April 16, 2024

తాత్పర్యం – సొరంగం

రచన:- రామా చంద్రమౌళి

కల భళ్ళున చిట్లి చెదిరిపోయింది.
నల్లని ఒక మహాబిలంలోనుండి..చిక్కని చీకటిని చీల్చుకుంటూ..తెల్లగా వందల వేల సంఖ్యలో బిలబిలమని పావురాల మహోత్సర్గం.విచ్చుకుంటున్న రెక్కల జీవధ్వని.ఒక ధవళ వర్ణార్నవంలోకి పక్షులన్నీ ఎగిరి ఎగిరి..ఆకాశం వివర్ణమై..దూరంగా..సూర్యోదయమౌతూ..బంగారురంగు..కాంతి జల.
అంతా నిశ్శబ్దం..దీర్ఘ..గాఢ..సాంద్ర నిశ్శబ్దం.
లోపల..గుండెల్లో ఏదో మృదు ప్రకంపన.అర్థ చైతన్య..పార్శ్వజాగ్రదావస్థలో..వినీవినబడని సారంగీ విషాద గంభీర రాగ ధార.
ఏదో అవ్యక్త వ్యవస్థ ..విచ్ఛిన్నమౌతున్నట్టో..లేక సంలీనమై సంయుక్తమౌతున్నట్టో..విద్యుత్ప్రవాహమేదో ప్రవహిస్తోంది ఆపాదమస్తకం ఒక తాదాత్మ్య పారవశ్యంలో.
భాష చాలదు కొన్ని అనుభూతులను అనుభవాలుగా అనువదించడానికి..ఫేజెస్..స్థాయి..ఉన్నతి..తురీయత..వెరసి భౌతికాభౌతిక ఆవరణలో..నిరంతరాణ్వేషణ.
వెదుకులాట..ఎడతెగని అనంతశోధన.
జీవితమంటే..వెదకడమేనా..వెదకడానికి ఒక అంతమంటూ ఉంటుందా.ప్రశాంతతకోసం వెదకడం..డబ్బుకోసం వెదకడం..సౌఖ్యాలకోసం వెదకడం..మనిషి తనను ప్రేమించే మరో మనిషికోసం వెదకడం..చివరికి..అర్థకాని “ఏదో”కోసం వెదకడం.
ప్రొఫెసర్ బాలసిద్ధ కళ్ళు తెరిచాడు ప్రశాంతంగా.
ఎక్కడినుండో..ఊర్థ్వ లోకాల అవతలినుండి..యోజనాల గగన మార్గం ద్వారా..ఎండుటాకులా తేలి తేలి..కిందకు జారి జారి..ప్రచలిస్తున్న భూతలంపై వాలిపోతున్నట్టు..అనుకంపన..వీణ తంత్రి మృదువుగా మోగుతున్నట్టు..అనునాదం.
రైలు పరుగెడుతూనే ఉంది..టకటకా టకటకా పట్టాల లయాత్మక ధ్వని.
అరవై ఏడేళ్ళ జీవితం.
తన జీవితం ఒక మూసివేసిన పుస్తకంగా మిగిలి..అన్నీ సంక్లిష్టతలే..అన్నీ చీకటివెలుగులే..క్రీనీడలే..అన్నీ దాచబడ్డ ఎండిన పూలే.
కిటికీలోనుండి బయటికి చూశాడు బాలసిద్ద.
రైలు చాలా వేగంగా పోతోంది.కిటికీలోనుండి..దూరంగా భద్రకాళి గుడి శిఖరం..తటాకం..నీలిగా.ఇటు పద్మాక్షమ్మ గుట్టలు.
రైలు కాజీపేట్ దాటి..బైపాస్ ట్రాక్ పైనుండి..వరంగల్.నాగపూర్ దాటిన తర్వాత వరంగల్లే..మహావేగం.
వేగం..కాలం..దూరం..పని..మహబూబియా హై స్కూల్..వెంకటయ్య సార్ లెక్కలు.ఒక తొట్టిని ఒక పంపు ఒక గంటలో ఖాళీ చేయును.అదే తొట్టిని మరొక పంపు అరగంటలో నింపును.ఆ రెండు పంపులను ఏకకాలంలో ఒక గంటసేపు నడిపించిన తొట్టిలో నీరు ఎంతశాతం నిండును.
ఏక కాలంలో..రెండు పనులు..అనేకపనులు వేర్వేరు కాలాలలో..విడివిడిగా..ఒకేసారిగా..ఒకరి చేతనే..వేర్వేరు వ్యక్తులచే..సామూహికంగా..ఒంటరిగా.
పని..పని..ఎప్పుడూ పని లెక్కలే.
జీవితంలో..ఎంతపని జరిగి..ఎంత డబ్బు సంపాదించి..ఎంత సంపదను సంపాదించి..ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ లు కూడబెట్టి..ఎన్ని సుఖాలను పొంది..ఎన్ని..?
అన్నీ ప్రశ్నలే..జవాబులేని పరంపరగా ప్రశ్నలు.
ఐతే చివరికి ఏమి మిగిలింది అనేది అంతిమం.
ఇప్పుడు ఏమి మిగిలింది తన దగ్గర.
ఏరో స్పేస్ ఇంజనీరింగ్..రాకెట్ డిజైన్స్ స్పెషలిస్ట్..ఫ్యూఎల్ కంపోజిషన్స్ ఎక్స్ఫర్ట్..క్రయోజెనిక్ ఇంజన్స్ రూపశిల్పి.
ఎనిమిది దేశదేశాల యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్.పన్నెండు డాక్టరేట్స్..మూడు పోస్ట్ దాక్టరేట్స్ డిగ్రీలు..అంతా ఒక అతివిశాలమైన వృత్తిక్షేత్రం.
పదుల సంఖ్యలో తను రాసిన పుస్తకాలు..ప్రపంచవ్యాప్తంగా..ఎందరో తన అభిమాన విద్యార్థులు..ఐతే.,
మరి ఈ శూన్యం..ఈ వెలితి..ఈ వ్యాకులత..ఎందుకు.?
రైలు వేగం తగ్గుతోంది..బొందివాగు..హంటర్ రోడ్..రైల్వే గేట్.బాలసిద్ధ తన ఎ.సి కోచ్ సీట్ లోనుండి లేచి..వెంట ఉన్న ఒకే ఒక బ్రీఫ్ కేస్ ను తీసుకుని..డోర్ లోకొచ్చి నిలబడి.,
ఎదురుగా గోవిందరాజుల గుట్ట.
సాయంత్రపు నీరెండ పడ్తూ..ధగధగా మెరుస్తూ..కొండ..పైన గుడి..శిఖరం.
సంతోషం ఎందుకో పొంగి..ఉప్పొంగి..బాలసిద్ధను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఫ్లాట్ ఫాం పై..మైక్ లో ప్రకటన వినబడ్తోంది..”యువర్ అటెన్షన్ ప్లీజ్….”
దిగి..చుట్టూ ఒకసారి తేరిపార చూచి.,
చిన్నపిల్లాడు పరమానందంతో పొంగిపోతున్నట్టు..పులకింత.
వెళ్ళాలి..
అటే..గోవిందరాజుల గుట్టపైకి.ఎప్పటినుండో మనసులో..ఆత్మలో నిక్షిప్తమై ఉన్న కోరిక.
బయటకు వచ్చి..ఓ ఆటో..మాట్లాడుకుని.,
స్టేషన్ కు ఎడమవైపుకు తిరిగి.,
వరంగల్లును విడిచి ఇరవై ఎనిమిదేళ్ళు.,
చాలా మారిపోయింది నగరం.
ఐదు నిముషాలు..కుడివైపుకు తిరిగి..దేవీ థియేటర్ అని ఒక హోర్డింగ్..కుడివేపు ఒక ఆర్చ్.దేవాలయానికి దారి.
టైం చూచుకున్నాడు బాలసిద్ధ.నాల్గూ నలభై ఐదు.
అప్పుదు..చిన్నప్పుడు..ఇదే టైం కు వచ్చేవాడు తను..ఈ గుట్టపైకి..పైకి..అక్కడి మంటపం కుడి దిక్కు..మెల్లగా రాతి సొరికెలోకి దూరి.,
మెట్లెక్కుతున్నాడు..ఒక్కొక్కటి.పైకి ఎన్నో మెట్లు..ఓ నలభై ఉంటాయేమో.
పైకి పోతున్నకొద్దీ..కిందివన్నీ చిన్నగా..అస్పష్టంగా..అనిపిస్తాయా.?
హమ్మయ్య..వచ్చేసింది..పైన గుడిమంటపం.
అవే రాతి స్థంభాలు..అదే పై రాతి కప్పు.తెల్లగా సున్నం వేసిన పిట్టగోడలు.పైన వ్రేలాడుతూ కంచు ఘంట.
ఒకసారి..రామనర్సయ్య సార్..ఆయన సైకిల్ పై తనను..డబల్ సవారి..ముందు పైప్ పై కూర్చుండబెట్టుకుని తొక్కుతూ..బుక్కొల్ల తోటదిక్కు తీసుకుపోతూ,
“ఒరే బాలసిద్ధూ..ఎదురుగా చూస్తున్నావుగదా..ఏమి కనబడ్తోందిరా నీకు” అనడిగాడు యధాలాపంగా.
పరిశీలనగా చూచి చెప్పడం ప్రారంభించాడు తను..”దూరంగా ఆజంజాహి మిల్లు..ఆపైన చిమ్నీ గొట్టం..ఇరు ప్రక్కలా గుంపులుగుంపులుగా చెట్లు..ఆ వైపు కరంటు స్థంభాలు.దూరంగా మేస్తున్న బర్రెలు.”అని.
“ఇంకా..”
“ఇంకేముంది సార్.ఏమీ లేదంతే.”అన్నాడు తను తడుముకోకుందా.
“బాగా చూచి చెప్పు”
“ఇంకేమీ లేద్సార్”
“నే చెప్పనా..”
“…”మౌనం.
“పైన..ఎదురుగా..విశాలంగా పరుచుకుని..అనంతాకాశం”
అప్పుదు చూసాడు తను..విశాలాకాశాన్ని.
నిజమే..మనుషులనీ..ఈ సకల చరాచర జగత్తునీ..కమ్ముకుని..ఆవరించి..ఆవహించి నిశ్శబ్దంగా వ్యాపించిఉన్న వినీలాకాశం.
వెనక్కి తిరిగి..సార్ కళ్ళలోకి చూసాను.
సార్ కళ్ళుకూడా ఆకాశంవలెనే..లోతుగా..నిండుగా..ఆర్ద్రంగా..దయతో..కరుణనిండి.
ఎందుకో కన్నీళ్ళొచ్చాయప్పుడు.అర్థం కాలేదు ఎందుకో.
పైకి చేరి ప్రొఫెసర్ బాలసిద్ధు చుట్టూ చూసాడు.ఎవరూ లేరు గుట్టపై.
తనకు చిన్నప్పుడు పరిచయమున్న..కుడిదిక్కు రాతి గుండువైపు నడిచి.,
సొరికె..అదే సొరికె..నల్లగా చీకటి.
మెల్లగా లోపలికి తొంగిచూచి..మెల్లగా దిగి..అడుగులు వేసుకుంటూ..ఒకటి..రెందు..పదడుగులు..భళ్ళున వెలుతురు చిమ్ముకొచ్చి ఒక ఓపినింగ్.
అక్కడే..తను కూర్చుని..ప్రతి వేసవి కాలం సంవత్సరం పరీక్షలప్పుడు చదువుకునేది పగళ్ళు.
జ్ఞాపకాలు..ముసిరే జ్ఞాపకాలు..మనస్సునిండా కురిసే జ్ఞాపకాలు..పులకింతగా.
కూర్చున్నాడు రాతినేలపై..ఒక గుండుకు ఒరిగి..తృప్తిగా ఊపిరి పీల్చుకుని..కళ్ళు మూసుకుని.,
కాలం..లోలకమై..అటూ..ఇటూ..ఊగి..తూగి..కంపిస్తూ..నిశ్శబ్దిస్తూ.,
పది నిముషాల తర్వాత బాలసిద్ధు కళ్ళు తెరిచాడు.
ఎదురుగా..కింద చిన్నగా వ్యాపించిన నగరం.పైన అతి విశాలంగా ఆకాశం.
బాలసిద్ధుకు ఆ క్షణం ఒక్క ఆకాశంతప్ప ఇంకేమీ కనబడ్డంలేదు..ఒక్క ఆకాశమే సృష్టంతా వ్యాపించి..ప్రశాంతంగా.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *