March 28, 2024

గోపమ్మ కథ – 4

రచన: గిరిజారాణి కలవల

నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గోపమ్మ … లక్ష్మి రెక్క పట్టుకుని ముందుకి లాగి, “చెప్పవే! అమ్మగారు అడుగుతున్నారుగా! చెప్పూ!” అంది కోపంగా.
ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. ఉదయం నుంచి నేను పడుతున్న ఆదుర్దా అయితే, లక్ష్మిని చూడగానే తీరింది కానీ, హైదరాబాద్ నుంచి ఇక్కడకి ఈ పిల్ల ఎలా రాగలిగిందా? అనే సందేహం వచ్చింది.
“ఉండు, గోపమ్మా! దాన్నేం అనకు. నేను కనుక్కుంటాను” అన్నాను.
“ఏంటమ్మా! కనుక్కునేది ? మీరు నా మీద నమ్మకంతో దీన్ని మీరు అక్కడకి పంపితే, ఇదేం చేసిందో చూడండి. అక్కడ ఉండబుద్ధి కాలేదట. అందుకని ఆ అమ్మగారికి కనీసం చెప్పను కూడా చెప్పకుండా, పారిపోయి వచ్చిందట. మీకు ఎంత నామర్దా అయిందో తలుచుకుంటే నాకు తల కొట్టేసినట్లు అయింది. చెపితే వాళ్ళే వచ్చి దింపి వెళ్ళేవారు కదా!” అంది గోపమ్మ.
“ఔను, లక్ష్మీ! ఎందుకలా చేసావు? చెప్పకుండా పారిపోయి రావడం తప్పు కదా? వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోలేదా? తిండి బాగా పెట్టలేదా? నిన్ను ఏమైనా అరిచేవారా?” అంటూ అడిగాను.
లేదంటూ బుర్ర అడ్డంగా ఊపింది.
“మరెందుకు వచ్చేసావు! పోనీ నాకు ఫోను చేసి చెపితే, వాళ్ళకి చెప్పేదాన్ని కదా? వాళ్ళే నిన్ను కారులో దింపేసేవారు” అన్నాను.
“మూగ మొద్దులా మాట్లాడవేమిటే? అమ్మగారు అడుగుతున్నారుగా చెప్పు” అంటూ లక్ష్మి నెత్తిన ఓ మొట్టు మొట్టింది గోపమ్మ.
నీళ్ళు నిండిన గుడ్లేసుకుని నిలబడింది లక్ష్మి.
“నీకు నచ్చలేదు వచ్చేసావు సరే… అంత దూరం నుంచి ఎలా వచ్చావు? నీ దగ్గర డబ్బులు కూడా లేవు కదా?” అన్నాను.
అప్పుడు నెమ్మదిగా నోరు విప్పింది లక్ష్మి.
“రాత్రి కల్లోకి రమేషన్న కొడుకు వచ్చి, అత్తా! అత్తా! అని పిలిచాడు. వాడిని చూడాలనిపించింది. ఇక్కడ వున్నవాళ్ళు నేనే వాడికి స్నానం చేయించి, అన్నం పెట్టేదాన్ని. నేను పాట పాడందే వాడు నిద్ర పోయేవాడు కాదు. వాడి కోసమే వచ్చేసాను. ఆ అమ్మగారికి చెప్పకుండా రావడం తప్పే. చెపితే పంపరేమో అను కున్నాను. అందుకనే చెప్పకుండా వచ్చేసాను.” అంది.
ఆ మాటలకి గోపమ్మ కరిగిపోయింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ లక్ష్మిని కావలించేసుకుంది.
మేనల్లుడి మీద లక్ష్మి పెంచుకున్న ప్రేమకి నాకు ఆశ్చర్యం వేసింది. తన స్వంత తల్లిదండ్రులు ఎవరో తెలీదు… తనది ఏ ఊరో తెలియదు.. అనాధలా ఈ ఊరు వచ్చి గోపమ్మ కంటపడింది. వీళ్ళ కుటుంబ సభ్యురాలైపోయుంది. గోపమ్మనే సొంత తల్లిలా భావిస్తూ వీళ్ళతో అనుబంధం పెంచుకుంది. పేరుకి పేదవారైనా వీళ్ళ మధ్య ఎంతటి అనురాగాలో కదా అనుకున్నాను.
“బస్సులో వచ్చావా? టికెట్ కి డబ్బులు ఎక్కడివి?” అన్నాను.
“పొద్దున్నే లేచిపోయి నా సంచీలో నా బట్టలు, పెట్టేసుకున్నాను. అప్పటికి ఇంకా ఆ అమ్మగారు, అయ్య గారు నిద్ర లేవలేదు. నెమ్మదిగా తలుపు తీసుకుని బయటకి వచ్చి, మళ్లీ తలుపు దగ్గరగా చేరేసాను. రోడ్డు మీద నడుస్తూ…ఇదివరలో ఒకేసారి ఆ అమ్మగారు నన్ను ఆటోలో బజారుకి తీసుకువెడుతూంటే దారిలో రైల్వే స్టేషన్ చూపించారు. ఆ దారి కొంచెం గుర్తు వుంది. కనపడిన ఆటో అబ్బాయిల్ని దారి అడుగుతూ స్టేషన్ కి వచ్చాను. అక్కడ, ఓ రైలు ఆగి వుంటే, ఇది ఎక్కడకి వెడుతుంది అని అడిగితే, గుంటూరు రైలని చెప్పారు. అది ఎక్కేసి మెట్ల దగ్గర కూర్చున్నాను. నన్ను టికెట్ ఎవరూ అడగలేదు. నడికూడి స్టేషన్ లో దిగి మళ్ళీ మన వూరి పాసింజర్ రైలెక్కి వచ్చేసాను.” అంది లక్ష్మి.
నివ్వెరపోయాను దాని తెగింపుకీ, ధైర్యానికీ. పదిహేనేళ్ల పిల్ల … ఎంత ధైర్యంగా హైదరాబాద్ వంటి నగరంలో కనీసం పది కిలోమీటర్ల దూరం పైగా వున్న రైల్వే స్టేషన్ కి కాలి నడకన వచ్చి, మహా గందరగోళంగా వుండే అక్కడ కరెక్ట్ రైలు ఏదో కనుక్కుని ఎక్కి, మళ్లీ మరో రైలు మారి ఇంటికి క్షేమంగా చేరిందంటే చాలా గొప్పే అనిపించింది. ఇప్పుడు సిటీ అయినా, చిన్న ఊరైనా… ఒంటరిగా ఆడపిల్ల బయటకి వెళ్ళిందంటే తిరిగి ఇంటికి వచ్చేవరకు ఇంట్లో వాళ్ల గుండెలు గుబగుబలాడుతూనే వుంటాయి. ఇప్పుడు లక్ష్మి క్షేమంగా ఇంటికి చేరుకోవడం నిజంగా అదృష్టమే. తనే కాదు ఒకరకంగా నేనూ, హైదరాబాద్ లోని నా స్నేహితురాలు కూడా లక్కీయే అనిపించింది. ఏదైనా జరగరానిది జరిగితే ఎన్ని సమస్యలు వచ్చేవో కదా అనిపించింది.
“పోనీలే గోపమ్మా! దానికి ఇష్టంలేని పని మనం మాత్రం ఎలా చేయిస్తాము. అది నీ దగ్గర వుండడానికే ఇష్టపడుతోంది. ఇక ఎక్కడికీ పంపకు.” అని చెప్పాను.
లోపలకి వెళ్లి లక్ష్మి సేఫ్ గా తిరిగి వచ్చిందని హైదరాబాద్ ఫోన్ చేసి చెప్పగానే, అక్కడ నా స్నేహితురాలు కూడా హమ్మయ్య అని గాలి పీల్చుకుంది.

సశేషం.

3 thoughts on “గోపమ్మ కథ – 4

  1. ప్రారంభమే బాగుంది. కధ పేరు కూడా వెరైటీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *