April 23, 2024

జీవనవేదం-5

రచన: స్వాతీ శ్రీపాద

అమ్మా , అమ్మమ్మ కాని అమ్మమ్మా నా లోకం. ఇద్దరూ ఊరువిడిచి హైదరాబాద్ మారు మూలకు వెళ్ళిపోయారు.
నేను పుట్టాక అమ్మ మళ్ళీ ఏదో హాస్పిటల్ లో ఉద్యోగంలో చేరింది. అతి కష్టం మీద నాన్న మీద కేస్ ఫైల్ చేసి వివాహాన్ని రద్దు చేయించగలిగింది అమ్మమ్మ. అమ్మమ్మ సంరక్షణలోనే పెరిగి పెద్దై చదువుకున్నాను. కాలేజీలో ఉండగా కాబోలు అమ్మ ఏదో కాన్ఫరెన్స్ కి ఆస్త్రేలియా వెళ్ళింది. అది అమ్మ జీవితంలో గొప్ప మలుపు.
అక్కడ పరిచయమైన డేవిడ్ అమ్మపట్ల ఎంతో ఆకర్షితుడయాడు.
అమ్మ వెంట ఇండియా వచ్చాడు. అమ్మమ్మ ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు. తనకున్న పేరు ప్రతిష్ట , ఆస్థిపాస్తులు అన్నీ వదులుకుని అమ్మతో ఇండియాలో ఉండటానికి సిద్ధపడ్డాడు. నన్ను కూతురిగా దత్తత తీసుకుందుకూ ఒప్పుకున్నాడు.
ఈ లోగా అమ్మమ్మకు స్ట్రోక్ రావడంతో అమ్మను, నన్ను ఒప్పించి వాళ్ల పెళ్ళి జరిపించింది. నలభై అయిదేళ్ళకు అమ్మ జీవితంలో స్థిరపడింది. నేను ఇంజనీరింగ్ కాగానే ఇక్కడ చదువు కుందుకు వచ్చాను. ఎమ్ ఎస్ చేసి ఉద్యోగంలో చేరి ఇలా… అంటూ ముగించింది సుమబాల.
“మీ గురించి చెప్పలేదు?”
“చెప్పడానికేముందండి? చదువు ఉద్యోగం…” ఎందుకో రవికిరణ్ కు తన పెళ్ళి విషయం సీత
సంగతీ చెప్పాలనిపించలేదు.
అటు సీత హైదరాబాద్ వెళ్ళి కాలేజీలో చేరింది.
కొత్త వాతావరణం, కొత్త జీవితం. హాస్టల్ లో ఉండటం. మొదట్లో కొంత దిగులు అనిపించేది. కాని త్వరలోనే అలవాటు పడిపోయింది.
రవికిరణ్ కి ఎన్ని ఉత్తరాలు రాసిందో … మొదట్లో పొడిపొడిగా వచ్చేవి జవాబులు …
“బిజీగా ఉన్నాను సీతా చదువూ , ఉద్యోగమూ … నువ్వూ చద్దువు మీద దృష్టి పెట్టు” అని మాటి మాటికీ అతను హెచ్చరించడంతో నిరుత్సాహపడిపోయింది.
అటు తలిదండ్రులతో , అత్తమామలతో ఆలోచనలు పంచుకోలేకపోడం, ఇటు రవికిరణ్ ముభావం ఒంటరిననే భావానికి గురిచేసాయి సీతను.
ఆ ఒంటరితనం నుండి స్నేహాలు వెతుక్కోడం మొదలైంది.
మమత హాస్టల్ లో రూం మేట్. ఇద్దరూ త్వరలోనే మంచి మిత్రులయారు.
“ఇంకా పాతకాలం ఆలోచనలేమిటి సీతా? ముందా మట్టెలు తీసెయ్. నువ్వు మట్టెలూ మంగళ సూత్రాలూ ఉంచుకోనంత మాత్రాన అయిన పెళ్ళి కానట్టు అవుతుందా? మన కాలేజీలో మనకన్న కనీసం పదేళ్ళు పెద్ద వాళ్ళైన మన లెక్చరర్లకే ఇంకా చాలా మందికి పెళ్ళి కాలేదు. చూసావుగా , నువ్విలా మట్టెలూ మంగళ సూత్రాలూ వేసుకున్నావనేగా ఇంకేం చదువు అంటూ ఎద్దేవాగా మాట్లాడుతున్నారు?” అనేది.
“అలా తీసెయ్యడం తప్పుకాదా?బావకు కీడు కాదా”
“ఏ యుగంలో ఉన్నావు సీతా? నువ్వు పెట్తుకునే ఈ మట్టెలు ఒక వెండి ఆభరణం అంతే. ఆ మంగళ సూత్రాలు మనను మనం బంధించుకునే బంగారపు ముద్రలు అంతే … ఇవన్నీ మనుషులు రాసుకున్న నియమాలే కదా …
నాగరికతతో పాటు స్వార్ధమూ పెరిగి నా అనే ముద్రవేసేందుకే గా ఇవన్నీ మొదలైనది…”
ఒకరకంగా చూస్తే మమత చెప్పేదీ నిజమే అనిపించేది సీతకు. మరో వంక తరతరాలుగా చూసిన ఆచారాలూ నియమాలూ వెనక్కు పట్టి లాగేవి.
ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో మనసు మూగపోయేది.
మొదటి నెల స్లిప్ టెస్ట్ పెట్టినప్పుడు… శూన్యంగా అనిపించిన జీవితం తప్ప మరేమీ గుర్తులేక ఏదీ గుర్తురాక అన్ని సబ్జెక్ట్ లలోనూ వందకు పది మార్కులు కూడా రాలేదు.
“పెళ్లి చేసుకుని కలల్లో ఊరేగే వాళ్లకు చద్దువులెందుకు అమ్మాయ్? హాయిగా మొగుడితో కాపురం చేసుకుని పిల్లాపాపలతో ఇల్లు పట్టుకుని ఉండక?
ఇలా కాలేజీలో చేరి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయాక ” అంటూ చెడామడా దులిపేసింది సులోచనా మేడమ్. ఆవిడ ఇంగ్లీష్ లెక్చరర్ … నలభైల్లో ఉన్నా ఇంకా పెళ్ళి చేసుకోలేదు.
అవమానంతో తల వంచుకుంది సీత.
క్లాస్ లో ఉన్న మిగతా అమ్మాయిలు ముసి ముసిగా నవ్వుకోడం కనిపించింది.
హాస్టల్ కి వచ్చాక కూడా మూడీగానే ఉండిపోయింది.
నిజానికి ఊళ్ళో అందరూ తెలివైన పిల్ల అనే అనేవారు. పెద్ద రంగు లేకపోయినా కళగల మొహం అనేవారు.
చిన్నప్పటినుండీ అందరూ రవికిరణ్ ను నీ మొగుడు నీ మొగుడు అనడంతో అదే మనసులో స్థిరపడిపోయి, ఒక ట్రాన్స్ లో మిగిలిపోయింది. బావ లేకపోతే జీవితమే లేదనిపించింది.
అత్తకూడా ఇష్టపడబట్టే పెళ్ళి జరిగింది. కాని…
ఎంత అవమానం. బావ ఇప్పుడే తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా లేడు…
“ఇలా తిండి మానేసి మూడీగా ఉంటే నీ సమస్యలు తీరతాయా?అసలు విషయమేమిటో ఎవరితోనైనా పంచుకుంటే కదా మనసు తేలిక పడేది. ప్లీజ్ సీతా అలాఉండకు” మమత అనునయంగా మాట్లాడే సరికి మంచులా కరిగిపోయి కన్నీళ్ళై ప్రవాహమయింది సీత.
ఏడుస్తూనే జరిగినదంతా చెప్పింది సీత. మమత జాలి పడలేదు. కోపంతో మండిపడింది.
“సిగ్గుందా , అలా వదిలేసి వెళ్ళిన వాడి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు లోకువ చేసుకుందుకు? అందుకే మన జాతి ఇలా అవమానాల పాలవుతున్నది. అంతలా ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్య గురించి అతనికి పట్టకపోయాక ఇది అచ్చంగా నీ బలహీనతే కదా… ఇది ఇప్పటిది కాదు పుట్టినప్పటి నుండీ నీ చుట్టూ ప్రపంచం నీళో నాటిన అబద్ధపు రుగ్మత.
ముందు నిన్ను నువ్వు నిరూపించుకో. ప్రేమంటే పడి చచ్చిపోయి కాళ్ల దగ్గర పడి ఉండటం కాదు సీతా ,నిన్ను నువ్వు తాకట్టుపెట్టుకోడం కాదు. ప్రేమ ప్రేమె ఆత్మాభిమానం ఆత్మాభి మానమే. సర్వకాల సర్వావస్థల్లోనూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఎద్దుటి వాళ్ళు నీకోశం వెంపర్లాడాలి. అంతే కాని ఇలా ఏవేవో కండిషన్లకు బానిస అవడం కాదు.”
కాస్సేపు మౌనంగా ఉండి, “లే ముందు అన్నం తిను. ఇక్కడ నువ్వు తిన్నా తినకపోయినా ఎవ్వరూ అడగరు. నిన్ను నువ్వు ఎంత శిక్షించుకున్నా ఎవరూ వచ్చి బ్రతిమాలరు.” అని కోపగించుకుంది.
ఆలోచించే కొద్దీ సీతకు ఆమె మాటల్లో నిజం లాటిదేదో ఉందనే అనిపించింది. పళ్ళెంలో సీతకోసం తీసిపెట్టిన అన్నం ముందు పెట్టి బలవంతాన తినిపిస్తూ, “చూడు సీతా ఈ ప్రేమ కోసమే మనం అంటే మన స్త్రీ జాతి తనను తాను బానిస చేసుకుంటోంది. ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే న్యాయం. ఏమిస్తామో అది అన్ని సార్లూ తిరిగి రాకపోవచ్చు. మన జీవితం మనం గడపగలిగే స్థితిలో ఉన్నప్పుడు, మన ఆత్మ గౌరవం మనం నిలబెట్టుకున్నప్పుడు కొంతైనా మెరుగుపడతాం”
అవునన్నట్టు తలవూపింది సీత.
“అయినా నేను నీకిది నాలుక చివరి సలహాగా చెప్పటం లేదు. మా అమ్మ సంగతి చెప్పుకుందుకు నేను సిగ్గుపడను. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అమ్మ ఈ ప్రేమ వ్యామోహంలోనే పడింది. అదీ పెద్ద చదువులూ చదివీ కాదు, ఇంటర్ చదివే రోజుల్లోనే. ఆ ప్రేమించిన వాడికీ అంత పెద్ద చరిత్ర లేదు. ఏదో పనులు చేసుకు బ్రతికే రకం. ఉన్నట్టుండి ఒక రోజున వాడితో పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసుకుంది. వారం రోజుల్లో తాతయ్య వాళ్ళ జాడ కనుక్కుని తన్ని, తాళి తెంచి పారేసి వెనక్కు లాక్కువచ్చాడు. ఇల్లు దాటనివ్వకుండా కాపలా పెట్టి నెల తిరక్కుండా వచ్చిన సంబంధం కుదుర్చుకుని పెళ్ళి చేసి పంపాడు. ’నాన్న ప్రైవేట్ ఉద్యోగంలో రోజులు గడపడం తప్ప చేసేదేమీ లేకపోయింది. ఇప్పుడు చెప్పు సీతా తాళి విలువ ఏమిటో,
సరే సరిపెట్టుకుని గుట్టుగా రోజులు గడిపింది అమ్మ. నేనూ, చెల్లీ ఇద్దరు పిల్లలం. నాన్న అలవాట్లకు, శ్రమకు వచ్చిన జబ్బుకు బలైపోయాడు. సరిగ్గా పదిహేనేళ్ళు కూడా లేని నేను, పదమూడేళ్ళ చెల్లి అమ్మ తప్ప ఏమీ మిగలలేదు. ప్రైవేటు ఉద్యోగం అవడం వల్ల వెనక వేసినదీ లేదు. ఇల్లూ వాకిలీ లేదు. అమ్మ చదువు ఇంటర్ మధ్యలోనే ఆగిపోడం, వంట తప్ప ఏమీ చెయ్యలేక అమ్మకు దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యలేక రోడ్డు మీద పడిన సమయంలో ధైర్యం తెచ్చుకుని తెలిసిన వృత్తినే పనిగా మార్చుకుంది.
నాలుగిళ్లలో వంట చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. నేనూ ఆలోచిస్తున్నాను ఇలా హాస్టల్ లో ఉండి, అమ్మకు భారంగా మారే బదులు, అమ్మా చెల్లీ కూడా ఇక్కడకు వచ్చేస్తే కలిసి ఉండవచ్చని. అందుకే కాలేజీ అయ్యాక ఒక గంట నేను మనకాలేజీ లోనే ట్యూషన్ లు చెప్పే ఏర్పాటు చేసుకున్నాను”
జీవితానుభవంతో చెప్తున్నాను సీతా పెద్ద గొప్పా అని కాదు ఎవరి కాళ్ల మీద వాళ్ళు
బ్రతకగలగాలి.
నీ సంగతే చూడు. నిన్ను చదువుకో అన్నాడు కాని నీ ఖర్చులకు డబ్బేమయినా పంపుతున్నాడా? తీరా నువ్వు చదివి అక్కడకు వెళ్ళినా ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చెయ్యగలవు?”
ఈసారి సీత నిజంగానే ఆలోచనలో పడింది.
అవును. పుట్టిన ఊరూ అత్త ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు. ఎంత బావ అయినా ఎలా నమ్మాలి?
గబగబా కళ్ళు తుడుచుకుంది సీత.
ఏదేమైనా చదువు ముఖ్యం అనే నిర్ణ యానికి వచ్చేసింది.
*******
” నా పేరు రవీంద్ర ” పరిచయం చేసుకున్నాడు అతను.
ఇంటర్ కాలేజీ పాటల పోటీలకు విజయవాడ వచ్చింది సీత. చిన్నప్పుడు అమ్మ వెనకాల తీసే కూని రాగలకు సరదాగా నేర్చుకున్న సంగీతం కాలేజీలో పెద్దపేరే తెచ్చిపెట్టింది. మొదటి సారి బిడియంగా ప్రార్ధన గీతం పాడినప్పుడు ఆ స్వరంలో అసాధారణ మృదుత్వానికి అందర్రూ తన్మయులైపోయారు. అంత వరకూ చదువుల్లో పెద్దగా రాణించడం లేదని ఈసడింపుగా చూసిన వాళ్ళే కల్పించుకుని మాటలు మొదలెట్టారు.
దానికి తోడు చదువు విషయం కూడా సీరియస్ గా తీసుకున్న సీత రాత్రింబగళ్ళు కష్ట
పడుతూనే ఉంది.
సంగీత పరిషత్ పాటల పోటీ పెద్ద ఎత్తున ప్రకటించినప్పుడు కాలేజీ తరఫున సీతను పంపడం
మొదటి నాలుగు రౌండ్లలో గెలుపొందడం మామూలు విషయం కాదు.
అసలు సీత కూడా ఊహించలేదు.
సంగీతపరిషత్ రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన పోటీ అని తరువాత కానీ తెలియలేదు. ఒకసారి నాలుగు రౌండ్లలో గెలుపొందాక ఇహ సీతను కాలేజీ గౌరవంగా భావించి ఆమె వెళ్ళగలిగినంత దూరం పంపాలనె నిర్ణయించుకుంది కాలేజీ. అందుకే ఒక లెక్చరర్ ను తోడిచ్చి విజయవాడ పంపారు.
ఆ పోటీ నాలుగు రౌండ్లలో ఉంది. మొదట జానపద గీతాలు. అందులో పాల్గొనే పదిమందీ జానపద గీతాలు పాడి వినిపించారు.
కొందరు ఎంకి పాటలు పాడితే కొందరు, బాగా సుపరిచితమైన, మొక్కజొన్నతోటలో ఒకరిద్దరు, స్థానిక పాటలు కొందరు పాడి వినిపించారు. రావోయి బంగారి మామా పాడాడు రవీంద్ర. సీత విలక్షణంగా హైదరాబాద్ కే పరిమితమైన బతుకమ్మ పాట పాడి వినిపించింది.
పాట కొత్తగా అనిపించి న్యాయమూర్తులను ఆకట్టుకుంది.
రెండో రౌండ్ లో లలిత సంగీతం.
రేడియో పుణ్యమా అని లలిత సంగీత గీతాలకేమీ కొదువలేకపోయింది. అద్భుతంగా సాహిత్య సంగీతాలు సమౌజ్జీలుగా ప్రవహించిన సమయం అది.
“అమ్మదొంగా నిన్ను చూడకుంటే ” అంటూ ఆర్ద్రత నింపుకుని పాడిన సీత స్వరం అందరి మనసులూ చెమ్మగిలేలా చేసింది.
రవీంద్ర కూడా ఏమాత్రం తీసిపోకుండా “భాష రాని నా హృదయం భావగీతి పాడిందీ” అంటూ ఆకట్టుకున్నాడు.
మధ్యాన్నం లంచ్ టైమ్ లో సీత దగ్గరకు వచ్చి మాట్లాడాడు రవీంద్ర.
“విన్నాను మీ పాటలు – మీస్వరం చాలా బాగుంది”
” ఇది బాగాలేదు, మీరు బాగాపాడి నాపాట బాగుందని మెచ్చుకోడం” అంది సీత.
” నాపాట మీకు బాగుందేమో మీ పాట బాగుంటే మెచ్చుకోకూడదా?”
ఇద్దరూ నవ్వుకున్నారు. ఇద్దరూ వచ్చినది హైదరాబాద్ నుండే.
అయినా చిత్రంగా పరిచయం అయినది మాత్రం విజయవాడలో.
ఎస్కార్ట్ గా వచ్చిన లెక్చరర్ లు పిల్లలను అక్కడ వదిలి అమ్మవారిని దర్శించుకుని వస్తామని వెళ్ళారు.
ఇంకా మూడో రౌండ్ అష్టపద్దులు చివరి దానిలో అన్నమయ్య గీతాలు మిగిలిపోయాయి.
ఒక గంట గాప్ ఇచ్చి లంచ్ తర్వాత రెండింటికి మొదలుపెడతామన్నారు.
ఎవరి దారిన వాళ్ళు వారి వారి పాటల ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు.
“మీరు మరోసారి పాడి చూసుకోరా?” అడిగింది సీత.
” చివరి నిమిషంలో ఏం చూసుకుంటాం? అయినా పాట ప్రారంభించాక నేను పాడుతున్నాను అనే అనిపించదు. ఏదో అతీత శక్తి నన్ను ఆవహించినట్టుగానే ఉంటుంది.”
అతని వైపు సంబ్రమంగా చూసింది సీత.
“నిజం నాకూ అలానే అనిపిస్తుంది”
ఇద్దరూ కూచుని ఏవేవో మామూలు విషయాలు మాట్లాడుకున్నారు గాని ఎవరేం పాడుతున్నారని ఒక్కళ్ళు అడగలేదు.
మూడో రౌండ్ మొదలైన కాస్సేపటికే మిగతా పోటీదారుల్లో సత్తా లేదని తేలిపోయింది.
సీత రాధికా కృష్ణా రాధికా అంటూ పాడితే రవీంద్ర ధీరసమీరే పాడాడు.
అందరికీ తెలిసిపోయింది సీత , రవీంద్ర ఫైనలిస్ట్ లని.
ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకున్నారు.
చివరి రౌండ్ కు ప్రసిద్ద సంగీత విద్వాంసులను జడ్జీలుగా పిలిచారు. పోటీలు ముగియగానే బహుమతి ప్రదానం.
ఇద్దరూ ఒకరికొకరు బెస్ట్ విషెస్ చెప్పుకున్నారు.
పిడికిట తలంబ్రాలు అంటూ రవీంద్ర పాటకు ప్రాణం పోస్తే , చేరి యశోదకు అంటూ సీత పాడి అద్వితీయంగా నిలిచింది.
చివరికి ఇద్దరినీ విజేతలుగా ప్రకటించారు. మొదటి బహుమతి ఇద్దరికీ సమానంగా పంచుతారనుకున్నారు కానీ బహుమతి రెండింతలు చేసి ఇద్దరికీ రెండు రెండు లక్షలిచ్చారు. ఇద్దరికీ ట్రోఫీలు ఇచ్చారు.

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *