March 29, 2024

సాఫ్ట్ వేర్ కథలు – ఆలేమగలు

రచన: రవీంద్ర కంభంపాటి

కంగారుగా నడుచుకుంటూ తన క్యూబికల్ దగ్గరికి వచ్చిన చరిత, అటూ ఇటూ చూసింది. అప్పటికే టీమ్ అంతా మీటింగ్ కి వెళ్ళిపోయేరు. ఛ.. వద్దు వద్దంటున్నా ఆ కృతిక వచ్చి కాఫీకి లాక్కెళ్లిపోయింది. వీకెండ్ వాళ్ళు చూసిన సినిమాల కబుర్లు చెప్పుకుంటూంటే, టైమే తెలీలేదు.
ఇప్పుడు ఆ టీం మీటింగ్ లో అందరి ముందూ వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ విమల్ చులకనగా చూసే చూపూ, విసిరే కామెంట్లూ పడాలి, అనుకుంటూ మెల్లగా మీటింగ్ రూమ్ వైపు నడిచింది.
మీటింగ్ రూంలో అందరూ వాళ్ళ టాస్క్ స్టేటస్ చెబుతున్నారు. మెల్లగా లోపలికి వచ్చిన చరిత వైపు విమల్ అసహనంగా చూసేడు.
తలొంచుకుని నుంచుంది చరిత.
“నీ కోడ్ ని పీర్ రివ్యూ చేయించుకోకుండా అప్లోడ్ చెయ్యొద్దని చెప్పాక కూడా, ఎందుకు చేసేవు?” అడిగేడు విమల్
“అంటే. టెస్టింగ్ కోసం వెంటనే డిప్లాయ్ చెయ్యమని కోమల్ చెప్పింది” మెల్లగా అంది చరిత
“తను అడిగితే మాత్రం? ఇక్కడో ప్రాసెస్ అనేది ఉంది.. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలని తెలీదా? ఎందుకూ పనికి రాని ఆ కోడ్ ని ఫిక్స్ చెయ్యడానికి నిన్న రాత్రి, నేను, అనిరుధ్, కార్తీక మూడు గంటలపాటు ఆఫీస్ లో ఎక్స్ట్రా అవర్స్ పని చేయాల్సొచ్చింది.. రెస్పాన్సి బిలిటీ, అకౌంటబిలిటీ లాంటి పదాలు ఎప్పుడైనా విన్నావా నువ్వు ?”
అందరూ చరిత వేపు జాలిగా చూస్తున్నారు, చరిత ఏమీ మాట్లాడలేదు, తలొంచుకుని నుంచుంది.
“మళ్ళీ మళ్ళీ చెప్పను. ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ వే ఆఫ్ వర్కింగ్” అని మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేడు విమల్
టీమ్ అందరూ చరిత దగ్గర చేరి, “టేక్ ఇట్ ఈజీ.. విమల్ సంగతి తెలుసు కదా నీకు.. టూ మచ్ స్ట్రిక్ట్” అంటూ ఎవరికి తోచినట్లు వారు ఓదార్చేరు.
మానస అంది, “ఓ కాఫీ తాగొద్దాం.. ఉదయాన్నే ఈ స్టేటస్ మీటింగ్ తో బుర్ర హీటెక్కిపోయింది”, అందరూ సరేనంటూ కాంటీన్ వేపు నడిచేరు.
“నువ్వు కాబట్టి ఓర్చుకుంటున్నావుగానీ, అదే నేనైతే ఎప్పుడో ఈ కంపెనీ వదిలేసి బయటికివెళ్ళిపోయేవాడిని” అన్నాడు మోహన్. అతను కూడా విమల్ టీంలో డెవలపర్.
“అవును. బయటకి వెళ్తే బోల్డు ఆఫర్స్ వస్తున్నాయి.. ఇక్కడి కన్నా మినిమం 40-50% హైక్ కూడా వస్తుంది” అని మానస అంటే, అందరూ తలూపేరు.
“అవును.. నిజమే.. వీళ్ళిచ్చే బోడి సాలరీకి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ లాంటి పెద్ద పెద్ద మాటలొకటి” అంది చరిత
“పైగా వీకెండ్ వర్క్ కూడా. ఏమన్నా అంటే ప్రాజెక్ట్ క్రిటికల్ అంటాడు విమల్” విసుక్కున్నాడు అజయ్
మానస ఫోన్ మోగింది.
తీసి మాట్లాడిన మానస “నీ కోసం అడుగుతున్నాడు విమల్. ‘ఫోన్ చేస్తే తియ్యట్లేదు.. డెస్క్ దగ్గర లేదు’ అంటున్నాడు” అంది చరితతో.
“కాస్సేపు ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివ్వడు. ఫోన్ ఛార్జ్ అవుట్ అయ్యిందని చెప్పు” అంటూ బయల్దేరింది చరిత
***
తన డెస్క్ దగ్గరికి వచ్చేసరికి, అక్కడే అసహనంగా నుంచుని ఉన్నాడు విమల్.
బెదురుగా ఏంటన్నట్టు చూసింది చరిత
“ఒకసారి మీటింగ్ రూమ్ లోకి రా “ అని పిలిచేడు.

మీటింగ్ రూమ్ లోకి వెళ్ళగానే చెప్పేడు,”ఇప్పటికే అందరూ నేను నిన్నేదో ఇన్సల్ట్ చేస్తున్నాను అన్నట్టుగా చూస్తున్నారు.. అందరి ముందూ నిన్ను తిట్టడం ఇష్టం లేక ఇక్కడికి పిలిచేను.. క్రిస్ తో నిన్న సాయంత్రం మీటింగ్ అటెండ్ అవ్వాలి.. నువ్వు అటెండ్ అవ్వలేదు.. నిన్ను ఫైర్ చెయ్యడం ఎంతోసేపు పట్టదు.. నేను ఏదో మంచిగా ఉంటున్నాను కదా అని నువ్వు ఇంత కేర్‌లెస్‌గాఉండడం కరెక్ట్ కాదు..”
“సారీ సర్. నిన్న ఇంట్లో ఏదో అర్జెంట్ పని ఉండి సడెన్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది.. ఐ విల్ నాట్ రిపీట్ థిస్” అంది చరిత
“ఏదో ఫార్మల్ గా ‘సర్’ లాంటివి అక్కర్లేదు. నీ పని నువ్వు సరిగా చేసుకుని ఇంకొకళ్ళకి బర్డెన్ అవకుండా ఉంటే చాలు” అన్నాడు విమల్
“ష్యూర్ సర్.. థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బాక్” అని వెళ్ళిపోయింది చరిత!
ఆ సాయంత్రం చరిత క్యూబికల్ వేపు వెళ్తూ, అక్కడ చరిత కనబడకపోయేసరికి, విమల్ గుండె గుభేల్మంది. ఫోన్ చేసేడు.. ప్చ్.. నాట్ రీచబుల్.
మానసని అడిగేడు, “ఏదో పనుందని వెళ్ళిపోయింది విమల్” అని చెప్పిందామె
ఒళ్ళు మండిపోయి, తన డెస్క్ దగ్గరికి కూచుని, చరిత చెయ్యాల్సిన పెండింగ్ వర్క్ అంతా చెయ్యడం మొదలెట్టేడు. ఆ కోడ్ అంతా పూర్తి చేసి, ఓసారి టెస్ట్ చేసి, క్లయింట్‌కి అప్డేట్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పదయింది.
హాల్లో కూచుని టీవిలో బిగ్‌బాస్ చూస్తున్న భార్య అంది, “ఇవ్వాళ నాకు వంట చేసే ఓపిక లేదు.. నువ్వే ఏమైనా చేసేయ్”
ఇంక చేసేదేం లేక, “ఛస్.. ఏదో ఈ హౌసింగ్ లోన్ తీరడం కోసం అని తనని ఉద్యోగం లో పెడితే నన్నాడుకుంటూంది” అని మనసులో అనుకుంటూంటే, “త్వరగా చేసేయ్.. మళ్ళీ లేట్ గా తిని లేట్ గా లేస్తే, నువ్వే మళ్ళీ నన్ను ఆఫీసులో విసుక్కుంటావు” అని హాల్లోంచి అరిచిందా చరిత !
* * *

5 thoughts on “సాఫ్ట్ వేర్ కథలు – ఆలేమగలు

  1. కధ లోని నీతి –
    1.ఇద్దరూ ఒకే ఆఫీసులో ఒకే టీం లో పని చేయకూడదు.
    2. కష్టమో నిష్టూరమో ఒక ఒప్పందం మీద పని చేసేటప్పుడు అది పూర్తయ్యేదాకా ఒకరి బలహీనత ల పై ఇంకొకరు ఆడుకోకూడదు. ఎక్కువ తక్కువలు పాటించకూడదు.
    3. మోస్ట్ ఇంపార్టెంట్ – every action will have an equal and opposite reaction.
    చాలా బావుంది కథ

Leave a Reply to Raveendrs Cancel reply

Your email address will not be published. Required fields are marked *