April 16, 2024

సాఫ్ట్‌వేర్ కధలు – కలేపా – కోతిమీ

రచన: కంభంపాటి రవీంద్ర

స్టాండ్ అప్ కాల్ లో, విశాలి తన టీం చేసిన టాస్క్ స్టేటస్ వివరిస్తూండగా సన్నగా వినిపించిందా ఏడుపు .
‘‘జస్ట్ ఎ మినిట్” అని వీడియో ఆఫ్ చేసి, కాల్ మ్యూట్ లో పెట్టి ‘‘మురళీ .. అనన్య ఏడుస్తున్నట్టుంది .. కొంచెం చూడు .. ఇక్కడ స్టాండ్ అప్ కాల్ లో బిజీగా ఉన్నాను” విశాలి గెట్టిగా అరిచింది
‘‘ఏడుస్తున్నది అనన్య కాదు అలేఖ్య .. నేను కూడా మా రెవెన్యూ ప్రొజెక్షన్ కాల్ లో బిజీగా ఉన్నాను .. నువ్వే మేనేజ్ చెయ్యి” అంతే గెట్టిగా బదులిచ్చేడు మురళి !
చాలా ఫ్రస్ట్రేషన్ తో మళ్ళీ కాల్ లో జాయిన్ అయ్యి , ఆదర బాదరాగా స్టేటస్ వివరించి , లాగాఫ్ అయ్యి , పక్క గదిలోకి పరిగెత్తింది విశాలి .
ఆ రోజు ఉదయం పిల్లలిద్దరికీ పెట్టిన ఇడ్లీలని ఒకళ్ళ మొహాలకి ఒకళ్ళు పూసేసుకుని కొట్టేసుకుంటున్నారా కవలలు అలేఖ్య , అనన్య! పిల్లల అల్లరి, వాళ్ళకి తను టైం కేటాయించలేని పరిస్థితి , పక్క నుంచి ఆఫీస్ ప్రెషర్ ఇవన్నీ తల్చుకుంటే , ఏడుపొచ్చేసింది విశాలికి !
మూడేళ్ళు నిండాయా పిల్లలిద్దరికీ. వాళ్ళని చూసుకోడానికి అటు మురళి వాళ్ళ వైపు నుంచి ఎవరూ రాలేదు. తన తల్లికి వీలవుతుంది కానీ ఇక్కడ నెల కన్నా ఎక్కువ ఉండలేదు , అక్కడ ఊళ్ళో ఆవిడకి ఇంకా కుటుంబ బాధ్యతలున్నాయి.
క్రితం ఏడాదే , కొత్త ఫ్లాట్ కొన్నాడు మురళి, రెండున్నర కోట్లు పెట్టి . దానికి వుడ్ వర్క్ ఇంకో ముప్పై లక్షలు ఖర్చుపెట్టేరు . దాంతో ఇద్దరి జీతాల్లో సగానికి పైగా ఆ అప్పు తాలూకా ఈఎమ్మై కట్టడానికే పోతుంది . కాబట్టి విశాలి కొంతకాలం పిల్లల్ని చూసు కోడానికి ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకునే ఛాన్సే లేదు ! ఇంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి , ఎలాగోలా నెట్టుకొచ్చేరా దంపతు లిద్దరూ . ఇప్పుడు కొత్తగా ఆఫీస్ కి వచ్చి పని చెయ్యమని చెప్పేసేరు, ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలా అని ఆలోచనలో పడింది విశాలి .
ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు , మురళితో ఈ విషయం కదిపింది .
‘‘రేట్లు పెరిగిపోయేయి.. ఇప్పుడు ఇద్దరినీ డే కేర్ లో పెట్టాలంటే, నెలకి కనీసం పాతిక వేలు అవుతుంది .. వేరేదేదైనా ఆలోచించాలి” సాలోచనగా అన్నాడు మురళి
‘‘నాకో ఐడియా వచ్చింది .. మన పనిమనిషి యాదమ్మకి కొంచెం ఎక్కువ డబ్బులిచ్చి మనం ఆఫీస్ కి వెళ్ళే టైములో మన ఇంట్లోనే ఉండి , పిల్లల్ని చూసుకోమంటేనో ?” అంది విశాలి
‘‘గుడ్ ఐడియా … ఇప్పుడు మనం తనకి నెలకి మూడు వేలు ఇస్తున్నాం కదా .. ఇంకో ఐదు వేలు ఆఫర్ చేద్దాం ..” అన్నాడు మురళి .

*****

ఆ రోజు సాయంత్రం గిన్నెలు కడగడానికి యాదమ్మ వచ్చినప్పుడు , విశాలి అడిగింది , ‘‘మేమిద్దరం ఆఫీస్ కి వెళ్ళేక మా ఇంట్లోనే ఉండి , పిల్లల్ని చూసుకోగలవా ?”
‘‘కానీ అమ్మా … మరి నాక్కూడా వేరే పనులుంటాయి .. డబ్బులు సరిపోక , మా ఇంటి దగ్గర రోజూ కూరలు కూడా అమ్ముతూంటాను” యాదమ్మ చెప్పింది
‘‘కూరలమ్మగా నీకు నెలకి ఎంత మిగుల్తుంది ?”
‘‘ఖర్చులు పోనూ ఆరు వేలు మిగుల్తుందమ్మా” చెప్పింది యాదమ్మ
‘‘ఆ ఆరు వేలూ నీకు నేనిస్తాను .. మా ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటావా ? శనాదివారాలు అక్కర్లేదు .. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి” అడిగింది విశాలి
ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది యాదమ్మ , ‘‘కానీ .. మీ ఇల్లంతా నాకు అప్పగించేసి , మీరిద్దరూ ఆఫీస్ కి వెళ్ళిపోవడం మంచిది కాదమ్మా ‘‘ ‘‘ఫర్వాలేదు .. హాలు , కిచెన్ , పిల్లల గది నీకు వదిలేస్తాము .. మిగతా గదులు లాక్ చేసుకుంటాము” అంది విశాలి.
‘‘ఓసారి మా ఇంట్లో మాటాడి చెబుతానమ్మా” అని చెప్పిన యాదమ్మ, మర్నాడు ఉదయం పన్లోకి వచ్చినప్పుడు చెప్పింది, పిల్లల సంగతి నేను చూసుకుంటానని .
మురళికి, విశాలికి చాలా సంతోషమేసింది . అలేఖ్య , అనన్య ఇద్దరూ యాదమ్మతో బాగానే కలిసిపోతారు కాబట్టి , తనతో రోజంతా గడపగలరు అనే నమ్మకం ఉంది.
ఆ తర్వాత రెండు వారాలకి ఆఫీస్ కి వెళ్ళడం మొదలెట్టేరా ఇద్దరూ . అన్ని పన్లూ త్వరగా ముగించుకుని, ఆరున్నర, ఏడు గంటలకల్లా ఇంటికి వచ్చేసేది విశాలి . యాదమ్మతో పిల్లలిద్దరూ హుషారుగా ఆడుకుంటూ కనిపించేవారు, చాలా సంతోషంగా అనిపించేది విశాలికి .
‘‘ఇప్పుడు వీళ్ళని ఎవరు చూసుకుంటారు అనే టెన్షన్ తీరిపోయింది.. ఇంకొక్క టెన్షన్ ఏమిటంటే .. ఇద్దరికీ మాటలు ఇంకా రాలేదు .. అవి కొంచెం వస్తే , వాళ్ళని ఏదో ఒక ప్లే స్కూల్ లోనో జాయిన్ చెయ్యొచ్చు ‘‘ అంది మురళి తో
‘‘అవును .. కానీ ఈ మధ్య చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూంది .. ఇద్దరూ ఏదో మాట్లాడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు ‘‘ అన్నాడు మురళి
‘‘నిజమే .. రోజంతా యాదమ్మతో ఉంటున్నారు కదా .. ఏవో మాటలు నేర్పిస్తున్నట్టుంది ‘‘ అంది విశాలి

*****

శనివారం ఉదయం ఏడింటికే మెలకువ వచ్చేసింది విశాలికి . సాధారణంగా సెలవు రోజు కాబట్టి , కొంచెం ఎక్కువసేపు పడుకోడానికి ఇష్టపడుతుంది, కానీ పిల్లలు ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు గెట్టిగా అరుచుకుంటున్నారు , ఆ దెబ్బకి లేవాల్సి వచ్చింది. హాల్లోకి వచ్చి చూస్తే , ‘‘కోతి మీ” అని అనన్య అరిస్తే , ఇంకా గట్టిగా ‘‘కలేపా” అని అలేఖ్య అరుస్తూంది !
ఇద్దరినీ ఊరుకోబెట్టి , పళ్ళు తోమించి , పాలు కలిపిచ్చింది వాళ్ళకి . అప్పుడే లేచిన మురళి హాల్లోకి వస్తే , ‘‘వాళ్ళ ఫస్ట్ వర్డ్స్ .. కోతిమీ .. కలేపా ‘‘ అంది విశాలి నవ్వుతూ !
మురళి భలే సంబరపడిపోయి , ఆ రోజంతా పిల్లలిద్దరినీ ఎత్తుకుని , మళ్ళీ మళ్ళీ అనిపించుకున్నాడా మాటల్ని !
ఆ తర్వాత వారం , తన కొలీగ్ సొనాల్ అనే అమ్మాయి చెప్పింది , ‘‘ఇంట్లో మీరు సీసీ టీవీ పెట్టించుకోవచ్చు కదా .. అప్పుడు హాయిగా పిల్లలు ఏం చేస్తున్నారో , మీరు మీ మొబైల్ లోనే ట్రాక్ చెయ్యొచ్చు !’”. నిజమే కదా అనిపించి , వెంటనే మురళి కి ఫోన్ చేసి చెబితే , ‘‘యాదమ్మ మంచిదే అనుకో అయినా ఫ్లాట్ లో సేఫ్ సైడ్ సీసీ టీవీ పెట్టించడం మంచిదే” అన్నాడు
‘‘సోనల్ వాళ్ళ ఫ్రెండ్ ఈ బిజినెస్ లో ఉన్నాడట.. ఇవాళ ఈవెనింగ్ ఫోర్ కి మనం ఇంట్లో ఉంటే , అతను వచ్చి ఇవాళే పెట్టేస్తాడట” అంది విశాలి
‘‘మరి ఇంకేం !.. ఇవాళ కొంచెం ఎర్లీ గా నువ్వు” అని మురళి అంటూంటే , ‘‘తెలుసు .. మీకు కుదరదని .. నేనే వెళ్తాను లెండి” అని ఫోన్ పెట్టేసింది విశాలి !
టైం చూసుకుంటే మూడు కావొస్తూంది , ఇంకాస్సేపట్లో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళని డ్రాప్ చెయ్యడానికి షటిల్ బస్ స్టార్ట్ అవుతుంది . ‘‘వెంటనే తన మేనేజర్ కి చెప్పేసి, గబగబా షటిల్ ఎక్కి ఇంటికి బయల్దేరింది .
తనుండే టౌన్ షిప్ కి ఓ కిలోమీటర్ దూరంలో డ్రాప్ చేస్తుందా షటిల్ . అక్కడ దిగి గబగబ ఇంటికి నడుస్తూంటే , లీలగా వినిపించాయా మాటలు. ఒక్కసారి ఆగి , మళ్ళీ వినడానికి ప్రయత్నించింది . అవే మాటలు దూరం నుంచి లీలగా వినిపిస్తున్నాయి . కంగారుగా అటువైపు నడుస్తూంటే , ఇంకొంచెం గెట్టిగా వినపడ్డాయి . ఇంకాస్త కంగారుగా పరిగెడితే , యాదమ్మ ఇంటి ముందున్న కూరల బండి మీద కూచుని, ‘‘కలేపా .. కోతి మీ ‘‘ అంటూ కరివేపాకు , కొత్తిమీర అమ్ముతూ కనిపించేరా అనన్య , అలేఖ్య . వాళ్ళిద్దరి వెనక కూచుని , తీరిగ్గా మొబైల్ లో టీవీ సీరియల్ చూసుకుంటోందా యాదమ్మ !

*****

3 thoughts on “సాఫ్ట్‌వేర్ కధలు – కలేపా – కోతిమీ

  1. Kottimee story chala Baga narrate chesaru
    Ee software yugamlo tallidandrulaku tappavu ee kastalu
    Cc camerala sayam to chala Baga chusukovacchi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *