March 29, 2024

అమ్మమ్మ – 42

రచన: గిరిజ పీసపాటి

“ఇంతకీ విషయం నీకు ఎలా తెలిసిందో చెప్పనేలేదు!?” అన్న కూతురుతో “మీ మామగారి నాటకం హైదరాబాదులో జరిగినప్పుడల్లా నేనా విషయం పేపర్లో చదివి తెలుసుకుని, ఒకసారి ఆయన్ని కలిసి మీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను”.
పదిహేను రోజుల క్రితం రవీంద్రభారతిలో ఆయన నాటకం ఉందని తెలిసి ఎప్పట్లాగే వెళ్తే, ఆయన జరిగిన విషయం చెప్పి, మిమ్మల్ని, నన్ను కూడా నానా మాటలు అన్నారు. అవి విని నేను భరించలేకపోయాను”.
“ఆయన కన్నా వయసులో పెద్దదాన్నయిన నన్నే అన్ని మాటలు అన్నారంటే మిమ్మల్ని ఎన్ని మాటలు అని ఉంటారో ఊహించ గలను” అంటున్న ఆవిడ మాటలకు అడ్డు వస్తూ…
“నువ్వంటే ఆయనకి ముఖాముఖి ఎదురుపడ్డావు కనుక అన్నారు గానీ, మమ్మల్ననే అవకాశం ఆయనకి రాలేదమ్మా! ఆయన ఈ ఊరు వస్తున్నారో లేదో కూడా మాకు తెలీదు. మేమాయన్ని కలిసిందీ లేదు” అంది నాగ నిజాన్ని దాస్తూ.
ఆవిడ కూతురి కళ్ళల్లోకి సూటిగా చూసి “అవునవును. ఆయన ఆ విషయం కూడా చెప్పారు. మీరాయన్ని కలవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళలేదనీ, ఆయన మిమ్మల్ని అసలు ఏమీ అనలేదని కూడా చెప్పారు” అన్న ఆవిడ మాటలకు దొరికిపోయినట్లుగా తల దించుకుంది నాగ.
“ఇంకా ఎందుకు నాగేంద్రుడూ! నా దగ్గర దాపరికం. నువ్వెంత బాధపడుతున్నావో నేనామాత్రం తెలుసుకోలేనా తల్లీ!” అంది కూతుర్ని దగ్గరగా పొదువుకుంటూ. తల్లి కౌగిలిలో పసిపిల్లలా ఒదిగిపోయి, మనసులోని భారం దిగిపోయేంతవరకు ఏడ్చింది.
అమ్మమ్మ కూడా కూతురిని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. ‘లోలోపలే ఇన్నాళ్లూ ఘనీభవించిపోయిన బాధ కన్నీటి రూపంలో వెళ్లి పోవడం చాలా మంచిది కదా!’ అనుకుంది.
కాస్త తెప్పరిల్లిన తరువాత కళ్ళు తుడుచుకుని “ఇక్కడ మా పరిస్థితి నువ్వనుకున్నంత దారుణంగా లేదులే అమ్మా! మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట నిజమే. కానీ, నాని మన ఢిల్లీతో కలిసి పనికి వెళ్తున్నాడు. వాడికి రోజుకి 20 రూపాయలు వస్తున్నాయి. వాడికి వచ్చేది, నా జీతం కలిపి పొదుపుగా ఖర్చు చేసుకుంటున్నాం” అంది నాగ.
“మరి ఇంటి అద్దె?” అడిగిందే అమ్మమ్మ.
“రెండు నెలలు ఆగమని ఇల్లుగలవాళ్ళకు అన్నపూర్ణ గారి చేత చెప్పించాం. వసంత, గిరిజ కూడా ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్లకి కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తే ఇంక దేనికీ లోటుండదు” నాగ మాట పూర్తవకుండానే…
“గిరిజా! ఇదిగో ఈరోజు న్యూస్ పేపర్” అని పిలుస్తూ వచ్చిన అన్నపూర్ణమ్మగారు అమ్మమ్మను చూసి నాగతో “మీ అమ్మగారా!” అంటూ నాగ సమాధానం చెప్పేలోపే “నమస్కారం పిన్నిగారు! మేము ఎదురింట్లో ఉంటున్నాం. మీ అమ్మాయి, మనవలు మీ గురించి చెప్తూనే ఉంటారు. ప్రయాణం బాగా సాగిందా!” అని పలకరించారు.
“బాగానే సాగిందండీ! అమ్మాయి కూడా మీ గురించి ఉత్తరాల్లో రాస్తూ ఉంటుంది. ఈ కష్టకాలంలో మీరు మా పిల్లలకి అండగా ఉంటూ, చాలా సహాయం చేస్తున్నారు. చిన్నవాళ్లు కనక మీకు నమస్కరించకూడదు. మీరు మీ పిల్లలు అది కాలాలు సుఖంగా, క్షేమంగా ఉండాలి” అంటూ ఆశీర్వదించింది అమ్మమ్మ.
ఆవిడ పది నిముషాలుండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. రోజులాగే పేపర్లో వాంటెడ్ కాల్స్ చూస్తున్న గిరిజ “అమ్మా! ఆ షాపు వాళ్లు మళ్లీ సేల్స్ గర్ల్స్ కావాలని ప్రకటన వేశారు” అనడంతో…
“అదేంటి పాత వాళ్లకి కనీసం కాల్ లెటర్స్ కూడా పంపలేదుగా! వీళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎవరూ నచ్చకపోతే అప్పుడు కదా మళ్ళీ ప్రకటన ఇవ్వాలి!?” అన్న తల్లితో “ఒకవేళ మమ్మల్ని ఇక ఇంటర్వ్యూకి పిలవరేమో!” అంది గిరిజ చిన్నబోయిన ముఖంతో.
అంతా వింటున్న అమ్మమ్మ “పోతే పోయింది వెధవ ఉద్యోగం. ఇప్పుడు మీరే ఉద్యోగాలు చేయక్కర్లేదు” అది. “అన్ని విషయాలు తెలిసి కూడా అలా అంటావేంటమ్మా” అంది నాగ చిరుకోపంతో.
“నీకేం తెలియదు నాగేంద్రుడూ! ఆడపిల్లల్ని అందులోనూ పసివాళ్ళని ఉద్యోగానికి పంపిస్తావా?” అంటూ నిలదీసినట్లు అడిగింది అమ్మమ్మ.

“నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది. నా చదువుకి సహాయం చేసి, నేను ఉద్యోగం చేయడాన్ని ప్రోత్సహించిన నువ్విలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా ఆడదాన్నేగా!” అంది నాగ.
“నువ్వు పెళ్లయినదానివి నాగేంద్రుడూ! మెడలో పసుపు తాడు ఉంటే కనీసం సగం మంది మగవాళ్ళైనా ఆడదానికి గౌరవం ఇస్తారు. వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు. ఆ విషయం మర్చిపోకు” అన్న అమ్మమ్మతో…
“ఇప్పుడు వసంత వయసుకి నాకు పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అమ్మా. రోజులు మారాయి. అయినా హైదరాబాదు లాంటి మహానగరంలో ఉండి వచ్చిన నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. అయినా వీళ్ళు ఉద్యోగం చేసే చోట అంతా బాగుంటేనే పంపిస్తాలే. లేకపోతే వెంటనే మానిపించేస్తాను. ఆ విషయంలో నువ్వు కంగారు పడకు” అంది నాగ.
“అక్కడ ఉండి, నాలుగు రకాల మనుషుల్ని చూసి వచ్చాను కనుకే ఇలా మాట్లాడుతున్నాను అమ్మాయ్. రోజులు మారినా మగవాళ్ళ బుధ్ధి మారలేదు. అందరూ కాకపోయినా కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళని చూసే చూపులోనూ మార్పు లేదు. అందుకే భయపడుతున్నాను” అంటూ అమ్మమ్మ ఇంకా ఏదో అంటుండగానే…
“వచ్చీ రాగానే ఎందుకు వాదన? త్వరగా వంట పూర్తి చేస్తాను. భోజనం అయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకో అమ్మమ్మ. నిన్న మధ్యాహ్నం అనగా తిన్న భోజనం. ట్రైన్ లో నువ్వు పళ్ళు తప్ప ఏమీ తినవు కదా!” అంటూ అక్కడికి ఆ టాపిక్ కట్ చేసింది వసంత.
” ఇందాక అడిగితే మాట మార్చేసావు గానీ, నువ్వేంటమ్మా బాగా చిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నావు? ఆరోగ్యం బాగానే ఉంది కదా!?” అని ఆందోళన, ఆప్యాయత కంఠంలో తొణికిసలాడుతుండగా తల్లిని ప్రధాన ప్రశ్నించింది నాగ.
“నాకు ఈ మధ్య బాగా సుస్తీ చేసింది నాగేంద్రుడు. అసలు బతుకుతానో లేదో అనుకున్నాను. అక్కడ అందరూ చాలా భయపడ్డారు. ఇంత వయసు వచ్చాక ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదనీ, మీ అమ్మాయి దగ్గరికి వెళ్లిపోమని చెప్పసాగారు. అందరూ ఒకే మాట పదేపదే చెప్పేసరికి నేను కూడా ఆలోచనలో పడ్డాను”.
“ఇంతలో మీ మామయ్య గారిని రవీంద్రభారతిలో కలిసి మాట్లాడాక పెదబాబు లేకుండా మీరు ఒక్కరే ఉంటున్నారు అని తెలిసింది. ఇక ఆగలేక వెంటనే అన్నీ చక్కబెట్టుకుని వచ్చేసాను. ఇంక హైదరాబాదు వెళ్ళను. నేనూ మీతో పాటు ఇక్కడే ఉంటాను. ఉన్న కొద్దిపాటి సామాను గోతాం (గోనె సంచీ) లో ప్యాక్ చేసి పెట్టాను”
“నేను ఫోన్ చేయగానే అక్కడి వాళ్ళు పంపించే ఏర్పాటు చేసొచ్చాను. వంట అవసరం ఎక్కడి వాళ్లకైనా తప్పదుగా అమ్మా! కాస్త పరిచయాలు పెంచుకొని ఆ వంట పనేదో నాకు ఓపిక ఉన్నన్నాళ్ళు ఇక్కడే చేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మీకు కష్టం రాకుండా చూసుకుంటాను” అంది అమ్మమ్మ భరోసా ఇస్తున్నట్లుగా.
అమ్మమ్మ ఇక ఇక్కడే ఉండిపోతుంది అన్నమాట వినగానే అందరూ చాలా సంతోషించారు. పిల్లలు ముగ్గురూ చిన్నపిల్లల్లా చప్పట్లు కొట్టసాగారు. ‘ఇంటికి పెద్ద దిక్కు చాలా అవసరం. అందులోనూ మగ తోడు లేని ఇంటికి మరీ అవసరం.’ అని మనసులో అనుకొంది నాగ. పిల్లల సంబరాన్ని చూసి నవ్వుతూ “భడవకనల్లారా! ఆపండి మీ గెంతులు” అని ముద్దుగా కసురుకుంది అమ్మమ్మ.

********** సశేషం **********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *