April 18, 2024

తాత్పర్యం – ప్రమేయం (ఒక కథ … మూడు ముగింపులు)

రచన: రామా చంద్రమౌళి

అదృష్టం. అంటే దృష్టము కానిది. అంటే కనబడనిది .
ఏమిటి కనబడనిది.?
ఏదైనా. నేటికి రేపు. కనబడనిది. వర్తమానానికి భవిష్యత్తు కనబడనిది. మనిషికి మనసు. కనబడనిది. కళ్ళకు గాలి కనబడనిది. అసలు మున్ముందు జరుగబోయే జీవితం ఏమిటో. అస్సలే కనబడనిది.
ఒక స్త్రీ, పురుషుడి జీవితంలో ‘ పెళ్ళి చూపులు ‘ అనే ప్రహసనం ఎంత పెద్ద జోకో అనుకుంది లీల. వెంటనే అమ్మ జ్ఞాపక మొచ్చిందామెకు. తనను పెళ్ళి చూపులకు అలంకరించి హాల్లోకి తీసుకు వస్తూ అమ్మంది “ఈ పెళ్ళి చూపులు ఒట్టి తంతమ్మా. ఎవరికి ఎవరు నుదుటిపై రాసిపెట్టుంటే వాళ్లతోనే పెళ్ళి. అంతా అదృష్టం. అంతే.” అని . నిజమే కదా. ఆ క్షణం వరకు ఒకరి ముక్కూ ముఖం మరొకరికి తెలియని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఓ పావు గంటలో ఒకరినొకరు ఏమి తెలుసుకుంటారు. ఏమి చూచుకుంటారు. ఒట్టి ముఖం, రూపురేఖలూ, రంగూ, ఒడ్డూ పొడుగూ వంటి శారీరక పరామీటర్స్ తప్పితే, మనసు. తత్వం. ప్రవర్తన. అభిరుచులు. జీవితం పట్ల దృక్పథం. ఒకరి వ్యక్తిత్వం గురించి మరొకరికి అవగాహన. ఒక జీవితకాలం కలిసి జీవించవలసిన ఇద్దరు వ్యక్తులు ఒకరిని మరొకరు విశ్వసించి ముందడుగు వేయగల ధీమా. ఇవన్నీ ఎలా అర్థమౌతాయి. అమ్మ చెప్పినట్టు . అంతిమంగా ఒక స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ కేవలం అదృష్టాన్ని బట్టే లభిస్తారా.”
ఉన్నట్టుండి ఆకాశం భయంకరంగా ఫెళఫెళ మని ఉరిమి. ఎక్కడో పిడుగు పడ్డట్టయి ఉలిక్కిపడ్డది లీల.
ఇరవై ఆరేళ్ళ బంగరు బొమ్మ లీల. లీల ఎం ఎ ఇంగ్లిష్. గోల్డ్ మెడిలిస్ట్. యూనివర్సిటీ టాపర్. మంచి డాన్సర్. గాయకురాలు. ఇంటర్ లో ఉన్నపుడే ‘పాడుతా తీయగా’ లో ఎంపికై ఫైనల్ రౌండ్ దాకా వచ్చింది. ఏక సంథాగ్రాహి. ఇవన్నీ బయటకు కనిపించే సుగుణాలు. కాని బయటకు కనబడనిది .ఆమెలోని అతి సున్నిత మనస్తత్వం. అభినివేశం. స్వంత వ్యక్తిత్వం.
లీల రోడ్డుపై నడూస్తూంటే చుట్టుప్రక్కలున్న మగ జీవులన్నీ ఆమెవైపే గాక ఇంకెటువైపూ చూపులను తిప్పలేవు.
పెళ్ళైన ఈ రెండేళ్లలో ఆమె గ్రహించింది. తన వ్యక్తిత్వం పూర్తిగా ధ్వంసమై పోయిందని. ఆమె సున్నితత్వం పూర్తిగా బండ బారిపోయిందని. తనలోని సకల కళలు, తెలివితేటలు ఒక్క ” నోర్ముయ్ ” అరుపుతో పెనుగాలికి ఎండిన ఆకుల్లా కొట్టుకు పోయాయని. తను ఒట్టి నిస్సహాయయై . ఒక రకంగా చెప్పాలంటే అత్తవారింటికి, సో కాల్డ్ మొగుడు అనబడే ఒక అతి సాధారణ మగాడికి తను బానిసైపోయిందని.
అమ్మ చెప్పింది. “ఆడదానికి రెండు జీవితాలమ్మా. ఒకటి ఇక్కడ. మరొకటి అక్కడ” అని.
కాని అమ్మ చెప్పలేదు. స్త్రీకి మరణాలెన్నో.
భర్త అభిరుచులే భారత సామాజిక వ్యవస్థలో స్త్రీ మీదా, ఆ కుటుంబం మీదా, ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తనలపైనా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. పితృస్వామ్య ఆధిపత్యాలే అన్నీ. స్త్రీ చాలా సందర్భాల్లో ఒట్టి నిమిత్తమాత్రురాలు. ఒట్టి పట్టు చీరలకూ, నగలకూ, సమాజంలో అమ్మలక్కల వికారపు మొహమాటపు సకిలింతలకు మాత్రమే పరిమితమై కుక్కలా పడి ఉండవలసిన ఒక అర్భకురాలు.
“నేను ఉద్యోగం చేస్తా” అంది తను.
“అవసరం లేదు” అని అత్తవారింట్లో అందరి ఏకగ్రీవ తీర్మానం. తల వంచక తప్పని స్థితి.
” సర్దుకుపోవాలి తల్లీ ” అని అమ్మ ఉవాచ. “జీవితమంటేనే రాజీపడ్తూ. పరస్పర అవగాహనతో గుట్టుగా జీవించడం” అని ఒక అదనపు సలహా.
వెరసి, అందరూ కలిసి మూకుమ్మడిగా చెప్పేది “నోర్ముయ్” అని.
నోరు మూతబడింది.
ఓ ఆరు నెలల్లో మొగుడికి ఈ వరంగల్లు నగరానికి ట్రాన్స్ ఫర్. లెక్చరర్ ఇన్ బాటనీ. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్. యు జి సి స్కేల్స్. మొత్తం డెబ్భై ఆరు వేల జీతం. పై పైన బయట అన్నీ చిల్లరమల్లర దందాలు. చిట్టీలు నడుపుడు. ఎల్ ఐ సి ఏజెన్సీ. రియాల్టీ వ్యవహారాలు. పై అధికారులకు తొత్తుగా ఉంటూ చిన్న చిన్న పైరవీలు. అన్నీ కలిపి సాధ్యమైనంత తొందరగా సాధ్యమై నంత ఎక్కువగా డబ్బు సంపాదించాలనే దుగ్ధ. పైగా హద్దుమీరిన మూఢ విశ్వాసాలు. ఎవడో న్యూమరాలజీ వాన్ని సంప్రదించి తన పేరు ఇంగ్లిష్ స్పెల్లింగ్ ను వికృతంగా మార్చుకునుడు. ఎడమ చేతి దండకు ఒక తాయెత్తు. చేతికి ఒక ముస్లిం ముల్లా సలహాపై ఒక పిల్లికన్ను రంగు రాయితో వెండి ఉంగరం. అంతా చెత్త. మాట్లాడితే. రోత. ‘ చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ‘ అన్న జ్ఞానోదయం మనకే.
ఆకాశం లీల హృదయం వలేనే భీకరంగా అరిచి అరిచి, వర్షించడం మొదలైంది. పెద్ద పెద్ద చినుకులు. మబ్బులు అప్పటి నుండీ కమ్ముకొచ్చీ కమ్ముకొచ్చీ మొత్తం పగలు చీకటిగా మారింది. రివ్వుమని గాలి. ఒకటే హోరు.
ఒక స్త్రీ తను ఎంత ఉన్నత సంస్కారంగలదైనా, ఎంతో రిఫైండ్ గా , శాస్త్రీయంగా ఆలోచించగలదైనా యాదృచ్ఛికంగా దొరికిన మొగుడు ఒక మూర్ఖుడైతే ఇక ఆమె జీవితం చెప్పుకింది కాగితంలా చిరిగిపోవలసిందేనా. తన బతుకిప్పుడంతే కదా.
” ఇవ్వాళ స్పాట్ వాల్యుయేషన్ ఉంది. డిగ్రీ పేపర్లు. ఎన్ని పేపర్లు దిద్దితే అంత ఇన్కం. కనీసం రెండొందల పేపర్లన్నా దిద్దాలి. రావడానికి లేటౌతుంది” అని చెప్పి వెళ్లాడు రాజు అనబడే మొగుడు. అంటే ఏ రాత్రో. పదింటికి. అన్ని పనులూ ముగించుకుని. మందుకొట్టి, తూలుతూ రావడం అనర్థం.
టైం చూచుకుంది లీల. ఆమెకు ఆ క్షణం అకారణంగానే పట్టరానంత దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కెక్కిపడి బిగ్గరగా ఏడ్వా లనిపించింది నిస్సహాయంగా. చిన్ననాటినుండీ ఒక సఖిగా, స్నేహితురాలిగా, అమ్మగా సన్నిహితురాలైన తల్లికి ఫోన్ చేసి మాట్లాడా లనిపించి అనాలోచితంగానే ఎదుట ఉన్న ల్యాండ్ ఫోన్ రిసీవర్ తీసి నంబర్ డయల్ చేసింది.
అప్పుడుగాని ఫోన్ డెడ్ ఐ నిన్ననే బి ఎస్ ఎన్ ఎల్ కు కాంప్లేయింట్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి,
మొబైల్ ఫోన్ ను చేతిలోకి తీసుకుంది.
సరిగ్గా అప్పుడే అతి భీకరమైన గాలివానకు తాము కిరాయికుంటున్న ఆ దూరంగా విసిరేసిన ఒంటరి ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు ఫెళఫెళా విరిగి ప్రక్కనే ఉన్న కాంఫౌండ్ గోడపైన కూలిన చప్పుడు వినబడింది పెద్దగా. చటుక్కున బయటికి పరుగెత్తి చూస్తే, చెట్టు నేలకొరిగి, పెద్ద పెద్ద చినుకులతో భీకరమైన జడివాన. ఇంట్లో తనొక్కతి. ఊహించని పెద్ద వర్షం. ఊరిబయట ఒంటరి ఇల్లు. చుట్టు ప్రక్కల ఒక తోడుగానీ, ఇరుగుపొరుగుగానీ లేని దూరంగా విసిరేసినట్టున్న ఒకే ఒక్క గృహం.
” ఊరిబయట. ప్రశాంతంగా, ప్రకృతి ఒడిలో, అద్భుతంగా ఉంటది లీలా. నీకు తెలుసుకదా నేను ప్రకృతి ఆరాధకుణ్ణి ” అన్నాడు రాజు ఆరోజు.
కాని నిజం అది కాదనీ. ఇంటి కిరాయి రెండు వేలు తక్కువగా ఉండడమే ఆ ఇంటిని రాజు ఎంచుకోడానికి కారణమని. లీలకు తెలుసు. ఐతే చుట్టూ ప్రశాంతమైన వాతావరణం నచ్చి తను కూడా తలూపింది.
కాని ఈ విపత్కర బీభత్స సమయంలో, ఏదో భయం. బెరుకు. లోలోన ఆందోళన.,
టైం చూచుకుంది. మధ్యాహ్నం మూడూ పది.
కాని బయటంతా చీకటి. మబ్బులు కమ్మేసి ఆకాశం ఇక కూలిపోతుందా అన్నంత విహ్వలత.
సరిగ్గా అప్పుడు మ్రోగిందామె మొబైల్ ఫోన్. ఒక్కసారిగా ఉలిక్కిపడి” హలో ” అంది.
“మేడం మేము బి ఎస్ ఎన్ ఎల్ టెక్నీషిఎన్స్ ము మేడం. మీ టెలిఫోన్ రిపేర్ చేయడానికి. వచ్చి ఇక్కడ మీ ఇంటి బయట చెట్టుకింద నిలబడ్డాం. లోపలికి రమ్మంటారా. ” అని వినయంగా ఒక మగ గొంతు,
ఈ బీభత్స సమయంలో వీళ్లైనా తోడుంటారుకదా అనుకుని ” రండి ” అంది లీల.
ఓ ఐదు నిముషాల్లో బయటి గేట్ చప్పుడై. కిటికీలోనుండి చూస్తే, ఇద్దరు ఖాకీ దుస్తుల్లో.
యువకులే ఇద్దరూ. ఒకడి చేతిలో టూల్స్ బ్యాగ్. గేట్ ను లోపలినుండి మూస్తూ.
తలుపులు తెరిచింది లీల యథాలాపంగా.
లోపలికి వచ్చిందే తడవు వెంటనే ఒకడు లీల పైకి లంఘించి, ముఖంపై, ముక్కు దగ్గర తన దస్తీని బలంగా అదిమిపట్టి,
క్షణకాలంలో లీల స్పృహ కోల్పోతూ. గిలగిలా తన్నుకులాడుతూ, కొద్దిగా కళ్ళు తెరిచి వాళ్ళిదరినీ గమనిస్తూ,
ఒకడు బలిష్టంగా. ముఖంనిండా జ్వలిస్తున్న సెక్స్ కోరికతో, మరొకడు ఆకలిగొన్న సింహంలా,
గొరగొరా బెడ్ రూంలోకి లాక్కుపోయి. మంచంపైకి బలంగా తోసి,
ఒకడు రెండు కాళ్ళనూ పైన రెండు చేతులనూ ఎదుట హ్యాంగర్ పై నున్న లుంగీతో బంధిస్తూ,
స్పృహ కోల్పోయింది లీల పూర్తిగా.
చాలా సేపటి తర్వాత మెలకువొచ్చి . మెల్లగా. పర్వాతాలను ఎత్తుతున్నట్టు కను రెప్పలను విప్పి, తలపై ఎవరో ఒక స్లెడ్జ్ హామ్మర్ తో బాదినట్టనిపిస్తూండగా,
అంతా అవగతమైంది లీలకు.
ఇద్దరూ తనను విచ్చలవిడిగా తమ ఇచ్ఛమేరకు అనుభవించి వెళ్ళిపోయారని. కాళ్ళకు కట్లు అలాగే ఉన్నాయి. చేతులను మాత్రం విప్పినట్టున్నారు వెళ్ళిపోతూ.
బయట ఇంకా వర్షం చప్పుడు అలాగే ఉంది ఉధృతంగానే. గాలి ఊపు కూడా. మెల్లమెల్లగా మానసిక స్థితి జ్ఞాపకాలను సంతరించుకుంటూ,
మొబైల్ ఫోన్. బి ఎస్ ఎన్ ఎల్ వ్యక్తులు. టెలిఫోన్ రిపేర్.
అంతా అర్థమైంది. మెల్లగా లేచి కూర్చుని తనవైపు తానే చూచుకుంది. విధ్వంసానంతర ఉద్యానవనంలా శరీరం. అత్యంత సౌందర్యభరిత సుందర దేహం. పగిలి వ్రయ్యలైన కుండలా. బీభత్స అవశేషమై,
లేచింది. మంచం దిగింది. ముందు డ్రాయింగ్ రూంలోకి నడిచింది. చుట్టూ కలియ జూస్తే. ఇల్లంతా ఎట్లున్నది అలాగే చెక్కు చెదరకుండా. ఉన్నదున్నట్లు. ఏ వస్తువూ కదల్చబడకుండా,
అంటే వాళ్ళిద్దరూ కేవలం తనను అనుభవించడాని మాత్రమే సిద్ధపడి. దొంగలు కారు వాళ్ళు. కాని ,
ఇప్పుడు తను ‘శీలహీనా? ‘
తన ప్రమేయమేమీ లేకున్నా జరిగినదానికి. ఇప్పుడు తన ప్రతిక్రియ ఏముంటుంది. ఏముండాలి. అసలు ఈ శీలం. శీల భగ్నత. దానికి కారణాన్వేషణ. ఫలితం. భార్య భర్త. ఈ పరస్పరతలో శీల స్వచ్ఛత. సంరక్షణ. అర్పణ. ఇద్దరిలోనూ ఉండవలసిన పారదర్శకత. వాట్లో ఒక మూల కారకంగా ఒకరిపట్ల మరొకరికి ఉండవలసిన నైతిక జవాబుదారీతనం. విలువల పరిరక్షణ. ఇదంతా ఏమిటి.?
గంట దాటింది. అలాగే కూర్చుంది లీల సోఫాలో. బయట వర్షం అలాగే ఉంది. తగ్గేలా లేదు. ఉరుములు మెరుపులు.
కిటికీలోనుండి. విరిగి గోడపై పడిపోయిన మామిడి చెట్టు కనిపిస్తోంది.
‘చెట్టు విరిగిపోయింది. ఎందుకు.? ‘ ఎందుకు. అనుకుంది.
ఎదురుగా గోడ గడియారం. టైం ఆరున్నర. చీకటిపడ్తూ. బయట పల్చటి వెలుగు.
భర్త అనబడే రాజు కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయలేదు వెళ్ళినప్పటినుండి. హు.
లేచి బయటి లైట్ వేసింది. మనిషి ఏదో స్థిరపడ్తున్నట్టు. నడిచి స్నానాల గదిలోకి వెళ్లి. తలారా స్నానం చేసింది ఓ పావు గంటసేపు. బట్టలు మార్చుకుని. వంటగదిలోకొచ్చి ఒక కాఫీ తయారు చేసుకుని ప్రశాంతంగా వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని . సిప్ చేస్తూ.ఆలోచించడం మొదలెట్టింది.
వాట్ టు డు .?

మొదటి ముగింపు
రాత్రి పది దాటింది.
రాజు ఇంకా రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు.
వర్షం వెలిసింది. కిటికీల్లోనుండి ఈదురుగా గాలి.
వణికిపోతోంది లీల. తన సంస్కారం. తన వ్యక్తిత్వం. తన చదువు. నిజాయితి. వీటన్నింటి మధ్య ఏదో ఒక నిశ్శబ్ద ఘర్షణ.
సరిగ్గా పదీ యాభై నిముషాలకు. బయట మోటార్ బైక్ చప్పుడై. గేట్ తీసిన శబ్దం. లోపలికొచ్చి కాలింగ్ బెల్. బజర్.ర్ ర్ ర్.
మనిషినుండి గుప్పుమని విస్కీ వాసన ముందు. తర్వాత చల్లగా విసురుగా. వాన వెలిసిన తర్వాతి బలమైన గాలి.
“అన్నం తిన్నవా” అని ప్రశ్న తూలి పడిపోబోయి నిగ్రహించుకుంటూ, ” నేను బయటనే తిన్న. గుడ్ నైట్ ”
నువ్వు తిన్నవా అని అడగాలన్న స్పృహ లేదు.
“మీతో మాట్లాడాలి నేను కొద్దిగా” అంది లీల. చాలా బలహీనంగా.
“ఊ” అని కొద్దిగా తూగుతూ ఆగి. చెప్పమన్నట్టు చూస్తూ,
” ఈ రోజు మధ్యాహ్నం, ఏమైందంటే.” అని ప్రారంభం. ఎంతసేపూ ఒక జరుగవలసిందికాని పని జరిగిందని చెప్పి తన మనస్సులోని భారాన్ని దించుకోవాలన్న తపన ఆమెలో.
ఒక్కో ఘట్టం చెబుతున్నకొద్దీ. రాజు ఒంట్లోని తాగుడు మత్తంతా ఆవిరైపోయి. ముఖమంతా జేవురించి,
“ఇప్పుడెలా” అని తోక తెగిన కుక్కలా అటూ ఇటూ తిరిగి.”పద.బట్టలు సర్దుకో నీవు. వెళ్ళాలి మనమిప్పుడే.” అని పురమాయించాడు.
లీల భయం భయంగా అతని ముఖంలోకి నిర్లిప్తంగా చూచి లేచింది సోఫాలోనుండి.
ఆ లోగా రాజే. చకచకా బెడ్రూంలోకి తుఫానులా దూస్కుపోయి. చేతికందిన లీల బాపతు కొన్ని బట్టలను ఓ బ్యాగ్ లో కుక్కి, చేయి పట్టుకుని ఇంటి బయటికి లాక్కొచ్చి, తలుపులకు తాళమేసి, మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేసి, వెనుక ఎక్కుమని సైగ చేసి, ఒకసారి చేతి వాచీలో టైం చూచుకుని రైల్వే స్టేషన్ దిక్కు పోనిచ్చాడు బండిని.
ఆ క్షణం లీల మౌనంగా, దుఃఖితగా, ఒట్టి ఖాళీగా ఉంది.
“సత్యం వధః” అని ఆమె అంతరంగాల్లో ఒక ప్రతిద్వని ఆ క్షణం.
మళ్ళీ ఆకాశం ఫెళఫెళ మని ఉరుముతూ. పునః సమాయత్తం వర్షించడానికి.
చాలా గమ్మత్తుగా. రాజు ఆమె పుట్టింటి ఊరుకు టికెట్ తేవడం. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా రైల్వే ప్లాట్ ఫాంపై అపరిచితుల్లా నిలబడి, పది నిముషాల తర్వాత రైలు రాగానే. ఆమె కంపార్ట్ మెంట్ లోకి ఎక్కడం. అతను గిరుక్కున వెను దిరిగి వడి వడి అడుగులతో వెళ్లిపోవడం.
బోగీలో ఎక్కువ మంది లేరు. ప్యాసింజర్ బండి అది. కిటికీ దగ్గర తలపైనుండి చీర కొంగును కప్పుకు కూర్చుని చీకట్లోకి చూస్తున్న లీలకు. ‘ తనిప్పుడు తన ప్రమేయమే లేకున్నా శీలాన్ని కోల్పోయినందువల్ల భర్తచే నిరాకరించబడ్డట్టా. సీతా రాముడూ పుట్టిన ఈ పుణ్య భూమిలో. లేక సకల దుర్లక్షణాలు మూర్తీభవించిన, స్త్రీని ఒక బానిసగా భావించిన భర్త అనబడే దుర్మార్గుని నుండి విముక్తినీ , స్వేచ్ఛను పొందినట్టా ‘
లీల చాలా నిశ్చలంగా చూస్తోంది చీకట్లోకి .

రెండవ ముగింపు
సరిగ్గా పదీ యాభై నిముషాలకు. బయట మోటార్ బైక్ చప్పుడై. గేట్ తీసిన శబ్దం. లోపలికొచ్చి కాలింగ్ బెల్. బజర్.ర్ ర్ ర్.
భర్త రాజు. రాత్రి పదీ యాభైకి వచ్చాడు. బాగా తాగి తూలుతూ. ప్రతి రోజులాగానే.
“భోజనం వడ్డించనా” అంది లీల.
” ఊ.” అన్నాడు డైనింగ్ టేబుల్ పై కూర్చుంటూ,
వడ్డించి. అతని ముందు కుర్చీలో కూర్చుండి. తను కూడా భోజనం వడ్డించుకుని,
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం చాలా సేపు.
“చెప్పు లీలా. ఎందుకు నిశ్శబ్దంగా అదోలా ఉన్నావ్” అన్నాడు రాజు యథాలాపంగా.
“ఒక ఘోరం జరిగిపోయిందండీ” అందామె బెరుకు బెరుగ్గా.
చెప్పు అన్నట్టు తలెత్తి చూశాడతను.
లీల జరిగిందంతా నెమ్మదిగా. విషాదంగా. వివరంగా చెప్పింది పదినిముషాల్లో.
రాజు షాక్ ఐ. భోజనాన్ని మధ్యలోనే విడిచిపెట్టి. లేచి పడగ్గదిలోకి వెళ్ళి పోయి. మంచంపై వెనక్కి వాలి,
కాస్సేపాగి లీల కూడా వెళ్ళింది గదిలోకి, ఆందోళనగా.
ఒక పావుగంట ఇద్దరి మధ్య నిశ్శబ్దం తర్వాత. అతనన్నాడు.”దీంట్లో నీ ప్రమేయమే లేదు కదా లీలా. ఇది ఎటువంటి ఘటనంటే మనకు సంబంధమే లేకుండా పైన ఒక బల్లి పడితే. ఏం చేయగలం మనం. ఊర్కే స్నానం చేసి. శరీరాన్ని శుద్ధి చేసుకుని మన పనిలో మనం పడిపోతాం కదా. ఇదీ అంతే. దాన్ని జ్ఞాపకాల్లోనుండి పూర్తిగా తొలగించి. అన్నీ మర్చిపో. జస్ట్ రిలాక్స్. నిశ్చింతగా నిద్రపో.” అని.
లీల కొయ్యబారిపోయినంత ఆశ్చర్యంగా రాజువైపు చూచి కృతజ్ఞతగా నవ్వుకుంది. కళ్ళనిండా ఒక అభావ దృక్కుతో అలా ఉండిపోయి . ఓ రెండు నిముషాల తర్వాత నిద్రలోకి జారిపోయింది.
రాజు ఆమె ముఖంలోకి అలా చూస్తూండగానే. ప్రసన్నమైన లీల ముఖం అతనికి ఏ మబ్బూ లేని నిర్మలాకాశంలా కనబడిందా క్షణం.

మూడవ ముగింపు
చాలాసేపే తర్జనభర్జన పడింది లీల. ఇప్పుడేం చేయాలా అని.
వెనుకటి పాత తెలుగు సినిమాల్లో హీరోయిన్ను ఒక దుండగుడెవడో రేప్ చేస్తే. ఘంటసాల ఎలుగెత్తి. ఉచ్ఛైస్వరంలో.’ తల్లీ, నీ శీలం పోయెనా చెల్లీ ‘ అని ఒక నేపథ్య గీతం పాడుతున్న ఘటన జ్ఞాపకమొచ్చి,
శీలం. చెరుచుట. తన ప్రమేయమే లేని ఒక బలవంతపు దుష్కార్యంను పరిగణనలోకి తీసుకునుట. అంతా ఒట్టి ట్రాష్. పరమ చెత్త. ఒంటిపై బురద పడితే కడుక్కునుట. దట్ మచ్ సింపుల్ ఇటీజ్. ఆ వచ్చిన దుర్మార్గులెవరు. తనను కట్టేసి. స్పృహ కోల్పోయేట్టు డ్రగ్ ఏదో ఇచ్చి. అసలు తనకేమీ తెలియదు. ఏం జరిగిందో. ఏమిటో అది. అంతా ఒట్టి కలలోలా మిథ్య. అప్రమేయ చర్య. దానికి అసలు ఉనికే లేదు.
చక చకా లేచి వెళ్ళి ముందు గదిలో ఉన్న ర్యాక్ లోనుండి ‘జయకాంతన్ కథలు’ పుస్తకం తెచ్చుకుంది.
” అగ్ని ప్రవేశం” కథను చదవడం మొదలెట్టింది.
‘ వ్యక్తిగతమైన ఏ చర్యలోనైనా. మనిషియొక్క పరిగణించదగ్గ ప్రమేయమున్నప్పుడు మాత్రమే ఆ క్రియకు గుర్తింపూ. విలువా ఉంటాయి. ప్రమేయమే లేనప్పుడు. అసలది లెక్కలోకి తీసుకోదగ్గ విషయమే కాదు. కేవలం త్యజిస్తూ మరిచిపోదగ్గ ఘటనే ఔతుందది ‘ అంటాడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జయకాంతన్. కొన్ని అప్రాచ్యపు విషయాలను ఊర్కే మనసులోనుండి తొలగించి సింపుల్ గా మరిచిపోవడం మంచిది. అనుకుంది లీల.
సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మ్రోగింది.
రాజు పిలుస్తున్నాడు కూడా. ‘ లీలా లీలా’ అని.
గబ గబా వెళ్ళి తలుపులు తెరిచి.,
ఆ రోజు రాజు తాగి రాలేదు. ప్రసన్నంగా కూడా ఉన్నాడు. ‘ఇవాళ మూడువేలు మొత్తం సంపాదన’ అన్నాడు సంతోషంగా. అని వెళ్ళి ఓ పది నిముషాల్లో స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చున్నాడు.
లీల నిశ్శబ్దంగానే తామిద్దరికీ వడ్డించింది.
ఇద్దరూ భోంచేస్తూ ఆ రోజు మామిడి చెట్టు విరిగి పడిపోవడం గురించి లీలా, తను ఎలా క్యాంప్ ఆఫీసర్ ను మేనేజ్ చేసి ఎక్కువ పరీక్ష పేపర్లను దిద్దిందీ రాజూ మాట్లాడుకున్నారు.
తర్వాత అరగంటకు. వాళ్ళ బెడ్ రూంలో సన్నగా బెడ్ ల్యాంప్ వెలుగుతోంది.
ఇద్దరూ అదమరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
బయట వర్షం పూర్తిగా తగ్గి వెన్నెల కురుస్తోంది.

(నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నప్పుడు ఈ కథను ఓ యాభై మంది విద్యార్థినులకిచ్చి చదివి లీలకు సంబంధించిన ఏ ముగింపు సరియైందో చెప్పమని అభిప్రాయ సేకరణ చేశాను. చాలా మంది మూడవ నిర్ణయమే సరియైందని అభిప్రాయపడ్డారు. ఈ తరం అమ్మాయిల ఆలోచనా విధానం అర్థమౌతోంది . కదా – రచయిత )

2 thoughts on “తాత్పర్యం – ప్రమేయం (ఒక కథ … మూడు ముగింపులు)

  1. మూడు ముగింపులూ…జరిగే అవకాశం వున్నా…రెండో ముగింపు అంత తొందరగా జీర్ణించుకోవడం కష్టం. బావుంది.

Leave a Reply to Saswathi ponnada Cancel reply

Your email address will not be published. Required fields are marked *