April 19, 2024

భావ కాలుష్యం

రచన: వసంతరావు నాగులవంచ

కాలుష్యాలు నానా విధములు. భౌతిక కాలుష్యం కంటే భావ కాలుష్యం మిక్కిలి ప్రమాదకరమైనది. మానవుని ఆలోచనా విధానంలో వ్యతిరేక భావాలు చోటుచేసుకున్నప్పుడు మనసు మాలిన్యమౌతుంది. తత్ఫలితంగా వచ్చే ఫలితాలు కూడా చెడ్డగానె ఉంటాయి. జరుగవలసిన పనికూడా సక్రమంగా జరుగదు.
మనసుకు శరీరానికి అంతులేని అవినాభావ సంబంధం ఉంది. మనసు తేలికగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడు శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై శరీరాన్ని ఆరోగ్యవంతంగా, కర్మలను చేయడానికి మిక్కిలి అనుకూలంగా ఉంచుతుంది. భావాలు వ్యతిరేకమైనప్పుడు శరీరం వ్యాధుల పాలవుతుంది. అంతులేని ఇబ్బందులకు గురిచేస్తుంది.
మానవుడు తన మనసును అదుపులో పెట్టుకోవడం ఆత్యంత ఆవశ్యకమైనది. ఒక్కసారి చెడు ఆలోచన మనసులోకి వస్తే దాని పరిణామాలు విపరీత దుష్పరిణామాలకు దారితీస్తుంది. మానవ జీవిత గమనాన్ని మార్చివేసి అనేక బాధలకు గురిచేస్తుంది. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. సభ్య సమాజంతో సత్సంభందాలను దూరం చేస్తుంది. మనుష్యుల మధ్యన అపోహలను సృష్టిస్తుంది. తద్వారా శాశ్వత శత్రుత్వాన్ని పురికొల్పుతుంది.
భావ కాలుష్యం సమాజ తీరుతెనులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి పథం నుంచి అధోగతిపాలు చేస్తుంది. చక్కగా సాగాల్సిన సమాజ పురోగతికి అడ్డుగా నిలుస్తుంది. మనుష్యుల మధ్యలో మనస్ఫర్ధలు సృష్టిస్తుంది. సమాజ నిర్మాణానికి వెన్నెముక యైనంటువంటి ఐకమత్య భావనను అంతరింపజేస్తుంది.
చరిత్రలో మహా ఉద్దండులు, సకల శాస్త్ర కోవిదులు మనసును అదుపులో పెట్టుకోలేక, అనేక దుర్వ్యసనాలకు లోనై, జీవితాలను భ్రష్ఠుపట్టించుకొని చారిత్రహీనులైన సంఘటనలు కోకొల్లలు. తద్వారా తాము నష్టపోవడమే కాకుండా సమాజంలో చెడు వాతావరణాన్ని వ్యాపింపజేయడానికి కారకులైనారు. భావ కాలుష్యం ఎంతకెంతకు పెరిగితే భౌతిక అభివృద్ధి అంతకంతకు దిగజారిపోతోంది. మానవ సమాజ నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తుంది.
సానుకూల భావనే సమాజ సర్వతోముఖాభివృద్ధికి శ్రీరామ రక్ష. మానవ జీవితంలో అరుణోదయ కాంతులకు ఆలవాలం. జీవన రణరంగంలో విజయం సాధించే పాశుపతాస్త్రం. ఎదుటివారి మనసును దోచే వశీకర మంత్రం. సద్భావనా స్రవంతులే మానవ జీవితాన్ని పరిఢవిల్లజేసే హరివిల్లులు. మనవాభ్యున్నతికి, మహిలో మహత్తర యశోకాంతులను విరజిమ్మే తారాజువ్వలు. మనసుకు సాంత్వననిచ్చే వింజామరలు.

1 thought on “భావ కాలుష్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *