March 29, 2024

సుందరము – సుమధురము – 1

రచన: నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:

‘భక్త కన్నప్ప’ చిత్రంలోని కిరాతార్జునీయం గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను.
1976లో విడుదల అయిన ఈ చిత్రానికి శ్రీ బాపు గారు దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు గారు గీతాకృష్ణా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కన్నప్పగా తానే నటించారు. అతని భార్య నీలగా వాణిశ్రీ నటించారు.
ఈ పాట, పాశుపతాస్త్రం కోరి, అడవిలో తపస్సు చేస్తున్న అర్జునునికి, అతడిని పరీక్షించటానికి కిరాతరూపం దాల్చి భువికి దిగిన మహాశివుడికి మధ్య జరిగిన కదనమును వివరిస్తుంది. ఆదినారాయణరావు గారు, సత్యం గారు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని ఈ పాటను శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు వ్రాయగా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో మధురంగా ఆలపించారు.
అర్జునుడిగా (కన్నప్పగా మారిన తిన్నడు పూర్వజన్మలో అర్జునుడేనని అంటారు) శ్రీ కృష్ణంరాజు, శివుడిగా శ్రీ ఎం. బాలయ్య, పార్వతిగా శ్రీమతి పి ఆర్ వరలక్ష్మి తెరపై కనిపిస్తారు.
రాగమాలికగా సాగే ఈ పాట వివరణ, ఇదిగో మీ కోసం.
***
‘తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా
(తకిటతక తకతకిట అని నాట్యంచేసే పదయుగళం కలిగిన వాడా! వికటంగా దూకిన గంగను బంధించిన జటలనే సంకెలలను కలిగిన వాడా!)
హరిహరాంచిత కళా కలిత నీలగళా
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా
(హరిహరులతో పూజించబడే కళలతో నిండిన గరళ కంఠం కలవాడా! నిండు కాంతులతో వెలిగే లలాటమున్న చంద్రకళాధరా!)
జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా’
అని దేవతలు శివుని కొనియాడ,
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల!
(పై విధముగా సకల దేవతలు, శివుని స్తోత్రం చేయుచుండగా ఉన్నట్టుండి కైలాసం కంపించిందట. ఒక ప్రళయజ్వాల కనిపించిందట.)
జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె!
(జగములేలే శివునిలో సగభాగమైన పార్వతి నివ్వెరపోయింది. కానీ, మిగిలిన సగమైన హరుని ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది.)
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు
అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి ఇంద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు
(అదిగో, ప్రణవనాదం. అలా ‘ఓం నమశ్శివాయ’ మంత్రాన్ని విడువకుండా జపిస్తూ, తపస్సు చేస్తున్న అతడే అర్జునుడు, పాండవ వీరుల కీర్తిని ధనముగా కలవాడు. ఇతరులెవ్వరికీ సాధ్యం కాని పాశుపతాస్త్రాన్ని కోరి, ఇంద్రగిరిని చేరి, పగలూ రాత్రీ విడువక తపస్సు చేస్తున్నాడు, అదే ఈ దివ్య తేజాన్ని సృష్టించింది.)
నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మారగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
(తలమీద ఉండే నెలవంక నెమలి ఈకగా మారిపోయింది. తలమీద ఉండి పొంగే గంగమ్మ ఆయన తలుపులోనికి పారింది. నిప్పులు కురిసే మూడవ కన్ను బొట్టుగా మారింది. మేనికి పూసుకునే బూడిద పూతల బదులుగా పులితోలు వచ్చి చేరింది. అన్నీ తెలిసిన శివుడు, ఎరుకలవాడయాడు, తల్లి పార్వతి ఆయనను ఎరుకతయై అనుసరించింది. ఓంకార ధనువై ఒదిగిపోయింది త్రిశూలం. కైలాసాన్ని వదలి భూమిపైకి కదిలి వచ్చాడు, మహాదేవుడు.)
శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా
(శివుడు ఆజ్ఞాపించగా మూకాసురుడు అనే రాక్షసుడు భూమి దద్దరిల్లేటట్టు ఘూర్ఘరిస్తూ, పంది రూపంలో వచ్చాడు.)
చిచ్చరపిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో
అర్జునుడు మట్టుపెట్టగా పట్టె బాణమూ
ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే, వేసినంతనే
తలలు రెండుగా విలవిలలాడుచు, తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల, అసువులు వీడెను వరాహమూ
(చిచ్చర పిడుగులా దూకిన ఆ పందిని రెచ్చిన కోపంతో దానిని చంపాలని బాణము, ధనువు అందుకున్నాడు, అర్జునుడు. గురిచూసి బాణం వేయగానే, ఆ పండి తల రెండు భాగాలు అయింది. శరీరం కొండలా గిరగిర తిరుగుతూ, అటూ ఇటూ తగిలిన రెండు బాణాల ధాటికి ప్రాణాలు వదిలేసింది, ఆ వరాహం. ఒకటి అర్జునుని బాణం. మరి మరొకటి? ఆ కిరాత రూపంలో వచ్చిన ఆ మహేశ్వరుని శరమే కదా! )
కొట్టితి నేనని అర్జునుడూ, పడగొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడగొట్టిన వీరముతోనపుడు
వేట నాది, వేటు నాది, వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడూ
చేవ నాది, చేత నాది, చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసె అర్జునుడు
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ
ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
(నేను కొట్టాను పందిని – అన్నాడు అర్జునుడు. కాదు, నేనే పడగొట్టాను – అన్నాడు శివుడు.
ఇద్దరూ పట్టినపట్టును వదలకుండా, తొడగొట్టి ఒకరికొకరు సవాలులు విసురుకుంటున్నారు ఇలాగ…
“వేటాడబడిన ఈ పంది నాది. దానిని వేసిన వేటు కూడా నాదే. నాతో తగవేమిటి నీకు? వెళ్ళు…” అని విల్లు మీటి పలికాడట శివుడు.
“బలం నాది, బాణం వేసింది నేను… నీకు చేవ అంటూ ఉంటే, రా…” అంటూ కనుసైగ చేసాడట, అర్జునుడు.
తన ధనుస్సు గాండీవాన్ని ఎంతో పాండిత్యంతో ఉపయోగిస్తూ బాణాల వర్షం కురిపించాడు అర్జునుడు కానీ అప్పుడు అతడు వేయి చేతులున్నా, అసహాయుడైపోయిన కార్తవీర్యార్జునుడుగా మారాడు.
ఓంకారం అనే మేఘధ్వనిలా (ఘనము అంటే ఇక్కడ గొప్పది అనే కాక, మేఘము అని కూడా అర్థం) శబ్దం చేసే ధనువుతో శరపరంపరను కురిపించాడు, శివుడు… అయినా, అర్జునుడికి అతడు మనోహరుడు కదా! అంటే అనుగ్రహించాలని వచ్చిన వాడే కదా…)
చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గురి వట్టిదాయె
అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మరచిపోయె!
(అదేమి చిత్రమో, అర్జునుడు గురి పెట్టిన బాణమ్ములన్నీ మాయమైపోతున్నాయి. విధి విలాసమా అదేమో, గురి పెట్టి కొట్టినా ఆ శరాలు పక్కకు పోతున్నాయి. మంత్రోచ్ఛారణతో బాణం వేసినా అది విఫలమౌతున్నది. బాణాలు మధ్యలోనే విరిగిపోతున్నాయి. సవ్యసాచి (కుడి, ఎడమ చేతులతో ఒకేసారి బాణాలు వేయగల పటిమ కలవాడని అర్థం) కుడి ఎడమలుగా సంధించటం మరచిపోయాడు…)
జగతికి సుగతిని సాధించిన తల – దిగంతాల కవతల వెలిగే తల
గంగకు నెలవై, కళ కాదరువై – హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై – శ్రీకరమై శుభమైన శివుని తల అదరగా,
సృష్టి చెదరగా,
తాడి యెత్తు గాండీవముతో ముత్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే
తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు – కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు – పదములంటెను నరుడు భక్తితో అపుడు
(జగతినే మంచి మార్గంలో పెట్టే తల, దిగంతాలకు అవతల దేదీప్యమానంగా వెలిగిపోయే తల, గంగకు నెలవైనది, చంద్రకళలకు ఆదరువైనది, హరిబ్రహ్మలకు తరగని పరువైనది, అతి పవిత్రమైనది, పాపాన్ని కోసేసే కొడవలియైనది, శ్రీకరమై, శుభకరమైన శివుని తల అదరగా, సృష్టి చెదరగా…
ఎందుకని అదిరింది అంటే, తాడిచెట్టు అంత ఎత్తున్న గాండీవంతో, మూడు తాళ్ళ ప్రమాణం గల ఎత్తైన అర్జునుడు నియంత్రించుకోలేని కోపంతో కొట్టగానే శివుని తల అదిరిందట…
అప్పుడేమి జరిగింది?
అమ్మానాన్నల చల్లదనంతో సాక్షాత్కరించాడు ఆ దేవుడు… కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు…
ఎదుట నిలిచాడు ఆ శివుడు, ఆయన పదాలు అంటాడు, నరుడు భక్తితో అప్పుడు…)
కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!
(అంటూ శివుని స్తోత్రం చేశాడు అర్జునుడు. ఆ శివుడు మెచ్చి అతనికి పాశుపతాస్త్రమును అనుగ్రహిస్తాడు…)
ఈ పాటలో మనం శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారి కలం యొక్క విశ్వరూపాన్ని చూడవచ్చును. వారి భాషాజ్ఞానాన్ని ఎంతైనా శ్లాఘించవచ్చు.
ఎంతో చక్కని పద ప్రయోగాలు చేసారు.
‘జగములేలిన వాని సగము నివ్వెరబోయె
సగము మిగిలిన వాని మొగము నగవైపోయె’
ఈ పంక్తులలో అంతులేని చమత్కారం!
ఎరుక, అనే పదాన్ని అన్యార్థంలో ఉపయోగించటం వినటానికి భలే అందంగా ఉండే ప్రయోగం. అలాగే, ‘వరాహరూపము, ధరాతలమ్మే’ ‘గాండీవ పాండిత్య’, ‘అర్జునుడు – కార్తవీర్యార్జునుడు’, ‘హరుడు, నరుడు, మనోహరుడు’ అనే పదాలలో శబ్దాలంకారం వీనులకు విందుగా వినిపిస్తుంది.
మంచి ట్యూన్ తో, అద్భుతంగా గానం చేసిన గాయకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ఎప్పుడు విన్నా, తాదాత్మ్యతతో కనులు చెమరింపజేసే ఈ గీతాన్ని మీరు కూడా మరోసారి విని ఆనందించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *