April 20, 2024

చంద్రోదయం 34

రచన: మన్నెం శారద

ఆ వెంటనే ఆ చూపులు పేలవంగా విడిపోయేయి.
“ఆరోగ్యం జాగ్రత్త. నువ్వనవసరమైన భయాల్ని వదిలించుకుని, ఎవరి మాటలూ వినకుండా నానీని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఏమన్నా అయితే నానీ గతేవిటో ఆలోచించి ఏవయినా చెయ్యి.” సారథి ఎటో చూస్తూ ఆ మాటలనేసి వెళ్లిపోయేడు.
అతని నిరాదరణ చూస్తుంటే ఆమెకు గుండె పగిలిపోతోంది. ఇక తన ముఖం జీవితంలో చూడడు, తనని దగ్గరకి తీసుకోడు. అయిపోయింది. తన కల చెదిరిపోయింది.
జానకమ్మ మాటలు విని తను తన అందమైన సంసారాన్ని చేజేతులా పాడు చేసుకొంది.
నిజానికి తను చాలా దురదృష్టవంతురాలు. పుట్టినప్పటినుంచి లెక్కేసుకుంటే తను సుఖపడిన రోజులు చాలా తక్కువ. అమృతభాండాన్ని చేతికి అందించినట్లే అందించి, అది గ్రోలే సమయానికి విషబిందువులు చిలికించి నవ్వుతాడా దేవుడు.
స్వాతికి ఏడుపొస్తోంది.
కాని ఓ పక్క అత్తగారు, మరో పక్క నానీ వున్నారు.
తనకి ఏడ్వటానికి కూడా స్వేఛ్ఛ లేదు. తన ఏడుపుకి కారణం చెప్పుకోవాల్సి వుంటుంది.
దుఃఖం ఆపుకోవటాన్న అదురుతోన్న పెదవులని పంటి బిగువున అదిమిపట్టి బెడ్‌రూంలోకి వెళ్ళిపోయింది స్వాతి.
కోడలు, కొడుకు అదోలా వుండటం, అన్యోన్యంగా మాట్లాడుకోకపోవటం గమనించి ఆందోళపడింది సావిత్రమ్మ.
స్వాతి హాస్పిటల్ నించి వచ్చిన దగ్గరనుంచి ఆమె గమనిస్తోంది.
కోడలి పనులన్నీ తనకే పురమాయిస్తున్నాడు. ఆమె దగ్గర కూర్చుని మాట్లాడినట్లనిపించదు. ఈ పిల్ల కూడా నవ్వుతూ మాట్లాడాలని, మొగుణ్ణి మంచి చేసుకొని అతని ప్రేమని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కన్పించదు. ఎప్పుడూ ఏదో పోయినట్లు ఆ మూల కూర్చుని ఆలోచిస్తుంది.
ఆమె ఆలోచనలు తెగకుండానే “వదినగారూ, బాగున్నారా?” అన్న పిలుపు వినిపించి తల తిప్పి చూసింది.
ఎదురుగా జానకమ్మ నవ్వుతూ నిలబడింది.
“రంది వదినగారూ, చాన్నాళ్లకొచ్చేరు!” అంది సావిత్రమ్మ నవ్వుతూ చాప పరిచి.
“ఏం రావటమమ్మా, మీ అబ్బాయి నన్ను చూస్తేనే ఎగిరిపడతాడు!” అంది జాంకమ్మ దిగులుగా ముఖం పెట్టి.
“అదేవిటి?” సారథి తల్లి ఆశ్చర్యంగా అడిగింది.
“ఏం చెప్పమంటావు? మంచికిపోతే చెడు ఎదురయ్యిందని, నా జాతకమే అంత”
సావిత్రమ్మ ఆశ్చర్యంగా వింటోంది.
“మీ కోడలు లేదూ!” అంది గొంతు తగ్గించి.
“పడుకొంది. వంట్లో బాగుండటం లేదుగా.”
“బాగోకపోవటమా, చట్టుబండలా. ఆ పిల్లది మానసిక రోగం” అంది మెల్లిగా జానకమ్మ.
“అంటే?” సారథి తల్లి అర్థం కానట్లు చూసింది.
“చెబితే నువ్వు కూడా నీ కొడుకులా ఎగిరిపడకూడదు మరి. ఆ పిల్లకి.. నీ కొడుకు పువ్వుల్లో పెట్టి పూజ చేసినా మొదటి మొగుడి మీదే ప్రేమ. రెండోది శేఖర్ తండ్రి ఆస్తంతా మీ అబ్బాయి పేర రాశాడు. దానితో ఆ డబ్బు నానీగాడికి దక్కదేమోనని బెంగ. ఇంక మూడవది. నువ్వీ మాటలు ఎక్కడా అనకు వదినా. కొంపలంటుకుంటాయి. పిల్లలు పుడితే ఆస్తి వాళ్లకివ్వబడుతుందని నీ కొడుక్కి తెలియకుండా ఎబార్షన్ చేయించుకొంది. ఏం మింగిందో మరి, చావుతప్పి కన్నులొట్ట బోయినట్లయితే సమయానికి నేనే దగ్గరుండి ఆసుపత్రిలో జాయిన్ చేశాను. తీరా నీ కొడుకొచ్చి తప్పంతా నాదేనన్నట్లు “గెటౌట్” అన్నాడమ్మా. చూసావా, మేలు చేయబోతే కీడెలా ఎదురయిందోనూ!” అంది జానకమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంటూ.
సావిత్రమ్మ నివ్వెరపోయింది. ఆమెకీ విషయాలు నమ్మశక్యంగా లేవు.
“స్వాతి యింతటి నెరజాణా? తన కొడుక్కింత అన్యాయం తలపెట్టిందా? ఎంత దారుణం. తన కొడుకు జీవితమంతా వాళ్లకి ధారపోసేడే. స్నేహధర్మం కోసం బ్రతుకంతా త్యాగం చేసి, శక్తికి మించిన బరువు నెత్తిన వేసుకున్నాడే. పిల్లాడి తల్లని కూడా ఆలోచించకుండా, మొగుడు పోయిన మనిషని సందేహించకుండా కట్టుకున్నాడే! ఈ రోజుక్కూడా పెళ్లాన్ని పల్లెత్తుమాట అనకుండా మౌనంగా ధర్మ ప్రభువులా ప్రవర్తించే తన కొడుక్కి యింత అన్యాయం తలపెడుతుందా? వాడికంటూ సంతానం లేకుండా నాశనం చేస్తుందా? ఎంత రాక్షసి! ఎంత నయవంచకురాలు.
ఆమె రక్తం సలసలా మరిగిపోసాగింది.
సావిత్రమ్మ ముఖం చూసి జానకమ్మ మెల్లిగా జారుకొంది.
“నాన్నమ్మా! అన్నం పెట్టవూ?” నానీ వచ్చి ఆమె ఒళ్ళో తల పెట్టుకొని మారాం చేసేడు.
ఆమె ఆలోచనల్నుంచి తేరుకుని నానీవైపు చూసింది. ఒక్కక్షణం ఆమె మామూలు మనిషై ప్రేమగా నానీని దగ్గరకు తీసుకో బోయింది. మరో క్షణంలో ఆమెలో నాటుకొన్న విషబీజం నిముషంలో వృక్షమై వూడలు దించుకు నిలబడింది.
వాణ్ని ఒక్క విదిలింపు విదిలించింది.
“మీ అమ్మేం చేస్తుంది? అన్నం పెడితే ఒళ్ళేం అలిసిపోదు. లేచి పెట్టమను” ఆ గొంతు వింతగా ప్రతిధ్వనించింది.
అనుకోని ఆ హఠాత్పరిణామానికి నానీ బిక్కమొగం వేసుకుని నిలబడ్డాడు.
ఎంతో సంస్కారాన్ని పెంపొందించుకుని, స్వతహాగా మంచి మనిషయిన ఆమె చెప్పుడు మాటలకి లొంగి క్షణంలో పసిపిల్లాడనే జాలిని వదలి కఠినంగా శిలంగా మారిపోయింది.

ఇంకా వుంది.

1 thought on “చంద్రోదయం 34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *