February 9, 2023

పునర్జన్మ

రచన: G.S.S. కళ్యాణి

సమయం సాయంత్రం మూడు గంటలు కావస్తోంది. నగరంలోని ఒక ప్రఖ్యాత కార్పొరేట్ ఆసుపత్రిలో మంచంపై పడుకుని ఉన్న ప్రసాదరావుకి మెల్లిగా స్పృహ వస్తోంది. అలా ఎన్ని గంటలు పడుకున్నాడో తెలియదు, కానీ తన భార్య కళావతి తనున్న గది బయట నిలబడి ఎరితోనో మాట్లాడుతూ ఉంటే, అస్పష్టంగా వినపడుతున్న ఆ మాటలను వినడానికి ప్రయత్నించాడు ప్రసాదరావు.
“డాక్టరుగారూ! మావారిని బ్రతికించుకునే మార్గమే లేదంటారా? ప్లీజ్ డాక్టర్!! మీరే ఏదో ఒక మార్గం చూపించి ఆయనకేమీ కాకుండా చూడండి” ప్రాధేయపడుతోంది కళావతి.
“మేడం! మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. మరో ఇరవైనాలుగు గంటలవరకూ ఏమీ చెప్పలేం” చెప్తున్నాడు డాక్టర్.
ఆ మాటలు విన్న ప్రసాదరావు గాభరాగా “కళావతీ! కళావతీ!” అంటూ గొంతు పెకలించుకుని మరీ కేకలు వేసేసరికి, “ఆఁ ఆఁ వస్తున్నానండీ!” అంటూ పరుగున గదిలోకి వచ్చింది కళావతి. కళావతి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిపోయినట్లున్నాయి.
“కళావతీ! అసలు నాకు ఏమైందీ? నేను ఈ ఆసుపత్రిలో ఎందుకున్నాను?” ఆత్రంగా అడిగాడు ప్రసాదరావు.
“అబ్బెబ్బే..ఏమీ లేదులెండి!” అసలు విషయం దాచే ప్రయత్నం చేసింది కళావతి.
“కళా! నిజం చెప్పు. ఏమైంది నాకు?” ఈసారి కాస్త గంభీరంగా అడిగాడు ప్రసాదరావు. భర్త మాట అంటే ఎంత గౌరవముందో అంతకు మించిన భయం ఉంది కళావతికి.
“ఇవాళ పొద్దున్న మీకు ఒంట్లో బాగుండక నీరసంతో మన ఇంట్లో పడిపోయారు. డాక్టర్ సలహాతో మిమ్మల్ని ఇక్కడ చేర్పించాము. టెస్టులన్నీ పూర్తయ్యాయట. ఆ విషయమే డాక్టరుగారితో మాట్లాడుతున్నాను. అంతే!” అంటూ చీర కొంగుతో తన కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది కళావతి.
“అంతేనా..? ఇంకా ఏమైనా చెప్పారా ఆ డాక్టరు?” కళావతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు ప్రసాదరావు.
ప్రసాదరావు కోపం ఎలా ఉంటుందో కళావతికి బాగా తెలుసు. ఇక నిజం చెప్పక తప్పదని అనుకున్న కళావతి, “అయ్యో ! మీకు ఈ విషయం ఎలా చెప్పనండీ? మీ గుండెల్లో ఎప్పటినుంచో ఏదో తీవ్రమైన సమస్య ఉందట. ఇన్నాళ్లూ ఎక్కడా బయటపడని ఆ సమస్య ఇప్పుడు ఒక్కసారిగా మన మీద పడింది! మరో ఇరవైనాలుగ్గంటల్లో.. మీకు నూరేళ్లూ నిండిపోతాయట…!” అంటూ భోరున విలపించింది.
ఆ మాటలు విన్న ప్రసాదరావు నిశ్చేష్టుడయ్యాడు.
“కళా! ఏమిటే? నువ్వంటున్నది నిజమా?? అంటే.. నాకు బతకడానికి ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉందా?!” విపరీతమైన ఆందోళన చెందుతూ అన్నాడు ప్రసాదరావు.
మృత్యువు తనకోసం ముంగిట్లో వేచి చూస్తోందన్న తలపు మింగుడు పడటంలేదు ప్రసాదరావుకి. అతడి ముఖమంతా ఒక్కసారిగా చమటలు పట్టేశాయి. తల తిరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఉన్నట్లుండి తన చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించినట్లుంది. వేగంగా కొట్టుకుంటున్న తన గుండె ఆగడానికి ఇక ఎంతో సమయం లేదని అనుకున్న ప్రతిసారీ తన గుండెచప్పుడు తనకే వినపడుతోంది వింతగా! కళ్ళు మూసుకుని, తన మనసులో ఎడతెరపి లేకుండా వస్తున్న ఆలోచనలకు అడ్డుకట్ట వెయ్యాలని విఫల ప్రయత్నం చేస్తున్న ప్రసాదరావుకు తన అరవయ్యేళ్ళ జీవితం కళ్ళముందు తిరిగింది. తనకు జన్మనిచ్చి, తనను ఎంతో కష్టపడి చదివించి, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను వారి చివరి రోజుల్లో వృద్ధాశ్రమం పాలుచేసి వారిపట్ల తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, తన చెల్లెలి పిల్లలైన పరిమళ, మిథున్ లకు అవసరానికి మించిన సహాయం చేస్తూ, కట్టుకున్న భార్యనూ, కన్నకొడుకు రాఘవనూ నిర్లక్ష్యం చెయ్యడం, తన ఇష్టాలకు వ్యతిరేకంగా ఏది జరిగినా ఓర్వని క్షణాలూ, తన పంతమే నెగ్గాలన్న పట్టుదలతో తన వారిని కష్టపెట్టిన ఘటనలూ, తను చేస్తున్న వ్యాపారంలో తన చిన్ననాటి స్నేహితుడు హరిశ్చంద్ర తనకు ఎక్కడ పోటీకి వస్తాడో అన్న భయంతో అవకాశం దొరికినప్పుడల్లా న్యాయాన్యాయాలను పట్టించుకోకుండా అతడిని తొక్కి పెట్టి ఉంచిన సందర్భాలూ, స్వార్ధంతో అక్రమంగా సాధించిన విజయాలను చూసి గర్వపడిన రోజులూ, అన్నీ ఒక్కొక్కటిగా ప్రసాదరావుకి జ్ఞాపకమొస్తున్నాయి. జీవితంలో తను ఇన్నాళ్లూ చేసిన పనులు మంచివా కాదా అన్నది తెలుసులేక మనశ్శాంతిని కోల్పోతున్నాడు ప్రసాదరావు.
తన భర్త పరిస్థితిని గమనించిన కళావతి, ఎక్కడలేని ధైర్యం కూడగట్టుకుని, “అనవసరమైన ఆలోచనలతో మీరు మనసు పాడు చేసుకోకండి. కాసేపు విశ్రాంతి తీసుకోండి!” అంది.
“కళా! నాకింకా కొన్నాళ్ళు బతకాలని ఉంది!” విచారంగా అన్నాడు ప్రసాదరావు కళావతితో.
తన భర్త ముఖంలో ధైర్యమే తప్ప భయమెన్నడూ చూసి ఎరుగదు కళావతి. అలాంటిది ఇప్పుడు ప్రసాదరావు కంఠంలో కళావతికి మొట్టమొదటిసారి వణుకు వినపడుతోంది!
“అధైర్య పడకండి. నేను నమ్ముకున్న ఆ భగవంతుడు మీకేమీ కాకుండా చూసుకుంటాడు!” అంది కళావతి.
కళావతి భగంతుడి పేరు ఎత్తినప్పుడల్లా ఆమెను కసిరేవాడు ప్రసాదరావు. కానీ ఇవాళ అతడికి కళావతిని గుడి విషయంలో కోప్పడాలని కానీ, కసరాలని కానీ అనిపించడంలేదు. ఎందుకంటే ఆ భగవంతుడు నిజంగా ఉండి తనకు సహాయం చేస్తాడేమోనని ప్రసాదరావు మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ!
అంతలో అనుకోకుండా ప్రసాదరావు స్నేహితుడు హరిశ్చంద్ర కొన్ని పళ్లతో ప్రసాదరావుని చూడటానికి వచ్చి,”ఒరేయ్ ప్రసాదూ! ఏమిట్రా మమ్మల్నందరినీ తెగ కంగారు పెడుతున్నావ్? నీకేమీ కాదురా! నీ వెనుక నేనున్నాను. వ్యాపారం వ్యాపారమే. స్నేహం స్నేహమే! ఈ చిన్ననాటి మిత్రుడు నీకు ఎప్పుడూ తోడుంటాడని మర్చిపోకు. నువ్వు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా!” అని ప్రసాదరావుకీ, కళావతికీ ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు.
“నేను ఇన్నాళ్లూ నాకు శత్రువని భావించినవాడు నాకు ఆప్తుడని ఇప్పుడే తెలుసుకున్నాను!” అంటూ ఆశ్చర్యపోయాడు ప్రసాదరావు.
కాసేపటి తర్వాత, ప్రసాదరావు విషయం తెలుసుకున్న అతడి తోటి సహోద్యోగులు కూడా ఒక గుంపుగా వచ్చి ప్రసాదరావుని పరామర్శించి వెళ్లిపోయారు.
“కళా! ఇంతమంది వస్తున్నారు. మరి పరిమళ, మిథున్ లు ఏరీ?” కళావతిని అడిగాడు ప్రసాదరావు.
“వాళ్ళా? నేను ఇందాక మీ చెల్లెలికి ఫోను చేసి, మీ ఆరోగ్యం సంగతి చెప్పాను. పరిమళ, మిథున్ లకు వేరే ఏవో ముఖ్యమైన పనులున్నాయట. ఆసుపత్రికి రావడానికి వీలుపడదనీ, ఫోనులో కూడా వాళ్ళు అందుబాటులో ఉండరనీ మీ చెల్లెలు చెప్పింది. మీ చెల్లెలికి తలనొప్పిగా ఉండటంవల్ల ఆసుపత్రికి తను కూడా రాలేనని చెప్పిందండీ” అంది కళావతి మొహమాటపడుతూ.
“అర్ధమయ్యింది కళా! నేను ఇంతవరకూ ఎవరి సుఖం కోసం తాపత్రయపడ్డానో వారికి నేను ముఖ్యం కాదన్నమాట! ” అన్నాడు ప్రసాదరావు దుఃఖంతో.
” బాధపడకండి! మీకోసం ఎవరు ఉన్నాలేకపోయినా నేనూ, రాఘవా ఉన్నాము” అంది కళావతి ప్రసాదరావుని ఓదారుస్తూ.
“ఇంతకీ మన రాఘవ కనపడడేం?” అడిగాడు ప్రసాదరావు.
“వాడు వాళ్ళ స్నేహితుడు విక్రం దగ్గరకు వెళ్ళాడండీ. మరికాసేపట్లో వచ్చేస్తాడట!” చెప్పింది కళావతి.
“స్నేహితుడా? వీడికి స్నేహాలు తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పినా…” అంటున్న ప్రసాదరావుని కళావతి వారిస్తూ, “రాఘవకి మీరంటే ప్రాణం. వాడు ఈ సమయంలో స్నేహితుడి దగ్గరకు వెళ్లాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నేను ఇప్పుడే ఇక్కడికి దగ్గర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వస్తాను. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి” అంది.
“వద్దు కళా! నువ్వు ఇక్కడే ఉండు!” దీనంగా అడిగాడు ప్రసాదరావు.
“ఈ సమయంలో మనకు సహాయం చెయ్యగలిగినవాడు భగవంతుడొక్కడే! ఒక్క అరగంటలో నేను తిరిగి వచ్చేస్తాను!” అంటూ ప్రసాదరావుని బతిమలాడి ఒప్పించి గుడికి వెళ్ళింది కళావతి.
కళావతి బయటికెళ్లిన కాసేపట్లో రాఘవ తన స్నేహితుడు విక్రంతో ప్రసాదరావు వద్దకు వచ్చి, “నాన్నా! నీకిప్పుడు ఎలా ఉందీ? వీడు నా స్నేహితుడు విక్రం. విక్రం కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు. నీ రిపోర్టులన్నీ ఒకసారి చూస్తానంటే ఇక్కడికి పట్టుకొచ్చాను” అన్నాడు. సరేనని నర్సు తన పక్కన పెట్టి వెళ్లిన రిపోర్టుల ఫైలును తీసి విక్రంకు ఇచ్చాడు ప్రసాదరావు.
విక్రం ఫైలులో ఉన్న వివరాలన్నీ పరిశీలించి రాఘవతో, “ఒరేయ్ రాఘవా! రిపోర్టులను బట్టి మీ నాన్నగారి ఆరోగ్యం ఆందోళన చెందవలసిన విషయమేరా. ఒక్కసారి నాతోరా. నీకొక చిన్న విషయం చెప్పాలి” అంటూ రాఘవను తీసుకుని గది బయటకు వెళ్ళాడు.
‘నన్ను కాపాడగలిగే దిక్కే లేదా??’ అని నిట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నాడు ప్రసాదరావు. ఆ మరుక్షణం తన నుదుటిపై తగిలిన చల్లటి స్పర్శకు కళ్ళు తెరిచి చూసిన ప్రసాదరావుకి ఎదురుగా కళావతి తనకు దేవుడి బొట్టు పెడుతూ కనపడింది.
“మిమ్మల్ని ఆ వేంకటేశ్వరుడు కాపాడతాడండీ. ఇదిగోండి ప్రసాదం!” అని అంటూ వేడి వేడి చక్రపొంగలి ఉన్న విస్తరాకును ప్రసాదరావు చేతిలో పెట్టింది కళావతి.
కళావతి చెబుతున్న వాక్యం పూర్తి చేసేలోపే రాఘవ ప్రసాదరావున్న గదిలోకి రివ్వున వచ్చి పట్టరాని సంతోషంతో, “నాన్నా! నాన్నా! నీకేం కాదు! మరి కాసేపట్లో మనం ఇంటికి వెళ్లిపోవచ్చట!!” అని చెప్పాడు.
“ఏమిట్రా? ఏమైందీ?? ఏమిటి విషయం?” రాఘవని ఆత్రంగా అడిగాడు ప్రసాదరావు.
“విక్రం చెప్తాడు విను!” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ విక్రంను ముందుకు తోశాడు రాఘవ.
“అంకుల్! మీ ఫైల్ పరిశీలించాక నాకు ఒక అనుమానం కలిగింది. ఫైలులో ఉన్న రిపోర్టుల ప్రకారం మీ ఆరోగ్యం ఉన్నట్లయితే, మీరు కళ్ళు కూడా తెరిచే స్థితిలో ఉండరు. అలాంటిది మీరు లేచి కూర్చుని ఉండటమేకాక, తత్తరపాటు లేకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అంటే ఆ రిపోర్టులలో ఏదో తేడా ఉందని గ్రహించాను. వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్లను అప్రమత్తం చేశాను. వాళ్ళు నర్సును పిలిచి ఆరా తీస్తే నర్సు వేరొకరి ఫైలును మీ ఫైలనుకుని ఇక్కడ ఉంచిందని తెలిసింది. మీ కేసును చూస్తున్న డాక్టర్ మనోహర్ ఇవాళ సెలవులో ఉన్నారట. ఆయన స్థానంలో వచ్చిన డాక్టరు సందీప్ గారికి ఈరోజు పేషెంట్లు ఎక్కువగా ఉండటంతో మీ రిపోర్టులను పైపైన మాత్రమే చూడగలిగారు. సందీప్ గారు ఫైలును పరిశీలించిన సమయానికి మీరు మందుల ప్రభావంవల్ల గాఢ నిద్రలో ఉండేసరికి మీ ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగాలేదని అనుకున్నారాయన. పొరపాటు జరిగిందని ఇప్పుడు అందరికీ అర్ధమయ్యింది. మీ అసలు రిపోర్టులు నేను పరిశీలించాను. అవి చాలా వరకూ బాగానే ఉన్నాయి. అందులో మీరు కంగారు పడాల్సినది ఏదీ లేదు!” అన్నాడు విక్రం చిరునవ్వుతో.
విక్రం మాటలు ప్రసాదరావుకు నమ్మశక్యం కాలేదు.
“ఇది మన ఊళ్ళో బాగా పేరున్న ఆసుపత్రి కదా! ఇక్కడ ఫైళ్లు అలా ఎలా తారుమారవుతాయి? పేషెంట్ పేర్లను వైద్య సిబ్బంది చూసుకుని ఉండాలి కదా?” ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాదరావు.
“ఫైళ్ల మీద ఉన్న పేషెంట్ పేర్లు ఒక్కటే కావడంవల్ల ఈ గందరగోళం తలెత్తింది అంకుల్. మీరన్నట్లు ఇది పేరున్న ఆసుపత్రే. వీళ్ళు రోగుల విషయంలో ఎటువంటి పొరపాట్లూ జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ, ఒకప్పుడు కేవలం పెద్దవయసులో ఉన్నవారికి మాత్రమే వచ్చే హృద్రోగ సమస్యలు ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. అందువల్ల ఇక్కడికి వచ్చి చేరే రోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ కారణంగా ఇక్కడ పనిచేసే నర్సులు కూడా పని ఒత్తిడిని విపరీతంగా అనుభవిస్తున్నారు. ఇద్దరు నర్సులు తమ పని కాస్త తగ్గుతుందనో ఏమో తమ ఫైళ్ల పైన పేషెంట్ పేర్లను పూర్తిగా రాయకుండా వాటిని చిన్నవి చేసి, ‘ఏ.వీ. ప్రసాదరావు’ అని రాశారు. దాంతో ఆ రెండు ఫైళ్లూ తారుమారయ్యాయి. తప్పు జరిగిందని తెలిశాక వివరాల్లోకి వెడితే మీ ఇద్దరి పూర్తి పేర్లు వేరని తేలింది. మీరు ఏ. వెంకటేశ్వర ప్రసాదరావు అయితే ఆ ఇంకొకాయన ఏ. వర ప్రసాదరావు! అదీ విషయం” వివరించి చెప్పాడు విక్రం.
విక్రం మాటలు విన్న కళావతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ, “అంటే నిజంగా ఆ వేంకటేశ్వరుడే మిమ్మల్ని కాపాడాడండీ!” అంది ప్రసాదరావుతో.
“నిజమేనే కళా! ఇన్నాళ్లూ కళ్ళుమూసుకుని అహంకారంతోనూ, స్వార్ధంతోనూ ప్రవర్తించిన నాకు, నేను చేసిన తప్పులను తెలియజేసి, నిజంగా నాకోసం తపించేవారెవరో నాపై ప్రేమను నటించేవారెవరో నాకు తెలియబరిచేందుకే ఆ భగవంతుడిలా చేసినట్లున్నాడు. భగవంతుడున్నాడని ఇప్పుడు నేను కూడా పూర్తిగా నమ్ముతున్నాను కళా! ఆయనే నాకీ పునర్జన్మను ప్రసాదించాడు. ఇక నా శేష జీవితం ఆ భగవంతుడి సేవకు అంకితం!” అంటూ ఆనందాశ్రువులు నిండిన కళ్ళతో భక్తిగా చక్రపొంగలిని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాడు ప్రసాదరావు.

*****

1 thought on “పునర్జన్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *