March 28, 2024

మంచుపూల వాన

రచన: రమాదేవి బాలబోయిన

“శారదక్కా! ఈరోజు మీరు ఆ భోజనాల ఆటోతో రోడ్ నెంబర్ 13 లోని రాజనందనం అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయండి” అంది జ్యోతి మధ్యవయస్కురాలైన ఓ స్త్రీ వైపు చూస్తూ.
“అలాగేలేమ్మా” అని తలూపుతూ…ఇక తప్పుతుందా అన్నట్లుగా మొహం తిప్పుకుని కౌంటర్ మీద ఉన్న ఐడెంటిటీ కార్డ్ మెడలో వేసుకుంది శారద.
మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా…”ఆహ్… అక్కా! వాళ్ళు మనకు పదహారు వేల మూడొందల రూపాయలు ఇస్తారు. ఈ రశీదు వారికిచ్చి డబ్బు తీసుకురండి” అంటూనే “ఇదిగోండి అక్కా! తిరిగి వస్తూన్నప్పుడు రేపటి కోసం కావలసిన కూరగాయలన్నీ రైతుబజార్ లో కొనుక్కురండీ” శారదకు వెయ్యి రూపాయలు ఇస్తూ అన్నది జ్యోతి చిరునవ్వుతో.
“మరెవరినైనా పంపొచ్చుగా?” కాస్త విసురుగానే అడిగింది శారద.
“మనకు రేపు ఉదయం రెండు, సాయంత్రం ఒకటి మొత్తం మూడు ఆర్డర్లు ఉన్నాయి అక్కా…వీళ్ళకి తలా ఒక పని ఉండనే ఉంది…మీరెళ్ళొచ్చే దారిలోనే కాబట్టి మీకు చెప్పాను. ఇదిగోండి లిస్ట్ రాసి పెట్టాను…వీటిలో ఉన్నవి అన్నీ తీసుకురండి” అంటూ శారదను ఆటోతో పంపించేసింది జ్యోతి. శారద మాత్రం మూతి తిప్పుకుని అయిష్టంగానే వెళ్ళింది.
అసలే మధ్యాహ్నం సమయంలో కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ఘుమఘుమలాడే వంటకాలను కళ్ళెదుట ఉంచు కుని తినలేకపోగా, ఆ కస్టమర్ వాళ్ళ బంధువులకు భోజనం వడ్డించడం అంటే ఎంత బాధనో ఎంత ఇబ్బందో ఈమెకేం తెలుసు. లోలోన గొణుక్కుంటూ ఆటోలో వెళ్ళిపోయింది శారద. ఎవరూ లేని తాను పొట్టకూటికోసం అక్కడ పనిచేస్తే మాత్రం అలా తిండీ తిప్పలు లేకుండా మాడ్చేస్తోందని తిట్టుకుంది కూడా.
చిన్నగా నవ్వుకుంటూ అక్కడున్న మరో పన్నెండు మంది మహిళలకు తలా ఒక పని అప్పజెప్పింది జ్యోతి. తరువాత తన ఇతర పనుల్లో నిమగ్నమైపోయింది. నిజానికి అక్కడున్న వాళ్ళలో తక్కువ పనిచేసే శారద గుణం అందరికీ తెలుసు.
అక్కడ వివిధ వయసుల్లో ఉన్న మహిళలల్లో కొందరు బియ్యం, పప్పులు శుభ్రం చేయడం, కొందరూ టిఫిన్లకు పప్పులు నానబెట్టడం, పచ్చళ్ళకు ముక్కలు తరగడం,వడియాలు పెట్టడం లాంటి పనులన్నీ చకచకా చేస్తున్నారు.
అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా పనిచేస్తున్నారు. తమ తమ కుటుంబ పోషణ కోసం ఏ పనీ దొరకని సమయంలో అక్కడ చేరారు. వాళ్ళంతా నలభై యాభై ఏళ్ల వయసులో విధి వంచించగా ఆ విధినే ప్రశ్నిస్తూ జీవితాన్ని గెలవాలనుకుంటున్నవాళ్ళు.
ముఖ్యంగా జ్యోతి ఏనాడూ యజమానురాలిగా ప్రవర్తించకుండా అందరినీ “అక్కా” అంటూ పిలుస్తూ అందరినీ కలుపుకు తిరిగుతుంది. ఆమె వెంట ఉన్నంతసేపు వాళ్ళకసలు సమయమే తెలిసేది కాదు. ఆమె ఆత్మీయతలో అలసట కూడా తెలిసేది కాదు. పనిలో ఉత్సాహం పెరిగేది. అందుకే అంతా కలిసి “జ్యోతి హోం”లో ఆత్మీయబంధువుల్లా ఉండేవారు.
జ్యోతి తన కేటరింగ్ & హోంఫుడ్ సప్లై హోం కి ప్రొప్రైటర్ . కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకోవడం, సమయానికి అన్నీ తయారు చేయించి కస్టమర్ చెప్పిన సమయానికన్నా అరగంట ముందే అందజేయడం లాంటివన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది. అందుకే ఆమె ఫుడ్స్ కు అతి తక్కువ సమయంలోనే కస్టమర్స్ పెరిగి చాలా మంచి పేరొచ్చింది.
చిన్నప్పటి నుండి అనాధగా పెరిగినా కూడా ఎన్నడూ తన కష్టాలను ఎవరితోనూ పంచుకోని జ్యోతి గుంభనంగా ఉంటుంది. చిన్నప్పుడు భోజనం కోసం తాను ఎంత అంగలార్చిందీ, అడిగిన వాళ్ళు ఛీ కొడితే ఎంత దుఃఖించిందీ ఎన్నడూ మరువలేదు. అందుకే ఎవ్వరినీ పస్తులుండనీయదు.
** *

ఎప్పటిలాగే పనిలో లీనమైపోయింది జ్యోతి. అంతలో ఫోన్ మోగింది. కస్టమర్ అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది.

“హలో…ఔనండీ జ్యోతినే మాట్లాడుతున్నాను”
అటునుండి వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియదు‌…జ్యోతిలో వస్తున్న మార్పులు చూసి అక్కడే పనిచేస్తున్న వాళ్ళంతా జ్యోతి చుట్టూ మూగారు.
“ఏమైందమ్మా…ఎందుకలా నీరసపడిపోతున్నారు. జ్యోతమ్మా…ఏమైందమ్మా”అందరూ కంగారు పడుతూ అడుగసాగారు.
“మన ఫుడ్ ఆటోని లారీ గుద్దేసిందంట. శారదక్కకు గాయాలయ్యాయని చెబుతున్నారు. నన్ను గాంధీ హాస్పిటల్ కి వెంటనే రమ్మన్నారు. నేను త్వరగా వెళ్ళాలి” అంటూ స్కూటీపై బయలుదేరింది జ్యోతి.
హాస్పిటల్ చేరుకున్న జ్యోతికి అదిరిపడే వార్త చెప్పారు సిబ్బంది. “చూడండి జ్యోతి ఆక్సిడెంట్ లో శారదకు కడుపులో బలంగా దెబ్బతగలడంతో లివర్ డ్యామేజ్ అయింది. వెంటనే లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేయకుంటే ఆమెకు చాలా ప్రమాదం” అని అన్నాడు డాక్టర్.
“అయ్యో! మరిప్పుడు దాత ఎవరు దొరుకుతారు”
ఏం చేయాలో పాలుపోలేదు జ్యోతికి.
ఇంతలో “నేను ఇస్తాను జ్యోతమ్మా!”అంటూ వచ్చింది జ్యోతి దగ్గర పనిచేసే డైబ్బయ్యెళ్ళావిడ. అది చూసి మాకు కూడా పరీక్ష చేయండి అంటు వచ్చారు మిగిలినవారంతా. ఎవరి గ్రూపూ సరిపోలేదు. ఒక్క జ్యోతి లివర్ మాత్రమే సరిపోతోంది.
ఏమాత్రం ఆలోచించకుండా జ్యోతి లివర్ నుండి కొంతభాగం శారదకు దానం చేసింది. ఆపరేషన్ లు వరుసగా జరిగి పోయాయి.
వారంరోజుల్లో శారదకు నయమైపోయింది…ఆ రోజే డిశ్చార్జి అయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఇంటికి తిరిగొచ్చింది.
హోం లోని మహిళలంతా ఆమెను సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. జ్యోతి శారదకు దిష్టి తీయించిందీ.
హోం చేరిన శారద పశ్చాత్తాపంతో కుమలిపోసాగింది. తన గత ప్రవర్తన గుర్తొచ్చి సిగ్గుపడింది. తానెంత రుసరుసలాడినా మనసులోఉంచుకోక ఆత్మీయంగా తనను జాగ్రత్తగా చూసుకుంటున్న జ్యోతినీ, బృందాన్ని చూసి ఆనందాశృవులు జలజలా రాలాయి.
శారదను కౌగిలించుకుని ఊరడించిన జ్యోతిని పట్టుకుని భోరుమంది. ఇలా ‘ఆత్మీయత చూపడమే అసలైన సంతృప్తి’ అని తెలుసుకుంది.
అంతేకాకుండా తానెంత కష్టాల కొలిమిలో ఉన్నా మంచుపూలవానలా ప్రేమకురించే జ్యోతి ప్రేమలో తడిసిపోయింది శారద. తన గుణం మార్చుకుని అనతికాలంలోనే అందరికీ ప్రీతిపాత్రురాలైంది శారద.

~~~~~~~సమాప్తం~~~~~~~

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *