April 19, 2024

కంభంపాటి కథలు – కౌసల్య నవ్విందిట

రచన: కంభంపాటి రవీంద్ర

శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ తీసుకోగానే , టాక్సీ డ్రైవర్ అడిగేడు .. ‘ఏమ్మా ఇంటర్నేషనలా లేక డొమెస్టికా?’
కిటికీలోంచి బయటికి చూస్తున్న కౌసల్య బదులిచ్చింది ‘ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర డ్రాప్ చెయ్యి బాబూ ‘
‘అమెరికాకా అమ్మా?’ అడిగేడతను
‘అవును బాబూ. మా అమ్మాయి ఉద్యోగం చేస్తూందక్కడ .. ”
‘మా అబ్బాయి కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడమ్మా… అట్లాంటాలో ఉంటాడు … రెండుసార్లు చూసొచ్చేను ‘ అన్నాడతను.
కౌసల్య ఆశ్చర్యంగా చూసిందతని వైపు .
అతను నవ్వుతూ చెప్పేడు ‘వాడు మమ్మల్ని బాగానే చూసుకుంటాడమ్మా .. కానీ ఈ డ్రైవింగ్ పని చేస్తూ వాడిని చదివించేను .. వాడిని అంత గొప్పవాడిని చేసిన ఈ డ్రైవింగ్ పని ఇంకా గొప్పది కదమ్మా .. అందుకే , ఈ పని వదలలేదు నేను ‘
‘నీలాంటి గొప్ప వ్యక్తిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబూ ‘ అని కౌసల్య అంటూండగానే ఇంటర్నేషనల్ టెర్మినల్ వచ్చేసింది.
టాక్సీ బిల్ పే చేసి , తన లగేజ్ తీసుకుని ట్రాలీ మీదకి ఎక్కించి లోపలికి నడుస్తూంటే , గీతిక ఫోను ‘అమ్మా ఎయిర్పోర్ట్ కి జాగ్రత్తగా వచ్చేసేవా ?’ అంటూ
‘నేను వచ్చేసేను .. లగేజ్ చెకిన్ చేసి , సెక్యూరిటీ చెకిన్ అయ్యిన తర్వాత కాల్ చేస్తాను ‘ అంది కౌసల్య
‘నీకు ఫస్ట్ క్లాస్ బుక్ చేసేను కదా … నీ చెకిన్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది … పెద్ద క్యూల్లో నిలబడక్కర్లేదు ‘ అని గీతిక అంటూంటే, ‘ఓ అరగంట తక్కువ నిలబడేదానికి మామూలు కన్నా మూడు రెట్లు ఎక్కువ టిక్కెట్టు పెడతారా ఎవరైనా?’ అని కౌసల్య అంటూంటే , ‘నేను పెడతాను ..మా అమ్మ .. నా ఇష్టం .. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు ..సరే సెక్యూరిటీ చెక్ అయ్యాక నాకు ఫోన్ చెయ్యి ‘ అంటూ కాల్ కట్ చేసింది గీతిక .
గీతిక చెప్పినట్టే , తన చెకిన్ చాలా సులభంగా అయిపోయింది . సెక్యూరిటీ వేపు నడవబోతుంటే , పక్కనే ఉన్న ఎకానమీ క్యూలో చిన్న గొడవ వినిపించి అటువైపు చూసింది .
ఎవరో పెద్ద వాళ్ళు .. ఆవిడ సూట్ కేస్ ట్రాలీ మీద నుంచి దింపుతూంటే , దాని హేండిల్ ఊడొచ్చి , అది కాస్తా కిందపడి తెరుచుకుని, అందులో ఉన్న సామాన్లన్నీ కింద పడ్డాయి . ‘నీకు సరిగా హ్యాండిల్ చెయ్యడం రాదు .. బంగారంలాంటి సూట్ కేసు ‘ అంటూ ఆయన అరుస్తున్నాడు, కిందనున్న సామాన్లన్నీ పెట్టెలో పెడుతున్న ఆవిణ్ణి చూసి జాలిపడి, సాయం చేద్దామని దగ్గరికెళ్ళిన కౌసల్య ఒక్కసారి షాక్ అయ్యింది .
తన దగ్గరికొచ్చిన కౌసల్యని చూసి అలాగే షాక్ అయ్యిందా సామాను సర్దుతున్న జయంతి గారు . వెంటనే మొహం పక్కకి తిప్పుకుందావిడ !
కౌసల్య ని చూసిన జయంతి భర్త బలరాం ‘ఏమ్మా బావున్నారా ? మీ అమ్మాయికి పెళ్లయిందా ?’ అంటూ నవ్వుతూ అడిగేసరికి, ‘బావున్నానండి .. వస్తాను ‘ అంటూ చిన్న నవ్వు నవ్వి , సెక్యూరిటీ వేపు నడిచింది .
సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని , వెయిటింగ్ లాంజ్ లో కూచునుండగా ఏవేవో గుర్తుకురావడం మొదలెట్టేయి .
ఆ మర్నాడు తన తమ్ముడు కేశవ్ తో విషయం చెప్పి , ఓ మంచిరోజు చూసుకుని , కేశవ్ కుటుంబం తో ఆ భార్గవ్ వాళ్ళింటికి వెళ్ళేరు కౌసల్య , గీతిక .
ఐదేళ్ల క్రితం .. ఆ సాయంత్రం తన పన్లన్నీ పూర్తి చేసుకుని , బాల్కనీ కూచుని రోడ్ వేపు చూస్తూంది కౌసల్య . రోజూ, ఆ వీధి చివర
వాళ్ళ కంపెనీ బస్ దిగి నడుచుకుంటూ వచ్చే గీతిక ని చూడ్డం అలవాటు కౌసల్యకి . ఈ రోజు మటుకు , తనతో పాటు ఎవరో కుర్రాడు
కూడా వస్తున్నాడు . ఎప్పుడూ చూళ్ళేదు , ఎవరీ అబ్బాయి అని తను అనుకుంటూండగానే , గీతిక తోపాటు ఇంటికి వచ్చేడతను !
వస్తూనే గీతిక ‘అమ్మా ..ఇతను భార్గవ్ .. మా టీం మేట్ ..నన్ను పెళ్లి చేసుకుంటాడట .. నీతో మాట్లాడాలట.. ‘ అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది!
ఇదెప్పుడూ ఇంతే .. అన్నీ మొహం మీద చెప్పేస్తుంది అనుకుంటూ , ‘కూచో బాబూ కాఫీ తీసుకొస్తాను’ అని కిచెన్ లోకి వెళ్ళబోతూంటే , ‘ఫర్లేదాంటీ .. ఫార్మాలిటీస్ ఏమీ వద్దు .. డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను .. గీతిక అంటే చాలా ఇష్టం .. తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను .. మా ఇద్దరికీ కూడా యూఎస్ వెళ్ళే అవకాశం వచ్చింది .. మీరు ఒప్పుకుంటే .. మా పేరెంట్స్ ని మీతో మాట్లాడ్డానికి తీసుకొస్తాను ‘ అన్నాడు భార్గవ్.
‘తనతో మాట్లాడేవా?’ అడిగింది కౌసల్య
‘మాట్లాడేను ఆంటీ … తనకి ఇంకా పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పింది .. కానీ మా ఇంట్లో మటుకు నాకు సంబంధాలు చూస్తున్నారు .. వాళ్ళకి కూడా చెప్పేసేను .. నా లైఫ్ బావుండాలి అంటే , నా పెళ్లి గీతిక తో చెయ్యండి అని .. పైగా మనం మనం ఒకటే కేస్ట్ కూడా కాబట్టి , వేరే ఇబ్బందులు ఏమీ ఉండవు ‘
‘అలా కాదమ్మా .. అసలు మా అమ్మాయి లో నీకు ఏం నచ్చింది ?
‘ తన చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ పోతే, మీరే చాలా కష్టపడి తనని, వాళ్ళ అన్నయ్యనీ చదివించేరని తెలుసు.. తనలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి .. ఇది అని స్పెసిఫిక్ గా చెప్పలేను ఆంటీ .. కానీ తనతో ఉంటే నాకు చాలా బావుంటుంది ‘ అన్నాడతను
‘నువ్వు ఇలా సడెన్ గా అడిగితే, నేనేమీ చెప్పలేను .. ఒకసారి దాంతో మాట్లాడనీ .. అలాగే, వాళ్ళ అన్నయ్య తో కూడా మాట్లాడాలి ‘ అంది కౌసల్య
‘అలాగే ఆంటీ .. తప్పకుండా .. మీరెప్పుడంటే అప్పుడు మా పేరెంట్స్ ని తీసుకొస్తాను ‘ అన్నాడు భార్గవ్
‘ఫర్లేదమ్మా .. అన్నీ కుదిరితే , నేనే మీ ఇంటికి వస్తాను ‘ అంది కౌసల్య
‘థాంక్స్ ఆంటీ’ అంటూ మొహం ఇంత చేసుకుని వెళ్లిపోయేడా భార్గవ్!
ఆ రాత్రి , అమెరికాలో ఉన్న కొడుకు పవన్ కి ఫోన్ చేసి మాట్లాడింది .
‘ఒకే ఆఫీస్ అంటున్నావు .. పైగా బావున్నాడు అంటున్నావు .. దానికి ఇష్టమైతే చేసెయ్యమ్మా ‘ అన్నాడు ఫణి
‘నిజంగా చెప్పాలి అంటే … నాకేమీ ఇష్టమూ లేదు . అలాగని అయిష్టమూ లేదు .. అతను మంచివాడే .. కాదనను .. కానీ అలాగని పెళ్లి చేసేసుకోవాలా ?’ అంది గీతిక
‘మంచివాడే అని నువ్వే అంటున్నావుగా ..అంటే నీకు అతని గురించి కొంత ఐడియా అంటూ ఉంది .. ఎలాగూ అమెరికా వెళ్తానంటున్నావు .. కాబట్టి ఓసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడితే ? మనం ఏమీ వెతక్కుండానే , ఓ మంచి సంబంధం ఇంటికే వచ్చిందంటే .. అదృష్టవంతురాలివే నువ్వు ‘ అంది కౌసల్య
‘సరే అమ్మా … ఆల్రెడీ ఆ అబ్బాయి వాళ్ళింట్లో చెప్పేసేను అంటున్నాడు కదా .. నువ్వు ఓసారి మావయ్య ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడు .. నాకు మీటింగ్ కి టైం అవుతూంది ‘ అంటూ కాల్ కట్ చేసేడు పవన్ .
ఆ మర్నాడు తన తమ్ముడు కేశవ్ తో విషయం చెప్పి , ఓ మంచిరోజు చూసుకుని , కేశవ్ కుటుంబం తో ఆ భార్గవ్ వాళ్ళింటికి వెళ్ళేరు కౌసల్య , గీతిక .
పరిచయాలయ్యాయి , చాలా బాగా మాట్లాడేరు భార్గవ్ తల్లితండ్రులు బలరాం , జయంతి .
మాటల్లో అడిగేరు బలరాంగారు , ‘మీ అబ్బాయిని ఎవరికిచ్చేరు ?’
‘మా పవన్ ది లవ్ మ్యారేజ్ అండి ‘ అంది కౌసల్య
‘అది సరేనండి .. వాళ్ళ ఇంటి పేరేంటి ?’ జయంతి అడిగింది
కౌసల్య చెప్పింది.
‘అంటే వాళ్ళు మన క్యాస్ట్ కాదు కదండీ?’ నవ్వుతూ అన్నారు బలరాంగారు
‘అవునండి ‘
‘అలా ఎలా చేసుకున్నారండీ? అంటే రేప్పొద్దున్న .. మా అబ్బాయిని మీ ఇంటికి ఇచ్చేమనుకోండి .. ఎప్పుడైనా మీ ఇంటికొచ్చినప్పుడు , అదే టైంలో మీ కోడలు కూడా అక్కడే ఉందనుకోండి , మరా పిల్ల నాన్ వెజ్ తింటుంది కాబట్టి , మావాడిని కూడా నాన్ వెజ్ తినమని బలవంతం చెయ్యరు కదా ?’ గెట్టిగా నవ్వుతూ అన్నారు బలరాం గారు
‘అమ్మా.. పద ‘ అంటూ లేచి నుంచుంది గీతిక
‘ఆవేశపడకమ్మా .. ఆలోచించు .. అలాంటి కుర్రాడిని ఇంటి నుంచి మనం వెలేస్తే , రేప్పొద్దున్న ఇంట్లో వేరెవరైనా ఇలాంటి వెధవ్వేషాలు వెయ్యడానికి దడుస్తారు .. కానీ … మీలా మెతగ్గా అయిందేదో అయ్యిందని ఒప్పేసుకుంటే , రేప్పొద్దున్న మన క్యాస్ట్ భవిష్యత్తేంటి ?.. నీకు మా అబ్బాయిని చేసుకునే అదృష్టం లేదనుకో ‘ అని బలరాం గారు అంటూంటే , విసురుగా బయటికి వెళ్ళిపోయింది గీతిక . అదే గదిలో కూచున్న భార్గవ్ వంచిన తలెత్తలేదు !
ఆ తర్వాత కొన్ని నెలలకే గీతిక అమెరికా వెళ్ళిపోయింది . అప్పటి నుండి ఇలా ఏడాదికో ఆర్నెల్ల పాటు తను అమెరికా వెళ్ళడం , పిల్లల దగ్గిర సరదాగా గడిపి రావడం ఓ అలవాటుగా అయ్యింది కౌసల్యకి . మళ్ళీ ఎప్పుడూ ఆ భార్గవ్ ప్రసక్తి రాలేదు వాళ్ళ మధ్య , అసలు అతని గురించి డిస్కస్ చెయ్యడమే అనవసరం అనుకున్నారు వాళ్ళు .
అలా ఆలోచనల్లో ఉంటే , ఫోన్ మోగింది , ఎవరా అని చూస్తే గీతిక నుంచి .
‘ఏం లేదు .. ఒక్కదానివే కూచునుంటావు కదా .. నీకు బోర్ కొడుతుందని ఫోన్ చేసేను .. అన్నయ్య వాళ్ళని కూడా కాన్ఫరెన్స్ చేస్తాను , అంటూ పవన్ ని కూడా కాల్ లో కలిపింది .
‘మీకో విషయం చెప్పాలి .. ఇందాక అనుకోకుండా ఆ భార్గవ్ వాళ్ళ పేరెంట్స్ ని చెకిన్ కౌంటర్ దగ్గర కలిసేను’ , అంటూ విషయం చెప్పింది కౌసల్య
‘ఆ మనిషికి ఇంకా ఆ క్యాస్ట్ పిచ్చి తగ్గలేదన్నమాట ‘ అన్నాడు పవన్
గీతిక నవ్వు వినిపించి , ‘ఏమిటే .. ఇందులో అంత గెట్టిగా నవ్వడానికి ఏముంది ?’ అని చిరుకోపంగా అడిగింది కౌసల్య
‘అమ్మా . నేను నవ్వుకున్నది .. ఆ భార్గవ్ వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి ‘ అంది ఇంకా నవ్వుతున్న గీతిక
‘ఆయన గుర్తొస్తే, నవ్వు రావడమేమిటి?’ విసుగ్గా అడిగింది కౌసల్య
‘అలా కాదమ్మా … ఆ భార్గవ్ ఇక్కడి అమెరికన్ అమ్మాయిని చేసుకున్నాడు .. మరి ఇప్పుడు ఆయన మన క్యాస్ట్ గురించి ఏమంటాడో అనుకుని నవ్వేను ‘ చెప్పింది గీతిక
టాపిక్ డైవర్ట్ చేసింది కౌసల్య , కాస్సేపు వాళ్ళు ముగ్గురూ ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు , ఇంతలో కౌసల్య, ‘ఇదిగో ఫస్ట్ క్లాస్ వాళ్ళని బోర్డింగ్ కి పిలుస్తున్నారు నేను వెళ్తాను ‘ అంటే , ‘సరేనమ్మా .. నేను , అన్నయ్య , వదిన ఎయిర్పోర్ట్ కి వస్తాను .. హావ్ ఏ సేఫ్ ఫ్లైట్ ‘ అని ఫోన్ పెట్టేసింది గీతిక .
బోర్డింగ్ వైపు నడుస్తూ ఉంటే, కౌసల్యకి ఎకానమీ క్లాస్ క్యూలో కనిపించేరు భార్గవ్ తల్లితండ్రులు , చిన్నగా నవ్వి, వెళ్ళిపోయింది !
ఆ కౌసల్యగారినే చూస్తున్న జయంతి గారు అన్నారు , ‘మనల్ని చూసి ఆవిడ కొంచెం గర్వంగా నవ్వినట్టు లేదూ ?’
‘ఎందుకు నవ్వదూ? మన వెధవ ఆ అమెరికా పిల్లనెవత్తినో చేసుకున్నాడన్న విషయం తెలిసుంటుంది .. చేస్తే చేసుకున్నాడు .. కానీ ఆ చేసుకునేదేదో ఏ తెల్ల పిల్లనో చేసుకోవచ్చు కదా ?.. ఊహూ .. ఎవరూ దొరకనట్టు ఆ నల్లపిల్లనివత్తినో చేసుకున్నాడు ‘ అన్నారు కోపంగా బలరాంగారు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *