April 25, 2024

నమ్మక ద్రోహం

రచన: లక్ష్మీ ఏలూరి

“ఓయ్…! హనుమంతురావు… నీకు మన బాస్ ఏమన్నా చెప్పారా!?అని మల్లేష్ అడిగాడు.
“ఆ… చెప్పారు, మనం ఆఫీసులో కొన్ని పోస్ట్ లకు ఇంటర్వూ లు జరుగుతాయని, వాటికి అప్లై చేయమన్నారు. దాని కొరకు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ కి వెళ్లి సీనియారిటీ లెటర్ తెచ్చి అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయమన్నారు”అని హనుమంత రావు చెప్పాడు.
“నాకు కూడా అదే చెప్పారు, నేను వెళ్లి మన ఇద్దరి సీనియారిటీ లెటర్స్ తెస్తాను లే” అని మల్లేష్ అన్నాడు.
దానికి “సరేలే”అన్నాడు హనుమంతరావు.
మల్లేష్, హనుమంతరావు ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఇద్దరూ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి కొత్తగా డిఫెన్స్ కంపెనీలో క్యాజువల్ బేస్ మీద రీ ఎంప్లాయిమెంట్
అయ్యారు. ఇద్దరినీ వాళ్ళ బాస్ పర్మినెంట్ జాబ్ కొరకు అప్లై చేయమన్నారు.
హనుమంతరావు స్నేహానికి అతిగా ప్రాణమిచ్చే మనిషి. మల్లేష్ మటుకు స్నేహం గానే ఉంటూ వెనుక తన స్వార్థం చూసుకొనే మనిషి.
తెల్లవారి హనుమంతరావు వాళ్ళ ఊరినుంచి ఎవరో దగ్గర వారు కాలం చేశారని కబురు వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి. అలాంటి టైములో కూడా మల్లేష్ కు హనుమంతరావు ఫోన్ చేసి”సీనియారిటీ లెటర్స్ ఇద్దరవీ తీసుకుని రా”
నేను ఊరికి వెళ్ళి, ఎట్టి పరిస్థితుల్లోనూ. రేపటి వరకు వస్తాను. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చెయ్యి.” అన్నాడు.
మూడవరోజు హనుమంతరావు ఊరినుంచి వచ్చి “ఏమైంది… ఇద్దరిది సీనియారిటీ లెటర్స్ తెచ్చావా?”అని అడిగాడు.
దానికి మల్లేష్”చెప్తా… చెప్తా”అంటూ అక్కడి నుంచి బిజీగా ఉన్నట్టు వెళ్లిపోయాడు.
ఇంతలో అటెండ్ రాజు “బాస్ పిలుస్తున్నారు” అని హనుమంతరావు చెప్పాడు.
ఈయన వాళ్ళ బాస్ దగ్గరకు వెళ్ళి”నమస్తే సార్… ! పిలిచారంట”అనగానే వాళ్ళ ఆఫీసర్ “ఏమయ్యా!?మీ కేమయినా తెలివి ఉందా!? జాబ్ పర్మినెంట్ కోసం, సీనియారిటీ లెటర్ తెచ్చి అప్లికేషన్ నింపి హెడ్ ఆఫీసులో సబ్మిట్ చేయమన్నాను కదా…! నీతోటి వాడు మల్లేష్ నిన్ననే సబ్మిట్ చేశాడు, నీకు తెలుసా?”అని కేకలు వేశాడు.
దానికి నివ్వెరపోవడం హనుమంతరావు వంతు అయ్యింది. వెంటనే మల్లేష్ ను కలిసి ‘”ఏమిటి!? నా సీనియారిటీ లెటర్ తెచ్చావా!? నువ్వు నిన్ననే అప్లికేషన్ హెడ్ ఆఫీస్ లో సబ్మిట్ చేశావని కదా!?”అని అడిగాడు.
దానికి మల్లేష్”అయ్యో చెప్పటం మరిచాను,… నా ఒకనిదే ఇచ్చారు. నీది ఇవ్వలేదు. అందుకని నా అప్లికేషన్ నింపి హెడ్ ఆఫీస్ లో సబ్మిట్ చేశాను” అన్నాడు.
దానికి హనుమంతరావు”ఆ మాట ముందే చెపితే నేనే తెచ్చుకొనేవాడిని కదా… మన బాస్ చెప్పేవరకు నీ అప్లికేషన్ హెడ్ ఆఫీస్ లో సబ్మిట్ చేసింది కూడా
చెప్పలేదు, నేను అడుగుతున్నా కూడా. నీవు నాకు ఇంత ద్రోహం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు”అని బాస్ పర్మిషన్ తీసుకుని సీనియారిటీ లెటర్ తెచ్చి అప్లికేషన్ నింపి హెడ్ ఆఫీస్ లో సబ్మిట్ చేశాడు.
మల్లేష్ అసలు ఉద్దేశం ఏమిటంటే!తను ముందు అప్లికేషన్ ఇస్తే సీనియారిటీ ప్రకారం తాను ముందు పర్మినెంట్ కావాలని ఇలా చేశాడు. అసలు మొదట
హనుమంతరావుకే సీనియారిటీ ఉంది.
ఇలాంటి స్నేహితులతో ఎప్పటికీ ముప్పు ఉంటుంది.
స్నేహం ముసుగులో వెనుక గోతులు తీస్తారు. మచ్చ లేని స్నేహానికి ఇలాంటి వారి వలన కళంకం ఏర్పడుతుంది.
తరువాత ఇంటర్వూలో, టెస్ట్ లో అందరి‌ దగ్గరికి రికమండేషన్ కొరకు తిరిగాడు మల్లేష్.
హనుమంతరావు మటుకు టెస్ట్ రాసి, ఇంటర్వూకు వెళ్లి, ఇంకా తన మామూలు ఆఫీస్ పనులలో చేరాడు.
ఇక రిజల్ట్ తెలిసే రోజు వచ్చింది. మల్లేష్ పుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తీరా చూస్తే తాను ఒకరికి ద్రోహం చేయాలనుకుంటే పైన ఉన్న వాడు గమనించుతాడు. ఇక హనుమంతరావు పేరు మాత్రమే లిస్ట్ లో ఉంది. నల్ల‌బడిన మొఖంతో మల్లేష్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి నమ్మకద్రోహులతో స్నేహం పాముకు పాలు పోసి పెంచినట్లే.

* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *