April 19, 2024

వెంటాడే కథలు – 14

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

****
దుర్ఘటన!

రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి.
ఓ పక్కన గాబ్రియల్ బృందం తమ వీధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది.
వాద్యాల బృందం ఒక పక్కన, కళాకారుల బృందం మరో పక్కన సిద్ధమవుతోంది. గాబ్రియల్ భార్య ఎనిసా మేకప్ చేసుకుంటోంది. తన అందం మరింత పెరిగేలా వస్త్రధారణ చేసుకుందామె. ఆమె అందాల రాణి. ఆ ప్రదర్శనలో ఆమె అందం ఒక తురుపు ముక్క! చాలామంది ఆమెను చూడటానికే ఆ ప్రదర్శనకు వస్తారు.

గాబ్రియల్ మీసాలు దువ్వుకుంటూ కత్తులు విసరడంలో సాధన చేస్తున్నాడు. కత్తులు అంటే జానపద సినిమాల్లో చూపించే పొడవైన కరవాలాలు కాదు.. కేవలం జానెడు పొడవు ఉన్న పదునైన చాకులు!
ఈ గారడీ ప్రదర్శనలో గాబ్రియల్ బృందానికి మంచి పేరుంది. రకరకాల సాములు చేశాక చిట్టచివరగా చేసే కత్తులు విసిరే ప్రదర్శన అన్నింటిలోకి హైలెట్! చూసేవారిని ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తుందది! బృంద నాయకుడైన గాబ్రియేలే దానిని చేస్తాడు అందులో భాగస్వామిగా అతని భార్య ఎనిసా కూడా పాల్గొంటుంది. భార్యాభర్తలిద్దరూ ఆ ప్రదర్శన చేసేటప్పుడు పరస్పరావగాహనతో చాలా అద్భుతంగా చేస్తారు. ఏమాత్రం తొణికినా ప్రాణాలు పోవడం ఖాయం.

ఇంతకీ ఏమిటా ప్రదర్శన అంటే-
ఎనిసా వెళ్లి ఒక్క నిలువెత్తు చెక్క బల్లని ఆనుకుని వయ్యారంగా నిలబడుతుంది. కళ్ళకి గంతలు కట్టుకొని గాబ్రియల్ ఆమె వైపు కత్తులు విసురుతాడు. అవన్నీ ఆమె తలకు అరంగుళం పైన, మెడకు, నడుముకు ఇరువైపులా, కాళ్ల పక్కన వెంట్రుక వాసి దూరంలో చెక్క బల్లకు గుచ్చుకుంటాయి. అంతేకానీ ఒక్కటి కూడా ఆమెకి తగలదు. ఏ మాత్రం హాని జరగదు. గాబ్రియల్ వెళ్లి ఆ కత్తులన్నింటినీ చెక్కనుంచి పీకేస్తేనే ఆమె ఇవతలకు రావడం సాధ్యపడుతుంది.
అంత దగ్గరగా అంటే మృత్యువుకు అతి సమీపంలో ఆమె నిలబడుతుందన్న మాట. అయితే ఆ ప్రదర్శనలో ఆమెకు ఎలాంటి భయం లేదు. చాలా నిర్లక్ష్యంగా నిలబడుతుంది. ప్రేక్షకుల్ని పరిహాసంగా చూస్తూ నిలబడుతుంది. తన భర్త గురిమీద ఆమెకు అంట నమ్మకం. గాబ్రియల్ కూడా అంతే కత్తులు విసిరే టప్పుడు చాలా నిర్లక్ష్యంగా విసిరినట్టు కనిపిస్తాడు కానీ అతి జాగ్రత్తగా విసురు తాడు లేకపోతే తన అందమైన ముద్దుల భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం.

అదే ఈ ప్రదర్శనకు ప్రాణం!
ఆ రోజున కూడా జనం చుట్టూ పోగయ్యారు.. ప్రదర్శన ప్రారంభమైంది. ఒక్కొక్క అంశము జరుగుతుంటే ప్రేక్షకులు ఆశ్చర్యానందాలతో హర్షధ్వానాలు చేస్తూ సంబరపడిపోతున్నారు.
చిట్టచివరి ప్రదర్శనకు సిద్ధమయ్యారంతా.
అంతరిలోనూ ఉద్వేగం.. ఉత్కంఠ!
ఎటుచూసినా నిశ్శబ్దం!!
ఎనిసా ప్రేక్షకులపై చిరునవ్వులు రువ్వుకుంటూ బల్ల దగ్గరకు వయ్యారంగా నడిచి వెళ్లి దానికి ఆనుకుని నిలబడింది..
నోట్లో సిగరెట్టు ఉంచుకుని కళ్ళు చికిలిస్తూ గాబ్రియల్ లేచాడు.
లేచి వెళ్లి ఆమెకు అల్లంత దూరాన నిలబడ్డాడు. అతని పక్కనే ఒక స్టూలు! దానిపైన ఒక డజను పదునైన కత్తులు..
చూసేవారికి భయంతో చెమటలు దిగజారిపోతున్నాయి తప్ప అటు ఎనిసా గాని ఇటు గాబ్రియల్ గాని చాలా సాధారణంగా.. చాలా నార్మల్ గా ఉన్నారు.
ఒక సహాయకుడు వచ్చి గాబ్రియల్ కళ్లకు గంతలు కట్టాడు. ప్రేక్షకుల నుంచి ఒకడు వచ్చి అతనికి ఏమీ కనబడడం లేదని నిర్ధారించాడు. ప్రదర్శన ప్రారంభం కాబోతోంది..
ప్రేక్షకులు గుండెలు చిక్కబట్టుకొని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు.
ఒకటి.. రెండు.. మూడు..
‘సర్ సర్’ మంటూ చాకులు రివ్వున గాలిలో ఎగిరి వెళ్లి బల్లకు గుచ్చుకుంటు న్నాయి ఎనిసా దేహానికి అతి చేరువలో! ఒక్క అరంగుళం తేడా వచ్చినా ఆమె గాయపడటం ఖాయం.
గాయమే కాదు ప్రాణాలు పోవడం కూడా ఖాయం.
అప్పటికి కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చిన ఆ జంటకు అలాంటి సందేహం ఎప్పుడూ రాలేదు.
చాకులు మొదట కాళ్ల వైపు గురిపెట్టి విసిరాడు గాబ్రియల్. అవి కాళ్లకు అటూ ఇటూ కాళ్ల మధ్యలో గుచ్చుకున్నాయి. క్రమంగా నడుము.. తర్వాత చేతులు తర్వాత తల పైభాగం… కూడా పూర్తయింది.
ఇక రెండే రెండు చాకులు మిగిలాయి. అవి ఆమె కంఠానికి ఇరువైపులా చెక్కకు గుచ్చుకోవాలి.
ఒక చాకు కుడి చేతిలోకి తీసుకున్నాడు గాబ్రియల్. మరొకదాన్ని ఎడం చేత్తో పట్టుకుని సిద్ధమై ఉన్నాడు గాబ్రియల్.
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
పదకొండో చాకు సర్రున గాలిని కోసుకుంటూ వెళ్లి ఎనిసా కంఠంలో దిగింది.
రక్తం పిచికారి కొట్టినట్టు బయటకు వెల్లువైంది.
అందంగా అలంకరించుకున్న ఎనిసా ధరించిన బట్టలు ఎర్రగా మారిపోయాయి.
అంతే!
ఒక్కసారిగా జనం హాహాకారాలు చేశారు.
కొందరు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇంకొందరు రక్షకభటులను తీసుకురావడానికి పరుగెత్తారు..
వైద్యుల్ని పిలుచుకు రావడానికి పరిగెత్తారు మరికొందరు.
ఈ హాహాకారాలు విని తమ ప్రదర్శన విజయవంతం అయిందని అందుకనే జనం అరుస్తున్నారని అనుకుని పన్నెండో చాకు కూడా విసిరాడు గాబ్రియల్. అది సర్రున నేరుగా వెళ్లి లూయిస్ గుండెల్లో దిగబడింది.
ఏం జరిగిందో తెలిసేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మళ్లీ జనం కేకలు..
కోపంగా కొందరు వెళ్లి గాబ్రియల్ ని పట్టుకుని అతని కళ్ళకున్న గంతలు లాగేసారు.
“నీకు బుద్దీ జ్ఞానం ఉందా? నిండు ప్రాణం తీసావు కదరా దరిద్రుడా? నిష్కారణంగా భార్యని చంపుకున్నావు కదరా మూర్ఖుడా? నువ్వెంత పాపాత్ముడివిరా దుర్మా ర్గుడా?” అని తిట్టడం మొదలు పెట్టారు.
కొందరు అతనిపై చేయి కూడా చేసుకున్నారు.
మొదట ఆశ్చర్యంతో తెల్లబోయిన గాబ్రియల్ ఎర్రమందారంలా అచేతనంగా కత్తుల నడుమ ఉన్న భార్య వంక చూసి తటాలున ఆమె వైపు ఏడుస్తూ పరిగెత్తాడు. చుట్టూ ఉన్న చాకుల్ని చకచక లాగేసి ఆమె దేహాన్ని తన ఒళ్ళోకి తీసుకుని దుఃఖ సముద్రంలోకి మునిగిపోయాడు.
ఎప్పుడూ గురి తప్పని తన చాకు ఇవాళ గురి తప్పడం ఏమిటి తన కర్మ కాకపోతే? తన భార్యని తనే చంపుకున్నాడు.. తనెంతటి పాపాత్ముడో కదా అని రోదిస్తూ ఆమె శరీరాన్ని హృదయానికి హత్తుకుంటూ కుళ్ళికుళ్ళి ఏడ్చాడు.
అతని సహాయకులు అతన్ని ఓదార్చడం మొదలుపెట్టారు.
అతని రోదన మిన్నంటింది. ప్రేక్షకులు కూడా అది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన పాపం అతను మాత్రం ఏం చేస్తాడు? కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చిన వాడు.. ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన వాడు ఇవాళ ఖర్మ ఇలా కాలింది పాపం! నిష్కారణంగా భార్యని చేజేతులా చంపుకున్నాడని అర్థం చేసుకున్నారు.
దాంతో అతన్ని ఓదార్చే పనిలో పడ్డారు వారు కూడా!
రక్షకభటులు పరుగు పరుగున వచ్చారు.. గాబ్రియల్ని బంధించబోయారు..
వైద్యులు ఎనిసాకి ప్రాణం ఎక్కడైనా మిగిలి ఉందేమోనని పరీక్షలు చేయడం మొదలుపెట్టారు.
ఊహూ గుండెల్లో గుచ్చుకున్న బాకు ఆమె ప్రాణాల్ని క్షణాల్లోనే తీసేసింది.
అక్కడున్న ప్రేక్షకులంతా గాబ్రియల్ ను బంధించబోయిన రక్కభటుల్ని వారించారు.
“అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన! మీరు అతన్ని వదిలేయండి!! ఇప్పటికే భార్యను పోగొట్టుకుని కృంగిపోతున్నాడు. చేజేతులా చంపుకున్నానని పసివాడిలా ఏడుస్తున్నాడు అలాంటి వాడిని మీరు బంధించడం అవసరమా?” అని వాదించారు. ఇంకొందరు కావాలంటే తామంతా సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి వస్తామని చెప్పారు.
అంతమంది ప్రేక్షకులు గాబ్రియల్ని సమర్థిస్తుంటే రక్షకభటులు ఏమీ చేయలేకపోయారు. గాబ్రియల్ కి తమ సానుభూతి తెలిపి అతని భార్య మరణం ఒక దుర్ఘటన మాత్రమే అని తమ రికార్డుల్లో నమోదు చేసుకుని పై అధికారులకు విన్నవించడానికి వెళ్లిపోయారు.
ఆ రాత్రి గాబ్రియల్ అన్నం తినలేదు.. కనీసం మంచినీరు కూడా ముట్టలేదు. భార్యనే తలుచుకుంటూ పదేపదే తల కొట్టుకుంటూ రోదిస్తూ కూర్చున్నాడు. అతని సహాయకులు ఎంత ఓదార్చినా కోలుకోలేకపోతున్నాడు. గుండె దిటవు చేసుకోలేకపోతున్నాడు.. తన భార్యను చంపుకున్న ఊళ్లో ఉండలేనని చెప్పి మూట ముల్లె సర్దుకుని తన సహాయకులతో కలిసి వేరే ఊరికి వెళ్ళిపోయాడతను.
పది రోజులు గడిచింది..
గాబ్రియల్ కొంత కోలుకున్నాడు.
పైకి దిగులుగా ఉన్నా అతని మనసు సంతోషంతో గంతులు వేస్తోంది. చేతిలో మద్యం సీసా పట్టుకుని తాగుతూ అనుకున్నాడు.. ‘తనకు ద్రోహం చేసి, ఆ దుర్మార్గుడు రాఫెల్ గాడితో చాటుమాటు సరసాలు ఆడుతోంది దొంగ ముండ! చేతికి మట్టి అంటుకోకుండా తగిన శాస్తి చేశాను. మట్టిలో కలిపేసాను.. జనాన్ని మాత్రం దుర్ఘటనగా నమ్మించాను.. లేకపోతే ఎప్పుడైనా చివరికి నిద్రలోనైనా తన కత్తి గురి తప్పుతుందా?’ అని మనసులోనే నవ్వుకుంటూ మీసం దువ్వుకున్నాడు.

-:000:-

నా విశ్లేషణ:

ఈ కథ గురించి ఆలోచించి చెప్పక్కర్లేదు కచ్చితంగా ఫ్రెంచి రచయిత గైడి మపాసాదే అనిపిస్తోంది. మనిషి మనస్తత్వాన్ని కాచి వడబోసి, చిత్రిక పట్టిన కథ ఇది! అత్యంత తెలివైన నేరగాడి కథ ఇది. అఫ్ కోర్స్ ఇవాళ ఇలాంటి కథలు మనం చాలా చదివి ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లో ఇది బాగా కొత్తదైన వస్తువు. అందుకే ఎందరినో అలరించింది. ఎందరో రచయితలకు రచనా పరంగా స్ఫూర్తినిచ్చింది..
కథను నడపడం మపాసాలాంటి మహానుభావులకే కుదురుతుంది అనడంలో సందేహం లేదు.
దానికి ఈ కథే ఉదాహరణ. మీరేమంటారు ?

*****

2 thoughts on “వెంటాడే కథలు – 14

  1. ఈ కధ చివరి వరకు చదివేలా చేసింది. అక్రమ సంబంధం గురించి వచ్చిన అనేక కధలకు భిన్నంగా ఉంది. ఉత్కంఠ లేకపోవచ్చు. కానీ కధ విషాదం నుంచి విస్మయానికి పాఠకులను గురిచేసిన విధానం బాగుంది. ముగింపు ఉహించలేనిది.

Leave a Reply to Chandra Pratap Cancel reply

Your email address will not be published. Required fields are marked *