June 14, 2024

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల

ఇక అప్పటినుండి గోపమ్మ , లక్ష్మిని తనతోనే తను పనిచేసే ఇళ్ళకి తీసుకువెళ్ళేది. బడిలో చేర్పించి చదువు చెప్పిస్తానంటే ససేమిరా ఒప్పుకోలేదు లక్ష్మి. లక్ష్మి చేసే సహాయంతో గోపమ్మకి మరి నాలుగు డబ్బులు చేతిలో ఆడసాగాయి. లక్ష్మి ఈడేరినప్పుడు ఫంక్షన్ చేద్దామని తలచింది. నన్ను పదివేలు సర్దమని అడిగింది.
‘ఎందుకు గోపమ్మా! ఈ ఆర్భాటాల ఫంక్షన్లు. అనవసరంగా డబ్బు దండుగ కదా! అప్పు చేసి మరీ చేయాలా?’అని అడిగాను.
“ఏం చేస్తామమ్మా! మా ఇళ్ళల్లో తప్పదు. చెయ్యకపోతే కాకుల్లా పొడుస్తారు. శుభమైనా,అశుభమైనా మా కులపోళ్ళందరినీ పిలవాలి . పలావుతో పాటుగా సారా కూడా ఇప్పించాలి అందరికీ. సాయంత్రం దాకా తినడం, తాగడం మా ఇళ్ళల్లో అలవాటే. పదివేలు ఇప్పిస్తే పై డబ్బులు నా దగ్గర వున్నవి సరిపోతాయి. నెల నెలకి నా జీతంలో కాస్త కాస్త పట్టుకుందువుగాని.” అనేసరికి, నాకు ఇవ్వక తప్పలేదు.
“అమ్మా! మీరు కూడా ఎల్లుండి ఫంక్షన్ కి తప్పకుండా రండి. లక్ష్మికి అక్షింతలు వేసి దీవించాలి” అంటూ పిలిచేసరికి, “ మీ పలావు తింటాననే పిలుస్తున్నావా గోపమ్మా?” నవ్వుతూ అన్నాను.
“అయ్యో! మీరు మా ఇంట్లో తినమనే ధైర్యం నాకు లేదమ్మా! వూరికే వచ్చిపోండి” అంది.
“సరేలే! సరదాగా అన్నాను. ఎల్లుండి సాయంత్రం వస్తాలే” అని చెప్పాను.
మర్నాడు బజారుకి వెళ్లి లక్ష్మి కోసం వెండి పట్టీలు, పరికిణీ జాకెట్ ఓణీ కొన్నాను. ఫంక్షన్ నాడు సాయంత్రం గోపమ్మ కొడుకు రమేష్, నన్ను తీసికువెళ్ళడానికి ఆటో తీసుకుని వచ్చాడు.
నేను గోపమ్మ ఇంటికి చేరేసరికి, చుట్టు గుమికూడి వున్న మగజనం,’అమ్మగారు వచ్చారు’అనుకుంటూ,కండువాలు నోటికి అడ్డు పెట్టికుని దూరంగా వెళ్ళిపోయారు. షామియానా, కుర్చీలు… గోపమ్మ హడావుడి బాగానే జరుపుతోంది అనుకున్నాను. టెంట్ హౌస్ లో అద్దెకి తెప్పించిన మహారాజా కుర్చీలో కూర్చుని వుంది లక్ష్మి. చుట్టూ దాని ఈడు పిల్లలు గోలగోలగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఆకుపచ్చని ఆర్ట్ సిల్కు పరికిణీ, ఎర్రని నైలక్స్ ఓణీ, ఎర్రని జాకెట్, పూలజడ, చేతులకి నిండుగా గాజులు, చెవులకి , మెడలోకి రోల్డుగోల్డు గొలుసు,బుట్టలతో బుట్టబొమ్మలా వుంది లక్ష్మి. నుదుటి మీద అందరూ వచ్చి కుంకుమ బొట్లు మొత్తేసినట్టున్నారు. ఆ బొట్లతోనూ, చెంపల మీద పూసిన గంధం పూతలతోనూ చూడడానికి కొత్తగా వుంది.
నన్ను చూడగానే గోపమ్మ పరుగెత్తుకుని వచ్చి,’లెగండి,లెగండి.’అంటూ చుట్టూ వున్న పిల్లలని తరిమేసింది. వాళ్ళందరూ కొంచెం దూరంలో నిలబడి నా వేపు ఆసక్తి గా చూడడం మొదలెట్టారు. గోపమ్మ బంధుగణంలోని ఆడవాళ్ళందరూ… తమలో తాము..”ఈయమ్మ గారింట్లోనేగా మన గోపమ్మ పని చేసేది” అంటూ చెప్పుకోసాగారు.
గబగబా నాకోసం ఓ కుర్చీ తెప్పించి వేసారు. ఓ ప్లేటులో కారబ్బూందీ, మైసూర్ పాక్ తెచ్చి పెట్టి, “ తినండమ్మగారూ! మీరు కొనుక్కునే స్వీట్ షాపులోవే!” అంటూ ఇచ్చింది. వెంటనే మరొకరు కూల్ డ్రింక్ సీసా కూడా తెచ్చి ఇచ్చారు. వాళ్ళు అంత అభిమానంతో ఇచ్చేసరికి కాదనలేక తీసుకున్నాను.
తర్వాత నేను లక్ష్మి కోసం తీసుకు వచ్చిన కొత్త బట్టలు, వెండి పట్టీలు , దానికి బొట్టు పెట్టి ఇచ్చాను. వాటిని చూసుకుని లక్ష్మి తెగ మురిసిపోయింది. ఫోటో గ్రాఫర్ ని కూడా పెట్టినట్టున్నారు కాబోలు… అతనిని పిలిచి నేను లక్ష్మి కి అక్షింతలు వేస్తున్నప్పుడు, లక్ష్మి చేత నాకు దండం పెట్టిస్తున్నపుడు ఇలా చాలానే ఫోటోలు తీయించింది గోపమ్మ.
ఎక్కడ పుట్టిందో, ఎవరి సంతానమో తెలీదు… అనాధగా దొరికిన పిల్లని తన స్వంత కూతురిలా భావించి , అట్టహాసంగా తనకున్నంతలో వైభవంగా ఫంక్షన్ జరిపించడం గోపమ్మ సహృదయత తెలియచేసేలా అనిపించింది.
“ఈ ఫంక్షనే ఇంత బాగా చేసావు. ఇక పెళ్లి ఇంకెంత బాగా చేస్తావో కదా గోపమ్మా! “ అన్నాను.
ఆ మాటకి లక్ష్మి సిగ్గు పడిపోయింది.
“ఔను అమ్మా! పెద్దమనిషి అయాక మా ఇళ్ళల్లో ఎక్కువ రోజులు వుంచుకోకూడదు. ఇందాకనే మా ఆడబిడ్డ అడిగింది. వాళ్ళ కొడుకు, కోటి వున్నాడు. రిక్షా తొక్కుతాడు. వాడికి ఇచ్చి లగ్గాలు పెట్టుకుందామని అడిగింది. మా ఆయన కూడా చేసేద్దామంటున్నాడు. చెన్నకేశవస్వామి కళ్యాణం అయాక లగ్గాలు పెట్టుకుందామనకున్నాము.” అని చెపుతూ, “ఇదో వదినా! మీ కోటిని పిలువు, అమ్మగారు చూస్తారు.” అంటూ తన ఆడబిడ్డకి చెప్పింది.
“ఒరే! కోటీ! ఇట్ల రారా! అమ్మగారు నిన్ను సూస్తారట” అంటూ ఆమె పెట్టిన కేకకి , అంత దూరంలోనుండి సన్నగా రివటలా వున్న అబ్బాయి, మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ… పరుగెత్తుకుని వచ్చాడు.
“ఈడే అమ్మా! కోటి” అంటూ నాకు పరిచయం చేసింది గోపమ్మ.
“దండాలమ్మా!” వినయంగా వంగి నమస్కారం చేసాడు. చురుగ్గా బావున్నాడు కోటి.
“పిల్లలు ఇద్దరూ బావున్నారు గోపమ్మా! కానీ మరీ చిన్న పిల్లల్లా వున్నారు. పెళ్ళికి అప్పుడే ఏం తొందర. ఎలాగూ ఇంట్లో పిల్లాడే కదా! ఎక్కడికి పోతాడు? నాలుగేళ్ళు పోయాక చెయ్యి.” అంటూ సలహా ఇచ్చాను.
నా సలహా అంతగా రుచించలేనట్టుంది గోపమ్మకి. బుర్ర గోక్కుంటూ, “ఏమో మరి, మా కులపోళ్ళు ఎట్టంటే అట్ట సేయక తప్పదమ్మా!” అంది.
పేరుకి సలహా ఇవ్వగలను కానీ, వాళ్ళ పద్ధతులు మార్చడం నా చేతిలో లేదు కదా! అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరాను.

సశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *