March 19, 2024

అర్చన కనిపించుట లేదు – 1

రచన: – కర్లపాలెం హనుమంతరావు

అర్చన కనిపించటం లేదు!
శుక్రవారం కావలికని సింహపురి ఎక్స్ప్రెసైన్ లో బైలుదేరిన మనిషి కావలి చేరనే లేదు! దారిలోనే మిస్సయిపోయింది!
అర్చన నారాయణగూడ గవర్నమెంటు ఎయిడెడ్ హైస్కూల్లో సైన్సు టీచర్. వయసు ముప్పై.
వయసులో ఉన్న ఆడమనిషి కనిపించకూడా పోయిందంటే ఎంత సెన్సేషన్! మీడియాకు అంతకన్నా మంచి విందేముంది?!
అర్జన భర్త ప్రసాద్ అవతల భార్య కనిపించడం లేదని టెన్షన్ పడుతుంటే మీడియా వాళ్ళ దాడి మరింత చికాకు పుట్టిస్తున్నది .
‘అర్చన ఎప్పటిలాగానే వాళ్ళ పిన్నిగారిని చూడాలని బైలుదేరింది. నేనే టికెట్టు కొనిచ్చాను. స్టేషనుదాకా వెళ్ళి బండి ఎక్కించి కదిలిందాకా వుండి మరీ వచ్చాను. తనకిమయిందోనని నేనిక్కడ టెన్షన్ పడి చస్తుంటే… ఇందులో నా హస్తమేదో ఉందని మీడియా కూయడం ఏమన్నా బావుందా !’అని గయ్యిమన్న ప్రసాదుని మిత్రుడు సుధాకర్ చల్లపరిచే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు .
‘ఎందుకైనా మంచిదిరా… ముందు వెళ్ళి పోలీసు రిపోర్టియ్యి! . మనం తాత్సారం చేసిన కొద్దీ కోడిగుడ్డుకు ఈకలు పీకే వీళ్ళ పని మరీ ఎక్కువవుతుంది ‘అని బలవంతంగా స్టేషనుకు తనే తీసుకువెళ్ళాడు.
వెళ్లే వేళకి సిఐ సీట్లో లేడు. వచ్చిన తరువాతా అరగంట సేపు ఎవరితోనో హస్కు కొడుతూ కూర్చునుంటే సుధాకర్ కలగచేసుకోవల్సి వచ్చింది.
‘సార్! మేం నాంపల్లి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంకు స్టాఫ్. వీడి పేరు ప్రసాద్. వీడి భార్య మొన్న శుక్రవారం నుంచీ కనిపించటం లేదు’ అంటూ వివరాలన్నీ ముందే రాసి పెట్టి ఉంచిన ఫిర్యాదు కాగితాన్ని సిఐ ముందుంచాడు సుధాకర్.
కంప్లయింట్ కాగితాన్ని సరిగ్గా చూడకుండానే పేపర్ వెయిట్ కింద పెట్టి సిఐ మళ్ళీ ఎవరికో ఫోన్ రింగ్ చేయబోతుంటే ఈ సారి కాస్త గట్టిగానే అన్నాడు సుధాకర్ “సార్ ! షి ఈజ్ ప్రిగ్నెంట్ . వుయార్ వెరీమచ్ వరీడ్ అబౌట్ హర్ వేరెబౌట్స్ ! మీ నోటీసులోకేమైనా వచ్చిందేమో కాస్త రికార్డులు చూసి చెప్పరా. . ప్లీజ్!”
అక్కడే నిలబడున్న కానిస్టేబుల్ సిఐ సిగ్నల్ అందుకుని వాళ్ళిద్దర్నీ పక్కగదిలోని కంప్యూటర్ ముందుకు తీసుకెళ్లి సిస్టమ్ ఓపెన్ చేసి చూపించాడు.
మొత్తం మూడు కేసులు రిజిష్టరయి వున్నాయి ఈ మూడు రోజులలో. మూడింటిలో అర్చన కేసుకి మ్యాచ్ అయేది ఏదీ లేకపోవడం కొంత రిలీఫ్ ఇచ్చింది.
‘థేంక్ గాడ్! ‘ అన్నాడు ప్రసాద్ బైటికే.
‘సార్! అన్ని కేసులూ ఇక్కడ రిజిష్టరవాలని లేదు. మీరిచ్చిన కంప్లయింట్ ఇంకా సార్ టేబుల్ మీదే ఉంది చూసారుగా!’ అన్నాడు కానిస్టేబుల్ నర్మగర్భంగా నవ్వుతూ.
విషయం అర్థమయింది.
కానిస్టేబుల్ని బైటికి తీసుకువెళ్ళి చేతిలో ఒక రెండొందలు పెట్టి ‘కనీసం ఈ కాగితం అన్నా మిస్సయి పోకుండా చూసే పూచీ మీదే’ అన్నాడు సుధాకర్.
దారిలో బైక్ వెనకాల దిగాలుగా కూర్చోనున్న ప్రసాదుతో అన్నాడు సుధాకర్ ‘ఈ పోలీసువాళ్ళని నమ్ముకుని కూర్చుంటే లాభం లేదురా! మన ప్రయత్నమేదో మనమే సాంతంగా చేసుకోవడం మేలు’
ప్రసాద్ బరస్టయాడు. ‘ఏం ప్రయత్నంరా! ఎంత చెప్పినా వినకుండా వెంట వన్ లేక్ హార్డ్ కేష్ తీసుకెళ్ళింది. దానికోసం ఎవరన్నా ఏమన్నా చేసారేమా!’ భోరుమంటున్న ప్రసాదుని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు సుధాకర్ కు.

***

ఒకళ్ళ మంచితనం మీద అంతగా ఆసక్తి చూపించని లోకం.. అదే ముక్కు మొగం తెలీనివారికైనా సరే ఏదైనా అపకారం జరిగిందంటే ఎక్కడలేని అత్యుత్సాహం చూపిస్తుంది. లోకం తీరే అంత. తప్పు పట్టి లాభం లేదు. అలాగని బాధపడకుండా కూడా ఉండలేం.
అర్చన అదృశ్యం, మీడియా రచ్చతో ఇంట్లోని వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కిపోయివుంది.
ప్రసాదు తల్లి తులసమ్మగారైతే నిప్పు మీది ఉప్పులా చిటపటలాడిపోతుంది . ‘ నీ పెళ్ళాం మూలకంగా.. ఇప్పుడు చూడు ఇంటి పరువంతా నడిబజార్లో పడింది. ఈ ఇంటి పిల్లను ఇంక బుద్ధున్న వాడెవడైనా చేసుకుంటాడా?!’
ఆమె బాధంతా పెళ్ళి కావాల్సిన ప్రసాదు చెల్లెలు లావణ్యను గురించి! ఈ బాధ భరించలేక ప్రసాదు స్నేహితుడు మీనన్ ఇంట్లో జరుగుతున్న అయ్యప్ప భజనకు బైలుదేరాడు.
బైకు డ్రైవ్ చేస్తున్నాడే గానీ ఆలోచనలన్నీ అర్చనను గురించే. తనకు ఈ అయ్యప్ప దీక్ష ఇప్పించింది అర్చనే గదా ! స్వామీ ! నా అర్చన ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్లు కాపాడే భారం నీదే తండ్రి ! తను భద్రంగా ఇంటికి తిరిగొస్తే వచ్చే ఏడాది కూడా నీ కొండకొస్తా’ అంటూ రెండు చెంపలు వాయించుకున్నాడు వంటి చేత్తోనే .
జేబులోని సెల్ అదే పనిగా రింగ్ అవడం మొదలు పెట్టింది . బైకాపి సైడ్ కు తీసి నెంబరు చూస్తే అది అర్చన పినతల్లి కాంతమ్మ గారిది.
పేరుకు ఆమె సవతి తల్లే అయినా సొంత కూతురు కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది అర్చనను . కాంతమ్మగారిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ప్రసాదుకి. చివరికామే కాస్త సర్దుకుని ‘బాబూ! ఇట్లాంటి సమయంలో ఇట్లా అడిగానని ఏమీ అనుకోవద్దు. అర్చన బ్యాంకులోని ఆ ఫిక్సడ్ డిపాజిట్టు అట్లాగే ఉంచిందా? అది కూడా వగతెగించుకుని పోయిందా?’
ప్రపాదు బుర్రలో హఠాత్తుగా బల్బు వెలిగింది .
‘నిజమేగా! అర్చన పేరుమీద వాళ్ళ నాన్న గారు పెళ్ళికి ముందే కొంత డబ్బు డిపాజిట్ చేసుంచారు. అది కూడా డ్రా చేసుకుని పోయిందంటే తను కావాలనే ఇల్లు వదిలి పోయినట్లు లెక్క. పెద్దావిడకి తట్టినంత కూడా తనకు తట్టలేదు. ‘కనుక్కుని మళ్లీ కాల్ చేస్తాన’ ని లైన్ కట్ చేసి బ్యాంకులో పనిచేసే సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేశాడు.
వాడు తనకు క్లబ్బులో బడా దోస్త్ . లైన్లో కి వచ్చిన సుబ్బు ‘అదేంటి బ్రదర్ ! సిస్టర్ మొన్న బుధవారమే ఆ డిపాజిట్ క్లోజ్ చేసిందిగా! బ్రదర్ రాలేదేమని అడిగితే ‘ ఆయన లేకుండా నా డబ్బు నాకివ్వడం కుదరదా?’ అని కూడా అంది. ఏదో సరదాగా అందిలే అను కున్నా. నిజంగానే నీకు ఆ డిపాజిట్ క్లోజ్ చేసిన సంగతి తెలీదా?! ‘ అంటూ ఇంకా ఏవేవో అడుగుతుంటే తరువాత మాట్లాడతా అని లైన్ కట్ చేశాడు ప్రసాదు.
సుబ్బు సమాధానంతో అప్పటిదాకా ఉన్న ఆ కాస్త ఆశ కూడా పూర్తిగా అడుగంటింది.
ఏడు లక్షల డిపాజిట్ వడ్డీతో కలిపి దాదాపు పదిలక్షలు . అంత డబ్బు డ్రా చేసి ఏం చేసుకుంటుంది? ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎందుకు తీసుకు వెళ్ళింది? ఎన్నడూ లేనిది ఈ ప్రయాణాన్ని తన దగ్గర ఎందుకు దాచినట్లు ?! కావలికి తన చేత టూ అండ్ ఫ్రో టిక్కెట్లు కొనిపించింది తనని తప్పు దారి పట్టించడానికేనా?’
అన్నీ సందేహాలే.
‘ఇప్పటి దాకా తీసుకెళ్ళింది లక్ష రూపాయలే అనుకుంటున్నాడు తను, చిన్నా కాలేజీ ఖర్చులకని చెప్పింది నిజం కాదా ? మరి నిజం ఏంటి? తనప్పుడు పట్టించుకోలేదు గానీ .. తనతో పాటు అర్చన తీసుకెళ్ళింది షోల్డర్ బ్యాగ్.. హ్యాండ్ బాగ్ ! షోల్డర్ బ్యాగులో ఉన్నవి చిన్నా బర్త్ డేకని కొన్న జీన్స్, షూసూ .. అత్తగారి కీళ్లనొప్పులకని ఆయుర్వేదం మందు మాత్రమే కావా ?! ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా ?!
సుధాకర్ కు కాల్ చేసి డిపాజిట్ క్లోజర్ సంగతి చెప్పాడు ప్రసాదు .
‘ కావాలని పోయేవాళ్ళ ఏదో ఉత్తరమో పత్తరమో రాసిపెట్టి పోతారుగా! ఇంటికెళ్ళి వెదుకు ముందు. ఏమైనా ఆధారాలు దొరుకు తాయేమో! ఏడుస్తూ కూర్చుంటే ఏ దేవుడూ దిగి వచ్చి హెల్ప్ చేయడు. మన ప్రయత్నం మనం చేస్తుంటేనే ఏ దైవమైనా ముందుండి నడిపించేది’ అని వేదాంతం మొదులు పెట్టాడు సుధాకర్ .
భజనకు వెళ్ళకుండాని తిరిగి వెనక్కు వస్తున్నందుకు మనసులోనే రెండు సార్లు చెంపల వాయించుకుని ఇంటి ముఖం పట్టాడు ప్రసాదు .
బండిని నడుపుతున్నాడే గాని మనసంతా చెదిరిన తేనె తుట్టలాగా ఉంది అర్చన గురించిన ఆలోచనలు కందిరీగల్లా రొద పెడుతున్నాయి.
***
పెళ్ళి చూపులకని వెళ్ళి నప్పుడు అమ్మాయి పేరు అర్చన అని తెలిసి లావణ్య తెగ ఆటపట్టించింది. “అర్చన. . ప్రసాదు” పేర్లు బాగా మేచ్ అయ్యాయన్నయ్యా! ఈ మేచికే మనం పిక్సైపోదాం’ అని అదొకటే అల్లరి . ఆడపడుచు కట్నం క్రింద పదో పరకో కొట్టేయాలని దాని యావ .
తనకూ అర్చన తెగ నచ్చేసింది. జాతకాలు చూసుకొని గానీ అమ్మ ఒకే చేయలేదు.
పెళ్ళి జరిగిపోయింది
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అంటారు. నిజమేనేమో ! లేకపోలే చిన్నప్పట్నుంచి అనుకొన్న మామయ్య కూతురు
కుమారి స్థానంలో ఎక్కడి కావలి అమ్మాయో వచ్చి చేరటం ఏమిటి ?!
అర్చన భార్యగా లభించడం తన అదృష్టం. ఇంట్లో వాళ్లు చేసుకొన్న పుణ్యం. అర్చన గడపలోకి కాలు పెట్టిన తరువాత ఈ ఇంటికి వెలుగొచ్చింది తన బతుకులోని చీకటి తొలగిపోవడం మొదలుపెట్టింది. తన పేకాట పిచ్చి తగ్గడానికి, చెడు స్నేహాలు దూరమవ డానికి అర్చనే ప్రధాన కారణం.
పెళ్ళయిన ఏడాదిలోనే డియస్సి చేసి సిటీలోనే గవర్నమెటు ఉద్యోగం సాధించుకుంది. చాలా చురుకయినది. ఒట్టి చురుకుతనమే కాదు మంచి మనసు కూడా అర్చన రెండో అలంకారం.
సవతితమ్ముడైన చిన్న కోసం తను ఎంత తన్నుకులాడుతుందో ! ఆ అబ్బాయికి ఎడం కాలు వీక్ . . పోలియో వల్ల అలా అయింది. తన తమ్ముణ్ణి బాగా చదివించుకోవాలని. . మంచి డాక్టర్ని చేయాలని ఆమె కల. అమ్మ పడనిస్తుందో లేదోనని తన అనుమానం.
చిన్న విషయంగా అత్తా కోడళ్ల మధ్య ఒక కోల్డువార్ నడవడం తను గమనించకపోలేదు.
ఇల్లు విడిచిపోవడానికి ఇలాంటి ఏవేవో గొడవలు కారణం కాదు గదా ?! చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే టంత ఇమ్మెచ్యూర్డ్ కాదు అర్చన.
‘చిన్న కారణంగా మీ అమ్మగారికి ఇబ్బంది ఎందుకు ప్రసాదు! వాడిని అక్కడే ఎక్కడో ఏ నెల్లూరులోనో మంచి కాలేజి చూసి జాయిన్ చేయించి వస్తా. పిన్నికి కూడా వంటరిగా ఉండే బాధ తప్పుతుంది’ అంది పోయినవారం తనతో.
ఆమె ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ ఎదుటి వారిని గురించి చెడు చెప్పదు. చెడుగా ఆలోచించదు . . వాళ్ళు మరీ దుర్మార్గు లయితే తప్ప. మరంత దుర్మార్గం తనేమి చేసినట్లు? తన వాళ్లు ఏం చేసినట్లు ?!
ఇప్పటిదాకా ఇంట్లో ఏ సమస్య వచ్చినా అర్చనే పరిష్కారం చూపించేది. ఇప్పుడు అర్చనే ఒక సమస్యగా మారింది !
మాల వేసుకున్న ముహూర్తం బాగా లేదు. మనసు నిలకడగా ఉండటం లేదు. భార్యను గురించిన ఆందోళనలతో నియమాలవీ సరిగ్గా నడవడం లేదు. నిన్న మీడియా వాళ్ళు అడిగిన ఏదో ప్రశ్నకు జవాబుగా తాను వాడిన భాష అయ్యప్ప దీక్షలో ఉన్న స్వామి వాడవలసినది కాదు.
దీక్షలో ఉండి ఇలాంటి అపచారాలు చేసే కన్నా విరమించుకోవడం మంచిది. ముందు మనసు ప్రశాంతంగా ఉండడం అవసరం . భగవంతుడు తన బాధను అర్థం చేసుకుంటాుడు. అర్చనలాగా అతను క్షమా హృదయుడు.
అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆ శుద్ధి కార్యక్రమం ముగించుకొని ఇంటికి చేరేసరికి ఏ మధ్యాహ్నం రెండు గంటలో అయిపోయింది. కళ్లు మూసుకుని కాస్సేపు నడుం వాల్చుదామనుకొన్నాడు. దీక్షకు పూనుకోకముందు జరిగినవన్నీ అంతరంగాన్ని కెలకటం మొదలుపెట్టాయి.
***
పెళ్ళయిన కొత్తల్లో తను పాత అలవాటు ప్రకారం ఇంటికి కూడా సరిగ్గా రాకుండా పొద్దస్తమానం క్లబ్బులో ఫ్రెండ్సుతో పేకాటాడుతూ కూర్చునుండే వాడు. అర్చన ఎంత మొత్తుకున్నా అప్పటికి’సరే’ అనే వాడే గాని. . . తరువాత క్లబ్బు గేటు చూడగానే చేతులు సలుపుతుండేవి.
అదీగాక తను అంత హఠాత్తుగా వదిలి రావడానికి లేదు. పాత బాకీలు డెబ్బై, యనభై వేలదాకా ఉండేవి. ఎగేసి వస్తానంటే ఎవరూరుకుంటారు? ఆ ప్రోనోట్లు పట్టుకుని రచ్చరచ్చ చేయరూ! ఉద్యోగానికే ముప్పు వస్తుందప్పుడు .
ఊబిలో దిగబడినట్లుండేది అప్పటి పరిస్థితి.
ఒక్కసారి జాక్ పాట్ లాంటిదేదో కొట్టి అప్పులు మొత్తం క్లియర్ చేసుకుని పర్మినెంట్ గా క్లబ్ కు టాటా చెప్పాలని తన ఆలోచన.
చూస్తూ చూస్తుండగానే అప్పులు లక్షకు పెరిగిపోయాయి. తప్పని పరిస్థితుల్లో అర్చన గోల్డు బ్యాంకులో పెట్టి అప్పులు తీర్చాల్సొచ్చింది .
అర్చనకు చెప్పకుండా తాను చేసిన ఆ పిచ్చిపని బైట పడినప్పుడు అర్చన ఏమీ అనలేదు. తనే తన బంగారాన్ని బ్యాంకు నుంచి విడిపించుకుని తెచ్చుకుంది . కాని, ఆ రోజు రాత్రి మాత్రం జరిగిన సంఘటన ఇప్పటికీ నిన్న గాక మొన్న జరిగినట్లే ఉంది.
జీవితంలో ఇక పై పేకముక్కలు ముట్టనని తన మీద ఒట్టు వేయించుకుని గాని తనను వదిలి పెట్టలేదు.
నిజానికి చాలాకాలంగా అటు వైపు వెళ్లలేదు కూడా.
వ్యసనాలనేవి అంత తొందరగా వదులుతాయా? ఆ ఆంధ్రాబ్యాంకు సుబ్బుగాడి పెళ్ళి పార్టీలో మందు కొట్టి మళ్ళీ రాత్రంతా పేకాడినట్లు అర్చనకెలాగో తెలిసి పోయింది. ఇంటి కొచ్చిన తరువాత తను చేసిన హంగామా ఇప్పుడు తలుచుకున్నా గుండెల్లో దడ పుడుతుంది.
‘మీ పాడు అలవాటు వల్ల ఇంట్లో వాళ్లకు ఎంత ఇబ్బందవుతుందో. ఎప్పుడైనా ఆలోచించారా? నా మీద ప్రమాణం చేసి కూడా మాట తప్పారు. నా సంగతి వదిలేయండి. ముందు మీ గురించి ఆలోచించుకోండి ! ఈ దరిద్రపు అలవాటు వల్లే గదా ఆరోజు ఇంట్లో కూడా నా నగలు దొంగతనం చేశారు! అయినా బుద్ధి రాకపోలే ఎలా ? డబ్బు పోతే పోయింది, బుద్ధి వచ్చిందని మురిసినంత సేపు లేదు గదండీ సంబడం!’ అంటూ దులిపిపారేసింది.
తను ఆ రాత్రి వంటి మీద చెయ్యి వేయబోతే తోక తొక్కిన తాచులాగా బుసలుకొడుతూ లేచింది. ఆ పాడు పేక ముక్కలు పట్టుకున్న చెత్తో నా వంటి మీద చెయ్యి వేస్తే వూరుకొనేది లేదు. పెట్రోలు పోసుకుని మరీ అంటించుకుంటాను. నా చావుకు మీరే బాధ్యులని ఉత్తరం రాసి పెట్టి మరీ చస్తాను’ అని ఎన్నడూ లేనిది కన్నీళ్ళు పెట్టు కుని బావురుమంటే గాని తనకు తెలిసిరాలేదు. . తాను చేసింది ఎంత పెద్ద తప్పో!
జీవితంలో ఒకే సారి అవకాశం ఇస్తాడు దేవుడు. దాన్ని తెలివితక్కువగా జారవిడుచుకుంటే ఇంక దేవుడు కూడా మనలని కాపాడటానికి రాడు. అర్చన తనకు దేవుడిచ్చిన అవకాశం. మరో సారి తప్పు చేసి ఆమెను జారవిడుచుకోదలుచుకోలేదు.
‘ ఇంకొక్క ఛాన్సివ్వు అర్చనా! నీ కడుపులోని బిడ్డ సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా! ఇంకో సారి నా వల్ల ఇలాంటి తప్పు జరిగితే నువ్వే శిక్ష విధించినా అనుభవించడానికి రడీ ‘ అని తెల్లార్లు కాళ్లూ గడ్డాలూ పట్టుకొని ప్రాధేయపడితే గానీ అర్చన దిగిరాలేదు.
‘మాటల్లో కాదు. చేతల్లో చూపించాలి నిజాయితీ! నా మీద అయిపోయింది. ఇక నాబిడ్డ మీద పడ్డాయి మీ కళ్లు ఈసారి ‘ అని దెప్పులకు దిగింది ఆమె .
రోషం తన్నుకు వచ్చింది తనకు.
‘అయ్యప్ప మాల వేసుకోండి. అప్పుడైనా ఆ దేవుడిని గురించి భయపడతారేమో చూద్దాం’ అంటూ రెచ్చగొట్టేసరికి
మర్నాటి ఉదయాన్నే పద్మారావు నగరు గుడికెళ్ళి మాల వేసుకున్నాడు తను.
అయినా అర్చన వెళ్ళిపోయిందిప్పుడు ! అర్చన ఇట్లా అర్థాంతరంగా ఇల్లు విడిచి వెళ్ళి పోవడానికి ఎవరో కాదు తనేనా కారణం? దీక్షలో వుండీ తను ఆ రోజు రాత్రి అట్లా బలవంతం చేయడం వల్లే ఇదంతా జరిగిందా ?!
***
తన వల్ల పెద్ద తప్పే జరిగి పోయింది . తలుచుకుంటే తనమీద తనకే రోత పుడుతుందిప్పుడు.
దీక్ష తీసుకున్న మూడో రోజునుకుంటా . . తను పూర్తిగా ఆ వాతావరణానికి అలవాటు పడలేదింకా. అర్చన తన ముందే అలా బట్టలు మార్చుకుంటుంటే చూసి తమాయించుకోలేక పోయాడు. సమయానికి అమ్మ ఏదో పనుండి రాబట్టి సరిపోయింది గాని . . లేకపోతే తన దీక్ష అప్పుడే భంగమయిఉండేది.
దీక్ష సంగతి దేవుడెరుగు. ఇప్పుడు తన పాణమే తనకు దూరమయిపోయినట్లుంది.
కట్టుకున్నవాడినేగా ! క్షణికావేశానికి లోనయి చిన్న పారపాటు చేయబోయినందుకే అంత పెద్ద శిక్ష విధించే భార్య ఉంటుందా లోకంలో ఎక్కడైనా?!
‘అర్చన నీ మీద కోపంతోనే పోయిందని ఎందుకనుకుంటున్నావు? నిజంగా అదే కారణమయితే ఆ రోజే పోయుండాల్సింది. నిదానంగా దసరా సెలవు రోజులు చూసుకొని మరీ టికెట్లు బుక్ చేయించుకొని పోతుందా?! నిజంగా చిన్న కాలేజీ పని, పండగ రోజులు కలిసొస్తాయని వెళ్ళుండచ్చుగదా! లక్ష దాకా తీసుకెళ్లిందంటున్నావు. నీకు తెలీకుండా ఇంకేమేమి తీసుకెళ్ళిందో చూడు . . బంగారం వగైరా!’ అన్నాడు సుధాకర్ ఫోన్లో ప్రసాద్ చెప్పిందంతా విని.
‘బంగారం తనెప్పుడూ బ్యాంకు లాకర్లో పెట్టుంచుతుంది లేరా! ‘ అన్నాడు ప్రసాద్.
ఒకసారి అదీ బ్యాంకుకు ఫోన్ చేసి కనుక్కుంటే సరి ! డిపాజిట్ క్లోజర్ సంగతి, తనకివాళే కదా తెలిసింది- అనుకొన్నాడు ప్రసాదు .
బ్యాంక్ మ్యానేజర్ కి ఫోన్ చేశాడు. ‘ లాస్ట్ వెడ్ నెస్ డే మీ మిసెస్ గారొచ్చి లాకర్ క్లోజ్ చేసారు సార్! ఎఫ్ . డీ క్లోజ్ చేసిన మాట నిజమేగానీ, ప్రొసీడింగ్సన్నీ పూర్తిగా తీసుకెళ్ళలేదు. సేవింగ్స్ ఖాతాలో వుంచమని కొత్త చెక్ బుక్ మాత్రం ఒకటి అడిగి తీసుకువెళ్ళారు’ అని డీటెయిల్డ్ రిపోర్టు ఇచ్చేసాడు బ్యాంకు మేనేజర్ రికార్డ్స్ వెరిఫై చేసి.
‘ ఆ చెక్ బుక్ కోసం ఇంట్లో వెదుకు! ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో! ఇంకోసారి ప్రయత్నం చేయరా! మధన పడుతూ కూర్చుంటే జర గాల్సినదేదో జరిగిపోతుం దవతల! ‘ అని చివాట్లు పెట్టాడు సుధాకర్.
అర్చన కప్ బోర్డు ఓపెన్ చేసి చూసాడు ప్రసాద్ . అన్నీ ఎక్కడ వక్కడే వదిలేసి ఉన్నాయి . ఆమె ఎప్పుడూ ఇష్టపడి కట్టుకునే కలర్ శారీ మాత్రం ఎంత వెదికినా కనిపించ లేదు.
ఆ ఆకాశం రంగు చీరంటే ఆమెకు ఎంతో ఇష్టం. అర్చన ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజున అప్పటి కప్పుడు షాపుకు తీసుకుని పోయి తన చేత కనిపించుకున్న చీరె అది. ఆమె మిగతా వస్తువులన్నీ ఉండటంతో. . అర్చన నిజంగానే
ఎక్కడికో వెళ్లి పోవాలని ప్లాన్ చేసుకున్నట్లు అనిపించలేదు.
అర్చన సెల్ ఫోన్, బీరువాలోనే పడివుంది !
అదీ సంగతి! సెలిఫోను చేతిలో ఉంటే తనుండే లోకేషన్ బైట పడుతుందని వదిలి పోయినట్లుంది!
ఇదీ ఒకందుకు మంచిదే ! ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ సెల్ లోనే ఉండవచ్చు. . తన అదృష్టం బాగుంటే
ప్రసాద్ అర్చన సెల్ ఛార్జింగ్ కు పెట్టాడు. అర్చన స్కూలుకు తీసుకు వెళ్లే బాగ్ ఓపెన్ చేసి చూస్తే పనికొచ్చేది
ఒక్కటీ కనిపించలేదు . కొత్త చెక్ బుక్ కూడా ఎంత వెదికినా కనిపించలేదు.
ఈ మధ్య తనూ అర్చనా కలిసి చేయించుకున్న మెడికల్ చెకప్ రిపోర్టులున్న ఫైల్ బీరువాలో ఓ మూల కనిపించింది.
అయ్యప్ప దీక్షకు ముందు అర్చన తన ప్రాణం తీసి అన్ని రకాల టెస్టులు చేయించింది.
ఇంతలో అర్బన సెల్ ఫోన్ రింగవడం మొదలుపెట్టింది అదేపనిగా. ఒక్క ఉదుటున వెళ్ళి సెల్ అందుకున్నాడు ప్రసాద్ .
తీరా చూస్తే అదేదో మార్కెటింగ్ కంపెనీ నుంచీ సేల్స్ గరల్ ! తమ కంపెనీ ప్రొడక్టుని గురించి చెపుతానంటూ చేసిన కాల్! చిరాగ్గా కాల్ కట్ చేసాడు ప్రసాదు.
సరిగ్గా అప్పుడు గుర్తు వచ్చింది ప్రసాదుకి.
కాల్ రికార్డుని వెరిఫై చేస్తే ఈ మధ్య ఆమె ఎవరితో మాట్లాడిందో. . ఎవరు ఆమెతో మాట్లాడారో తెలిసిపోతుంది.
ఆమె సెల్లో ఒకే నెంబరు మీద పదకొండు సార్లు బుధవారం నుంచి జేట్ గోయింగ్ కాల్స్ వెళ్ళివట్లు రికార్డులో ఉంది.
04142-230723. . ఫోన్ నెంబర్ !
ప్రసాద్ ఆ నెంబరుకు కాల్ చేశాడు. ‘దిస్ నెంబర్ డజ్ నాట్ ఎగ్జిస్ట్’అని సూచన వినిపించింది ఇంగ్లీషులో. అంతకు ముందు అదే ప్రకటన తమిళంలో వినిపించింది.
కోడ్ బుక్ వెరిఫై చేస్తే ఆ నెంబరు తమిళనాడు – కడలూర్ ది !
అర్చనకూ, కడలూర్ కూ కనక్షనేంటీ? మాట వరసకు కూడా ఆమె మాటల్లో ఎప్పుడూ ఆ ఊరు ప్రస్తావన వచ్చినట్లు గుర్తుకురావటం లేదే!
బుర్ర వేడెక్కి పోతోంది. బాత్ రూంలోకి వెళ్లి రిఫ్రెషయి బట్టలు మార్చు కోవడానికి తన కప్ బోర్డు తెరిస్తే. . అక్కడ కనిపించింది అప్పుడా కవర్.
తెరిచి చూస్తే సుధాకర్ చెప్పినట్లుగానే అది అర్చన వదిలేసి వెళ్ళిన క్లూ. ముత్యాలు పేర్చినట్లుండే ఆమె చేతిరాతను తమ ఇట్టే గుర్తు పట్టగలడు!
తననే అడ్రస్ చేస్తూ రాసిన ఉత్తరం అది.
వణికే చేతుల్తో కవర్ ఓపెన్ చేసాడు ప్రసాద్ .
ప్రియమైన ప్రసాదుకు !
చివరిసారి నమస్కారాలు. ఈ ఉత్తరం మీకందేసరికి నేనెక్కడుంటానో నాకే తెలేదు. టికెట్ కావలి దాకా ఉంది . కాని, దిగేది ఎక్కడో. ఎక్కేది ఎప్పుడో. . ఆ విధికే తెలియాలి.
గత కొంతకాలంగా నా జీవితంలో ఒక సస్పెన్స్ డ్రామా నడుస్తున్నది ప్రసాద్ ! ఈ థ్రిల్లర్ కు ముగింపు ఎప్పుడో ఇప్పుడే చెప్పగల స్టేజీలో నేనూ లేను. సారీ!
ఈ లెటర్ రాయడానికి కారణాలు నాలుగు . నా మిస్సింగ్ ఏక్సిడెంట్ కాదు అని తెలియడం మొదటి కారణం. కావాలనే మీకు కనిపించకుండా వెళ్ళిపోతున్నాను. కారణం నా నోటితో చెప్పలేనిది.
రెండు నా అదృశ్యానికి కారణం మాయదారి లోకం ఎవేవో మసాలా కారణాలు సంచలనం కోసం సృష్టించి ప్రచారంచేసే ప్రయత్నం చేస్తుంది. నా నిర్ణయానికి కారణం ప్రపంచం ఊహించలేనిది అని తెలియచేయడం. పోలీసులు ఎవరినీ నిష్కారణంగా హింసించ కూడదన్నది ఉత్తరం రాయడానికి మూడో కారణం.
మానసికంగా మంచి స్థితిలో ఉండే నేను స్వచ్ఛందంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను కోరుకొంటే తప్ప ఎవరికి నేను కనపడను. . అని చెప్పడం నాలుగో కారణం.
పండంటి బిడ్డను కనిస్తానన్న హామీని నెరవేర్చనందుకు విచారంగా ఉంది. నా అదృశ్యం నేను కల్పించుకున్నది కాదు కనక నేను ఎవరికీ “సారీ” చెప్పవలసిన అవసరం కూడా లేదు.
నేను లేని లోటుకు అలవాటు పడటం ఒక్కటే నన్ను ప్రేమించిన మీలాంటి వారందరూ ప్రస్తుతం చేయాల్సిన మొదటి అతి ముఖ్యమైన పని.
– అర్చన

***
ఫ్రెండు రాజారావు రూములో పడుకోనున్నాడు రమణ. ఇక్కడయితే ఈ టైములో ఏ కాంతం దొరుకుతుంది. తన వేరెబౌట్స్ ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
వదిన అర్చన ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండ వెళ్ళిపోయినప్పటి నుంచి ఇల్లు నిప్పుల గుండంలాగా ఉంది. వదినమ్మ ఇలాంటి పనిచేయబోతుందని కొన్నాళ్ళ బట్టి తను అనుమానిస్తూనే ఉన్నాడు. అదే నిజమయిందిప్పుడు. వదిన ఆ రోజు పాత గాంధీ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లో ఎవరో అపరిచితుడితో అంత క్లోజ్ గా ఆ టైములో మూవవుతూ తన కంట బడ్డప్పుడే అనుకొన్నాడు. . ఏదో తొందరలో జరగబోతున్నది అని . కానీ మరీ ఇంత తొందరగా అని మాత్రం తను ఊహించుకోలేక పోయాడు.
***
మర్నాడు మార్నింగ్ టిఫిన్సప్పుడు అన్నయ్య ‘రాత్రి నువ్వు వెళ్ళిన సినిమా బాగుందా?’ అని అడిగితే ఆ సినిమా కథంతా చెప్పి మరీ బాగుందని చెప్పింది వదినమ్మ. ఎంత వగలాడి! పాపం, ఈ అన్నయ్యే వట్టి బుద్ధావతారం! ‘ పెళ్లాం కొంగు పట్టుకు తిరిగే సన్నాసి ‘ అని అమ్మ అనే మాట నిజమే.
వదిన మేటరంతా ముందు అమ్మ చెవిలోనే వేద్దామనుకున్నాడు తను .
తీరా సంగతి తెలిసిన తరువాత వెనక్కి తగ్గాడు. ఇప్పడా గొడవల్లో తన పేరు గాని బైటకొస్తే నెలనెలా వదినమ్మ దగ్గర్నుంచి వచ్చే ఆ వందా రెండొందలూ రాలవు.. అదీ బెంగ .
ఎంత తిట్టినా తిమ్మినా అవసరానికి డబ్బిచ్చేది వదినమ్మే కదా! అన్నయ్యని డబ్బడిగితే ‘ ముందు నువ్వు ఆ డిగ్రీ రెండు పేపర్లూ క్లియర్ చెయ్యి! అప్పుడడుగు’ అంటాడు.
శ్రావణితో పరిచయమైనప్పటి నుంచి ఏదో వంకతో మంచి గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు తను . హ్యాండ్ వాచ్ లాంటిది కొనాలన్నా మినిమమ్ రెండు మూడు వేలన్నా కావాలి. అమ్మ దగ్గర అంత డబ్బు ఉండదు. ఉన్నా ఇవ్వదు. వదినే గతి. ఆమె వీక్ నెస్ తనకు తెలుసు. ‘చిల్డ్రన్స్ డే సందర్భంగా అంధ బాలలకి, ఫ్రెండ్సందరం కలసి తలా ఒక మంచి డ్రస్ కొనిపెడదామనుకుంటున్నాం’ అనగానే పర్సులో నుంచి రెండు వేలు తీసి ఇచ్చింది. తన తరపునా ఏదైనా ఇవ్వమని మరికొంత ఇవ్వడంతో కదా శ్రావణితో కలసి ఆ రోజు మూవీ కెళ్లిందీ .. థియేటర్లో వదిన కంట్లో పడిందీ!
ఇంటర్వెల్లో ఆమె పీకిన క్లాసు దెబ్బకే శ్రావణి మళ్ళా నాలుగు నెలల దాకా తన జోలికి రావడానికి జంకింది.
ఇప్పుడు ఆ వదినే పెద్ద పత్తిత్తులాగా .. పెళ్ళయీ పరాయి మగాడితో చెడతిరుగుతోంది. చెడి తిరుగుతోందేమో కూడా!
తగిన ఆధారాలు దొరికతే వదిన దగ్గర్నుంచీ క్రమం తప్పకుండా మనీ రాబట్టుకోవచ్చు. ఆ ఆశతోనే అదే పనిగా ఆమెను ఫాలో అవడం.. తన టైమంతా వేస్ట్ చేసుకోవడం!
తన ప్రయత్నం వృథా కాలేదు . వదినమ్మ అదే పనిగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఆ దేవయాని డంగోరియా నర్సింగ్ హోం చుట్టూ తిరగడం తన కంటబడనే పడింది.
వదిన ప్రెగ్నెంట్ అని తెలుసు. ఆసుపత్రులకు వెళ్ళటం అదేమంత పెద్ద విశేషం కాదు . ఆ సంగతి ఇంట్లో చెప్పకపోవడమే తన అనుమానానికి కారణం. సంథింగ్ ఈజ్ ఫిషీ! ! ఆ ఫిష్ ఏంటో పనికట్టుకు వెతకాలి . ఆధారాలతో సహా ఆమె పట్టుబడే మంచి ఛాన్స్ కోసం ఎంతగా వెయిట్ చేశాడు తను!
ఆ రోజు రానే వచ్చింది. అమ్మ ఆ రోజూ నల్లకుంట బాబాయిగారి మనవడి బారసాలకని ముందు ముందు రాత్రే వెళ్ళిపోయింది. లావణ్య కాలేజీకి వెళ్ళింది. నాన్న మఠానికి, అన్నయ్య డ్యూటీకి వెళ్ళారు. వదినను కూడా అలా స్కూలుకు వెళ్ళనిచ్చి వాళ్ళ బెడ్ రూములో దూరాడు తను.
వదిన బీరువాను డూప్లికేట్ కీతో ఓపెన్ చేశాడు.
అల్మారా నిండా ఏమిటేమిటో వస్తువులు. ఆమె సోషల్ యాక్టివిస్టు. ఎవరెవరితోనో ఎప్పుడూ ఏదో కరస్పాండెన్సు చేస్తోంటుంది. ఆ చెత్తంతా తనకెందుకు? తనక్కావాల్సింది ఆమె హాస్పిటిల్ విజిట్స్ వెనుకున్న సీక్రెట్!
బట్టల మధ్య మడతలలో కనిపించింది కవర్ల కట్ట ! గులాబి రంగులో ఉన్న ఆ కవర్ల లాంటివే ఆ రోజు రెస్టారెంట్ లో వదిన అతని దగ్గర్నుంచి అందుకోవడం తను చూసింది.
గభాలున కట్ట మొత్తాన్ని చొక్కా లోపలికి కుక్కుకున్నాడు. లాకర్ ఓపెన్ చేసే వుంది! లోపల చెయ్యి పెట్టి తడుముతుంటే దానిలో కనిపించింది ఆ డంగోరియా హాస్పిటల్ వాళ్ళ ఫైల్!
అక్కడే ఓపెన్ చేసి చూద్దామనుకునే లోపలే చప్పుడు . . !
మెయిన్ గేట్ తెరుస్తున్న చప్పుడది !
ఎవరో ఇటే వస్తున్నట్లు అడుగుల శబ్దం.
గబగబా బీరువా వేసేసి.. రూము తలుపులు తెరిచాడు.
ఎదురుగా వదిన!
ఇద్దరూ షాక్! ముందుగా తేరుకుంది వదినే.
‘బీరువా తెరిచుందేంటి? నా వస్తువులతో నీకేం పని?’ అoటూ ఒక్క ఉదుటున బీరువా దగ్గర కెళ్లి లాకర్లో దేనికోసమో వెతకటం మొదలుపెట్టింది. బైటకు వెళ్లే తనను వెనకనుంచీ చొక్కా పట్టుకుని గుంజింది.
‘బీరువాలో గోల్డు బాక్సు ఉండాలి. నువ్వు తీసావా ? దీనికోసమేనా దొంగలాగా నా గదిలో దూరింది! నీ చేతిలో ఎంటా ఫైలు..’ అంటూ కేకలేయడం మొదలుపెట్టింది. తనను ఆపబోతుంటే పడనిచ్చాడు కాదు. ఆ పెనుగులాటలో బనీను కింద దాచిపెట్టిన కవర్ల కట్ట పగిలి కొన్ని కవర్లు నేల మీద చిందర వందరగా పడిపోయాయి . ఫైలుని కాపాడుకుంటూ. . కనీసం కొన్ని కవర్లనయినా తన్నుకు
పోవాలని తన ప్రయత్నం.
ఖర్మ! ఇంతలోనే కరెంటు రావడం. . గది గుమ్మం ముందు నాన్నెప్పుడొచ్చి నిలబడ్డాడో . . సింహంలాగా చూస్తున్నాడు!
ఆయనెప్పుడూ వదిన పక్షమే . అందిన కాడికి దొరికిన వాటిని అందిపుచ్చుకుని తాను ఎట్లా పడ్డాడో! ఇప్పుడు ఊహించుకుంటే అదో థ్రిలర్ మూవీకి మించి వళ్లు జలదరిస్తుంది.
***
వెనకనుండి వదినమ్మ కేకలు, నాన్న అరుపులూ వినిపిస్తునే ఉన్నాయి. ఆ రావడం రావడం. . ఇదిగో ఈ రాజారావుగాడి గదికొచ్చి పడ్డాడు తను . ఫ్రెండ్ ఇ. సి. ఐ. ఎల్ లో పనిచేస్తున్నాడు . కాబట్టే ఏకాంతం కావాల్సి వచ్చినప్పుడ్లల్లా ఇక్కడి కొచ్చి పడడం!
కవర్లలో, ఫైల్లో దొరికిన కాగితాల్లో ఏముందో చూడాలి! వదినతో జరిగిన ఫైటులో కాగితాలు ముక్కలు ముక్కలయ్యాయి. ఒక షేపులోకి తీసుకురావడానికి అరగంటకు పైనే పట్టింది. అంత కష్టపడ్డా. . మేటర్ మాత్రం పూర్తిగా అర్థం కావడం లేదు.
‘ నువ్వంటే నాకు ఎక్కడలేని .. వృథా. చావొక్కటే సమాధానం… ఎదురు.. కలుసుకొందా… ఎక్కడికైనా.. వెళ్ళి.. నేను రడీ! నీ ప్రేమ… ఎప్పుటికే నీ.. ‘ అంటూ పొడి పొడి మాటలు! అర్థమయింది తక్కువ. అర్థంకానిది ఎక్కువ.
ఆ రెస్టారెంటులో హీరోగారితో వదినగారు చేసుకున్న విన్నపాలు లాగున్నాయి. ఇద్దరూ కలసి ఎక్కడికో ఎగిరిపోయే ప్లానులో ఉన్నారని ఈ సందేశాలను బట్టి అర్ధమవుతూనే ఉంది. ఈ కవర్లు ఇదివరకే దొరికుంటే బాగుండేది! కవరుకు పదివేలు చొప్పున వసూలు చేసుండేవాడు . కానీ పట్టు జారిపోయింది!
ఛ ! అదృష్టం తనకెప్పుడూ బెత్తెడు దూరంలో కొచ్చి మిస్సవుతుంటుంది.
కవర్లు విసురుగా చెత్త బుట్టలోకి విసిరేశాడు రమణ.
బరువుకు బుట్ట పక్కకు దొర్లి పడింది. కింద పడ్డ కాగితాలని మళ్ళీ బుట్టలోకి వెయ్యటానికి దగ్గరికెళ్ళిన రమణకు అప్పుడు కనిపించింది. . అప్పుటి దాకా తాను వెదుకుతున్న మెడికల్ రిపోర్డ్ పేపర్ !
విజయా డయోగ్నసిస్ సెంటర్ వాళ్ళ రిపోర్టు ! చేతిలోకి తీసుకుని చూస్తే అది ప్రసాదన్నయ్యది! ఆ రిపోర్టులోని ఒక్క మాట కూడా తనలాంటి వాళ్లకు అర్థమయేలా లేదు. అర్థం కావడానికి మెడికల్ నాలెడ్డి అవసరం.
శ్రావణి ల్యాబ్ టెక్నీషియనే . యాక్జాన్ హాస్పిటల్ లో ప్రస్తుతం పనిచేస్తోంది. ఈ రిపోర్టు ఆమెకు చూపిస్తే సస్పెన్స్ అంతా విడిపోతుంది.
శ్రావణి నెంబరుకు కాల్ చేసి విషయం చెప్పాడు రమణ. సాయత్రం దాకా ఆమె డ్యూటీలోనే ఉంటుందని తెలిసి రాజారావు ఫ్రెండ్ బైకు మీద బైలుదేరాడు.
దారిలో వదిన చెప్పిన గోల్డు బాక్సు మేటర్ గుర్తుకొచ్చింది. ఆ బీరువాలో గోల్డుబాక్సు కూడా ఉందన్న మాట. తనకు కనిపించలేదే!
వదినెప్పుడూ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లోనే గదా ఉంచేది! వాడితో కలిసి వారిపోదామని ప్లాన్ చేసుకుందిగా! అవి తెచ్చి ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకున్నట్లుంది! మధ్యలో ఎవరో నొక్కేసినట్లున్నారు.
ఛ. . తనకైనా ఆ ఛాన్స్ దక్కలేదు! తను బీరువా తెరిచినప్పుడు లోపలి లాకర్ లాక్ లేకుండా ఉండటం ఇప్పుడు గుర్తుకొచ్చింది రమణకు .
వదిన అంతర్థానానికే ఆమె ఆసుపత్రుల చుట్టూ తిరగటానికి ఏమైనా సంబంధం ఉండుంటుందా? క్లూ ఏదైనా ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రసాదన్నయ్య మెడికల్ రిపోర్టు ఇస్తుందేమో చూడాలి.

సశేషం. . .

1 thought on “అర్చన కనిపించుట లేదు – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *