March 19, 2024

కోకో

రచన: వి. రాజారామమోహనరావు

“కోకో – మా కుక్క పేరు, మీకు నచ్చిందా? కోకో వెనకాల ఒక కథ ఉంది. దానికన్నా ముందు లియో గురించి చెప్పుకోవాలి.
పక్షుల్నీ, కుక్కల్నీ ఇంట్లో పెంచడం నాకు అయిష్టం. హాయిగా తిరగాల్సిన వాటిని బంధించటమేమిటని నా అభిప్రాయం. కానీ మా అమ్మాయికి వాటిని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఎవరింట్లో ఏ పెంపుడు జంతువు కనిపించినా వాటితో తెగ ఆడేది. అయినా నాకు ఇష్టం లేదని తెలిసి ఎప్పుడూ ఏ కుక్కనీ ఇంటికి తెచ్చుకుందామని పేచి పెట్టలేదు. పెద్దవాళ్ళకి ఇష్టం లేని పనులు చేయకూడదన్న పద్ధతిలో పెరిగింది.
ఇప్పుడు అదీ పెద్దదయింది, దానికి ఓ కొడుకు అంటే మా మనవడు మానస్… తొమ్మిదో క్లాస్… చిత్రమేమిటంటే జంతువులు అంటే వాడికి మా అమ్మాయి కన్నా పిచ్చి. వాడంటే నాకెంతో ముద్దు.
మొత్తానికి వాడి కోరికను కాదనలేక మా అమ్మాయిఓ కుక్క పిల్లని తెచ్చింది. తెల్లటి ఒళ్ళు, నుదుటి మీద నల్లటి మచ్చ. దానికి మూడో నెల. ‘లాబ్రడార్’ అంటారట, చూడటానికి చాలా అందంగా ఉంది. మన ఇంట్లో ఈ కుక్క వద్దని నేను ఎంతగా చెప్పినా మా మనవడి మాటే నెగ్గింది. దాని పేరే ‘లియో’. దానికినేనెంతో ఎంతో దూరంగా ఉంటూ వచ్చాను, కానీ అది నాకు దూరంగా ఉండకుండా దగ్గరవుతూనే వచ్చింది. దగ్గరికి రావడం, కాళ్ళు నాకడం, పొమ్మన్నా వినకుండా నా కాళ్ళ దగ్గరే పడుకోవటం… నాలుగు నెలల్లో నేనూ అదంటే ఇష్టపడటం ఆరంభమైంది. లియోఎంతో అందంగా తయారయింది. ఎవరు దాన్ని చూసినా చూపు తిప్పుకోలేకపోతున్నారు.
క్రమేపీ లియో మా ఇంటి మెంబర్ అయిపోయింది. ఇంట్లో మేము దాని కోసం ఒకచోట చేరి కలిసి గడిపే సమయం పెరిగింది. దానివల్ల మా దగ్గరితనం కూడా పెరిగింది. పెంపుడు జంతువుల ఉపయోగాల్లో ఇదొకటి అనుకుంటా. లియోని మా వాళ్లతో సమానంగా నేను దగ్గరికి తీసుకుంటున్నాను, జంతువులంటే దూరంగా ఉండే నన్ను లియో లొంగదీసింది.
అలాగే ఏడాది గడిచింది. లియోకి అన్నీ ప్రత్యేకం… దాన్ని తుడిచే బట్టలు, పడక వగైరా. మాలో ఓ భాగం అయిపోయింది. అంతా బాగున్న టైములో అలా అవుతుందని మేము ఎవ్వరం అనుకోలేదు.
లియో జబ్బు పడింది. తినకూడనిదేమి తిందో, తాగిందో… తినడం మానేసింది. మేం విషయం గ్రహించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేటప్పటికీ ఆలస్యం అయింది. ఎన్ని మందులు వేసిన లియో దక్కలేదు, చచ్చిపోయింది. అదీ నా కాళ్ళ దగ్గర, నా కళ్ళముందే చచ్చిపోయింది. నాకు పెద్ద షాక్. మా మానస్, అమ్మాయి ఏడ్చేశారు.చచ్చిపోయింది కుక్కే బంధువు కాదు, కానీ బాధ మాత్రం చాలా ఎక్కువ పడ్డాం. “ఇదంతా కుక్కని పెంచడం వల్లే కదా… ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయకండి” అని గట్టిగా చెప్పాను.

***
ఆరు నెలలు గడిచిపోయాయి. ఆ రోజు మా మనవడు మానస్ పుట్టినరోజు, సాయంత్రం ఆరింటికి పార్టీ పెట్టుకున్నారు.
నాలుగవుతుండగా బయటకెళ్ళిన మా అమ్మాయి, మనవడు తిరిగి వచ్చారు. కూడా చిన్న కుక్కపిల్ల ఉంది. తేవడమే కాదు తెగ ముద్దులాడుతున్నారు. భూమి నుంచి అరగజం ఎత్తులో ఉంది, బ్రౌన్ కలర్.
“తాతయ్యా… ఇది టిబెట్ బ్రీడ్… లాసా ఆప్సో. పెద్దగా ఎదిగిపోదు, ఇదే సైజులో ఉంటుంది, అందరితో కలిసిపోతుంది. చాలా ముద్దుగా ఉంది కదూ” అంటూ మానస్ దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు.
నాకు విపరీతమైన కోపం వచ్చింది. లియో చచ్చిపోయినప్పటి బాధ గుర్తుకొచ్చింది. “బుద్ధి లేదా! మళ్లీ కుక్కను ఎందుకు తీసుకొచ్చారు? వెంటనే పంపించేయండి. అది ఉంటే నేను ఇంట్లో ఉండను, నేనో అదో తేల్చుకోండి” అన్నాను.
నా దగ్గరకు వచ్చి మా అమ్మాయి ఏదో చెప్పబోయింది. నేను వినిపించుకోకుండా దాన్నీ అరిచాను. నాకు బీ.పీ. పెరిగిపోయింది, నా ముఖం ఎర్రబడింది. ఆ కుక్కపిల్లని నా ముందు నుంచి తీసుకెళ్లిపోయారు. గట్టిగా అలా అరిచానని ఎంతో బాధపడ్డాను కానీ నా మనసు మారలేదు. ‘వద్దు… వద్దు… ఏ కుక్కలూ వద్దు, బాధా వద్దు’ అనుకున్నాను. ఈ గొడవతో అమ్మాయి, మనవడు దిగులు పడ్డారు. బర్త్ డే పార్టీ డల్ గానే గడిచింది.
తెల్లారింతర్వాత, అమ్మాయి, మనవడు బిక్కముఖాలతో నా దగ్గరికి వచ్చారు. “కుక్కని వెనక్కి ఇచ్చేస్తాం నాన్నా! నీకన్నా మాకు ఏదీ ఎక్కువ కాదు” అంది అమ్మాయి. దానికి తనూ సిద్ధమే అన్నట్టు నిలబడ్డాడు మనవడు.
నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ ప్రవర్తనకో, నాకోసం కుక్క మీద వాళ్ళ అమితమైన ఇష్టాన్ని చంపుకుంటున్నందుకో… కుక్కపిల్ల వెర్రిదాన్లా నా వేపే చూస్తోంది. ‘వెఱ్ఱిముండ, దానికీగొడవలేం తెలుసు పాపం!’ అనిపించింది.
అప్రయత్నంగానే, “ఉంచుకుందాం… కుక్కపిల్లని వెనక్కి ఇవ్వక్కర్లేదు” అన్నాను.
నమ్మలేనట్టు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు అమ్మాయి, మనవడు.
“నిజంగానా?” అన్నారు.
“నిజమే, ఉంచేసుకుందాం” అన్నాను, కుక్క పిల్లని నా చేతుల్లోకి తీసుకుంటూ.
వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ కుక్క పిల్లే కోకో.
ఇప్పుడు కోకో మాలో భాగం, అందరం దానితో ఆడతాం, అదీ అందరితో ఆడుతుంది.
చిత్రం ఏమిటంటే, ఈ పెద్దవయసులో చిన్నవాళ్లతో సమంగా నేనూ కోకోతో ఆడటం కోకో మహత్యం లాగే ఉంది.
“పెట్స్ వల్ల మరింత దగ్గరగా, సంతోషంగా ఉంటాం కదు తాతయ్యా?” అన్నాడు మానస్.
అక్షరాలా నిజం అనిపించింది. అంతేకాదు పిల్లల మనసులు మెత్తన. కోకోలాంటి వాటి చేరువలో అవి మరింత అభిమానంగా, ప్రేమగా తయారవుతాయి.
జంతువులనేమిటి, ప్రకృతి అనేమిటి, దేన్నైనా ఎంత ఎక్కువగా ఇష్టపడి ప్రేమించగలిగితే జీవితం అంత బాగుంటుంది, ఇష్టంగా ఉంటుంది.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *