని అడిగితే “నాకు జావా వొద్దు. ఇండోనేషియా వద్దు. ఊరికే ఇచ్చినా పుచ్చుకోను” అని ఖండితంగా చెప్పేశాడు.

* * *

అవాళ అర్జంటు పనిమీద జావా మీద అర్జంటుగా అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి రాజమండ్రికి బయల్దేరాడు చెన్నకేశవ.
చీకట్లో కొన్న బండి చీకటిని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రయాణం చేస్తోంది. కాని చీకటిని ఎవరు చీల్చగలరు? ఎందుకు చీల్చుదురు? చీకటి చీలిపోతే చీకట్లో బతికే దౌర్భాగ్యులకు బతుకు తెల్లారిపోదూ. చెన్నకేశవ జావాని బ్లాకులో కొన్నందుకు విచారించలేదు. అందమైన జావా అంటే అతనికి చాలా ఇష్టమేసి బ్లాకులో అమ్మినవాణ్ణి ముష్టి పీనుగుని చూసినట్టు చూసి, డబ్బు పారేసికొన్నాడు. అప్పుడు ఆ చూపులు ఏది కలిసి అమ్మినా వాడికి శాపంలా తగిలి వాణ్ణి శనిలా పీడిస్తున్నాయి అనుకున్నాడు. అలా అమ్మినవాణ్ణి శనికీ, శాపానికి అప్పచెప్పేసి చెన్నకేశవ తన జావా తను తెచ్చేసుకున్నాడు.
ఎర్రటి జావా మీద ఏపుగా వున్న చెన్నకేశవ ఎంచక్కా వున్నాడు. అరేబియా గుర్రం మీద అందమైన రాజకుమారుడు స్వారీ చేస్తున్నట్టు, ఆంధ్ర ప్రేక్షకుల మీద అపరకృష్ణుడు స్వారీ చేస్తున్నట్టు బరువుగా, స్పీడుగా, జాలిగా జావా మీద చెన్నకేశవ దూసుకుపోతున్నాడు.
అనకాపల్లి రాగానే ఒరేయ్ అని కేక వినబడింది. ఆపి చూస్తే గోపి. చెన్నకేశవ క్లాస్ మేట్.
రాజమండ్రిగా నేనూ వస్తాను. వెనకాల ఎక్కాడు. “నేను మధ్యాహ్నం వచ్చి పనుండి ఆగిపోయాను. ఏదైనా లారీలో పోదామని చూస్తున్నాను. లక్కీగా నువ్వే తగిలావు. పోనీ” అన్నాడు.
జావా కదిలింది.
యిటూ అటూ నల్లటి చెట్లు. దూరంగా నల్లటి కొండలూ, చీకటికి తాము భయపడి పౌరులను భయపెడుతున్నట్లు కనిపిస్తున్నాయి.
వారి దీపాల వెలుగు ధాటికి సరిపోవడం లేదు. రోడ్డు రెండెడ్ల బళ్ళు, లారీలు అప్పుడప్పుడు ఎదురపడి వెళ్ళిపోతున్నాయి.
నిర్మానుష్యంగా చీకట్లో చంపి పడేసిన సర్పంలా వుంది రోడ్డు.
గోపీకి భయంగా వుంది. చెన్నకేశవ మాట్లాడ్డం లేదు. వెనకాల కూర్చున్న గోపీ గుండెలు భయంగా బెదరడం చెన్నకేశవకి వీపుమీద తెలుస్తోంది. చెన్నకేశవకు భయం ఎలా వుంటుందో ఎప్పుడూ తెలీదు. భయపడేవాళ్ళని చూస్తే వాళ్ళని యింకా భయగ్రస్తులని చేయాలని అతనికి సరదా వేస్తుంది. యిప్పుడు కూడా వేసింది.
“ఏరా గోపీ భయంగా వుందా”
“మరే”
“కథ చెప్పనా”
“ఊం “
“సరిగ్గా నెల్లాళ్ళ క్రితం నేను యిదే జావా మీద యిలాగే యిలాంటప్పుడే వెళ్తున్నాను. అదుగో ఆ ఎదురుగా మలుపులోవున్న మర్రిచెట్టు దగ్గర ఓ పాతికేళ్ళ వ్యక్తి నీలాగే పాంటూ, షర్టూ వేసుకుని కనిపించాడు. యిదుగో యిక్కడే రోడ్డు కడ్డంగా నిలబడి ఆపమని చెయ్యి చూపించాడు. దొంగేమోనని అనుమానం వేసింది నాకు. అయినా నన్నేం చేయ్యగలడులే అని ఆపాను. “సార్, నాక్కాస్త లిఫ్టిప్పించండి. తునిలో దిగిపోతాను. చాలా అర్జంటు. అనుకోకుండా ఇక్కడ చిక్కడిపోయాను”. అని రిక్వెస్ట్ చేశాడు. సరే అన్నాను. వెనకాల ఎక్కాడు. బండి స్టార్టు చేశాను. అతనికి నీలాగే భయం జాస్తి. ఏదైనా కథ చెప్పమన్నాడు. దెయ్యం కథ ఒకటి చెబ్దామనిపించింది. కానీ నాకేమీ జ్ఞాపకం లేదు. నేనే ఫ్రేమ్ చేశాను. చెప్పడం మెదలు పెట్టా. “మీలాగే ఎవరో ఒక అందమైన ఆడమనిషి” “బలేవారే. నేను అడమనిషిని కాదు”. అతను నవ్వాడు. ఓ పక్కన భయపడుతూనే, వినండి మరి సరిగ్గా నెలరోజుల క్రితం మీరు నిలబడిన చెట్టు దగ్గర నిలబడి నన్ను ఆపుచేసి తుని వరకు లిఫ్ట్ అడిగింది”.
అంతా వుత్తిదే. చాలాసార్లు అలాగ అందమైన అమ్మాయెవరైనా అయితే అర్ధరాత్రి ఆపుచేసి లిఫ్ట్ అడిగితే బాగుణ్ణనుకునేవాణ్ని. అంచేత అదే నిజంలా చెప్పా.
సరే లిఫ్ట్ ఇచ్చి స్టార్ట్ చేశాను. ఆమె వక్షోజాలు మెత్తగా నా వీపుకి తగుల్తున్నాయ్. నా గుండెలు వెనక్కి తిరిగాయి. వేగం పెంచాను. ఆమెకి భయం, వుత్సాహం రెండూ కలిగాయి. రెండు చేతుల్తో నన్ను వాటేసుకుంది. వెనక నుంచీ యన్టీరామారావులా –
అంతా వుత్తిదే. అలా జరిగితే బాగుణ్నని నేను చాలా సార్లు అనుకున్నా. అదే నిజంలా చెప్పా.
“మీరు బాగా డ్రైవ్ చేస్తారు” అని మెచ్చుకుంటూ కిలకిలా నవ్వింది. ఆమె పళ్ళు ముత్యాల్లా మెరిసివుంటాయి లెండి. “అయితే నాతో రాజమండ్రి వచ్చేయకూడదా, రెండ్రోజులుండి మళ్ళా తిరిగొద్దాం” అన్నాను. “అమ్మో” అంది. “ఏం?” అన్నాను. “అక్కడ ఎక్కడ వుంటాం!” అంది.
“హోటల్లో” అన్నా! “అయితే రెండు రోజుల తర్వాత మరి నన్ను మర్చిపోతారా! అంది. “మర్చిపోను” అన్నా “మరి తర్వాత ఎలా ఉండగలరు? అనడిగింది. “మీలాగే” అన్నా. “నేనుండలేను” అంది. “నేనూ అంతే” అన్నా. “మరెలాగా?” అంది. “ముందు రాజమండ్రి వచ్చేయండి. అక్కడ ఆలోచిద్దాం అన్నా”. “అలాగే” అంది. నా మనస్సు అనుకోకుండా అర్థరాత్రి లభించిన అప్సరసతో అనుభవాన్ని వూహించుకొంటూ గంతులు వేసింది. వేగం హెచ్చించాను. చూడండి. యిక్కడికి సరిగ్గా రెండు ఫర్లాంగుల్లో చిన్న చెరువొకటి వస్తుంది అక్కడి కొచ్చేవరకు ఏం మాట్లాడుకోలేదు. ఇదుగో సరిగ్గా యిక్కడే నేను తలతిప్పి చూశాను. ఆమె నా వెనుక సీట్లో లేదు. అదృశ్యమైంది. అరెరె పేరేనా అడగలేదే అనుకున్నాను. నాకు దెయ్యమేమోనని అనుమానం, అనుమానం ఏమిటి. నిజమే. ముమ్మాటికీ దెయ్యమే. దెయ్యానికి పేరేమిటి చెప్పండి.
అని వెనక్కి తిరిగాను. అంతే ఆ చెరువొచ్చింది. నావెనకాల కూర్చున్న అరిచిత వ్యక్తి కూడా కనిపించలేదు. అంతే అతని పేరు కనుక్కోనందుకు నేనేం బాధపడలేదు. అంత సేపూ దెయ్యానికి దెయ్యం కథ చెప్పేనా! అని మాత్రం అనుకున్నాను. ఎలా వుందిరా గోపీ కథ. యిదుగో సరిగ్గా యిదే చెరువు, యిదేరా చూడు. చెన్నకేశవ తలతిప్పాడు. ఆశ్చర్యం. అతని వెనకసీట్లో గోపీ లేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *