April 19, 2024

జీవనవేదం – 6

రచన: స్వాతీ శ్రీపాద

సీతకు సంతోషంగా ఉంది. మొదటి సారి తనకంటూ వచ్చిన గుర్తింపు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పుట్టి బుద్దెరిగి ఎప్పుడూ నా అనే ఆలోచనే లేదు. బహుమతి ప్రదానం జరిగి మీటింగ్ ముగిసేసరికి రాత్రి తొమ్మిది దాటి పోయింది. మర్నాడు ఆలిండియా రేడియో వాళ్ళు విజేతలను తమ రికార్డింగ్ కోసం ఆహ్వానించారు. నలుగురైదుగురు కలిసి రికార్డింగ్ కి వెళ్ళారు. వెంట వచ్చినలెక్చరర్ర్లు తమ బసలోనే ఉండిపోయారు.
“అయితే లంచ్ కాగానే వెళ్ళిపోతారన్న మాట” అన్నాడు రవీంద్ర.
“మీరేం ఇక్కడే ఉండిపోరుగా? మీరు తిరిగి హైదరాబాద్ రావలసిందేగా?” చనువుగా అంది సీత.
“నిజమే కాని అక్కడ మీరెక్కడ కనబడతారు?” కొంచం దిగులు పలికింది అతని స్వరంలో.
“మనసుంటే మార్గాలు ఉండవా?”
అప్పట్లో ఫోన్లు అంత విరివిగా వాడే కాలం కాదు. ఇంట్లో లాండ్ లైన్ ఉండటమే పెద్ద గొప్ప.
“మీరు హాస్టల్ లో ఉన్నారు వచ్చి కలవాలన్నా కష్టమే.”
“అవును మా వార్డెన్ అస్సలు ఒప్పుకోరు”
ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
రికార్డింగ్ అయ్యాక ఎవరి దారిన వారు వెనక్కు వచ్చారు.
సీత ఇమేజ్ కాలేజీలో అమాంతం పెరిగిపోయింది. ఏ కార్యక్రమమయినా సీత ప్రార్ధనా గీతంతోనే మొదలవాలి. వారం పది రోజుల్లో రేడియో స్టేషన్ నుండి చెక్ వచ్చింది. పాటలు ప్రసారం చేసారు. చెక్ పట్టుకున్న సీత చేతులు వణికాయి. బహుమతిగా వచ్చిన డబ్బు కోసం కాలేజీ కాంపస్ లో ఉన్న బాంక్ లో తొలిసారి అకౌంట్ తెరిచింది. ఆ వెంటనే ఈ చెక్.
“నేనూ సంపాదించగలననే ఊహ ఎంత బాగుందో”
కాలేజీకి దగ్గరలో ఇల్లు చూసుకుంది మమత. తల్లీ చెల్లెలు తనతో ఉండటంతో పాటు, ట్యూషన్లు చెప్పుకునే అవకాశాలు ఎక్కువవుతాయి, అమ్మకు సాయం చెయ్యవచ్చు.
“ఎంత వెతికినా చిన్న ఇల్లు దొరకలేదు సీతా , కొంచం అద్దె ఎక్కువే గాని , చదువుకునే అమ్మాయిని ఎవరినైనా పేయింగ్ గెస్ట్ గా ఉంచుకుంటాం. ఖర్చులు కొంచం కలిసి వస్తాయి”
అప్పుడు వచ్చింది సీతకు ఆ ఆలోచన.
“ఎవరినో ఎందుకు మమతా నన్నే ఉంచుకో, నాకూ కొంత సాయంగా ఉంటుంది. ఎంత వరకని పెళ్లైనా అమ్మ వాళ్ల మీదో అత్త మీదో ఆధారపడను, నేనూ ఏదో ఒకటి చేస్తానులే, నీకు పోటీ రాను”
“మీ వాళ్ళు ఒప్పుకోవద్దూ?” మమత సందేహం. ” నేను ఒప్పించుకుంటానుగా నీకెందుకు?”
మమత మాటల ప్రభావం బాగానే కనిపించింది సీత మీద. మంగళ సూత్రాలు తీసి లోపల పెట్టడం, మట్టెలు తీసేసేంత వరకూ.
అలా ఇద్దరూ హాస్టల్ దాటి బయటకు వచ్చారు.
****
“రాబోయేది లాంగ్ వీకెండ్ కదా ఏమిటీ మీ ప్లాన్స్?” అడిగాడు రవికిరణ్.
నవ్వింది సుమబాల.
“ప్లాన్ ఏమ్ చెయ్యను? నా రూమ్ మేట్ పెళ్ళి చేసుకోబోతోంది. మా ప్లాట్ రెంట్ చేసినది తనే. నేనిప్పుడు వేరే అకామడేషన్ వెతుక్కోవాలి.”
“అవునా? ఆఫీస్ దగ్గరలో అయితే బెటర్ కదా? ”
“నిజమే కాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నాతో షేర్ చేసుకుందుకు సిద్ధపడాలి కదా, షేరింగ్ ఫ్లాట్ దొరకడం అంత సులువేమీ కాదు”
“ఫ్రెండ్స్ ఉన్నది ఎందుకు? నేను సాయం చెయ్యనని అనలేదుగా? నేను ఉండేది ఇక్కడికి దగ్గరలోనే, మా కమ్యూనిటీలో ఎవైనా దొరుకుతాయేమో కనుక్కుందాం” భరోసా ఇచ్చాడు రవికిరణ్.
“అదేం మీకేం వీకెండ్ ప్లాన్స్ లేవా?”
“లేవు అంటే లేవు, ఉన్నాయి అంటే ఉన్నాయి”
“అదేం జవాబు?”
“ఫ్రెండ్స్ కి వాళ్ల వాళ్ల ప్లాన్స్ ఉన్నాయి. నేను వెళ్ళి వాళ్ళలో దూరలేను. నా అంతట నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే మరి” అని కాస్సేపాగి, “నయాగరా ఫాల్స్ చూసారా? అదీ కెనడా సైడ్ నుండి బావుంటుందని అంటారు”
“ఎప్పటికప్పుడు అనుకోడమే గాని వెళ్ళడం కుదరలేదు.”
“పోనీ,” అంటూ కొంచం సంకోచించి, “ఏమీ అనుకోకపోతే ఇద్దరం కలిసి వెళ్దామా?” అని అడిగాడు.
తలెత్తి అతని వైపు అభావంగా చూసింది సుమబాల.
“హార్డ్లీ నాలుగ్గంటల డ్రైవ్ సరదాగా తిరిగి రావచ్చు నియర్ బై ఫన్ ప్లేసెస్ చూడవచ్చును”
ఏం మాట్లాడలేదామె.
“సరే, ఈ రోజు నా ఫ్లాట్ కి రండి ఆ కమ్యూనిటీ మీకు నచ్చితే అక్కడ ప్రయత్నిద్దాం”
తలవూపి అతని వెంత వెళ్ళింది సుమబాల.
“వాటే టేస్ట్ ఎంత బాగా ఉంచుకున్నారు మీ ఇల్లు చూడగానే నచ్చేసింది.” చక్కగా నీట్ గా సర్ది పెట్టుకున్న కిచెన్ చూస్తూ అంది.
“డిప్ టీ తాగుతారా? లేకపోతే కాఫీ?”
“ఏదైనా ఓకె”
పదినిమిషాల్లో ఇద్దరికీ కాఫీ చేసి తీసుకు వచ్చాడు రవి.
“నాతో పాటు వెంకట్ కూడా ఉంటాడు. అతను ఇండియా వెళ్లాడు, త్రీ వీక్స్ కోసం. మీకేం ఇండియా వెళ్ళే ప్లాన్స్ లేవా?”
“ఉహు. కనీసం ఈ ఎమ్ బీఏ క్లాసెస్ అయ్యే వరకూ, చదువు ముఖ్యం కదా” నవ్వింది. మళ్ళి ఒక వెన్నెల కెరటం విసిరినట్తు అనిపించింది.
” వావ్ మీరు చెస్ ఆడాతారా?”
“అవును చెస్ నా ఫేవరెట్ గేమ్”
“నాక్కూడా”
“ఇంకేమ్ ఒక సారి ట్రై చేద్దాం”
అంటూ మొదలు పెట్టిన ఆట మూడు గంటలు సాగి రాత్రి పదిన్నరకు ముగిసింది.
“ఆర్ ఏన్ ఎక్స్పర్ట్” గెలిచినా టఫ్ పోటీ ఇచ్చిన ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
అంత వరకు ఆట ధ్యాసలో పడి తెలియలేదు కాని ఇద్దరికీ ఆకలి గుర్తుకు వచ్చింది.
“డిన్నర్?” ఇద్దరి నోటినుండీ ఒకే సారి వచ్చింది.
“ఇంత లేట్ అయింది, ఇంటికి ఏం వెళ్తారు? కాస్సేపు అన్నం పెట్టేస్తాను అమ్మ ఇచ్చిన పొడూలూ పచ్చళ్ళు ఉన్నాయి, ”
“ఏవైనా కర్రీ చెయ్యనా? అంటూ అతని వెనకే వెళ్ళింది. ఆలూ ఫ్రై మీకు ఇష్టమేనా?” అంటూ చనువుగా కిచెన్ లోకి వెళ్ళి అతను రైస్ కుకర్ సెట్ చేసేలోగా ఆలూ తరిగి ఫ్రై కి తయారు చేసింది.
నాలుగైదు టమాటాలు ఉంటే టమాటా చారు కూడా పెట్టింది.
కంది పొడి ఆలూ ఫ్రై, చారు, పెరుగు తో డిన్నర్. ఆపైన ఇద్దరూ ఒక తెలుగు మూవీ చూసారు.
” “ఇంత రాత్రి ఏం వెళ్తారు? నా ఫ్రెండ్ రూమ్ లో పడుకోండి” అంటూ ఆపేసాడు రవికిరణ్.
****
“వాటె సర్ప్రైజ్”
సీతను చూసి ఆశ్చర్యం ఆనందం కూడా కలిగింది రవీంద్రకు.
మమతతో హాస్టల్ వదిలి వెళ్ళాక రేడియో స్తేషన్ కి వెళ్ళి విజయవాడలో పాటల పోటీ రికార్డింగ్ గురించి చెప్పి ఏదైనా అవకాశం దొరుకుతుందా అని అడిగింది. పాటల రికార్డింగే కాక కాజువల్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఇచ్చారు. నెలకో మూడు నాలుగు మార్లు కార్యక్రమాలు చేస్తూ తన ఖర్చులకు తాను సంపాదించుకోగలుగుతోంది. విజయవాడ వెళ్లి వచ్చి మూడూ నెలలు దాటిపోయింది.
ఆ రోజు ఏదో సంగీత కార్యక్రమానికి వ్యాఖ్యాన్నం కావాలంటే వచ్చింది సీత, అక్కడ రవీంద్రను చూసి సీత కూడా అంతే ఆశ్చర్యపోయింది. ఇద్దరూ అలా కలుస్తారని కలలో కూడా అనుకోలేదు.
రవీంద్ర కూడా ముందునుండే అక్కడ క్యాజువల్ ఆర్టిస్ట్ అని ఆమెకు తెలియదు. అతను చెప్పలేదు.
పని ముగిసాక పక్కనే ఉన్న కామత్ కి వెళ్ళి పాటల సొబగుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.
అతని కళ్ళలో ఆమె పట్ల ఆరాధన స్పష్టంగా కనబడుతూనే ఉంది.
అతని కళ్ళలో ఆమె పట్ల ఆరాధన స్పష్టంగా కనబడుతూనే ఉంది.
రవీంద్ర డిగ్రీ ఫైనల్ లో ఉన్నాడు. ఓ పక్కన చదువుతూనే ఉద్యోగం కోసం కూడా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.
“మీ గురించి ఏం చెప్పలేదు”
“ఏముంది చెప్పడానికి… ఏదైనా ఆలోచన ఉంటేగా ?” అంటూ దాట వేసింది సీత. అయినా మనసులో ఒక చిన్న కల్లోలం.
బావిలో కప్పలా ఊళ్ళో పెరిగి లోకం తెలీకుండా చిన్నప్పటి నుండీ సీతా నీ మొగుడు నో మొగుడు అనగానే అదే
మాట మనసులో ముద్రించుకుని, బలవంతాన రవికిరణ్ కు భార్య కాడం ఎంత న్యాయం అనిపించింది. ఇప్పుడు ఆలోచించుకుంటే ఏదో అత్త బలవంతం వల్ల తలవంచి తాళి కట్టినా ఏనాడైనా బావ ప్రేమగా తన వంక చూసాడా అనిపించింది.
ఆ రాత్రి తన గదిలో కూచుని మంగళ సూత్రాలు, మట్టెలు చేతుల్లోకి తీసుకున్నప్పుడు పెళ్ళిలో చదివిన వేద మంత్రాలు గుర్తుకు వచ్చి తప్పు చేస్తున్నానా అనిపించింది.
ఇహ ముందుకు ఆలోచించలేక, “ఏదైతే అది అవనీ”అనుకుని మళ్ళీ వాటిని లోపల దాచేసింది.
అటు రవికిరణ్ సుమబాల స్నేహం రోజురోజుకీ పెరిగి తీగలుగా సాగిపోతూనే ఉంది.
ఇద్దరి మధ్యా బాగానే చనువు పెరిగింది.
“ఎలాటి అమ్మాయి కోసం వెతుకుతున్నావు రవీ?” అని చనువుగా అడిగేది సుమ.
“అచ్చం నీలాటి అమ్మాయినే ” అనేవాడు.
“నేను ఎదురుగా ఉండగా ఎవరినో వెతకడం ఎందుకు?” అనేది.
కాని రవికిరణ్ కి ఎందుకో నిజం చెప్పాలనిపించలేదు.
నిజమే అచ్చంగా ఎలాటి అమ్మాయి గురించి కలలు కన్నాడో అలాగే ఉంటుంది సుమబాల.
ఇష్టం లేని సీతతో కొనసాగింపు కన్నా … అక్కడ ఆపేసేవాడు ఆలోచనను.
ఇద్దరి దారులూ వేరు వేరని ఇద్దరికిద్దరూ అనుకున్నాక ఎవరికి తెలుసు అలా జరుగుతుందని.

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *