April 16, 2024

జీవనవేదం – 4

రచన: స్వాతీ శ్రీపాద

“నాగరత్నం మా అమ్మ.” అంటూ లేచి పారిజాతం
“మా అమ్మ లోకం తెలిసిన మనిషి కాదు. మేనత్త దగ్గర ఒద్దికగానే పెరిగినా లోకం పోకడ అసలు తెలియదు. భర్తే ప్రపంచం అనుకుంది. పెళ్ళైన ఆరునెలలకే మేనత్త కాలం చేసినా వెళ్ళి చూసే అనుమతి కూడా దొరకలేదు.
మేనత్త మైల మూడు రోజులతో సరి – అంటూ ఇంటిపనులన్నీ చేయించారట దుఃఖంలో ఉన్న అమ్మతో.
ఇహ నాన్న సంగతి సరేసరి. పదిళ్లపూజారి.
ఏ రోజునా ఏ పనీ బాధ్యతగా చేసిన మనిషి కాదు. చేతినిండా డబ్బు , జల్సాగా జీవితం ఇదే కావలసినది. ఇంటికి వచ్చినప్పుడు సకల భోగాలూ అందించడానికి భార్య – ఫలితంగా పిల్లలు. అవసరపడినప్పుడు పసుపుకుంకుమగా ఆమె తెచ్చుకున్న నగానట్రా అమ్మి డబ్బు చేసుకోడం. అదీ కుటుంబ వాతావరణం.
అయితే ఉమ్మడి కుటుంబంలో అతని ఆటలు ఎన్నాళ్ళో సాగలేదు.
మేనత్తలు పెద్దమ్మ సాగనివ్వలేదు.
ప్రత్యక్షంగా నాగరత్నాన్ని, పరోక్షంగా నవీన్ చంద్రనూ కుటుంబం మీద పడి తింటున్నారనీ, సంపాదన లేకపోయినా హంగులకు లోటు లేదనీ నానా రకాలుగా ఎత్తిపొడిచేవారు.
ఇహ లాభం లేదని, ఉన్న ఊళ్ళో వేరు కాపురం కుదరదని పక్కూళ్ళో ఆయుర్వేద నిలయం పెట్తుకుంటానని తండ్రిని అడిగాడు.
కాని దాని ఖర్చులు భరించడానికి ససేమిరా ఒప్పుకోలేదు తండ్రి. ఎక్కడైనా వెళ్ళి ఉద్యోగంలో చేరమనే సరికి పౌరుషం పొడుచుకు వచ్చింది.
నాగరత్నం ఒక్కతే మిగిలిన దారి.
“మీ అత్త రాసిచ్చిన ఇల్లు ఉందిగా, ఆ కాగితాలు ఇవ్వు. అది అమ్ముకుని వేరే వెళ్లిపోదాం” అంటూ రోజూ నసే.
ఇహ తప్పక అవి అతని చేతుల్లో పెట్టింది.
లోలోన కొంత ఆ ఇంటి చాకిరీ తప్పుతుందని సంతోష పడింది కూడా.
పర్యవసానంగా ఇద్దరు మొగపిల్లలను తీసుకుని ఇంటికి సుదూరంగా వలస వెళ్ళిపోయాక పుట్టింది పారిజాతం.
పెద్దగా యాభై ఇళ్ళు కూడా లేని పల్లెలో ఆయుర్వేదం మందుల సంగతి పక్కన పెట్టి, చౌకగా వస్తున్న స్థలం కొని వ్యాపారం చెయ్యాలని మనసు మార్చుకున్నాడు నవీన్ చంద్ర.
ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు చేతిలో పుష్కలంగా ఉంది.
“మీ ఇష్టం ఏదైనా చెయ్యండి. నాకు నాలుగు గాజులు కొనివ్వండి. మిగతా డబ్బు మీ ఇష్టం” వినయంగానే అడిగింది నాగరత్నం.
కాని డబ్బు మొత్తం ఆమె మొహాన విసిరికొట్టి “నీ డబ్బనే కదా ఆ అహంకారం” అంటూ అలిగి నానా యాగీ చేసాడు. వారం రోజుల పాటు కొత్త చోట భార్యానూ పసివాళ్లనూ వదిలి ఇంటి మొహం చూడకుండా, ఎక్కడున్నాడో చెప్పకుండా అలక సాగించి, భార్య నోరెత్తదని గ్రహించు కున్నాకే ఇంటికి వచ్చాడు.
మరోమాట లేకుండా మొత్తం డబ్బు అతని చేతిలో పెట్టింది నాగరత్నం.
తులసి చెప్పుకు వచ్చింది.
” నాన్న చాలా కష్టపడి పైకి వచ్చాడు. బెల్లం చుట్టు ఈగల్లా, ఒకప్పుడు ఏ మాత్రం లెక్కపెట్టని బంధువులు చుట్టూ మోగడం ప్రతి చిన్న అవసరానికీ కాళ్ళ వేళ్లా పడటం మొదలైంది. మాకు మా చదువులకు ఏ లోటూ ఉండేది కాదు. తెలిసిన వారందరిలోకీ ఎంతో అపురూపంగా పెరిగాం. స్కూల్ కి వెళ్ళడానికి, రాడానికి,మాకోసం ఒక కారు డ్రైవర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంచే వాడు.
పుట్టినరోజులకు నచ్చిన బట్టలు కొనడమే కాదు మా భవిష్యత్తు కోసం ఎన్నో సమకూర్చి పెట్టాడు. కాని దురదృష్టం పెద్దన్నయకు సెరెబ్రల్ పాల్సీ. ఆరేళ్ళకే బెడ్ రిడెన్, ఇరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు అతన్ని చూడాల్సిందే. అతను అలాఉండి మిగతా పిల్లలందరూ అన్ని సఔఖ్యాలూ అనుభవిస్తూ ఉండటమూ నరకప్రాయంగానే ఉండేది. చివరికి పుట్టిన రోజులు చేసుకోవాలన్నా బెరుకే.
ఇహ ఆ మనోవేదన భరించలేక నాన్న చివరకు వికలాంగుల హాస్టల్ లో చేర్పించారు. అయినా మా అందరికీ జీవితం వెలితి వెలితిగానే ఉండేది.
మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకూ బాగా చదువులు చెప్పించారు. అక్కలిద్దరూ ఒకరు మెడిసిన్, ఒకరు ఇంజనీరింగ్ చదివి పై చదువులకు అమెరికా వెళ్తానంటే పంపించాడు.
ఇద్దరికిద్దరూ అక్కడ కష్టపడి చదువుకున్నారు పొదుపుగా బ్రతికారు. కష్టపడి సంపాదించు కున్నారు.
బాగా స్థిరపడ్డారు. పెళ్ళిపెళ్ళంటూ నాన్న ఎంత వెంట పడినా తొందరపడలేదు. అన్ని విధాలా స్థిరపడిన జీవితం కోసం వేచి ఉన్నారు. ’పెద్దక్కకు నాన్న ఒక పాతిక సంబంధాలైనా చూసి ఉంటాడు. కొందరు నాన్న ఆస్థి చూసి వచ్చిన వాళ్ళు, మరికొందరు అక్క సంపాదనకు ఆశ పడేవాళ్ళూ… ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చక … దానికి తగినవాడూ దొరికే సరికి ముప్పై ఏళ్ళు నిండిపోయాయి.
రెండో అక్క చుపారుస్తుం. కాలేజీలో తన జూనియర్ ను ప్రేమించింది. అతను అక్కకన్న మూడేళ్ళు చిన్నవాడు. అందుకే ఈ మాట చెప్పడానికి అక్క పెళ్ళయేవరకూ ఆగింది. ఇద్దరూ అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అక్క పెళ్ళయాక ఈ మాట బయటకు వచ్చింది. ముందు రెండు వైపుల వాళ్ళూ ఒప్పుకోలేదు.
కాని వాళ్ళ కమిట్మెంట్, ప్రేమ గుర్తించాక కాదనలేకపోయారు. అక్క పెళ్ళైన ఆర్నెల్లకే ఇద్దరి పెళ్ళి ఎవరూ లేకున్నా అమెరికాలో శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ లోగా నేను లండన్ వెళ్ళి ఫిజియో థెరపీ చదువుకున్నాను. తమ్ముడు చదువుకోసం అమెరికా వెళ్ళాడు.
ఎవరూ నాన్నతో లేకపోతే అమ్మా నాన్న అన్నయ్యతో మరింత కుంగిపోతారని మళ్ళీ తిరిగి
వచ్చి ప్రైవేట్ గా క్లినిక్ ప్రారంభించాను. ఎందుకో అమ్మకు నాన్నకు అండగా ఇక్కడే ఉండి పోదామనిపించింది.
అమర్ ఎవరికో ఫిజియోథెరపీ కోసం వచ్చి పరిచయమయ్యాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్నని అమెరికా వెళ్లడం ఇష్టం లేక ఇక్కడ ఉండిపోయాననీ చెప్పుకున్నాడు. మృదువుగా మాట్లాడేవాడు ఆత్మీయంగా అనిపించేది. రోజు విడిచి రోజూ వచ్చి వెళ్ళేవాడు.
“మిమ్మల్ని చూడకపోతే తోచదు అనేవాడు” చివరికి పెళ్ళి చేసుకోమని అడిగాడు అదేమిటో ఆ క్షణంలో నావీ అతనివీ ఒకటే భావాలు అనిపించింది. ఇద్దరికీ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే ఉద్దేశ్యాలు లేవు. నాకు సపోర్ట్ గా ఉంటాడనిపించింది.
తల్లి దండ్రులకు ఒక్క కొడుకునేనని చెప్పాడు. వాళ్ళను తీసుకు వచ్చాడు కూడా. అమాయకంగా అనిపించారు.
కాని నిశ్చితార్ధం జరిగాక, పెళ్ళికి ముందు అదనీ ఇదనీ ఖర్చులు సమకూరడం లేదనీ దాదాపు నాన్న దగ్గర పదిలక్షల వరకూ తీసుకున్నాడట. పెళ్లికి రెండు రోజుల ముందు నా కోసం నగలు ఆర్డర్ చేసాననీ, సమయానికి రావలసిన డబ్బు వాయిదా పడిందనీ యాభై లక్షలు అడిగాడట. ఆ విషయం నాన్న నాకు చెప్పాడు.
“ఎందుకో అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. మించిపోయింది లేదు. ఇంకా పెళ్ళికి సమయం ఉంది ఆలోచించు” అన్నాడు.
అయినా ప్రేమ గుడ్డిది కదా, నేను అతన్ని నమ్మాను. నగలు వద్దులే అని అతనికి నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించాను.
పెళ్ళి జరిగాక ఓ పది రోజులు బాగానే గడిచాయి.
నేను క్లినిక్ కి వెళ్ళడం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లోనే ఉండటం. పదకొండో రోజున ఉన్నట్టుండి లే ఆఫ్ అన్నాడు.
పోనీలే తను మాత్రం ఏం చేస్తాడని బీరువాలో డబ్బుంది కావలిస్తే వాడుకో అన్నాను.
మూడునెలలు గడిచాయి. ఉద్యోగం వెతుకుతున్నానంటాడు. కాని నాన్న అతన్ని నమ్మడం లేదు.
నాకు నీరసంగా ఉంటోంది. అనుమానంగా ఉండి, నెల తప్పానేమోనని, కాని ఎవరికీ చెప్పే ఆస్కారమే లేదు.
అలాటి స్థితిలో నాన్న ఏమనుకున్నాడో గాని ఆస్థ్లులు పిల్లలందరికీ పంచేసి ఎవరిది వారికి రిజిస్టర్ చేసారు.
నా పేరిట ఒక ఫ్లాట్ కొంత స్థలం వచ్చాయి.
నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి.
కాని ఇదివరకులా కాదు. ఎందుకో నా మీద ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వచ్చింది.
అరా తీస్తే నమ్మలేని పచ్చి నిజాలు, నా ఆస్థి చూపి చేతికందిన మేరకు అప్పులు తెచ్చాడు అమర్. చుట్టూ ఎటు చూసినా అప్పులే.
నిలదీసి అడిగితే ఉన్నట్టుండి గొంతు పట్టుకున్నాడు, ఎవరో రావడంతో ప్రాణాలతో బయట పడ్డాను. ఆ రోజు నుండి ఇంటికి రాలేదు అతను.
కాని తెల్లారింది మొదలి ఇంటి చుట్టు అప్పుల వాళ్ళే. ఒకటీ రెండూ కాదు నా ఆస్తి కాగితాలు తనఖా పెట్టుకుని లక్షలాది రూపాయల అప్పులు.
ఎలా ఇచ్చారు అంటే మీ భర్తే కదా అంటారు.
ఓ పక్కన నాలుగు నెలలు దాటుతున్నాయి. మరో పక్క ఈ న్యూసెన్స్. అత్తింటికి వెళ్లి అడిగితే అసలు సంగతి బయట పడింది. అతను టెంత్ క్లాస్ కూడా పాసవలేదు. కాని చిన్నప్పటి నుండి క్లాస్ గా ఉండటం అలవాటు. ఏదో ఒకటి చేసి దర్జాగా బ్రతకాలి అదే అతని పాలసీ.
“ఏం చేస్తాం , మేం ఎప్పుడో చెప్పేసాము మాకూ వాడికీ ఏ సంబంధం లేదని. ఇప్పుడు అదే మాట” అంటూ తప్పించుకున్నారు.
ఓ పక్కన ఇలా సతమతమవుతుంటే మరో పక్క నన్ను చంపేస్తే నాపేరిట ఉన్న ఆస్తి అతని దవుతుందని అతని ఆశ.
ఎవరినో కిరాయి గూండాలను పంపాడు – తప్పించుకుని మీ ఆశ్రయంలోకి వచ్చాను.
తులసి గొంతులోనూ కళ్ళలోనూ తడి.
పారిజాతానికి తండ్రి బాధ్యతారాహిత్యం గుర్తుకు వచ్చింది.
అయినవాళ్లకు దూరంగా తల్లీపిల్లలను ఉంచి ఎప్పుడూ ఒక పని చేసిన పాపాన పోలేదు. ఆయుర్వేదంతో వచ్చిన డబ్బు తప్ప మరో ఆదాయం లేదు.
అదీ సవ్యంగా చేస్తే కదా. పట్టుమని పదిరోజులు ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్తాడో ఏ ఆర్నెల్లకో తిరిగి వచ్చేది.
ఏడాదికో బిడ్డ.
బాధ్యతా రాహిత్యం వల్ల ఎక్కడి కక్కడ గిడసబారిన జీవితాలు.
పారిజాతం జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎవరికీ జవాబులు చెప్పలేక నుదుట బొట్టు చెరిపేసుకుని పెళ్ళికాకుండానే వైధవ్యం నుదుట రాసుకుంది.
చటుక్కున లేచి తులసిని దగ్గరకు తీసుకుంది. “నువ్వు ఈ రోజునుండి నా బిడ్డవు”.
ఇద్దరూ ఏ రక్త సంబంధమూ లేని తల్లీ బిడలు.
******
అమ్మా , అమ్మమ్మ కాని అమ్మమ్మా నేను పుట్టక మునుపే అమెరికా వచ్చేసారు. – అంటూ నిట్టుర్చింది సుమబాల.

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *