March 29, 2024

బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

రచన: నండూరి సుందరీ నాగమణి

అనగనగా… మరేమో… ఒకానొక దేశంలో…

ఉల్లిపాయంత ఊరుండేదట. ఆ ఉల్లిపాయంత ఊరిలో బుడమకాయంత బుల్లోడు ఉండేవాడట… ఆ బుడమకాయంత బుల్లోడికి తామరకాయంత తండ్రి ఉన్నాడట. ఆ తామరకాయంత తండ్రి కాకరకాయంత కార్యాలయంలో పని చేస్తూ ఉండేవాడట. బుడమకాయంత బుల్లోడు బంగాళాదుంపంత బళ్ళో చదువుకుంటున్నాడట. ఆ బడిలో వీడికి చదువు చెప్పే పనసకాయంత పంతులమ్మ చెర్రీ పండంత చదువు చెప్పేదట. పుచ్చకాయంత ఫ్రెండ్స్ తో అనాసపండంత ఆటలా చదువు నేర్చుకుంటున్నాడు మన బుడమకాయంత బుల్లోడు.

ఈ బుడమకాయంత బుల్లోడికి తమ్మకాయంత తల్లి కూడా ఉందట. ఆవిడ ఓ రోజు తన వాక్కాయంత వంటగదిలో వంట చేస్తూ ఉంటే, తన ఇండుప కాయంత ఇంట్లోకి దొండకాయంత దొంగ ప్రవేశించాడట. వాడు చింతకాయంత చెప్పుల్ని బయట వదిలి, శబ్దం చేయకుండా పడకగదిలోకి ప్రవేశించి, బీరకాయంత బీరువా తెరిచి, అందులో దాచి పెట్టిన వంకాయంత వజ్రాన్ని కాజేసి, మెల్లగా తన టమాటా పండంత టయోటా కారులో వెళ్ళిపోయాడట.

ఆ సాయంత్రం తామరకాయంత తండ్రి ఇంటికి రాగానే వంకాయంత వజ్రం పోయిన సంగతి గ్రహించి, వెంటనే పొట్లకాయంత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, పిల్లిపెసరకాయంత ఫిర్యాదు రాసి ఇచ్చాడట. అక్కడున్న సీమ చింతకాయంత సీ ఐ తన కింద పని చేసే కమలాపండంత కానిస్టేబుల్ ని పిలిచి, దొంగను పట్టుకోవాలని ఆదేశించాడట.

కమలాపండంత కానిస్టేబుల్, లిచీ పండంత లాఠీని ఊపుకుంటూ ఉల్లిపాయంత ఊరిపైన పడ్డాడట. ఇంతలో అతనికి ఆపిల్ పండంత అమ్మాయి కనిపించి, పెద్ద ఉసిరికాయంత ప్రేమలో పడిపోయాడట. ఆపిల్ పండంత అమ్మాయి దగ్గరకు వెళ్ళి, గుమ్మడి పండంత తన గుండెలోని ప్రేమను వెల్లడించాడట. ఆపిల్ పండంత ఆ అమ్మాయి, కలువ కాయలంత కన్నులతో కమలాపండంత కానిస్టేబుల్ ని చూసి, నారింజకాయంత నవ్వు నవ్విందట. ఆపిల్ పండంత అమ్మాయి ఇంటికి వెళ్ళిన కమలాపండంత కానిస్టేబుల్ అక్కడ దొండకాయంత దొంగ ఫోటో చూసి, అతడు ఆపిల్ పండంత అమ్మాయి తండ్రని తెలిసి ఆశ్చర్యపోయినా డ్యూటీ ముఖ్యమని, సపోటా పళ్ళంత సంకెళ్ళతో అరెస్ట్ చేసి, పొట్లకాయంత పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయాడట. సీమ చింతకాయంత సీఐ, కమలాపండంత కానిస్టేబుల్ ని మెచ్చుకుని, దొండకాయంత దొంగను జామకాయంత జైల్లో పెట్టి, తాటికాయంత తాళం వేసాడట.

ఆ తరువాత ఆపిల పండంత అమ్మాయిని పిలిపించి, పొట్లకాయంత పోలీస్ స్టేషన్ లోనే, కమలాపండంత కానిస్టేబుల్ తో ద్రాక్ష పళ్ళంత దండలు మార్పించి, పెళ్ళి చేసేస్తే, ఆ దంపతులు దానిమ్మ పండంత దండం పెడితే, అరటిపండంత ఆశీర్వచనం ఇచ్చి, మామిడిపళ్ళంత మంచి విందు ఇచ్చాడట.

సీమరేగు పండంత ప్రేమ కలిగిన ఆ దంపతులకు సంవత్సరం తిరిగేసరికి సీతాఫలమంత చిన్నిగాడు పుట్టేసాడని వేరే చెప్పాలా?

***

1 thought on “బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *