March 29, 2023

లోపలి ఖాళీ – 1

రచన: రామా చంద్రమౌళి

‘‘ఒకసారి మళ్ళీ చెప్పండి ’’ అన్నాడు డాక్టర్‌ కుమార్‌ చాలా ఆశ్చర్యంగా. . విభ్రమంతో. . చిత్రంగా ఎదుట కూర్చుని ఉన్న ఆ పెద్దమనిషి ముఖంలోకి చూస్తూ.
ఆ పెద్దాయన ఏమీ చెప్పలేదు. సూటిగా డాక్టర్‌ కళ్ళలోకి ఓ లిప్తకాలం చూచి ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడౌతూండగా. ,
‘‘ఐతే మీరు మనుషులను ప్రేమించే శక్తిని కోల్పోతున్నారు. . యామై కరక్ట్‌. ? ’’ అన్నాడు డాక్టర్‌ కుమార్‌. . ప్రసిద్ధ సైకియాట్రిస్ట్‌. గత ముప్ఫై ఏళ్లుగా వేలమంది మానసిక రోగులతో సహవాసం చేస్తూ ఆ వృత్తిలో ఉన్నతుడిగా గుర్తించబడి రాష్ట్రపతి అవార్డ్‌ పొందినవాడు. ఆయన కన్సల్టేషన్‌ ఫీ ఐదువందల రూపాయలు. రోజుకు ఇరవై మంది పేషంట్స్‌ ను మాత్రమే చూస్తాడు. అప్పాంట్‌మెంట్‌ దొరకడం కష్టం.
‘‘ఉహూ… కాదు ’’ చాలా స్పష్టమైన సమాధానం.
‘‘మరి.?’’
‘‘నేను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను’’
‘‘ఓ. . మనుషుల్ని ప్రేమించే శక్తిని కోల్పోవడం కాదు. . అసలు మనుషుల్నే ప్రేమించలేకపోతున్నారు ’’ అని లోలోపల సన్నగా. . తనలోతానుగా. . కొద్దిగా చికాగ్గా. . అసహనంగా గొణుక్కూంటుండగా. ,
అతనన్నాడు. . ‘‘ డాక్టర్‌ గారూ. . ఒక మనిషి మరో మనిషిని బేషరతుగా . . ఆ మాటకొస్తే ఏ జీవినైనా ప్రేమించగలగడం ఒక గొప్ప మానవీయ లక్షణం. . ఐతే ఎవరైనా మరో మనిషిచేత నిజాయితీగా ప్రేమించబడడం గొప్ప అద ృష్టం. . కదా ’’ అన్నాడు. ఎందుకో డాక్టర్‌ కుమార్‌ కు ఎక్కడో ఒక పిడుగుపడ్డ అనుభూతి కలిగింది. నిజానికి అప్పుడు ఎక్కడా ఏ పిడుగూ పడలేదు, ఏ ఉరుములు మెరుపులుగానీ లేవు. అదొక మామూలు శీతాకాలపు తొమ్మిది గంటల రాత్రి. సన్నగా చలి మొదలౌతోంది అప్పుడప్పుడే. కాని గదిలో 25వ నంబర్‌ పై ఎ. సి పనిచేస్తున్నా డాక్టర్‌ కుమార్‌ కు కొద్దిగా ఉక్కపోయడం మొదలైంది.
‘ఈ ప్రేమించడం. . ప్రేమించబడ్డం. . ప్రేమించే శక్తి. . బేషరతుగా ప్రేమ. . ’ ఏమిటిదంతా. . ఈ ముసలాయనకు ఈ చిత్రమైన మానసిక పరిస్థితి ఎందుకొచ్చింది. దేనికోసం ఈయన బాధపడ్తున్నాడు. అసలు ఈయన సమస్యేమిటి.
‘‘ఊఊఊఁ., ’’ అన్నాడు సాలోచనగా తనకు తెలియకుండానే.
ఏ జవాబూ స్ఫురించదు. మనస్సునిండా శూన్యం. ఏదీ పాలుపోక ఆయన ముఖంలోకి చూశాడు అభావంగా.
ఎదుట ఆయన ఊర్కే అలా . . బయటికి కిటికీలోనుండి చూస్తున్నాడు చీకట్లోకి. . మౌనంగా.
నిజానికి డాక్టర్‌ కుమార్‌కు ఆ వ్యక్తి బాగా తెలుసు. అతని పేరు శంకరనారాయణ. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌. ఇంజనీర్‌. మెడికల్‌ కాలేజ్‌ లో ప్రతిరోజూ మార్నింగ్‌ వాక్‌లో కలుస్తూంటాడు. . ఒంటరిగా అక్కడెక్కడో దూరంగా చెట్లలో నడుస్తూ కనిపిస్తూంటాడు. మనిషిని చూడగానే ఎవరికైనా ఒక అనిర్వచనీయమైన గౌరవ భావం ఏర్పడి నమస్కరించబుద్దౌతుంది. ముఖంనిండా వెలిగే చిర్నవ్వు. . కళ్ళలోనుండి బయటికి దూకే కాంతి. . వర్చస్సు. చాలా తరచుగా అతనిగురించి పత్రికల్లో వార్తలు వస్తూంటాయి. . అతనొక పెద్ద రచయితా, కవీ అని తర్వాత్తర్వాత తెలిసింది.
కాని ఎప్పుడూ పరిచయం ఏర్పడలేదు.
దాదాపు పదిహేనేళ్ళ అపరిచయ పరిచయం తమది.
శంకరనారాయణను డాక్టర్‌ కుమార్‌ ఆ రోజు మొదట దాదాపు ఎనిమిది గంటల సమయమప్పుడే సి సి కెమెరాలో చూశాడు బయట ఒ. పి కౌంటర్‌ లో డబ్బు కట్టి విజిటర్స్‌ కుర్చీల్లో కూర్చూంటూండగా. కూర్చోగానే వెనక్కి ఒరిగి చేతిలోని ఏదో పుస్తకాన్ని తెరిచి అందులో లీనమైపోయాడు. అప్పటినుండి ఒక్కరొక్కరు తన దగ్గరికి వస్తూ వెళ్లిపోతున్నారు. . కాని శంకరనారాయణ రావడంలేదు. గేట్‌ బాయ్‌ ను పిలిచి అడిగాడు కుమార్‌ ‘ ఆయనెందుకు రావట్లేదు ’ అని.
‘‘సర్‌. అతనేదో ప్రత్యేక విషయం మీతో మాట్లాడాలట. . అందరికన్నా చివర్న లీజర్‌ గా వచ్చి కలుస్తానన్నాడు మిమ్మల్ని ’’
అట్లాగే చివరి పేషంట్‌ గా వచ్చి చెప్పిన విషయం . . ఇది. ‘తను మనుషుల్ని ప్రేమించలేకపోతూండడం ’
చిత్రమైన సమస్య.
ఇద్దరి మధ్యా అవాంచిత నిశ్శబ్దం కొద్దిసేపు గడిచిన తర్వాత. . డాక్టర్‌ కుమార్‌ ఏదో ఒక నిస్సహాయమైన ‘ స్కిప్‌ ’ ను చెప్పి భేటీని వాయిదా వేద్దామనుకుంటూండగా. . శంకరనారాయణ అన్నాడు. . ‘ నిజానికి ప్రతి జీవికీ జన్మతః కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. . ఉదాహరణకు. . చేపకు పుట్టగానే ఈత వస్తుంది. . సింహం పిల్లకు పుట్టుకతోనే వేటాడే లక్షణం అబ్బుతుంది. . పక్షులకు రెక్కలు మొలవగానే ఎగిరే లక్షణం అటువంటిదే. . కాని సకల జీవులన్నింటికీ కామన్‌ గా ఒక లక్షణం మాత్రం తప్పక పుట్టుకతోనే ఊపిరితోపాటే వస్తుంది. . అదేమిటో తెలుసా. , ’’
సూటిగా చూశాడు డాక్టర్‌ కుమార్‌ కళ్ళలోకి. . చూచి క్షణకాల మాగి. ,
అప్పుడు గమనించాడు కుమార్‌. . శంకరనారాయణ కళ్ళు మిలమిలా కాంతితో మెరవడం.
‘‘చెప్పండి. ’’
‘‘ఎదుటి జీవిని ప్రేమించడం . . మనిషిని మాత్రమే కాదు ఏ జీవినైనా ప్రేమించడమనే గుణం భగవంతుడు జీవులన్నింటికీ జన్మతః ప్రసాదించిన గొప్ప వరం. . కాని తాము అభివృద్ధి చెందుతున్నామనుకుంటున్న మనుషులు మాత్రం భగవత్‌ ప్రసాదితమైన ఈ ‘ ప్రేమించే ’ మూల లక్షణాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నారు. నేనైతే పూర్తిగా కోల్పోయాను డాక్టర్‌. ’’
ఏమీ తోచక అవాక్కై అతన్నే చూస్తున్న డాక్టర్‌ కుమార్‌ ఒక్కసారిగా, అనూహ్యంగా శంకరనారాయణ వెక్కెక్కి ఏడ్వడం గమనించి చకితుడైపోయాడు. మనిషికి గుండెల్లో ఏదో నొప్పి వస్తే విలవిల్లాడినట్టు బాధతో గిలగిల్లాడిపోతున్నాడు శంకరనారాయణ. పూర్తిగా అభౌతికమైన ‘ ప్రేమించలేక పోవడం ’ అనే ఈ చిత్రమైన మానసిక, మార్మిక, తాత్విక స్థితి మనిషిలో ఇంత నొప్పినీ, వేదననూ కలిగిస్తుందా.
భరించలేని నొప్పిని. . భరించలేక వెక్కెక్కి దుఃఖించే నొప్పిని అతనా క్షణం అనుభవిస్తున్నాడా.
ఇప్పుడు తనేం చేయాలి. నిజానికి ఇదొక వ్యాధా. ఈజిట్‌ ఎ డిజార్డర్‌. . రుగ్మత కిందికే వస్తుందా ఈ చిత్రమైన విచికిత్స.
‘‘మనుషుల్ని ప్రేమించలేకపోతున్నట్టు మీకెలా తెలుస్తోంది సర్‌’’
‘‘ఆకలౌతున్నట్టు మనిషికెలా తెలుస్తుందో.. మనసున్న మనిషికి ఎదుటి మనిషిని తను ప్రేమించలేకపోతున్నట్టూ. . ఇంకా స్పష్టంగా లోలోపలికి తొంగి చూచుకుంటే. . కొందరిని అయిష్టపడ్తున్నట్టూ. . ద్వేషిస్తున్నట్టూ, అసహ్యించుకుంటున్నట్టు కూడ మనకు తెలుస్తుంది. ఐతే ఈ వర్తమాన జీవన విధానంలో ఎవరికీ తమలోకి తాము తొంగి చూచుకునే తీరికగానీ. . సంస్కారంగానీ, ఆత్మాన్వేషణ జరుపుకునే ఔన్నత్యంగానీ లేవు. వెనుకట ఉండేవి. . మా చిన్నప్పుడు మనుషులు ఇంతగా ప్రేమరాహిత్యంలో జీవించేవాళ్లు కారు ’’ అని ఒక్క క్షణం ఆగగానే. ,
డాక్టర్‌ కుమార్‌. . అప్రయత్నంగానే . . ‘‘సర్‌. . ఈ సమస్య చాలా చిత్రంగా. . సున్నితంగా ఉంది. ఇట్‌ నీడ్స్‌ సం అనాలిసిస్‌. మనం. . మనం. . ’’ అని తత్తరపడ్తూండగా. ,
శంకరనారాయణన్నాడు ‘‘సర్‌. . నేను మళ్లీ కలుస్తాను మిమ్మల్ని ఒక వారం రోజుల తర్వాత. . ’’ అని లేచాడు కుర్చీలోనుండి.
ఎందుకో కుమార్‌కు సిగ్గనిపించింది ఆ సంక్లిష్ట పరిస్థితిలో. తనను ఆ విపత్కర పరిస్థితినుంచి తప్పించి రక్షించాడీ పెద్దాయన అనిపించి ఊపిరిపీల్చుకున్నాడు.
వెళ్తున్న అతనితో. . ‘‘సర్‌. . మీ ఐదువందల రూపాయల ఫీ. . తీసుకెళ్లండి ప్లీజ్‌ . . నేను మీకు చేసిందేమీ లేదు కదా.’’ అన్నాడు కుమార్‌ చాలా నిస్సహాయంగా.
శంకరనారాయణ తలుపు దగ్గర నిలబడి ‘‘ఉండనీయండి డాక్టర్‌. . నన్ను ఇంత విపులంగా వినడమే మీరు నాకు చేసిన ఉపకారం’’ అని తలుపు దగ్గరగా వేసి వెళ్లిపోయాడు.
అవాక్కయి చూస్తున్న డాక్టర్‌ కుమార్‌ కు. . ఆ సంక్లిష్ట స్థితి ఏమిటో అర్థం కాలేదు కాని. . తెలియని ఒక శూన్యవ్యాకులత ఏదో అతన్ని ఆక్రమిస్తూండడం మాత్రం తెలుస్తోంది స్పష్టంగా.
* * *
అప్పుడే శీతాకాల వర్షం వెలిసి. . చల్లగా గాలి వీస్తోంది.
ఎక్కడినుండో చర్చి గంటలు వరుసగా ఏడు మోగి ఆగిపోయాయి. వాతావరణం నిండా తేమ. . తడి. . దూరంనుండి తేలివస్తున్న ఇంటిప్రక్కనున్న విశాలమైన తోటలోని లిల్లీ పూల పరిమళం. . ఇక కుదురుకుంటున్న పొగమంచు తెరలు . అస్తమయానంతర మసక చీకటి సంరంభం వ్యాపిస్తూ.
సిటీ గ్రాండ్‌ హోటల్‌ ఎదురుగా. . మాతాశ్రీ ఫర్నిచర్‌ ప్రక్క సందులోని అపార్ట్‌ మెంట్స్‌. . ఐదవ అంతస్తులోని. . పెంట్‌ హౌజ్‌. ,
దూరంగా భద్రకాళి చెరువు. . కొండలు. . రంగంపేట రోడ్‌ పై ట్రాఫిక్‌ హడావుడి. . కొన్నేండ్లుగా విడిచిపెట్టబడి శిథిలావస్థలో ఉన్న ఒకప్పటి వైభవ ప్రతీక ‘ హోటల్‌ ఏకశిల ’. దాన్ని చూస్తున్నప్పుడల్లా ఎంత మహోజ్జ్వలమైన వ్యవస్థైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పక నశించిపోతుందని సిద్ధాంతీకరించి చెప్పే ‘ ప్రాడక్ట్‌ లైఫ్‌ సైకిల్‌ ’ థియరీ స్ఫురిస్తూ. ,
వెనుక కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ ప్రపంచం. . గుబురు గుబురుగా చెట్లు. . పాత క్వార్టర్స్‌. . కొత్తగా నిర్మితమౌతున్న ‘ కాళోజీ వైద్య విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయ ’ ప్రాంగణం రూపుదిద్దుకుంటున్న హంగులు. పురాధునిక సమ్మేళన సౌందర్య విభవం.
చుట్టూ ఒక ఉద్విగ్న సంచలిత ప్రపంచం.
ఇక్కడ తన ఇంట్లో మాత్రం ఎవ్వరూ లేరు. ఒక్కడే తను. మొత్తం నలుగురు సభ్యులు ఉండాలి కుటుంబంలో. కాని లేరు. . ఎప్పుడిరటికొస్తారో. . ఎప్పుడు రారో. . ఎక్కడికెళ్ళారో. . ఏమీ తెలియదు. కొడుకు. . ఉద్యోగం. . ఎప్పుడూ క్యాంపులు. . కోడలు కరీంనగర్‌ జిల్లాలో జిల్లా అధికారిణి. . అప్‌ అండ్‌ డౌన్‌ లు. . జీవితమంతా రావడం. . పోవడం. . ప్రయాణాలు. . మీటింగ్‌ లు. . సంపాదనలు. . ప్రమోషన్‌లు.
ఇద్దరు పిల్లలు. . కాలేజ్‌ లు. . పి. జి లు. . డిగ్రీలు. ఎప్పుడు ఏ సినిమా హాల్లోనో. . ఏ బేకరీ షాప్‌ లోనో. . పిజ్జాలు. . బర్గర్లు. . ఫ్రైడ్‌ చికెన్‌ లు. ఇంటికి ఎప్పుడొస్తారో. . వచ్చినా ఎవరి గదుల్లోకి వాళ్ళు చొరబడి. . ఏమేమి చేస్తారో . . ఎవరెవరితో తిరుగుతారో. . చెవుల్లో ఇయర్ఫోన్లతో. . ఇంటర్‌ నెట్‌ లతో. . ఇల్లు ఒకటే. . కాని ఎవరి ప్రపంచాలు వారివే. . ఎవరి జీవితం వాళ్ళదే. . ఎవరికీ టైం లేదు. . ఎవరికీ ఒక్క క్షణం నిలబడి తీరిగ్గా మాట్లాడే ఓపిక లేదు. వాళ్ల దృష్టిలో జీవితమంటే పరుగు. . జీవితమంటే అతి పెద్దదైన చిన్నది. . స్టాప్‌ నాట్‌. . జస్ట్‌ రన్‌.
పెద్ద ప్రపంచంలో అతి చిన్నగా మనిషి. . అతి చిన్న మనిషిలో పట్టలేనంతగా పెద్ద ప్రపంచం.
అసలు మనిషికి ఏం కావాలి. ? ఎంత కావాలి. ? ఒకరికోసం ఒకరు జీవించడం. . ఒకరికోసం ఒకరు మరణించడం. . ఒకరిని ఒకరు ప్రేమించడం. . ప్రేమించడంకోసమే జీవించడం. . ఇవి తెలుసా ఈ తరానికి.
తను తాతయ్య. . అమ్మమ్మ లేదు. వెళ్లిపోయింది విముక్తమై. తాతయ్యతో ఉండవలసిన అనుబంధమే లేదెవరికి. తండ్రితో కొడుక్కి లేదు. . కోడలుకు అస్సలే లేదు కన్సర్న్‌. ఒట్టి పేకమేడలు. కూలిపోవడం తర్వాత. . అస్సలు నిలబడలేవు.
ఒక కూతురు. . అమెరికాకు వలస. గ్రీన్‌ కార్డ్‌. . సిటిజన్‌ షిప్‌. . వలసలు బ్రతకడానిక్కాదు. . ఇంకా ఇంకా సౌకర్యాలూ, సుఖాలూ, ఆస్తిపాస్తులూ అపారంగా పొందడానికి. ఎంత ఆస్తి. . ఎన్ని సుఖాలు. . ఎన్ని బ్యాంక్‌ బ్యాలన్స్‌ లు. మమ్మీ డాడీలు. . సంకర భాష. . సంకర సంస్కృతి. సంకర జీవితం.
‘‘నాన్నా. . మన శ్రీదేవి ఇక్కడ బాల్టిమోర్‌ లో ఒక బ్లాక్‌ నీగ్రో రిచర్డ్స్‌ ను ప్రేమించింది నాన్నా. . దే గాట్‌ మ్యారీడ్‌ ఇన్‌ చికాగో . . జస్ట్‌ ఫర్‌ ఇన్‌ ఫర్మేషన్‌ టు యు. . అంతే. . ఏమీ చేయలేము నాన్నా మనం. ’’
‘‘ఔను ఏమీ చేయలేము. ’’ . . ఏవరూ ఏమీ చేయలేకపోవడమే నిజం.
కాస్సేపు ఊర్కే అలా ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు శంకరనారాయణ నిశ్చేష్టుడై.
‘నేను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను డాక్టర్‌ ’’
ఎందుకు. ? అన్న సమస్యతో కదా తను గత వారం డాక్టర్‌ కుమార్‌ దగ్గరికి వెళ్లింది.
అతనేమీ చెప్పలేకపోయాడు. తెలుసు తనకు అతనేమీ చెప్పలేడనీ. . ఏమీ చేయలేడనీ.
అసలు ప్రేమ అనే ద్రవ్యమే మృగ్యమై అంతరించిపోతున్న వేళ. . ‘ ప్రేమ ‘ గురించి ఆలోచించే డెబ్భై ఏళ్ళ తను. . ఒక రచయితగా. . ఇంజనీర్‌ గా , ఒక ప్రొఫెసర్‌ గా. ,
ఒక పిచ్చోడా.
తన చుట్టూ ఉన్న ఈ కుటుంబ సభ్యులలో, ఈ సంబంధీకులలో ఎవరిని ప్రేమించాలి. . ఎవరిచే ప్రేమించబడాలి.
శంకరనారాయణకు తను రాసిన కుప్పలు తెప్పల పుస్తకాలు. . పాఠ్య గ్రంథాలు. . పొందిన సన్మానాలు. . ప్రేక్షకుల కరతాళధ్వనులు . . ఇంటినిండా విస్తరించిన జ్ఞాపికల మూటలు. . అన్నీ లీలగా జ్ఞాపకమొస్తూ. . మగతగా నిద్ర వస్తున్నట్టనిపిస్తూ.
కల. . కలలో చప్పట్లు. . చప్పట్లు. . ఎడతెగని చప్పట్లు. చప్పట్ల నిషా.
పల్చగా వ్యాపిస్తూ స్వప్నం. . నీరెండలా. . నీడలా. . పచ్చి గడ్డిపై. . ఒక ఫుట్‌ బాల్‌. . తను. . తనే. . చటుక్కున ఒక బలమైన పాదమెవరిదో ఎక్కడినుందో వచ్చి ఫట్ట్‌ న తన్నింది బాల్‌ ను గట్టిగా.
బంతి గాలిలోకి లేచి. . కొట్టుకుపోతోంది రివ్వున. . ఎటో.
* * *
ఆ రోజు . . మళ్ళీ చిట్టచివరి పేషంట్‌ గా. ,
సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ కుమార్‌ తో మాట్లాడుతూ. ,
‘‘ప్రేమించడం.. ప్రేమించబడ్డం అన్న ఈ రెండు చర్యలు కనుమరుగైపోతూ మనుషులు కేవలం ప్రేమను నటిస్తున్న తరంలో జీవిస్తున్న వర్తమాన వ్యవస్థలో. . అసలు మీరెందుకు ప్రేమ గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు సర్‌. . జస్ట్‌. . లీవిట్‌. జనరేషన్‌ మారిపోయింద్సార్‌. . ’ లివింగ్‌ ఫర్‌ సెల్ఫ్‌. నీకోసం నువ్వు జీవించి నీకోసమే నువ్వు అంతరించిపో ’ అన్న వ్యవస్థలోకి మనుషులు పరివర్తిస్తున్న వేళ. . సర్‌ ఇదంతా ట్రాష్‌. ’’ అంటూనే తను ఏమి చెబుతాడో కనీసం వినకుండా. . ‘‘ ఎక్స్క్యూజ్‌ మీ . . ఒక ఆపరేషన్‌ ఉంది. . మళ్ళీ. . ఐ విల్‌ కాల్‌ యు సర్‌ ’’ అని తెచ్చిపెట్టుకున్న హడావిడితో కుమార్‌ వెళ్ళిపోవడం. . తెలుస్తోంది తనకు.
తప్పించుకుంటున్నాడు. . తన ప్రశ్నకు జవాబు లేదతని దగ్గర.
జవాబు లేనప్పుడు తప్పించుకుపోవడమో. . మనిషిని తప్పించడమో. . ఏదో ఒకటి కదా ఎవరైనా చేసేది.
ఇది మూడవ వారం. మూడూ ఇంటూ ఐదు. . పదిహేను వందల రూపాయల ఫీ.
జవాబు ఎదుటివాడు చెప్పలేనపుడు విజ్ఞుడైన వాడు తన ప్రశ్నకు జవాబును తనే కనుక్కోవాలి.
ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదీ నలభై ఐదు.
ఐదవ అంతస్తు. . పెంట్‌ హౌజ్‌. . బయట రోడ్డుపై ఎవని పరుగు వానిదే.
మామూలే. . ఎవరూ రాలేదింకా ఇంటికి. కోడలు ఫోన్‌ చేసింది. . చేసి ‘‘ రావట్లేదివ్వాల. . రేపు మినిస్టర్‌ గారి విజిట్‌ ఉంది ’’ అని ఫోన్‌ పెట్టేసింది. కొడుకు పత్తా లేడు. పిల్లలు. . వ్చ్‌. . ఎక్కడున్నారో. . ఎప్పుడొస్తారో. . వస్తారో రారో. . తెలియదు.
పిల్లలు ఒకప్పుడు తనకు బయపడే స్థితి నుండి తనను భయపెట్టే స్థితికి ఎదిగిన తర్వాత. ,
మిగిలేది భయం. . ప్రేమ రాహిత్యం . . అరాచకత్వం.
ఒక ఆధ్యాత్మిక పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు శంకరనారాయణ. ఇప్పుడిక తనను ఆదుకోగలిగింది పుస్తకం. . లేదా సంగీతం.
‘ఆనందాన్నిచ్చే హార్మోన్లు.. ’ అని శీర్షిక.
‘ఏ మూవింగ్‌ పార్ట్స్‌. . లేకుండా కేవలం స్పందించే అపురూప వ్యవస్థతో అనేకానేక రసాయనిక స్రావాలతో జీవన వ్యాపారాన్ని నిర్వర్తించే అపూర్వ సృష్టి ఈ మానవ శరీరం. స్వయం నియంత్రిత చాలక వ్యవస్థ ఇది. ఐతే మనిషిని పరమానంద పర్చగల నాలుగు హార్మోన్ల గురించి తెలుసుకోవడం విజ్ఞులైనవారికి అవసరం ’ అని రాస్తూ పోయాడు రచయిత. ఒకటి. . ఎండార్ఫిన్‌. . ఇది వ్యాయామం ద్వారా, ధ్యానం ద్వారా , సంతృప్తికర రతిక్రియానంతరం నాడీ మండలం నుండి విడుదలయ్యే ‘ ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌’. హాప్పీనెస్‌ బూస్టర్‌. రెండవది. . డోపమైన్‌. . మనిషి మంచి పనులు చేసి సంతృప్తిని పొందినపుడు మెదడునుండి విడుదలయ్యే న్యూరోట్రాన్స్‌ మిట్టర్‌. మనిషిలో నిక్షిప్తమై ఉండే ఏడవ శిరో ఊర్థ్వ కుండలినీ చక్రం. . ‘సహస్రార ’ సంబంధిత ‘ పిట్యుటరీ గ్లాండ్‌ ’ దీన్ని విడుదల చేస్తుంది. మూడవది. . సెరోటోమిన్‌. . ఇది మనిషి మూడవ కన్నుగా పిలువబడే పెనియల్‌ గ్రంథిలో మనిషి సమాజానికి ఉపయోగపడే పనులను చేసినప్పుడు విడుదలై మనిషికి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది. మూడ్స్‌ను నియంత్రిస్తుంది. అందుకే దీన్ని ‘ లవ్‌ హార్మోన్‌ ’ అని కూడా పిలుస్తారు. నాల్గవది. . ఆక్సిటోసిన్‌. . ఇదికూడా మనిషిలోని అత్యున్నత సహస్రార చక్రం నుండి విదుదలయ్యే న్యూరో ట్రాన్స్మిట్టర్‌. ఇది మనిషిని ప్రేమ మూర్తిగా పరివర్తింపజేస్తూ మనుషులను ఒక దగ్గరికి చేర్చే ‘ వసుదైక కుటుంబం ’ అన్న భావనను నెలకొల్పే నాయకున్ని. . లేదా దైవసమాన వ్యక్తిని రూపొందిస్తుంది. ’
శంకరనారాయణకు. . మనిషికి తనలోనే నిక్షిప్తమై ఉన్న మహత్తర శక్తులగురించీ. . మనిషి నిర్వర్తించగలిగే మానవ కల్యాణ కారక విధులను నిర్వహించినప్పుడు శరీరం ప్రతిస్పందిస్తూ రసాయనికంగా అందించగలిగే న్యూరో ట్రాన్స్‌మిట్టర్ల గురించీ. . అర్థమై. ,
అతను వికసించాడు.
తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతతతో.
* * *
ఫోన్‌ చేసి ఆ పూట శంకరనారాయణ సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ కుమార్‌ అప్పాయింట్‌మెంట్‌ తీసుకుని. ,
రాత్రి తొమ్మిదిన్నర. . మళ్లీ చివరి పేషంట్‌. . శంకరనారాయణ.
నిజానికి డాక్టర్‌ కుమార్‌ ఈ శంకరనారాయణతో ఒక రకంగా విసిగిపోయాడు. అది వాళ్ళ నాల్గవ భేటీ. ఆ రోజుతో శంకరనారాయణ చెల్లించిన ఫీజు నాల్గూ ఇంటూ ఐదు. . రెండు వేలు.
కుమార్‌ మెదడులో శంకరనారాయణ సమస్యే తిరుగుతోంది. . ‘ సర్‌. . నేను మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాను ’ అన్నది.
ఇప్పుడేమంటాడో మళ్ళీ.
‘‘చెప్పండి సర్‌ ’’ అన్నాడు కుమార్‌.
‘‘ఈ నాల్గు వారాలుగా పాపం మీరు మీ స్థాయిలో నా సమస్యకు ఒక చికిత్స కోసం పాకులాడుతున్నారు . కాని పరిష్కారం దొరకడంలేదు. . ఐతే నా సమస్యకు పరిష్కారం నాకు దొరికింది సార్‌.’’
‘‘ఔనా.. రియల్లీ. . హౌ ’’ అన్నాడు కుమార్‌ అప్రయత్నంగానే. ఉత్సుకతతో
‘‘సర్‌. . మీరు ఈ చిన్న మూడు నిముషాల వీడియో క్లిప్పింగ్‌ ను చూడండి” అని తన చేతితోని ఒక వింత గాడ్జెట్‌ ను క్లిక్‌ చేసి ఎదురుగా ఉన్న తెల్లని గోడపై ఒక వీడియో ను ప్రొజెక్ట్‌ చేశాడు. ’’
పచ్చని మొక్కలూ, కొమ్మలూ కిటికీ అవతల ఉన్న, ధారాళంగా వెలుతురు పడ్తున్న ఒక మంచి హాల్‌ లో. . మెత్తని పరుపుపై ఒక మూణ్ణెల్ల వయసున్న పసిపాప కళ్ళు తెరిచి చూస్తున్న క్లోజప్‌ షాట్‌ అది. పాప కిలకిలా నవ్వుతోంది. ముఖం నిండా పరిపూర్ణ నిర్మలత. శుద్ధకాంతి. అప్పుడు. . ఆమెకు తల్లి వయసున్న ఒక స్త్రీమూర్తి ముఖం పాప ముఖం దగ్గరికి వచ్చింది ముఖం నిండా ప్రసన్నతతో. పాప తన లేత పువ్వుల్లా ఉన్న రెండు పసి చేతులనూ ఆ స్త్రీమూర్తి చెక్కిళ్ళపై ఆన్చుతూ . . స్పర్శిస్తూ. . ప్రేమగా తడుముతూ. . కిలకిలా నవ్వుతూంటే. . ఆ తల్లివంటి స్త్రీ పారవశ్యతతో పులకించిపోతూ పాపను ముద్దాడడానికి పైపైకి వంగుతూ. . అప్పుడా క్షణం వాళ్లిద్దరి మధ్య ఉన్నది కేవలం ఒట్టి మానవీయ శుద్ధ స్పర్శ. పరస్పరత. సాంద్రతరమైన ప్రేమ . . గాఢ యిష్టత. ఇంకే స్వార్థమూ, భావనా లేని విశుద్ధ అనురాగం.
‘‘డాక్టర్‌ గారూ.. ఈ పాప ఆమెకు బిడ్ద కావల్సిన అవసరంలేదు. ఆమె పాపకు తల్లి కావల్సిన అవసరమూ లేదు. నిజానికి వీళ్లిద్దరూ తల్లీ పిల్లా కారుకూడా. ఐనా ఈ ఇద్దరూ ఒక శిశువుగా. . మాతృమూర్తిగా పొందుతున్న ప్రేమమయమైన తాదాత్మ్యత మాత్రం స్వచ్ఛమైందీ, నిర్మలమైందీ. వీళ్లిద్దరున్న ఆ మధురక్షణంలో. . కేవలం నిస్వార్థమైన ప్రేమ తప్పితే ఇద్దరిలోనూ ఇంకే భావమూ లేదు. పైగా ఇద్దరూ హృదయరీత్యా. . ఒట్టి ఖాళీ హృదయంతోనే చేరువౌతున్నారు . వాళ్ళ మనసుల్లో ఇంకే భావమూ లేదు. ’’
కుమార్‌ వింటున్నాడు శంకరనారాయణను జాగ్రత్తగా.
‘‘అంటే. . మనిషి ఎదుటి మనిషిని సంపూర్తిగా ప్రేమించాలంటే. . పూర్తి ఇష్టంతో ఆ వ్యక్తికి చేరువ కావాలి. నిర్మల హృదయంతో స్వీకరించగలగాలి. ఏ మాలిన్యమూ లేకుండా హృదయాన్ని పరిశుభ్రమైన ఖాళీ గ్లాసులా ఉంచుకోగలగాలి. . అంతే.’’
‘‘. . .’’ వింటున్నాడు డాక్టర్‌ కుమార్‌.
‘‘ఇన్నాళ్ళూ నా కుటుంబ సభ్యులూ. . ఇతరేతర పరిచయస్తులైన లోకులూ నా హృదయాన్ని కలుషితం చేసి దాన్ని బురదతో నింపేశారు. నేనిప్పుడు నన్ను నేను శుభ్రం చేసుకుని ఖాళీ చేసుకోవాలి. నిర్మలం కావాలి. మామూలు పరిభాషలో చెప్పాలంటే నా మనసును నేను కడుక్కోవాలి. అప్పుడు ఖాళీ ఐన నేను మళ్ళీ మనుషులను ప్రేమిస్తూ వాళ్ళను నా మనుషులుగా స్వీకరించ గలుగు తాను’’
ప్రొజెక్షన్‌ ఆగిపోయింది.
శంకరనారాయణ కుర్చీలోనుండి లేచి నిలబడి ‘‘వస్తాను డాక్టర్‌. . మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను’’ అని నడిచాడు డోర్‌ దగ్గరికి.
తేరుకుని డాక్టర్‌ కుమార్‌ టేబుల్‌ పైన పెట్టుకున్న రెండు వేల రూపాయల నోట్‌ ను తిరిగి ఇద్దామని శంకరనారాయణను పిలువబోయే లోపలే ఆయన నిష్క్రమించాడు బయటికి.
ఒక మనిషి హృదయంలోకి ఆత్మీయునిగా మరో వ్యక్తి ప్రవేశం పొందాలంటే ఆ హృదయంలో కొంత నిజమైన ప్రేమా, చోటూ, ఖాళీ ఉండాలిగదా మరి.

* * *

1 thought on “లోపలి ఖాళీ – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2023
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
2728