February 27, 2024

అర్చన కనిపించుట లేదు – 2

రచన: కర్లపాలెం హనుమంతరావు

మెడికల్ రిపోర్టు చూసింది శ్రావణి .
“మీ వదిన ప్రెగ్నెంట్ అన్నావు కదా! ఈ మధ్య కడుపులోని బేబీ హెల్త్ కండిషన్స్ సరిగ్గా ఎవాల్యుయేట్ చేయడానికి ఫాదర్స్, మెడికల్ హిస్టరీ కూడా చూస్తున్నార్లే . అందుకే మీ బ్రదర్ ఈ రిపోర్టు తీసుకున్నాడు లాగుంది” అంది.
“ఇంతకీ ఈ రిపోర్టుల్లో ఏముంది?”
“మీ బ్రదర్ హెచ్చైవీ. నెగెటివ్ రిపోర్టు రా ఇది”
“గర్భం వదినకయితే అన్నయ్యను టెస్ట్ చేయించుకోవలసిన అవసరం ఏముచ్చింది?”
“ఇది కామనే అన్నాగా! నా లెక్క ప్రకారం మీ వదిన కూడా ఇలాంటి టెస్టులు చేయించుకుని ఉంటుంది. విజయా డయాగ్నసిస్ లో ఎంక్వయిరీ చేయి!”
“నాకెవరు చెబుతారు శ్రావణీ! ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకోవాలి. ప్లీజ్.. నాకోసం” అన్నాడు రమణ లేస్తూ.
“రేపు నా డ్యూటికి ఆఫ్. పర్సనల్ గా వెళ్ళి చూస్తాలే . ఏదన్నా తెలిస్తే కాల్ చేసి నేనే చెబుతా” అని లోపలికి వెళ్ళి పోయింది శ్రావణి.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయింది రమణ పరిస్థితి. చాలా డిజప్పాయింట్ అనిపించింది.

***

మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి వుంది తులసమ్మగారు. అంత జ్వరంలో కూడా కోడలును గురించే ఆలోచనలు.
‘అదుండుంటే తనిలా పడివుంటే చూస్తూ వూరుకొనేదా! బలవంతంగానైనా అసుపత్రికి తీసుకెళ్ళేది. కాళ్ళనొవ్పులని బాధపడుతున్నా వినకుండా తనను గుళ్ళ కీ, గోపురాలకీ తిప్పి తీసుకొస్తుండేది. . పాపం! కట్టుకున్న మొగుడే మఠాలు పట్టుకుని తిరుగుతున్నా.. అది మాత్రం వేళకి కాఫీలు, టిఫిన్లు మందూ మాకులు అమర్చి పెట్టటంలో ఎప్పుడూ అలక్ష్యం చేయలేదు.
ఏ మాటకా మాటే! పిల్ల బంగారం. ఈ కాలంలో ఇలాంటి కోడలు దొరకడం నిజంగా నువ్వు చేసుకొన్న పూర్వ జన్మ సుకృతమే’ అని అయినవాళ్లు మాత్రం వూరికే ఎందుకుకుంటారు? అత్తగారు కనక తనకు అప్పడు ఒప్పుకో బుద్ధి కాలేదుగానీ.. అది లేని లోటు ఇప్పుడు ఇంట్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది.
ఎక్కడికెళ్లిందో ? ఎందుకెళ్లిందో? ? ఏమయిందో ?
గది బైట ఎవరో తచ్చాడుతున్నట్లు ఆలాపన. లేచి చూద్దామంటే వళ్లు కర్రలు బిగించి కట్టినట్లు బిర్ర బిగుసుకొనుంది.
“ఎవరూ? ” అని కేక వేసింది. సమాధానం రాలేదు.
మనసులో మళ్ళీ ఆలోచనలు. దానిది గవర్నమెంటు ఉద్యోగం. నెలకు నలభై వేల జీతం. జీతం ఇట్లా వచ్చీరాగానే తెచ్చి అట్లా తన చేతిలో పోసేది . . ప్రసాదు గాడే ఇంకా ఇంట్లో సరిగ్గా ఇవ్వడు గాని.
ఆ పాడు తిరుగుళ్లూ, పేకాటా ! ఇది వచ్చిన తరువాత కదూ వాడింటి పట్టున ఈ మాత్రమైనా ఉండటం ! కోడలు పిల్ల తోడు, సహకారం లేకుండా లావణ్య పెళ్లి భారం దిగేనా? రమణగాడికింకా దారే ఏర్పడలేదు. తన సాధింపు సతాయింపుల వల్లే కోడలు ఇల్లు వదిలి వెళ్ళి పోయిందంటున్నారంతా. తనేం సాధించింది దాన్ని!
ఇల్లు పట్టకుండా పొద్దస్తమానం పార్టీలనీ, ఫంక్షన్లనీ, నాటకాలనీ, నాట్యాలనీ పెళ్లి అయిన ఆడది బైట తిరుగుతుంటే దాని కన్న తల్లయినా ఒక మాట అనకుండా ఉంటుందా? తను అత్తగారు కనక అది సాధింపు అయిపో యిందా?!
కడుపులోని బిడ్డ మంచి చెడ్డ అట్లా గాలికొదిలేసి తిరుగుతుంటే ఆయనా, దాని మొగుడూ నంగిరి పింగిరి వాళ్లు కనక అల్లాగా వూరుకున్నారు . కానీ.. ఇంటికీ అడపెద్ద అయివుండీ తను ఎందుకు నోరు మూసుకొనుండాలి?!
అదే కూతురు చేస్తే మాత్రం తను మందలించకుండా ఉంటుందా?! ఇంటిని ధర్మసత్రంలాగా మారుస్తానంటే . . చూస్తూ పూరుకోవడం తన వల్ల కానిపని.
సవతి తమ్ముణ్ణి తెచ్చి నట్టింట్లో పెట్టుకుని తిప్పుతానంటుంది . వద్దంటే .. దానికే ఇంతలా అలిగి ఇల్లొదిలి పోవాలా?
ఎదిగిన బిడ్డ నట్టింట్లో తిరుగుతున్నాడు . నోరు విడిచి ‘అమ్మా ! రెండొందలియ్యవే ‘ అనడిగితే తడుముకోకుండా రొంటి ముడి విప్పి ఇవ్వగలుగుతున్నదంటే, తను డబ్బు విషయంలో అంత గట్టిగా ఉంటుంది కాబట్టే కదా !
కాలేజీకి పోయే పిల్ల లావణ్య . కంటికి కాస్త నదురుగా ఉండాలంటే రెండు మూడు జతలు అవసరమవునా కాదా ! తనెంత గట్టిగా లేకపోతే పిల్లదాని మెడలో ఆ రెండు తులాల గొలుసు చేయించి పెట్టగలదూ!
బైటకు మెరమెచ్చులు పలికినా కోడలుకు లోపలెక్కడో ‘ఇదంతా నా డబ్బు. నా నిర్వాకంతోనే వీళ్ళంతా బతుకుతున్నారు ‘ అని ఉండే ఉంటుందని తన అనుమానం. లేకపోతే రవ్వంత కట్టడి చేయబోయినందుకే ‘చూడండి .. నేను లేకపోతే మీ సంసారాలే మైపోతాయో’నని సవాలు చేసినట్లు ఇల్లు విడిచి పోతుందా!? .. అదీ చెప్పా పెట్టకుండా!
రమణగాడికి బెజవాడ మనిషెవరో మధ్యలో ఉండి రెండు లక్షలిస్తే గవర్నమెంటు ఉద్యోగం తెప్పిస్తానన్నాడు. ‘ నెలకు యాభైవేలు జీతం. వదిన్నడిగి ఇప్పించవే!’ అని పాపం ఎంత పోరుపెట్టాడు పిల్లాడు. పడనిచ్చి చచ్చిందా ఇది!
“రోజులు బాగా లేవత్తయ్యా! బియస్సీ కూడా అవని వాడికి అంతంత జీతాలు. . అందులోనూ గవర్నమెంటులో.. ? ! ఎందుకైనా మంచిది. మందు విచారించి చూద్దాం” అంటూ ఆ పని మామగారికి అప్పిగించింది. కోడలు అట్లా పురమాయించిందో లేదో ఈయనగారు ఇట్లా గెంతుకుంటూ వెళ్ళి విచారించుకొచ్చారు. “మధ్య మనిషి వట్టి ఫోర్ ట్వంటీట! ఇది వరకు ఇట్లాగే కార్పొరేట్ ఆసుపత్రులకు కిడ్నీలమ్ముకుని కేసుల్లో ఇరుక్కున్నాట్ట ‘ అని రిపోర్టు .
ఆ కాస్త వంక చాలదా దీనికి.. మొండి చెయ్యి చూపేసింది!
లావణ్య దగ్గరికొచ్చేసరికీ అట్లాగే దయ్యం పట్టినట్లు ప్రవర్తించేది! ఇల్లు విడిచి ఇట్లా అర్థాంతరంగా వెళ్ళి పోవడానికి ఆరోజు లావణ్య పెళ్లి మీద ఇంట్లో అయిన రచ్చ కాదు గదా కారణం? !
కంచికచర్ల వెళ్లొచ్చిన మర్నాడు జరిగిన ఆ సంఘటన తులసమ్మ మనసులో మెదిలింది.

***

ఆ శనివారం రాత్రి ఇంట్లో అందరూ భోజనాలకు కూర్చోనున్నారు.
“లావణ్యను గురించి అత్తయ్య వాళ్ళేమన్నారమ్మా?” అని అడిగాడు ప్రసాదు .
“ఏమంటుంది! … మన పిల్ల అంత రంగు లేదని గునుస్తుంది . అక్కడికి దాని కూతురేదో మహా సౌందర్యరాశి అయినట్లు” అంది తులసమ్మ.
కుమారి సంగతి ఎత్తగానే చిరాకు పడ్డాడు ప్రసాదు.
మొదట్లో తన కొడుక్కి చేసుకోవాలనుకున్నారు తలసమ్మ. తమ్ముడిది మండలాఫీసులో రెవిన్యూ ఉద్యోగం. పిల్లనిచ్చి అల్లుణ్ణి చేసుకొని వాడికో దారి చూపిస్తాడేమోనని అప్పట్లో ఆశపడింది తులసమ్మ . వాడి అండ దొరికితే ఉత్తరోత్తరా రమణగాడిని కూడ గాడిలో పడేయవచ్చని ఊహ. లావణ్యను కాణీ కట్నం లేకుంగా వాడి కొడుకు మూర్తికి అప్పగించవచ్చని చాలా పెద్ద ప్లానులోనే ఉంది తులసమ్మ.
ప్రసాదు వాళ్ళ కంటికి అనలేదు. ఏదో అమెరికా సంబంధం చేశారు. కుమారి వాడి దగ్గర రెండేళ్లు కూడా ఉండకుండా ఇండియా తిరిగొచ్చేసింది.
విడాకులు తీసుకున్న కూతురు, ఎక్కిరాని కొడుకు.. ఉద్యోగంలో ఇబ్బందులొచ్చి రెండేళ్ళ కిందటే గుండెనొప్పితో తమ్ముడు పోయాడు.
“అయినా మరదలు గీర తగ్గలేదు” అంది ఇప్పుడవన్నీ గుర్తుకొచ్చి తలసమ్మ.
“అదేం కాదులే. మగపెళ్ళివారు కదా.. ఆ మాత్రం బెట్టు ఉండకుండా ఉంటుందా!” అన్నారు తులసమ్మ భర్త శ్రీమన్నారాయణగారు.
ఆ మాటలకు నవ్వు వచ్చింది అర్చనకు. అది తన మీదనే అనుకొని గయ్యిమని లేచింది అత్తగారి హోదాలో తులసమ్మగారు.
అయినా మధ్యలో తమాయించుకుని వివరాలు చెప్పుకొచ్చింది కొడుకు ప్రసాదుకి “మూర్తికి కూడా మనమే ఇక్కడ ఏదన్నా ఉద్యోగం ఇప్పించుకొని అప్పడు చేసుకోవాలట. అదిరా మీ అత్తయ్య ఎత్తుగడ !”
ప్రసాదు గయ్యిమని లేచాడు. “తాను దూర సందులేదు. మెడకో డోలన్నట్లుంది. ఇక్కడ మన రమణగాడే గాడిదెద్దులాగా తిరుగు తుంటే వాడు కూడానా?”
దాంతో రమణకు పొడుచుకు రావడం.. తినే తినే కంచం ముందు నుంచి లేచిపోవడం.. కన్నతల్లిగా తులసమ్మ కడుపులో మంట రేపింది.
“ప్రసాదుగాడు ఈ మధ్యలో మరీ పెళ్లాం చెప్పినట్లు అడుతున్నాడు” అని చాలా కాలనుంచి కడుపులో రగులుతున్న మంటను ఆ గొడవల్లో పుసుక్కుమని బైటికే అనేసింది.
దాంతో ఎన్నడూ లేనిది అర్చన ఎందుకో భద్రకాళి అవతారం ఎత్తేసింది “అయిన దానికి కాని దానికీ మధ్యలో నన్నాడిపోసుకోవడం ఏం బావో లేదు అత్తయ్యగారూ! రమణకి డబ్బు సర్దనప్పటి నుంచి మీ విసుర్లు నా మీద ఎక్కువయ్యాయిు . అడ్డ దారిలో వెళ్లద్దనడం నేను చేసిన తప్పా? లావణ్య కూడా మీ అలుసు చూసుకుని నా మీద తైతక్కలాడాలని చూస్తుందీ మధ్య” .దాంతో ఎక్కడ నుంచి ఊడిపడ్డదో లావణ్య “నీ ఏడుపంతా నీ డబ్బుతో నాకు పెళ్లి చేయాల్సివస్తుందనేగా!” అంటూ.
“మీ డబ్బు లేకపోతే నాకు పెళ్లి అవదనుకోవద్దు. టాపిక్కు వచ్చింది కాబట్టి చెబుతున్నా.. నా కెవరూ సంబంధాలు చూడనక్కర్లేదు. నా పెళ్ళ నేను చేసుకోగలను” అంటూ ఓ ఫోటో బల్ల మీదకు విసిరేసి పోయింది.
“వీడే నా కాబోయే మొగుడు. మీ మర్యాద నిలుపుకోవాలనుకుంటే నా పరీక్షలవగానే వెళ్ళి అడగండి! వెళ్లకపోయినా ఫర్వాలేదు. మా పెళ్లి నెవరూ ఆపలేరు” అంటూ విసురుగా వెళ్లిపోయింది.
“ఈ లావణ్య చచ్చింది వేసిన బాణాలతోనే కొంప సగం కూలింది. మిగతా సగాన్ని ఈ అర్చన మహాతల్లి కూల్చి పుణ్యం కట్టుకుంది.” అనుకుంది తలసమ్మ గారు.
“ఈ గొడవకే ఇల్లు వదిలి పెట్టి పోయిందా? మొగుడూ పెళ్లాల మధ్య ఏమన్నా జరిగిందా ? కడుపులో బిడ్డను పెట్టుకుని గాలి తిరుగళ్ళు తిరుగుతూనే ఉంది. ఈ మధ్య తరచుగా వంట్లో బాగుండటం లేదు. స్కూలుకు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోరాదా’ అంది తను.”
అదీ తప్పే! పెళ్ళయిన ఇన్నేళ్ళకు ఇంట్లో చిన్న పాపాయి దోగాడితే మంచి రోజులొస్తాయని తను సంబడ పడినంత సేపు పట్టలేదు . ఇంత ఆనందం ఈ ఇంటికి అచ్చిరాదనుకున్నాడేమో దేవుడు!
ఎదురుగా గోడమీది ఏడుకొండలవాడు నుదుటి నామాల వెనక నుంచి చూస్తున్నాడు! ఆ చూపులకు అర్థమేంటీ ? అర్చన అంతర్థానం వెనకున్న అంతరార్థం ఆ పరమాత్ముడికే తెలియాలి!’

***

గుమ్మం దగ్గర మళ్లీ ఏదో అలికిడయింది.
లావణ్య చేతిలో సెల్ తో లోపలికొచ్చింది. దాని మొహంలోని హావభావాలని చూసి తులసమ్మ ఏదో కీడు శంకించింది .
“ఏమైందే! వదిన్ని గురించి ఏమన్నా కబురు తెలిసిందా?”
“తెలిసింది. తెలిసింది! నీ కొడలు కడుపు తీయించుకోవడానికని ఇంట్లోనుంచి దొంగలా పారిపోయింది..” పెద్దగా అరిచింది తులసమ్మగారు. అంత నీరసంలో కూడా అంత పెద్ద గొంతుతో తల్లి అరవడం లావణ్యకు వింతగా అనిపించింది.
“నా వంట్లా గాని ఓపికుండి ఉంటే నిన్నీ పాటికి ముక్కలు ముక్కల కింద తరిగి పోసేదాన్ని. వదినంటే ఎంత గిట్టకపోతే మాత్రం ఇట్లాంటి కారుకూతలా నువ్వు కూసేదీ!”
“ఉన్న మాటే అంటే ఎందుకు అంతలా ఎగురుతావ్? కావాలంటే నువ్వే కాల్ చేసి అడుక్కో” అoటూ సెల్ లో ఓ నెంబర్ నొక్కి తల్లి మీదకు విసిరేసింది లావణ్య .
ఫోన్ లో అటుపక్క రమణగాడి గొంతు “అవునమ్మా ! లావణ్యకు నేనే చెప్పాను.” అంటూ విజయా డయాగ్నసిస్ సెంటర్ వాళ్ల మెడికల్ రిపోర్టు వివరాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు.
వింటున్న తులసమ్మ మొహం జేవురించింది. మంచం మీద అట్లాగే సోలిపోయిన తల్లి పరిస్థితి చూసి కంగారుగా బైటికి పరుగెత్తింది లావణ్య సెల్ ఫోన్ అందుకొని.

లావణ్య అదే పనిగా శేషు నెంబరుకు ప్రయత్నం చేస్తోంది . సెల్ రింగవుతోంది గాని .. రెస్పాన్స్ లేదు!
ఏమయినాడు మహానుభావుడు? మూడు రోజుల్నుంచి మనిషి పత్తాలేడు !
లావణ్యకు భయం పెరిగిపోతోంది.
“నీ పరీక్షలు అయిందాకా ఎవరి దగ్గరా మన లవ్ మేటర్ లీక్ చేయద్దు. మీ వాళ్ళు కట్టడిచేస్తారు. నిన్ను చూడకుండా నేనుండలేను” అన్నాడు శేషు.
“ఛ ! తనే తొందరపడింది ఆ రోజు ఇంట్లో అన్నల దగ్గర అందరి ముందు. ఆడవాళ్ళు నేచురల్ గా ఎమోషనల్ని దాచుకోలేరు” అంటుంటాడు శేషు.
మరి అర్చన వదిన కూడా ఆడదేగా! తనంత కూల్ గా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయింది!
వదిన మిస్సింగ్ కు తన లవ్ మేటర్ కీ ఏమన్నా కనెక్షన్ ఉంటుందా? రమణగాడిచ్చిన సమాచారాన్ని ఆ శేషుతో షేర్ చేసుకొందా మనుకుంటే వాడసలు లైన్ లోకొచ్చి ఛస్తేగా! తానిచ్చిన బంగారాన్ని ఏం చేసాడో? కొంపదీసి వదినలాగా వాడూ… !
‘ఛ. ఛ! నిజమైన ప్రేమకు అనుమానాలుండకూడదు. తను శేషుని నిజంగానే ప్రాణానికి మించి ప్రేమిస్తోంది . అందుకే కంచికచర్ల మూర్తి బావ సంబంధం తప్పిపోయిందనగానే బోలెడంత సంబరపడింది. ఇంట్లో అందరితోను ఈ శేషు అండ చూసుకొనే విరోధం తెచ్చుకుంది.
సందు దారికితే చాలు.. వదిన తనకు ఎన్ని సంగనాచి నీతులు బోధించేది? ఇప్పుడు తనే ఎవరినో తగులుకుని ఏగించుకుని పోయింది!.
వదిన ఇలాంటి పనులు చేస్తుందని తనైతే ఊహించుకోలేక పోయింది. కాని శేషు అభిప్రాయం వేరుగా ఉంది. “మీ వదిన ఎట్లాంటిదో నాకు ఎప్పుడో తెలుసు. నేను నీకు రాసిన లవ్ లెటర్స్ చూపించి బ్లాక్ మెయిలుకి దిగింది తెలుసా ! వాటిని చూపించి బెదిరించింది రెండు మూడు సార్లు.. మరీ!” అన్నాడు శేషు.
తను షాకయింది.
ఆ డెవిల్ తను లేనప్పుడు తన రూములో దూరి శేషు రాసిన లెటర్స్ ను కాజేసిందన్న మాట ! తన వల్ల శేషు పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు!
తను బాధపడుతుంటే శేషు అన్నాడు, “ఆ లెటర్సు చూపించి మీ వదిన నిన్ను పెళ్ళి చేసుకోమని డిమాండ్ చేస్తే అర్థం చేసుకునే వాడినే ! తను నా దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది లావణ్యా!”
“మనం వెంటనే మేరేజ్ చేసుకుంటే ఇంకెవరూ ఏమీ చేయలేరుగా శేషూ?” అని తను అడిగితే “మేడమ్ ! మాకూ తమరి కన్నా తొందరగానే ఉందిక్కడ. నీ ఎగ్జామ్స్ డిస్టర్బ్ చెయ్యడమెందుకని చూస్తున్నా! రేపే కదా నీ ఫైనల్ పేపర్. ఎల్లుండి ఈ పాటి కల్లా మనం కోయంబత్తూర్ లో ఉంటాం” అన్నాడు శేషు.
“నా ఫ్రెండొకడు అక్కడ ఫైనాన్స్ బిజినెస్ లో ఉన్నాడు. నన్నూ పార్టనర్ గా జాయినవమంటున్నాడు. స్టేట్స్ కి వెళ్ళాలని దాచుకున్న సొమ్మును వాడికి డైవర్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఆ క్యాష్ నేమో ఇప్పుడు మీ వదినమ్మ డిమాండ్ చేస్తుండె నా లవ్ లెటర్స్ చూపించి” అన్నాడు శేషు.
“ఇవ్వద్దు. మా వదిన్ని కేర్ చేయద్దు! ఏం చేస్తుందో చూద్దాం!”
“అది నిజమే కానీ, నాకు ఎస్సై పోస్టు వచ్చే ఛాన్సుంది . ఇట్లాంటి లెటర్స్ బైటపడి పోలీసు కేసయితే వచ్చే ఉద్యోగం కూడా వెనక్కు పోతుంది. అదే చూస్తున్నా” అన్నాడు శేషు.
శేషుని సేవ్ చేయడానికి ఎలాగైనా ఆ లవ్ లెటర్సు తిరిగి సంపాదించాలని డిసైడయింది తను. వదిన బీరువా నుండి వాటిని తస్కరించే అవకాశం కోసం ఎదురుచూసింది.
నల్లకుంట రామ్మూర్తి బాబాయిగారింట్లో బారసాలకని ముందురోజే అమ్మ వెళ్ళిపోవడం… పెద్దన్నయ్య డ్యూటీకి, నాన్న మఠానికి వెళ్ళడంతో ఏకాంతం దొరికింది. రమణగాడు ఇంట్లో లేని సమయం చూసి వదిన గదిలో దూరింది. ఆమె స్నానాల గదిలో ఉంది. తాళం బీరువాకే వేళాడుతోంది.
లెటర్స్ కోసం వెదుకుతుంటే అవి కనిపించ లేదు గానీ… లాకర్ లో వున్న గోల్డ్ బాక్సు చేతికి తగిలింది. అవి తీసే వేళకి వదిన బాత్ రూమ్ గడియ తీస్తున్న చప్పుడయింది. చప్పున బాక్సుతో సహా తను బైటకు తప్పుకుంది.
వదిన వెళ్ళి పోయిన తరువాత శేషుకు కాల్ చేసి బంగారం మేటర్ చెప్పినప్పుడు లెటర్సు దొరకనందుకు బాధపడిన దానికన్నా .. బంగారం దొరికినందుకు ఎక్కువగా ఆనందించినట్లనిపించింది .
“సమయానికి సొమ్ము అందించి ఆ దేవుడు కూడా మన ప్రేమను ఆశీర్వదించాడు. ఆ గోల్డునెట్లాగో తంటాలు పడి కేష్ గా మారుస్తా.. వెంటనే తీసుకురా!” అని తాము ఎప్పుడూ కలుసుకునే స్పాటుకి పిలిపించుకున్నాడు.
బంగారం చేతిలో పడగానే “షాపులు క్లోజ్ చేసేలోపలే కేష్ చెయ్యాలి. టైం లేదు. నువ్వు లగేజీతో రడీగా ఉండు” అంటూ బైక్ మీద దూసుకుపోయాడు. ఆ పోవడం పోవడం ఇవాళ దాకా అయిపూ ఆజా లేడు!
ఇంట్లో దొంగతను విషయం బైటి పడేలోపలే వదినమ్మ ఎపిసోడ్ మొదలయింది.
ఇంటి బంగారమే మాయమైపోతే , ఇక వంటి బంగారాన్ని గూర్చి చింతెవరికుంటుంది ఇప్పుడు!
వాకిట్లో ఏదో బండాగిన చప్పుడుకు ఈ లోకంలోకొచ్చింది లావణ్య .
పోలీస్ వ్యాన్! . .

***

పోలీస్ వ్యాన్ లో లేడీ కానిస్టేబుల్ కనిపించింది .
శ్రీమన్నారాయణగారు బయటికొచ్చారు.
“సార్! మీ అమ్మాయిని ఇంటరాగేషన్ చేయవలసి వచ్చింది. స్టేషన్ కు తీసుకువెళుతున్నాం. కావాలంటే మీరూ వెంట రావచ్చు” అన్నాడు యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ ఒకడు .
లావణ్య తండ్రితో సహా బండి ఎక్కింది .
పోలీస్ స్టేషన్ లో ఎస్సై గారు విచారణ చేస్తున్నారు.
శేషు ఫోటో చూపించి “ఈ అబ్బాయి నీకు తెలుసా?”
“తెలుసు సార్!”
“ఎలా? క్లాస్ మేటా? కాలేజీ సీనియరా? ఇంకేమైనానా?”
“ఫ్రెండ్ .. పేరు శేషగిరి సార్ !”
“అలాగా! ఏం చదువుతున్నానని చెప్పాడు?”
“ఎమ్. టెక్ చేసాడు. పాత గాంధీ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న రెస్టరెంట్ లో పి.ఆర్. ఓ సార్!”
“ఫ్రెండన్నావు. నువ్వేమో మా ఇంకా కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయివి. వాడేమో పెళ్ళయి.. ఇద్దరు పిల్లలకు తండ్రి”
‘”నో” అని అరిచింది లావణ్య . “హి ఈజే బ్యాచిలర్ . మేమిద్దరం. తొందర్లో మారేజి కూడా చేసుకోబోతున్నాం” అంది తెగించి.
ఇంత దాకా పక్కనే తండ్రి ఉన్నాడని నిజం చెప్పలేదుగాని ఇంకా సైలెంటుగా వుంటే తను చేసిన బంగారం దొంగతనం అన్యాయంగా వాడి మీద పడుతుంది. ఎస్సై ఉద్యోగానికి ఇబ్బంది.
“సార్! ఆ బంగారం మా వదినది. కాజేసింది నేను. శేషుకేమీ తెలీదు. కావాలంటే నా మీద కేసు బుక్ చేసుకోండి, ప్లీజ్ .. లీవ్ హిమ్ !”
ఎస్సైగారు కూల్ గా అన్నాడు “బంగారమేంటి ? శేషేంటి ? అతడి పేరు శేషు కాదమ్మా. నరసింహరాజు. వీడు ఏ రెస్టరెంటులోనూ ఏమీ కాడు. బ్లడ్ బ్యాంకులకి బ్రోకర్ . వీడిని అరెస్టు చేసింది ఒక్క దొంగతనం కేసు మీదే కాదు. చీటింగ్, అడల్టరీ, అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం.. వగైరా వగైరా! వాడి సెల్ ఫోన్లో నీ నెంబరు కూడా ఉండబట్టి ఇంటరాగేషన్ కోసం పిలిపించాం . ఈ స్టేట్ మెంట్ మీద సంతకం చేసి ఇంటికి పో! ఇలాంటి డాఫర్స్ వలల్లో పడకండమ్మా ! మీ వదినగారు మా పాపకి టీచర్ . ఆ గౌరవంతో బంగారం దొంగతనం కేసు వదిలేస్తున్నా!” అని పెద్ద లెక్చరే దంచాడా ఆఫీసర్.
తండ్రితో కలిసి ఇంటి కొచ్చిందేగాని పెద్ద షాక్ లో ఉందిప్పుడు లావణ్య.
మర్యాడు అన్ని పేపర్లలో ఆ శేషు.. అలియాస్ నరసింహరాజుని గురించి ఫుల్ పేజీ క్రైం స్టోరీసే !
డబ్బు కోసం రక్తదానం చేసేవారిని వలేసి పట్టుకుని రక్త నిధి కేంద్రాలకు తరలించే ఒక దళారి ముఠా రాష్ట్రంలో కొంతకాలంగా చురుగ్గా పనిచేస్తోంది. ఒక యూనిట్ రక్తం దానం చేస్తే దాతకు 1500 రూపాయలు పరిహారంగా ఇచ్చే కేంద్రాలు రాష్ట్రంలో కొన్ని అనధి కారికంగా పనిచేస్తున్నాయి. పేదవారి అవసరాలను తమ వ్యాపారానికి మదుపుగా వాడుకునే ఇలాంటి దొంగ రక్తనిధి కేంద్రాలకు దళారులే వెన్నూ దన్నూ .
ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కి అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో అందుబాటులో ఉన్న ‘ ప్రగతి రక్తనిధి కేంద్రం’ నుంచీ రెండు రక్తం పేకెట్లు తెచ్చి ఎక్కించారు. తరువాతి చికిత్స కోసం వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి రక్తంలో మలేరియా క్రిములున్నట్లు నిర్ధారించారు. అంతకు ముందే నిర్వహించిన రక్త పరీక్షలలో ఆరోగ్యంగానే ఉన్న రోగికి రక్తనిధి తాలూకు రక్తం ఎక్కించిన తరువాత మలేరియా సోకిందని రోగి బంధువులు రోజంతా ఆందోళనలు నిర్వహించడంతో రక్తనిధి కేంద్రాల పని తీరు మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలయింది . ప్రభుత్వాదేశాల మేరకు గవర్నమెంట్ డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి ప్రయివేట్ రక్తనిధి కేంద్రాలకు అందే రక్తం తాలూకు నమూనాలను పరీక్షించి ఒక నివేదికను తయారుచేసారు. డబ్బుకోసం రక్తాన్ని అమ్ముకునే వారిని సేకరించి బ్లడ్ బ్యాంకులకు పంపించే దళారీ ముఠాను వలేసి పట్టుకునే క్రమంలో ‘నరసింహరాజు ఎలియాస్ శేషు ఎలియాస్ జకరయ్య ఎలియాస్ బాషా’ అనే ప్రముఖ నేరస్తుడు పట్టుబడ్డాడు. ఇతనికి అనేక అసాంఘిక కార్యకలాపాలలో ప్రత్యక్ష , పరోక్ష ప్రమేయం ఉందన్న నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించి, పెళ్ళి చేసుకొంటానని ప్రలోభ పెట్టి ఖరీదైన హోటళ్లలో కామకలాపాలకు దించి .. వాటిని బ్లూ ఫిల్ముల రూపంలో సొమ్ము చేసుకొనే ఒక కోయంబత్తూరు ముఠాకు సంబంధించిన వ్యక్తి ఇతను. .
లావణ్య ఇంకా ముందుకు చదవలేకపోయింది.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *