April 23, 2024

ఆట పట్టింపు

రచన: ప్రకాశ లక్ష్మి

వేణూ, వనజా అన్నా చెల్లెళ్ళు. వనజకు పది సంవత్సరాల వయస్సులో వారి తల్లిదండ్రులు ఒక బందువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్ళి వస్తూ వుండగా జరిగిన యాక్సిడెంట్లో మరణించారు.
అప్పటికే వేణూ పెళ్లి అయ్యి జాబ్ చేస్తున్నాడు. వేణూ భార్య రాధ మంచి అణుకువ గల పిల్ల. అడపడచు రాధను చాలా ప్రేమగా చూసుకొనేది.
కానీ వేణూ ఇంకా గారాబంగా చూసుకొనేవాడు. దాంతో వనజకు పెంకితనం, ముక్కోపం అలవాటు అయింది. అలా అని చదువులో ఏమీ వెనుక పడలేదు.
డిగ్రీ చదివి బ్యాంకు జాబ్ చేస్తున్నది. ఆమెకు పెళ్లి చేయాలని వేణూ ఆలోచన. కానీ నేరుగా ప్రస్తావన తెస్తే ఆమె ఎక్కడ “నో” అంటుందో అని బెరుకు.
రాధ తమ్ముడు మురళి “యు. ఎస్”లో జాబ్ చేస్తూ సెలవలకు ఇండియా వచ్చాడు. ఇద్దరికీ ఈడూజోడూ బాగుంటుంది అని, రాధ గురించి తెలిసినవాడు
కనుక ఎడ్జస్ట్ అవుతాడని, వేణూ. రాధ అనుకొని అతని అభిప్రాయం తెలుసు అనుకొన్నారు.
రాధ తమ్ముడిని”మురళీ . . . నువ్వు మా వనజను పెళ్లి చేసుకొంటావా!? ఎందుకంటే మీ ఇద్దరూ జంటగా బాగుంటారు, నీ ఒపికకు, ఆమె కోపానికి సరిపోతుంది.
నీ అభిప్రాయం తెలుసుకుని అమ్మానాన్నలకు చెపుతాను”అన్నది.
అప్పుడు మురళీ “చిన్ననాటి నుంచి తెలిసిందేగా అక్కా! ప్రథమ కోపం, మనస్సులో ఏమీ ఉండదు. ప్రాంక్ గా ఉంటుంది, కానీ. . . నేనంటే ఇష్టమో లేదో, కనుక్కోండి”అన్నాడు.
మళ్లీ మురళీనే “రేపు మీరు ఏదో ఫంక్షన్ కు వెళతారుగా, . . . అప్పుడు నేనే ఒక లెటరు ఇచ్చి అభిప్రాయం చెప్పమంటా, ! అప్పుడు చూడాలి అమ్మగారి కోపం” అని చిలిపిగా నవ్వాడు.
అలాగే వనజా ఆఫీస్ నుంచి రాగానే ప్రెషప్ అయ్యాక, మురళీ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి, “ఈ లెటర్ చదివి నీ అభిప్రాయం చెప్పు” అని లెటర్ ఇచ్చి పిల్లిలా బయటకు వెళ్ళాడు.
ఇది చూసి తోక తొక్కిన త్రాచులాగా అయి, అన్నావదినలు బయటనుండి రాగానే, కారు దిగీదిగకముందే “ఏమిటి!?. . వదినా మీ తమ్ముడి పని? మీరు చెబితే నేను ఏనాడైనా కాదన్నానా!? నాకు లెటర్ ఇచ్చి నా అభిప్రాయం చెప్పమన్నాడు” అని రుసరుసలాడింది.
అప్పుడు వేణూ “అందులో ఏమి వ్రాసాడో. . . చదివినావా!? ఓపెన్ చేసీ, చూసీ చెప్పు” అన్నాడు.
అప్పుడు వనజా ఆ లెటర్ తెరిచి చూస్తే “ఏప్రిల్ ఫూల్” అని రాసి ఉంది. అప్ఫుడు వనజకు గుర్తుకు వచ్చింది, ఆ రోజు “ఏప్రిల్ ఫస్ట్”అని తన ఆవేశానికి సిగ్గుపడింది వనజా. అందరూ నవ్వుల్లో మునిగితేలారు. అలా చెప్పకనే మురళితో వివాహం ఇష్టం అని చెప్పింది.

సమాప్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *