March 29, 2024

చంద్రోదయం – 35

రచన: మన్నెం శారద

“నానీకి వళ్ళు వెచ్చబడింది, జ్వరమేమో కాస్త చూడండత్తయ్యా!” అంది స్వాతి ఆందోళనగా సావిత్రమ్మ దగ్గరకొచ్చి.
ఆమె ఆయిష్టంగా ముఖం తిప్పుకొంది.
స్వాతి జాలిగా నిలబడింది.
స్వాతిని చూడగానే ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కుతోంది. “నేను చూసేదేమిటీ? థర్మామీటరుందిగా చూడు” అంది అయిష్టంగా.
“చూసేను. నూట నాలుగుంది. వాడికెప్పుడూ ఇంత జ్వరం రాగా చూడలేదు. సమయానికి ఆయన లేరు” అంది ఆందోళనగా స్వాతి.
ఆవిడ కోడలివైపు వెటకారంగా చూసింది. “అన్నీ ఆయనకు చెప్పే చేస్తున్నావా? హాస్పిటల్ ముఖం ఎరగనట్లే మాట్లాడు తున్నావ్. రిక్షాలో తీసికెళ్లి చూపించుకో” అంది నిరసనగా.
స్వాతి బిత్తరపోయిందా మాటలకి.
దేవతలా వుండే అత్తగారు ఎందుకిలా కఠినంగా మారిపొయింది. నాల్గు రోజులుగా ఆమె ప్రవర్తన వింతగా వుంటోంది. వరదొచ్చినప్పుడు పెరిగే నీటిమట్టంలా ఆమెలో ద్వేషం క్షణక్షణానికి పెరిగిపోతోంది.
నానీని ఎంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గోరుముద్దలు తినిపించేది. ఎంత బాగా పక్కలో పడుకోబెట్టుకొని కథలు చెప్పేది.
అలాంటిది నాల్గురోజులుగా వాణ్ని దగ్గరకే రానివ్వటం లేదు. “నా మంచం చాలదు. మీ అమ్మ దగ్గర పడుకో” అని కసరటం కూడ తను విన్నది.
సారథి తల్లికి జరిగిన విషయమంతా చెప్పేసాడా? తనని ఒక్కమాట అనని, అనలేని సారథి ఈ విషయం తల్లికి చెబుతాడా?
స్వాతి మనసు పరిపరివిధాలా పోతోంది.
ఆమెకు చెప్పలేని కంగారుగా, దడగా వుంది.
చివరికి పనిపిల్ల సహాయంతో నానీని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. డాక్టర్ పరీక్ష చేసి ఓ ఇంజెక్షన్ ఇచ్చి , మందులు రాసి పంపించేసేడు.
మందులు వేసి హార్లిక్స్ కలిపి పట్టింది. వాడు వెంటనే వాంతి చేసుకున్నాడు.
మరో గంటలో వాడికి జ్వరం తగ్గాల్సింది పోయి పెరుగుతున్నట్లనిపించింది స్వాతికి.
థర్మామీటర్ పెట్టి చూడాలంటే ఆమెకు భయం వేసింది. అందులో కన్పించిన అంకె చూసి ఆమె గుండె ఆగిపోయినట్లయింది.
ఏమీ పాలుపోక మళ్లీ అత్తగారి మంచం దగ్గరకి పరిగెత్తింది.
ఆమె హృదయం ఒక్కసారిగా జాలితో నిండిపోయింది. “పద” అంటూ వాడి గదిలోకి వచ్చింది.
నానీ గట్టిగా మూల్గుతున్నాడు. ఏవో మాటల్ని పిచ్చిగా పలవరిస్తున్నాడు.
బంతిలా నట్టిల్లంతా కలియదిరిగే కుర్రాడు అలా ఒక్కపూట జ్వరానికే మంచానికి అతుక్కుపోవటం ఆమెకు కూడా బాధ కల్గించింది..
కోడల్ని బేసిన్‌తో నీళ్లు తెమ్మని టవల్‌తో ఒళ్ళంతా తుడుస్తూ కూర్చుంది ఆవిడ.
స్వాతి దుఃఖాన్ని అదిమిపెట్టి అత్తగారివైపు చూస్తూ ఆమె కాళ్ల దగ్గర కూర్చుంది.
అత్తగారు స్వాతివైపు చూసిందో క్షణం. “ఎందుకలా భయపడిపోతావు. పిల్లలన్నాక జ్వరాలు రాకుండా వుంటాయా? ధైర్యంగా కనిపెట్టుకుని చూసుకోవాలి కాని, నువ్వొక్కదానివే కన్నావా కొడుకుని?” అంది కాస్త మందలింపుగా.
స్వాతి మాట్లాడలేదు. ఆ సమయంలో ఆవిడేమన్నా పడే ఓర్పు వచ్చేసింది స్వాతికి. ఆ క్షణం అత్తగారు వరాలిచ్చే దేవతలా కంపించింది.
నానీ మూల్గటం ఎక్కువయింది. చలికి వణికిపోతుంటే రగ్గు కప్పింది సావిత్రమ్మ.
ఏడిస్తే అత్తగారు తిడుతుందేమోనన్న భయంతో దుఃఖాన్ని అదిమిపెట్టి మోకాళ్ల మీద కూర్చుంది స్వాతి.
క్షణమొక యుగంలా నడుస్తూ తెల్లారింది.
ముఖః కడుక్కుని కాఫీ కలుపుకొచ్చి అత్తగారికిచ్చింది.
కాఫీ అందుకొంటూ స్వాతినోమారు చూసి “వీణ్ణి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిది” అంది ఆవిడ.
స్వాతి అత్తగారి మాటలకి వణికిపోయింది.
“వాడికి ప్రమాదంగా వుందంటారా?” అంది ఆందోళనగా.
వెంటనే ఆవిడ సర్దుకుంటూ”అబ్బే! అదేంకాదు. హాస్పిటల్లో అయితే డాక్టర్లు చేతిలో వుంటారు. క్షణక్షణం చూస్తూ కావల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. చూసేవుగా రాత్రి వాడెంత కంగారు పెట్టేసేడో. ఇద్దరం వుంది ఏం చెయ్యలేకపోయాము” అంది.
స్వాతి అత్తగారి కాళ్లకు చుట్టుకుపోయింది. “మీరు రండి అత్తయ్యా. ధైర్యంగా వుంటుంది” అంది ఏడుస్తూ. ఆమెకు ఓ క్షణం స్వాతిలో సునంద కన్పించింది. ఆమె హృదయం జాలితో ద్రవించింది.
వెంటనే బయలుదేరింది.
రిక్షాలో దగ్గరగా వున్న మంచి నర్సింగ్‌హోంకి వెళ్ళేరు. వాళ్లు నానీని వెంటనే అడ్మిట్ చేసుకున్నారు.
ఇద్దరు డాక్టర్లు వెంటనే వచ్చి పరీక్షించి నెమ్మదిగా ఏదో చెప్పుకుంటున్నారు.
స్వాతి అధైర్యంగా “ఎలా వుంది?” అంటూ అడిగింది.
వాళ్లు స్వాతి వైపు చూసి “డోంట్ బీ అప్‌సెట్. ఉయ్ విల్ డూ ద బెస్ట్” అంటూ వెళ్లిపోయేరు.
నర్స్ వచ్చి సావిత్రమ్మని వెళ్లిపొమ్మన్నది.
“మేము బిడ్డ తల్లిని ఒక్కదాన్నే ఎలవ్ చేస్తాం. మీరు వెళ్ళిపోండి” అంది ఖచ్చితంగా.
చేసేదిలేక సావిత్రమ్మ బయలుదేరింది ఇంటికి. “నువ్వు ధైర్యంగా వుండు. అంతా వాళ్లే చూసుకుంటారు. ఆ పైన భగవంతు డున్నాడు” అంది కోడలితో వెళ్ళిపోతూ.
స్వాతి దిగులుగా నానీ బెడ్ పక్కన స్టూలుమీద కూర్చుంది. మరో అరగంటలో నానీ డొక్కలు ఎగరేయటం మొదలెట్టేడు. స్వాతి పరుగెత్తుకెళ్లి డాక్టర్ని తీసుకొచ్చింది.
అతను నానీని పరీక్షగా చూసి నర్స్‌కేదో చెప్పేడు. మరోక్షణంలో ఆక్సిజన్ సిలిండర్ ఎరేంజ్ చేసేరు. ఇంకో పక్క సెలైన్ స్టాండు అరేంజ్ చేసేరు. చూస్తుండగానే ముక్కులో ట్యూబులతో జబ్బకి గుచ్చిన సూదిలోంచి సెలైన శరీరంలోకి వెళ్తుంటే లేబరేటరీలోని యంత్రంలా తయారయ్యేడు నానీ.
చూస్తుండగానే స్పృహ కోల్పోయి ఈ లోకంలో లేనట్లున్న కొడుకుని మొద్దుబారిన హృదయంతో పిచ్చిదానిలా చూస్తూ కూర్చుంది స్వాతి.
ప్రాణం వుండీ లేనట్లు కూర్చున్న ఆమె తన భుజమ్మీద పడ్డ చల్లని చేతిస్పర్శకు ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది.
సారథి!
నానీ వైపు పిచ్చివాడిలా చూస్తూ “ఏమయ్యింది?” అన్నాడు ఆందోళనగా.
అతన్ని చూడగానే స్వాతిలో దుఃఖం వెల్లువలా పొంగింది.
హాస్పిటలని మరచిపోయి అతన్ని అల్లుకుపోయింది.
“చూడండి… వాడెలా అయిపోయేడో. వాణ్ణి యెలాగయినా బ్రతికించమనండి. కావాలంటే నా ప్రాణమైనా తీసుకోమనండి. నా నానీని బ్రతికించమనండి. వాడు లేకపోతే నేను బ్రతకలేనండి. బ్రతకలేను” స్వాతి వెక్కెక్కి ఏడుస్తుంటే సారథి మౌనంగా ఆమె తల నిమురుతూ వుండిపోయేడు.
అతనికి నానీ పరిస్థితి చూసేక ధైర్యం సడలిపోయింది.
వెర్రివాడిలా తలపట్టుక్కూర్చున్నాడు.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *