March 19, 2024

వెంటాడే కథ – 16

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

**********************************************************************

దేవుడున్నాడు !

డిసెంబర్ నెల 24వ తేదీ..

శీతాకాలం కావడంతో రాత్రి 8 గంటలకు ఆ ప్రాంతమంతా దట్టమైన చీకటి అలముకుంది.
అడవికి దగ్గరగా ఉండటంతో చల్లని గాలులు వీస్తున్నాయి.
దాంతో కిటికీలు, తలుపులు బిడాయించుకుని కూర్చున్నారు ఆ ఇంట్లో వాళ్ళు.
మరోపక్క యుద్ధ భయం వారి వెన్నులో పాములా జరజర పాకుతోంది.
80 ఏళ్ల ఎలిజబెత్, ఆమె భర్త ఫ్రిడ్జ్ కలిసి తమ కుటుంబంతో కలిసి రాత్రి భోజనానికి కూర్చున్నారు.
భోజనం అలా నోట్లో పెట్టుకోబోయారో లేదో తలుపు చప్పుడు..
ఉలిక్కిపడ్డారంతా!
అందర్నీ నిశ్శబ్దంగా ఉండమంటూ తన నోటి మీద వేలు ఉంచి, దీపం తీసుకుని లేచి వెళ్లి తలుపు తీసింది ఎలిజబెత్. చల్లని గాలి రివ్వున ముఖాన కొట్టి గజగజ లాడించింది.
ఎదురుగా ఇద్దరు ఆగంతకులు..
వాళ్ళ వేషాలు, భాష చూసి గుర్తుపట్టిందామె అమెరికన్ సైనికులని.
వాళ్లు ఆమె వంక ప్రాధేయ పూర్వకంగా చూస్తూ- “అవ్వా.. మూడు రోజులుగా తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నాం. అక్కడ రాయి మీద మా తోటి సైనికుడు ఉన్నాడు. కాలికి బుల్లెట్ గాయం కావడంతో బాధ భరించలేకున్నాడు.. ఈ చలిని తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ పూట మీ ఇంట్లో ఆశ్రయమిస్తావా.. మా ఆకలి తీరుస్తావా?” అని అడిగారు.
ఎలిజబెత్ లోని మాతృహృదయం మేల్కొంది.
“సరే. రండి రండి.. లోపలికి రండి.. ఆయుధాలతో ఇక్కడ పనేముంది? వాటన్నింటినీ కట్టగట్టి దొడ్డి వైపు వసారాలో పెట్టిరండి ! వచ్చి కాళ్లు, చేతులు కడుక్కోండి” అంది ఆప్యాయంగా.
వాళ్లు ఆమె చెప్పినట్టు చేశారు.
దీపం వెలుగులో ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మూడో సైనికుడి కాలు పరీక్షించి ఏదో నాటు వైద్యం చేశారు.
తర్వాత వారందరికీ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉప్పు చల్లి తినడానికి అందించారు ఎలిజబెత్ కుటుంబ సభ్యులు. వాళ్లు కబుర్లు చెప్పుకుంటూ తింటుండగా మళ్లీ తలుపు చప్పుడు..
ఆ చప్పుడు ఏమిటో వారందరికీ అర్థమైంది తుపాకీ మడమతో గట్టిగా కొట్టిన చప్పుడు!
కుటుంబ సభ్యులతో పాటు సైనికులకు కూడా గుండెలు భయంతో జల్లుమన్నాయి.
ఎలిజబెత్ మాత్రం సైనికుల్ని లోపలి గదిలోకి వెళ్లమని సైగ చేసింది.
తర్వాత తనే లేచి వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా నలుగురు జర్మన్ సైనికులు!
ధైర్యవంతురాలైన ఎలిజబెత్ కూడా వారిని చూడగానే వణికింది. చలికి కాబోలు అనుకున్నారు వాళ్ళు. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుని ఏం కావాలి మీకు అని అడిగింది.
”అవ్వా మేము జర్మన్ సైనికులం. రెండు రోజులుగా అడవిలో దారి తప్పి అల్లాడుతున్నాం. మా బృందాలు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు.. ఆకలి, చలి పీక్కుతింటున్నాయి. దయచేసి ఈ ఒక్క రాత్రికి మాకు మీ ఇంట్లో ఆశ్రయం కావాలి” అన్నారు వాళ్ళు బతిమాలుతున్నట్టు.
ఎలిజబెత్ కి పాలు పోలేదు. తామంతా పెను ప్రమాదంలో చిక్కుకున్నామని అర్థమైంది.
చేసేది లేక ఆ సైనికులను ”రండి.. లోనికి రండి” అని ఆహ్వానించింది..
వాళ్ళు సంతోషించారు.
”… మరికొన్ని గంటల్లో క్రిస్మస్ రాబోతోంది మీరందరూ దేవుడు పంపిన బిడ్డలే! నా ఇంట్లో ఆయుధాలతో పని ఏముంది? వాటిని వీధి గుమ్మం పక్కన ఉన్న వసారాలో దాచి పెట్టుకోండి.. ఆ పక్కన నీళ్ళ తొట్టె ఉంది. కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి రండి.. క్షణాల మీద వంట చేసిపెడతాను” అంది.
కాళ్లు చేతులు కడుక్కుని వాళ్లు లోపలికి ప్రవేశిస్తుంటే – “మీరు నాకు మాట ఇవ్వాలి. నా ఇంట్లో వేరే అతిథులు ఉన్నారు. మీరు వారికి ఇబ్బందులు కలిగించరాదు. పండగనాడు నా ఇంటిని పరిశుద్ధంగా ఉంచండి.. ఇదే నా విజ్ఞప్తి” అందామె.
“అలాగే అవ్వా .. నీ ఇంటిని మేము ఎందుకు అపరిశుభ్రం చేస్తాం.. దేవుడు బిడ్డలని నువ్వే అన్నావు ఇందాక! కనుక దేవుడి బిడ్డలు ఎప్పుడూ అలా చేయరు.. ముఖ్యంగా ఆశ్రయం ఇచ్చిన ఇంటిని వారు ప్రార్థన మందిరం లాగానే చూస్తారు” అన్నారు భరోసాగా.
జర్మన్ సైనికులు లోపలికి వచ్చారు.
లోపల గదిలో అమెరికా సైనికులు తాముగానీ ఏదైనా ట్రాప్ లో చిక్కుకోలేదు కదా అన్న విచికిత్సలో పడిపోయారు. జర్మన్ సైనికుల మాటలన్నీ వారికి వినిపిస్తూనే ఉన్నాయి మరి!
ఎలిజబెత్ తన కొడుకుల్ని కోళ్ల గూటి దగ్గరకు పంపి పండుగ రోజు కోసం దాచుకున్న రెండు కోడిపెట్టలని తెప్పించి కోయించింది.
అరగంటలో ఘుమఘుమలాడే వంట తయారయింది.
సైనికులందరికీ నోట్లో నీళ్ళూరడం మొదలైంది.
వడ్డన పూర్తయింది.
ఎలిజబెత్ ఆదేశంతో లోపలి గదిలో అతిథులు కూడా మధ్య గదిలోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు.
వాళ్లు పరస్పరం ఒకరినొకరు గుర్తుపట్టారు.
ఏడుగురి మొహాలూ కోపంతో ఎర్రబడ్డాయి.
కోపంతో వారు ఒక్క ఉదుటున లేవబోతుంటే –
ఎలిజబెత్ మళ్లీ తన బాణం వదిలింది.
“మీరు ఏడుగురూ దేవుని బిడ్డలు! ఈ క్రిస్మస్ పర్వదినం నాడు నా ఇంటికి ప్రభువే మిమ్మల్ని పంపాడు. మీకు ఆశ్రయమిచ్చే భాగ్యాన్ని నాకు కలిగించాడు. మీరందరూ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఒకరికొకరు కరచాలనాలు చేసుకోండి.. ఆలింగనాలు చేసుకోండి.. ఇప్పుడు మీరందరూ అన్నదమ్ములు” అంది.
ఆ మాటలతో సైనికులందరికి కోపం చల్లారింది. హృదయాలు మెత్తబడ్డాయి. దాంతో అందరూ ఒకరినొకరు చిరునవ్వులు రువ్వుకుంటూ చూసుకున్నారు. ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ‘హాయ్’ అంటూ పలకరించుకున్నారు.
మెర్రీ క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కలిసి కబుర్లాడుతూ భోజనాలు ముగించారు.
జర్మనీ సైనికులలో ఒకరికి కాస్త వైద్య పరిజ్ఞానం ఉండడంతో అమెరికన్ సైనికుడి గాయానికి కట్టిన కట్టు విప్పదీసి తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లోని మందులు పులిమి, చక్కగా బ్యాండేజ్ వేశాడు.
ఆ సమయంలో వారిద్దరి కళ్ళల్లో ఒకరికొకరికి సాక్షాత్తు ఏసు ప్రభువే కనిపించాడు.
ఆ రాత్రంతా సంతోషంతో గడిచిపోయింది.
తమ అందరికీ అంత మంచి ఆతిథ్యం ఇచ్చిన ఎలిజబెత్ ను కన్నతల్లిలా భావించి వాళ్లంతా పాదాభివందనాలు చేశారు.. ప్రేమగా కౌగిలించుకున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
”నాయనా వచ్చే క్రిస్మస్ నాటికి మీరందరూ మీమీ ఇళ్లకు చేరి మీ తల్లితో మీ కుటుంబాలతో ఆనందంగా క్రిస్మస్ జరుపుకోవాలని నా కోరిక. అప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి.. గత సంవత్సరం బెల్జియం అడవుల్లో ఎలిజబెత్ ఆంటీ దగ్గర మీరు ప్రేమగా క్రిస్మస్ ఎలా జరుపుకున్నారన్న విషయం! అంతే కాదు.. ఈ విషయం మీ అమ్మకు, కుటుంబ సభ్యులకి కూడా తెలియ చెప్పండి” అన్నది ఆప్యాయంగా.
“తప్పకుండా అవ్వా. నిన్ను మర్చిపోవడం ఈ జన్మకు జరగదు.. అడవిలో ఆకలితో అల్లాడుతున్న వేళ మాకు కన్నతల్లిలా
ఆతిధ్యం ఇచ్చావు. మీ కుటుంబ సభ్యులతో అమెరికా సైనికులతో కలిసి క్రిస్మస్ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ” అన్నారు జర్మన్ సైనికులు.
అమెరికన్ సైనికులు కూడా అదే చెప్పారు.
మర్నాడు ఎలిజబెత్ కుటుంబం నుంచి వీడ్కోలు తీసుకునేటప్పుడు అమెరికా సైనికులు జర్మన్ సైనికులకి తమ క్యాంపులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చెప్పి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా చిట్కాలు చెప్పి ప్రేమగా వీడ్కోలు పలికారు.
“మీరు మా వాళ్ళకి చేరకుండా చిక్కకుండా క్షేమంగా మీ బెటాలియన్లను కలవాలని మా ఆకాంక్ష” అన్నారు జర్మన్ సైనికులు అంతే ప్రేమగా.
తరువాత చెరోదారిలో తమ తమ ఆయుధాలతో వేగంగా వెళ్లిపోయారు వాళ్ళు.
ఇరుపక్షాలూ కనుమరుగయ్యే వరకు ఎలిజబెత్ కుటుంబ సభ్యులు చేతులు ఊపుతూ టాటా చెప్పారు.
ఇదంతా జరిగింది రెండో ప్రపంచ యుద్ధం సాగుతున్న వేళ..
ఒకపక్క జర్మన్ సైనికులు, మరోపక్క అమెరికా సైనికులు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారు..
ఆ సందర్భంగా బెల్జియం సమీపంలోని ఒక అడవి అంచున ఉన్న గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

-:0:-

నా విశ్లేషణ :

బాగా గుర్తుంది ఇది బెల్జియం కథ. అనువాదకులు కూడా మన ప్రియతమ మల్లాది గారు. పాలకుల కోసం, జీతం కోసం పనిచేసినా సైనికులు కూడా మనుషులే కదా? వారికీ ఆకలి దప్పులు, అనుబంధాలు,
భావోద్వేగాలు ఉంటాయి కదా ? ఈ సబ్జెక్ట్ మీద కొన్ని సినిమాలు కూడా చూసిన గుర్తు ఉంది. దేవుడి సెంటిమెంట్ ఉపయోగించి తన ఇంట్లో రక్తపాతం జరగకుండా కాపాడుకుంది ఎలిజబెత్.
అది యుక్తితో కాదు.. నిండైన ప్రేమ హృదయంతో అని మనం గుర్తించాలి. యుక్తికన్నా ప్రేమకు ఎంతో శక్తి ఉంటుంది. నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే! ఇంత మంచి కథ చదివిన వారు జీవితంలో ఎప్పుడైనా మర్చిపోతారా ? మీరు కూడా మర్చిపోలేరు అని గట్టిగా చెప్పగలను.

4 thoughts on “వెంటాడే కథ – 16

  1. Such a humanistic story it is.
    The story tells a simple thing that God is there every where in every being…
    I heartily appreciate Sri.K.Chandrakanth garu for bringing this kind of stories to us, to read and feel the shades of human kind…
    Thankyou sir.

  2. సర్వమానవ సౌభాతృత్త్వం, మాతృప్రేమ కలబోసి ఒకే కధలో ముఖ్యంగా క్రిస్మస్ పర్వదినం. నేపథ్యంలోఉన్న ఈకధను మల్లాది గారు చేసిన అనువాదం చేసిన చాలా బాగుంది. వాతావరణం చాలా చక్కగా వర్ణించారు. కధను మాకు అందించిన మీకు ధన్యవాదాలు

    1. మల్లాది గారి అనువాదం యథాతథంగా చేయడం మన వల్ల కాదు. యోగానంద గారు ఇది నా నేరేషన్! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *