March 19, 2024

అమ్మమ్మ – 43

రచన: గిరిజ పీసపాటి

ఆ రోజు షాపుకి రానని ముందే చెప్పి ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయింది నాగ. కాసేపటికి ఢిల్లీ వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెప్పి, నానిని తీసుకొని పనికి వెళ్లిపోయాడు. పదకొండు గంటలకల్లా వంట ముగించిన వసంత, ముందుగా అమ్మమ్మకి భోజనం వడ్డించింది. అమ్మమ్మకి మడి, ఆచారం, ఎంగిలి వంటి పట్టింపులు ఎక్కువ. కనుక వీళ్ళతో కలిసి తినదు.
అమ్మమ్మ తినగానే, నాని కూడా రావడంతో అందరూ కలిసి భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. మార్చి నెలాఖరు కావడంతో అప్పటికే ఎండలు తీవ్రతను సంతరించుకున్నాయి.
అందరూ నడుం వాల్చాక “గిరీ! సాయంత్రం ఒకసారి నువ్వు ఉద్యోగానికి అప్లై చేసిన షాప్ కి వెళ్లి, నీ ఉద్యోగం విషయం కనుక్కో! పర్సనల్ గా చూస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తారు.” అంది నాగ.
“సరేనమ్మా! అక్కని తీసుకుని వెళతాను” అన్న గిరిజ మాటలు విన్న వసంత “నేను రాను. సాయంత్రం అమ్మమ్మకి ఫలహారం తయారు చేసి, వంట కూడా చేయ్యాలి. నువ్వు ఒక్కదానివే వెళ్ళి మాట్లాడి రా!” అంటూ ఖరాఖండిగా చెప్పింది.
“నేనొక్కదాన్నీనా! ఊహూఁ…! నాకు భయం. నువ్వూ రా అక్కా! నీ ఉద్యోగం గురించి కూడా కనుక్కోవాలి కదా!” బతిమాలు తున్నట్టు అడిగింది గిరిజ.
“నా ఉద్యోగం గురించి అడగాలనుకుంటే నేను రేపు ఉదయం వెళ్లి అడుగుతాలే! సాయంత్రం నాకు చాలా పని ఉంది. అయినా ఉద్యోగం వచ్చాక రోజూ నీ వెంట నేరాగాలనా? అప్పుడైనా నువ్వు ఒక్కదానివే వెళ్లాలి. భయం భయం అంటే జీవితాంతం భయం పోదు. నువ్వే వెళ్లి అడగాలి. అడుగుతున్నావు కూడా!” శాశిస్తున్నట్లుగా ఉన్న అక్క మాటలకు బదులు చెప్పలేక, కోపంగా అటువైపు తిరిగి పడుకుంది గిరిజ.
వీళ్ళ సంభాషణ విని, చిన్నగా నవ్వుకుంటున్న తల్లిని చూసి, అలిగి అటు తిరిగి పడుకున్న చెల్లెల్ని బొటనవేలుతో సైగ చేసి చూపిస్తూ, నవ్వేసింది వసంత. అంతకుముందు రోజు ఇద్దరి కూతుర్ల మధ్య జరిగిన సంభాషణ విన్న నాగ, పెద్ద కూతుర్ని ఉద్యోగ విషయంలో ఇక బలవంతం చేయదలచుకోలేదు.
వసంతకి ఉన్న అంగవైకల్యం గురించి ఎవరు వేలెత్తి చూపినా తట్టుకోలేదు. అందుకే ‘దానికి ఇష్టమైతేనే ఉద్యోగం చేస్తుంది. లేకపోతే లేదు.’ అని ఆ రోజే నిర్ణయించుకుంది. అందుకే ఉద్యోగం గురించి కనుక్కోమని గిరిజకి మాత్రమే చెప్పింది.
తల్లి చెప్పినట్లుగానే సాయంత్రం బయలుదేరి తను ఉద్యోగం కొరకు అప్లై చేసిన షాప్ కి వెళ్ళింది గిరిజ. షాప్ లోపలికైతే అడుగుపెట్టింది గానీ, కస్టమర్లతో కిటకటలాడుతున్న షాప్ ని చూడగానే ఎవరిని పలకరించాలో, ఎవరితో మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా ఎంట్రన్స్ డోర్ దగ్గరే నిలబడిపోయింది.
ఇంతలో ఒక అబ్బాయి గిరిజని చూసి కస్టమర్ అనుకొని “ఏం కావాలి మేడమ్?” అని మర్యాదగా అడిగాడు. “షాపు ఓనర్ గారిని కలవాలి” అంది తడబడుతూ.
“ఏం పని?” ఈసారి మర్యాదతో పాటు కాస్త కుతూహలం వినిపించింది ఆ అబ్బాయి కంఠంలో.
“ఉద్యోగం కోసం అప్లై చేశాను. ఒకసారి కనుక్కుందామనీ…” అంది కాస్త ధైర్యాన్ని కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ.
“ఓ అలాగా! నాతో రండి” స్నేహపూర్వకంగా చిరునవ్వుతో అంటూ… డోర్ దగ్గర నుండి నాలుగు అడుగులు ముందుకి, మరో నాలుగు అడుగులు ఎడమ చేతి వైపు వేసి, అటువైపు తిరిగి పక్కనే ఉన్న కస్టమర్ కి ఏదో వివరిస్తున్న ఒకాయనను ఉద్దేశించి “సార్! మిమ్మల్ని కలవడానికి ఈవిడ వచ్చారు!” అని చెప్పాడు.
‘పదహారేళ్ల దాన్ని పట్టుకొని ఈవిడ అంటాడేంటీ అబ్బాయి. చిత్రంగా ఉందే!’ మనసులో అనుకుంటుండగానే… అప్పటివరకు కస్టమర్ తో నవ్వుతూ మాట్లాడుతున్న ఆయన ఇటువైపు తిరిగి అదే నవ్వు ముఖంతో “చెప్పండమ్మా!” అన్నారు.
ప్రశాంతంగా ఉన్న ఆయన నవ్వు ముఖం చూడగానే ధైర్యం వచ్చిన గిరిజ “సర్! న్యూస్ పేపర్ లో సేల్స్ గర్ల్స్ కావాలని మీరు వేసిన ఉద్యోగ ప్రకటన చూసి అప్లై చేశాను. ఒకసారి మిమ్మల్ని ఆ విషయం కనుక్కుందామని వచ్చాను” అంటూ ఏ డేట్ న, ఏ న్యూస్ పేపర్లో ప్రకటన చూసి అప్లై చేసిందీ కూడా చెప్పింది.

అప్లికేషన్ ఫామ్ కి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా జత చేసింది కనుక, ఆయన తనని గుర్తు పట్టొచ్చనే ఆశ లేకపోలేదు. కానీ, ఆయన ముఖంలో ఎక్కడా ఆ భావం గోచరించలేదు సరి కదా “ఇప్పుడు షాపు బిజీగా ఉంది. రేపు ఉదయం రండి” అన్నారు.
“ఉదయం ఎన్నింటికి రమ్మంటారు సర్?” అడిగింది.
“తొమ్మిది గంటలకు రండి” అని చెప్పి తిరిగి కష్టమర్ కి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో మునిగిపోయారాయన.
చేసేదేమీ లేక నిరాశగా వెనుతిరిగి కాళ్లీడ్చుకుంటూ ఇంటికి వచ్చేసి, జరిగిన విషయం తల్లికి, అక్కకి వివరించింది.
“అన్నిటికీ అలా నిరాశపడుతూ నెగిటివ్ గా ఆలోచించకు. షాప్ బిజీగా ఉందని నువ్వే చెప్తున్నావు. రేపు ఉదయం రమ్మన్నారుగా! నిన్ను, నీ క్వాలిఫికేషన్ చూశాక ఖచ్చితంగా తీసుకుంటారు. నాకా నమ్మకం ఉంది. రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మళ్ళీ వెళ్ళు” అన్న తల్లి మాటలకు ‘సరే’ అన్నట్టు తల ఊపింది.
మర్నాడు ఉదయాన్నే లేచి, తనకెంతో ఇష్టమైన తెలుపు రంగు మీద స్కై బ్లూ, ఇంక్ బ్లూ కలర్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన చుడిదార్ వేసుకుని పావు తక్కువ తొమ్మిది కల్లా బయలుదేరి షాప్ కి వెళ్ళింది. ఇంకా షాప్ తెరవలేదు. అప్పటికే చాలామంది స్టాఫ్ వచ్చి షాప్ ముందు నిలబడి మాట్లాడుకుంటున్నారు.
మరీ వాళ్ల మధ్య, షాప్ ముందే నిలబడితే బాగోదని, షాప్ కి సరిగ్గా ఎదురుగుండా రోడ్డుకి ఇవతల వైపు ఖాళీగా ఉన్న పేవ్ మెంట్ మీద నిలబడింది. వాళ్లలో నిన్న తనను ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళిన కుర్రాడు కనపడలేదు. వాళ్లలో కొందరు తనని చూడడం, తన గురించి ఏదో మాట్లాడుకోవడం కనబడుతూనే ఉంది. అయినా తనను కాదన్నట్టు దిక్కులు చూస్తూ చేతులు కట్టుకుని నిలబడింది.
అరగంట దాటాక తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మారుతి వ్యాన్ ఒకటి వచ్చి షాప్ ముందు ఆగడం, ఒక కుర్రాడు పరుగు పరుగున వాన్ దగ్గరకెళ్ళి, తాళాలు అందుకొని షట్టర్ ఓపెన్ చేయడం కనబడింది. వ్యాన్ పార్కింగ్ లో పెట్టి దిగుతున్న ఓనర్ గారిని చూసి, గబగబా రోడ్డు క్రాస్ చేసి వెళ్లి, ఆయనను కలిసి, విష్ చేసింది.
“వచ్చారా!” అంటూ గిరిజని పలకరించి “మీ అప్లికేషన్ చూసానమ్మా! నేను కబురు చేస్తాను” అని మరో మాటకి అవకాశం ఇవ్వ కుండా షాప్ లోకి వెళ్లిపోయారాయన. ఆయన వెంటపడి మరో మారు అడుగుదామనుకొని కూడా, చిన్నతనంగా అనిపించి వచ్చిన దారినే తిరిగి ఇంటిదారి పట్టింది.
నెల రోజులు గడిచాయి. కానీ షాప్ నుండి ఏ కబురు రాలేదు. కనబడిన వాంటెడ్ కాలమ్స్ కి అప్లై చేస్తూ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఒక్కరి దగ్గరి నుండి కూడా పిలుపు రావట్లేదు.
అమ్మమ్మ మాత్రం గుడులు, గోపురాలు తిరిగుతూ అక్కడి పూజారులతోను, గుడికి వచ్చే వారితోను పరిచయాలు పెంచుకుని, ఎక్కడైనా వంట పని ఉంటే చెప్పమని చెప్తోంది. ఆవిడ పరిచయాలు పెంచుకోవడంలో చూపుతున్న చొరవకి, నేర్పరితనానికి చాలా ఆశ్చర్యపోతున్నారు తల్లీపిల్లలు.
ఇంతలో ఒకరోజు ఉదయం ‘ఇన్నోవేషన్స్’ అనే షాప్ నుండి మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటర్వ్యూకి రమ్మని గిరిజకు కాల్ లెటర్ వచ్చింది. ఇంట్లో వాళ్లకు ఆ లెటర్ చూపించి ఆనందంతో గంతులు వేసింది.

********** సశేషం ***********

1 thought on “అమ్మమ్మ – 43

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *