రచన: ములుగు లక్ష్మీ మైథిలి
ఈ మధుర కౌముది
ఎన్నో ఊసులకు,ఊహలకు జీవం పోస్తుంది
ఎందరో ప్రేమికులకు
వలపు కుటీరమై ఆశ్రయమిస్తుంది
ఎన్ని రాత్రులు వస్తున్నా
వెన్నెల రేయి కోసం జగతి
వేయి కనులతో వేచి చూస్తుంది
పండువెన్నెల జాబిల్లి
నిశీధిలో వెలుగులు చిందిస్తూ
పసిపాపలందరికీ పాలబువ్వ తినిపిస్తుంది
ఆకాశ వీధిలోఅందాలచందమామ
యువజంటల అనురాగానికి
తానే పల్లవి చరణాలవుతుంది
జలతారుల చంద్రికలతో
యువత మనసు దోచేస్తూ
గుండెల్లో గుబులు రేపుతుంది
అప్పుడప్పుడూ..
నీలి మేఘాల చాటున దాగి
దోబూచులాడుతూ
చంద్ర కాంతిలో విరిసిన
కలువను కవ్విస్తూ ఉంటుంది
నిండు పున్నమివేళ
కవుల లేఖినితో చెలిమి చేసి
కావ్యాలను లిఖిస్తూ
సాహితీ సుగంధాలను వెదజల్లుతుంది
బృందావనిలో రాధా కృష్ణుల సన్నిధిలో
సరస సరాగాలు పలికిస్తుంది.
వెన్నెల రేయిలో అమ్మ చేతి
గోరుముద్దలు తిని…
నాన్నతో ఆడుకుని ఎన్నేళ్ళయిందో..
ఈ వెన్నెల రేయి ఎప్పుడూ తీయని జ్ఞాపకమే!
*****