May 19, 2024

విరించినై… మనసున మల్లెలు – భానుమతి

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

డాకర్ పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ పేరు వినగానే కమ్మని సంగీతం, హాయిగా నవ్వుకోగలిగే హాస్యం గుర్తొస్తాయి. ఆమె అరవై సంవత్సరాల సినీజీవితంలో నటీమణిగా మాత్రమే కాదు, సంగీతజ్ఞురాలు సాహితీవేత్త, మధురగాయిని, దర్శకురాలు, నిర్మాత, ఎడిటర్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అన్నింటా ప్రవేశమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
రాజ్యలక్ష్మీ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. గేటు దాటగానే నిలువెత్తు అలమేలుమంగా, వేంకటేశ్వరుల ఫోటోలు, ‘శరణం నీ దివ్య చరణం’ – కమ్మని కంఠం మధురంగా వినపడుతుంటే లోపలికి వెళ్ళాను. కబుర్లతో, ఆమె కమ్మని కంఠం నుంచి శ్రావ్యంగా జాలువారే పాటలతో మా ఇంటర్వ్యూ ఒక మధురమైన అనుభూతిని కలిగించింది.

ప్ర. భానుమతిగారు అనగానే నాకు ముందుగా మీ ‘అత్తగారి కథలు’ గుర్తొస్తాయి. మీ కమ్మని కంఠం మనసులో మెదులుతుంది. మీరు ముందుగా రచయిత్రా? గాయనా? హీరోయినా? ఏది ముందు? మీ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి?
జ. మొదట గాయనినే! తరువాత హీరోయిన్, తరువాత రైటర్. మా నాన్నగారు బొమ్మరాజు వెంకట సుబ్బయ్యగారు. మా అమ్మ పేరు సరస్వతి. నేను ఆదివారం పుట్టానని భానుమతి అని పేరు పెట్టారు. కర్ణాటక సంగీతానికి మా నాన్నగారే నాకు మొదటి గురువు. మా ఇంట్లో అందరూ బాగా పాడతారు. మా నాన్నగారు త్యాగరాజు పరంపర నుంచి వచ్చిన గురువుగారి దగ్గర నేర్చుకున్నారు. మా నాన్నగారి మేనల్లుడు పారుపల్లి రామకృష్ణయ్యగారు కర్ణాటక సంగీత విద్వాంసులు. కర్ణాటక సంగీతమంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వినికిడితోనే నేర్చుకున్నాను. నా సంగీతం దేశమంతా వినిపించాలన్నది నాన్నగారి ఆశ. కొల్హాపూర్ నుంచి గురువుగారిని రప్పించి హిందూస్తానీ ‘గవాయి’ కూడా నేర్పించారు. నాన్నగారు నన్ను బారెట్లా చెయ్యాలనుకునేవారు. నా చేత పాటల రికార్డ్స్ ఇప్పించాలనుకునేవారు. సినిమాల వాళ్ళంటే ఆయనకు మంచి అభిప్రాయం లేదు. సినిమాల్లో చేరితే పెళ్ళవదని ఆయన భయం.

ప్ర. మీ సినీ జీవితం ఎలా మొదలైంది? ఎప్పటినుంచి యాక్ట్ చేస్తున్నారు? ఎన్ని భాషలలో చేశారు? ఎన్ని చేశారు?
జ. నాకు 13 ఏళ్ళ వయసులో నా పాటలు రికార్డ్ చేయించటానికి నాన్నగారు మద్రాస్ తీసుకు వెళ్ళారు. సి.పుల్లయ్యగారు ‘వరవిక్రయం’ సినిమాలో కాళింది పాత్ర కోసం నన్ను వేయమని అడిగారు. నాకు నటించడమంటే ఇష్టముండేది కాదు. అప్పట్లో సాంప్రదాయ కుటుంబాల వారికి సినిమాలంటే అంత మంచి అభిప్రాయం వుండేది కాదు. నాన్నగారు నేను సినిమాలలో చేయటానికి ఇష్టపడలేదు. మా నాన్నగారి గురువుగారు, టంగుటూరు సూర్యకుమారి మేనమామ మైనంపాటి నరసింహారావుగారు, ‘మా మేనకోడలు పిక్చర్లో చేస్తున్నది. ఏమీ ఫర్వాలేదు. మీ అమ్మాయి చేత కాళింది పాత్ర వేయించ’మని, సలహా ఇచ్చారు. సి. పుల్లయ్యగారు కూడా ఆ రోల్ నా చేత చేయించాలని పట్టుపట్టటంతో అందులో చేశాను. 1939లో రిలీజ్ అయి 100 రోజులు ఆడింది. మా నాన్న ప్రోత్సాహంతో మొదటి సినిమాలో, మొదటిసారి “పలుకవేమి నా దైవమా” అనే త్యాగరాజ కీర్తన పాడిన మొదటి దాన్ని కూడా నేనే.
గుజరాతీ, మళయాళం, బెంగాలీ, మరాఠీ తప్ప అన్ని భాషల చిత్రాల్లోనూ చేశాను. ఎల్.వి. ప్రసాద్ ‘గృహప్రవేశం’ సింహలీస్ (సిలోన్) భాషలోకి డబ్ చేశారు.

ప్ర. ‘భానుమతీ రామకృష్ణ’గా ఎప్పుడు మారారు?

జ. ‘కృష్ణప్రేమ’లో పనిచేస్తున్నప్పుడు పాలువాయి రామకృష్ణగారితో పరిచయం అయింది. ఆయన హెచ్.ఎమ్.
రెడ్డిగారి దగ్గర పనిచేసేవారు. ఆయనతో పరిచయం మా వివాహానికి దారి తీసింది. ఆయన సినిమాల్లో వున్నారని, పెద్దగా ఆస్తి లేదని, అందంగా వుండరని మా నాన్న ఏడాదిపాటు మా పెళ్ళికి ఇష్టపడలేదు. ఆయనలోని ఆత్మ సౌందర్యం, మంచితనం నాకు బాగా నచ్చింది. 1943లో నాన్నగారి ఆధ్వర్యంలోనే మా పెళ్ళి జరిగింది.

ప్ర. మీరు ఎన్ని చిత్రాలు చేశారు? మీకు ఏ చిత్రం నచ్చింది? మీరు ఎన్ని పాటలు పాడారు? ఏ పాట నచ్చింది?
జ. నాకు కౌంట్ చేసే అలవాటు లేదమ్మా! భానుమతి చేసింది ఏది బాగుందని చెప్పగలరు? ఏ పాట బాగుందని చెప్పగలరు?

నాకు మీ పిక్చర్లన్నీ బాగుంటాయి. పాటలూ అంతే. దేనికదే ఎంతో ఎంతో బాగుంటుంది. ‘నా జవాబూ అదేనమ్మా’ అన్నారు నవ్వుతూ.

ప్ర. నృత్యంలో మీకు ప్రవేశముందా?
జ. మొదట్లో నేర్చుకోలేదు. నాల్గవ పిక్చర్ చేసేటప్పుడు వెంపటి పెదసత్యం నేర్పించారు. పాడతాను గనుక, భంగిమల కంటే భావానికే ప్రాధాన్యత ఇస్తాను గనుక నా డాన్స్ అందరికీ నచ్చేది.

ప్ర. మీరు ఎన్ని భాషల చిత్రాలు డైరెక్ట్ చేశారు?
జ. తెలుగు, తమిళ్, హిందీ, మళయాళం పిక్చర్స్ దర్శకత్వం వహించాను. నా దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘చండీరాణి’. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషలలోనూ ఒకేసారి డైరెక్ట్ చేశాను. ఫస్ట్ లేడి డైరెక్టర్ని నేనే. డైరెక్షన్లో, ఎడిటింగ్లో నాకు మా వారు గురువు. ఆయన ఎడిటర్ కూడా అవడంతో ‘పాటకు తాళం’లాగా పిక్చర్ చాలా బాగా వచ్చేది.

‘చక్రపాణి’ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ‘విప్రనారాయణ’కి నేనే పాటలు చేశాను. నేపథ్య సంగీతం, రీరికార్డింగ్ కూడా చేశాను. చాలా సినిమాలకి మ్యూజిక్ నేనే చేసేదాన్ని కాని పేరు వేసుకోలేదు. ‘మట్టిలో మాణిక్యానికి’ డైలాగ్స్ సెట్లోనే చెప్పేదాన్ని. తరువాత వాళ్ళు వ్రాసుకునేవారు. ఆ చిత్రం బాగా ఆడిందని చలం సంబరపడిపోయాడు.

‘అంతా మనమంచికే’ నుంచి ఎడిటింగ్ నేనే చేసేదాన్ని. అంతా చిన్న పిల్లలతో ‘భక్త ధృవ మార్కెండేయ’ తీశాను.

ప్ర. అప్పటి సినిమాలకీ, ఇప్పటి సినిమాలకీ తేడా ఎలా వుంది?
జ. అప్పట్లో కథకీ, సంగీతానికి, సాహిత్యానికీ, నటనకీ ఎంతో ప్రాధాన్యత వుండేది. అందుకే ఆ సినిమాలు ఇప్పటికీ జనం చూస్తున్నారు. ఇప్పటి సినిమాలు స్పీడ్ అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయ్. మంచి మార్పు రావాలని ఆశిస్తున్నాను.

ప్ర. మీకు సాహిత్యంలో ఎలా ప్రవేశం కలిగింది?
జ. సాహిత్యంలో విశ్వనాధ సత్యనారాయణగారు నాకు గురువు. నా హ్యూమర్ ఆయన దగ్గర నేర్చుకున్నదే. ‘నీకు గుర్తున్న చిన్న సంఘటన తీసుకొని దానికి కల్పన జోడించి కథ రాయ’మని ఆయనే ప్రోత్సహించారు. కలకత్తా వెళ్ళేటపుడు జరిగిన సంఘటన ‘మరచెంబు’ కథగా వ్రాశాను. దానిని విశ్వనాథవారే కరెక్ట్ చేసి మేగజైన్ కు పంపారు. ఆ కథ నా 14వ ఏట రాశాను. సాహిత్యపరంగా ఆయన దగ్గర ఎన్నోమెళకువలు నేర్చుకున్నాను.

ప్ర. మీ ‘అత్తగారి కథలు’ చదువుతుంటే అందులోని పాత్రలన్నీ సజీవంగా ఉన్నట్టే అనిపిస్తాయి.ఆవిడ అమాయకత్వానికి జాలిపడుతూనే మనసారా నవ్వుకుంటాం. అత్తగారంటే గయ్యాళిగానే కాదు, అమాయకంగా, గడుసుగా కూడా వుంటుందని నిరూపించారు. ఆ కథలకి ఇన్స్పిరేషన్ ఏమిటి? మీరు ఎన్ని కథలూ, కథానికలూ వ్రాశారు?
జ. మా అత్తగారికి మడి, పూజలూ అవి చాలా ఎక్కువ. చాలా మంచి ఆవిడు. ఆవిడ ఆచారాలని ఇన్సిపిరేషన్‌గా తీసుకుని అత్తగారు ఎలావుంటే బాగుంటుంది అని వూహించి రాశాను. ‘అత్తగారి కథల’ వల్ల ‘ఆంధ్రపత్రిక’ బాగా పాపులర్ అయింది. అత్తగారి కథలు 1, 2 భాగాలు, భానుమతి కథానికలు 2 బుక్స్, భానుమతి కథలు 2 బుక్స్, ‘నాలో నేను’ వ్రాశాను.

ప్ర. టి.వి. సీరియల్స్ తీస్తున్నారని విన్నాను. ఏ సీరియల్స్ తీశారు?
జ. ‘నాలో నేను’ టి.వి. సీరియల్ తెలుగు, తమిళ భాషలలో తీశాను. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ‘నాలో నేను’కి అవార్డు ఇచ్చారు. ‘అత్తగారి కథలు హిందీలో తీశాను, 6 ఎపిసోడ్స్ వచ్చాయి. ‘అత్తగారి కథలు’ కి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

ప్ర. ఆటోబయోగ్రఫీని టి.వి. సీరియల్ గా తీసిన మొదటి సినిమా వ్యక్తి మీరే కదూ!
జ. ప్రశ్నలోనే జవాబు చెప్పేశారు.

ప్ర టి.వి. సీరియల్ తియ్యటం, సినిమా తియ్యటం రెండింటిలో ఏది తేలిక?
జ. టి.వి.సీరియల్ తేలిక. సినిమాకి స్క్రీన్ ప్లే నుండి ఎడిటింగ్ దాకా చాలా చూడాలి.

ప్ర. మద్రాలోని తమిళనాడు మ్యూజిక్ కాలేజ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ గా చేసిన తొలి తెలుగు మహిళ మీరే కదా! మన తెలుగువాళ్ళు గర్వించదగిన విషయం కదా ఇది!

జ. అదేమో కానీ, అప్పట్లో భానుమతిగారున్న మ్యూజిక్ కాలేజీ అనే అంతా అనేవారు. మగవాళ్ళని పంచె, లాల్చీలతో, ఆడవాళ్ళని చీరెలతో కాలేజీకి రమ్మనేదాన్ని. తమిళనాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో కూడా ప్రిన్సిపాల్ గా చేశాను. అంతా అష్టావధాని భానుమతీ రామకృష్ణ అనేవాళ్ళు.

ప్ర. ఒక విధంగా మీరు శతావధానం చేస్తున్నారనే చెప్పాలి. మీరు ఇన్ని కార్యక్రమాలు ఎలా నిర్వహించగలుగుతున్నారు?
జ. ఆ శక్తి అమ్మవారే ఇచ్చింది. ఇది వరకు శ్రీచక్రం చేసేదాన్ని. 1960లో శృంగేరీ పీఠాధిపతి పిలిచారు. చాలా ఉపదేశించారు. 1971లోనూ ఉపదేశం పొందాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. శివలెంక వీరేశలింగంగారు నాకు ఎస్ట్రాలజీలో గురువుగారు. అది కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను.

ప్ర. మీకు నటన, పాడటం, రచన, దర్శకత్వం వీటిలో ఏది బాగా ఇష్టం? దేనిలో తృప్తి కనిపించింది?
జ. నాకు రచనలు చెయ్యటమే ఇష్టం. బాగా పాడారు, బాగా ఏక్ట్ చేశారు, బాగా డైరెక్ట్ చేశారు అనేకంటే, బాగా రాశానని ఎవరైనా అంటే నాకు చాలా సంతోషంగా, తృప్తిగా ఉంటుంది.

ప్ర. ప్రస్తుతం సాహిత్యానికి ప్రజలలో ఎలాంటి స్పందన వుంది?
జ. ఇదివరలో సాహిత్యానికి చాలా విలువుండేది. పుస్తకాలు కొని మరీ చదివేవారు. ఆస్తుల కంటే ఎక్కువగా మంచి పుస్తకాలని దాచుకున్నవారూ వున్నారు. ఇప్పుడంతా స్పీడ్ యుగం. వంటలకి రెడీమేడ్ తయారీలు వచ్చినట్టే లైఫ్ ఈజీగా స్పెండ్ చేసే వస్తువులూ వచ్చాయి. అంతా మెకానికల్ లైఫ్. ఈ కాలం వాళ్ళకి పుస్తకాలు కొని చదివే ఓపిక అసలే లేదు.

ప్ర. రాజ్యలక్ష్మీ అవార్డ్ వచ్చింది కదా! కె.వి.రావ్, జ్యోతీరావ్ అవార్డ్ కూడా ఇస్తున్నారని విన్నాను?
జ. రమణయ్యరాజా చాలా మంచి పనులే చేస్తున్నారు. చిన్నవాళ్ళయినా డాక్టర్ కె.వి.రావ్, డాక్టర్ జ్యోతీరావ్ మంచి కార్యక్రమాలే చేపట్టారు.

ప్ర మీది చాలా బిజీ లైఫ్. మీ జీవితాన్ని గురించి మీరు ఎలా ఫీలవుతున్నారు?
జ. నేను సినిమాల్లో చేస్తూ, ఈ ఫీల్డ్ లోనే వున్న రామకృష్ణగారిని వివాహమాడాను. మాకొక అబ్బాయి భరణి, డాక్టర్. మనవరాలు మీనాకి మెడిసిన్ మూడో సంవత్సరం,మనవడు వెంకటేష్ మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇక్కడే ఉన్నారు.

నా మేరేజ్ లైఫ్, ఫామిలీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేశాను. అది నాకు ఎంతో తృప్తి. సినిమాలలో ఆయనకంటే ఎంతో ముందువున్నా, ఇంట్లో మాత్రం ఆయనకి వెనకగా వుండేదాన్ని. అందుకే మా జీవితం సంతోషంగా గడపగలిగాము. పురుషుని మలచుకోగలిగే శక్తి స్త్రీకి వుంది. అయినా స్త్రీ తన స్వాతంత్ర్యాన్ని లిమిటేషన్లోనే వుండేలా చూసుకోగలగాలి. అందుకే నేను నా జీవితంలో ఆనందంగా, తృప్తిగా వున్నాను.

చివరలో, ఆఫ్ ది రికార్డ్, “మీకు అహంకారం, అంటారు కదమ్మా! “అన్నాను బెరుకుగానే. నా భుజం తట్టి “నువ్వు చెప్పు” అన్నారు నవ్వుతూ. ఆమె ఆత్మాభిమానం ఎంత ఉన్నతమో, ఆమె చెప్పిన కొన్ని సంఘటనలు నాశిరస్సు వంచి నమస్కరించేలా చేసినై.


పద్మశ్రీ, కలైమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత ఆంధ్ర, వేశ్వర యూనివర్సిటీల నుంచి రెండు డాక్టరేట్లు పొందిన పద్మశ్రీ భానుమతిగారితో గడిపిన ఆ రెండున్నర గంటలలో ఆవిడ మాటలతో పాటుగా ఆమె పాడి వినిపించిన కీర్తనలూ, పాటలూ, ఆ గొంతులో తరగని మాధుర్యం నా మనసున మల్లెలు పూయిస్తుండగా, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిగర్వి, అచ్చ తెలుగులో చెప్పాలంటే పదహారణాల తెలుగింటి ఆడపడుచు నుంచి వీడ్కోలు తీసుకున్నాను.

భానుమతి గారికి, నేను1997లో, చెన్నై వెళ్ళినపుడు, ఫోను చేశాను. ఆమెసీరియలుతీస్తు బిజీగావున్నారు. తరువాత99 ఫోను చేశాను ఆమె బిజీ. మళ్ళీ 1999లో చేసినప్పుడు, ఆమె” అమ్మాయ్! నువ్వు97లో, 98లో, కూడా ఫోను చేశావు. నాకు కుదరలేదమ్మాఈసారి తప్పకుండా కలుద్దాం” అన్నారు. అన్నిరంగాలలో ,   అంత ప్రావీణ్యం వున్న భానుమతిగారు కేవలం, ఫోనులోమాత్రమే పరిచయమైన నన్ను గుర్తు పెట్టుకోవటం, అంత చక్కగామాట్లాడటం, ఆమె సంస్కారం, ఔదార్యం.

ఆమె ఆస్ట్రాలజీలో కూడా చాలా దిట్ట. నా నక్షత్రం అడిగి” ఇప్పటిదాకా అక్షర రూపంలో ,కనపడ్డావు. వినపడ్డావు(రేడియోలో), ఇకనుంచీ నువ్వు తెరమీద కనపడతావు. పుస్తకాలు వేస్తావు”అన్నారు ధృఢంగా. ఆమె చెప్పింది అక్షర సత్యం. 2000సం. దూరదర్శన్ ప్రోగ్రాంతో నా ప్రయాణం మొదలై, చాలా ఛానల్సులో ఇంటర్వూలు, ఇతర ప్రోగ్రాంలే కాకుండా, కాలమిస్టగా రచయిత్రిగా బిజీ కావటం, అందరికీ తెలిసిందే. ఇదంతా నా గొప్పకోసం వ్రాయలేదు. శ్రీమతి భానమతీరామకృష్ణగారిలోవున్న, ఈ కోణం కూడా ఆమె అభిమానులకు తెలియపరచాలనిపించి వ్రాశాను.

***

ఎప్పుడేమీ జరిగినా, మంచి చెడ్డల మహాసముద్రంలో సుఖదుఃఖాల వీచికలు ఎన్ని వీచినా, అసలెలాంటి పరిస్థితులు ఎదురైనా – మనిషి తన జీవనమార్గంలోని రెండు పటిష్టమైన దారులని ఏ మాత్రం పట్టుసడలనివ్వకూడదు. ఆ రెండు దారులే – ఆశ, నమ్మకం.
-జిగ్ జిగ్లర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *