March 29, 2024

గోపమ్మ కథ – 3

రచన: గిరిజారాణి కలవల

ఆ రోజు మా ఇంట్లో పనికి గోపమ్మ రాను అని కబురు చేసింది కాబట్టి… నాకు ఆలోచించుకుందుకి కాస్త సమయం దొరికింది.
లక్ష్మి దొరికిన పిల్లే అయినా తన స్వంత కూతురులాగే పెంచింది గోపమ్మ. ఏదో డబ్బు వస్తుందన్న ఆశతో, నా మాట మీద నమ్మకంతో హైదరాబాద్ పంపింది. ఇప్పుడు లక్ష్మి కనపడ్డం లేదంటే ఎలాంటి గొడవ చేస్తుందో అని నాకు ఆందోళన కలిగింది. ఇందులో నా తప్పు లేదు.. హైదరాబాద్ లోని నా స్నేహితురాలు తప్పూ లేదు… తనంతట తనే లక్ష్మి ఇంటినుంచి వెళ్ళిపోయింది. అయినా సరే మేము సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి కలిగింది. ఎలారా? భగవంతుడా? అని తలపట్టుకుని కూర్చున్నాను.
హైదరాబాద్ నుంచి నా స్నేహితురాలు కూడా గంటకి ఒకసారి ఫోను చేస్తోంది. లక్ష్మి ఏమైనా మీ ఊరికి కానీ వచ్చేసిందా? అంటూ…
తను చాలా బాగా చూసుకున్నాననీ, మంచి బట్టలు,గాజులు,చెప్పులు అన్నీ కొనిపెట్టాననీ, తిండికి కూడా లోటు చేయలేదనీ..ఇన్ని చేసినా కూడా, తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే..ఎలా? అసలు ఎలా వెళ్ళిందో, ఎక్కడకి వెళ్ళిందో, ఎలాంటి పరిస్థితుల్లో వుందో తలుచుకుంటూంటే గుండె దడదడ లాడిపోతోందని ఏడుపు స్వరంతో మాట్లాడసాగింది. ఇక్కడ ఇంచు మించు నాదీ అదే పరిస్థితి.
ఇప్పుడు రాకపోయినా, సాయంత్రం పనికి వస్తుంది గోపమ్మ. వచ్చాక లక్ష్మితో మాట్లాడాలని వుంది, ఫోను చేయమంటే, నేనేం సమాధానం చెప్పాలి? ఒకరోజు దాచిపెట్టొచ్చు, రెండు రోజులు దాచిపెట్టొచ్చు… ఎంతకాలం చెప్పకుండా వుండగలను? అయినా చెప్పకుండా దాచిపెట్టే విషయం కూడా కాదు ఇది.
అసలు నా స్నేహితురాలు అడిగినంత మాత్రాన నేను గోపమ్మకి చెప్పకుండా వుండి వుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకునేదాన్నే కాను. లక్ష్మిని హైదరాబాద్ పంపించి తప్పు పని చేసాను.
పోనీ పోలీసు రిపోర్టు ఇస్తేనో? అనిపించింది. మళ్లీ ఇస్తే ఏం గొడవో? ఇవ్వకపోతే ఏం గొడవో? అనే మీమాంసలో మధ్యాహ్నం వరకూ గడిపాను. ఏం వండానో? ఏం తిన్నానో కూడా తెలీకుండా, మనస్ధిమితం లేకుండానే గడిపాను.
మధ్యాహ్నం మూడయ్యాక, “అమ్మగారూ! అమ్మగారూ! “ గోపమ్మ గొంతు గట్టిగా వినపడేసరికి, ఒక్క వుదుటన బయటకి వచ్చాను. గేటు దగ్గర గోపమ్మని చూసి నిశ్ఛేష్టురాలయిపోయాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నిజమో , అబద్ధమో తెలీని పరిస్థితిలో వుండిపోయాను.

గోపమ్మ పక్కనే నేల చూపులు చూస్తూ నిలబడిన లక్ష్మిని చూసి, ఆశ్చర్యపోయాను. వెంటనే తమాయించుకుని, “ఏంటి? గోపమ్మా? హైదరాబాద్ నుంచి లక్ష్మి ఇక్కడకు ఎలా వచ్చింది?” ఏమీ తెలియనట్లే అడిగాను.
నా ప్రశ్నకు గోపమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే…

సశేషం.

1 thought on “గోపమ్మ కథ – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *