March 19, 2024

సాఫ్ట్‌వేర్ కధలు – పర్పస్

రచన: రవీంద్ర కంభంపాటి

ఆ రోజు ఉదయం మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిన రాజేష్ కి తన క్లయింట్ డగ్లస్ నుంచి మెయిల్ కనిపించింది. ‘హై ఇంపార్టెన్స్ ‘ అని మార్క్ చేసి ఉండడంతో, ఏమైనా ఎస్కలేషన్ వచ్చిందేమోనని వెంటనే ఆ మెయిల్ ఓపెన్ చేసేడు రాజేష్.
వచ్చే నెల, ఇండియాలో ఉన్న తమ టీం ని కలవడానికి వస్తున్నానని, మూడు రోజులు ఉంటానని సారాంశం ! సాధారణంగా డగ్లస్ ఇండియా వచ్చినప్పుడు, తమ కంపెనీతో పాటు, తమకి కాంపిటీషన్ గా భావించే విప్రో, ఇన్ఫోసిస్ లని కూడా కలుస్తాడు. కానీ ఆ మెయిల్ లో ఉన్న ఎజెండా ప్రకారం, ఈ ట్రిప్ మొత్తం తమ కంపెనీతోనే గడపబోతున్నాడు !
ఎందుకు? అని ఆలోచనల్లో ఉండగానే, రాజేష్ ఫోన్ మోగింది. అవతలపక్కన అమెరికాలోని తమ సేల్స్ హెడ్ అమోల్.
“డగ్లస్ నుంచి మెయిల్ చూసేవా?” అమోల్ స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వచ్చేసేడు.
“చూసేను. . ఈ సారి మొత్తం ట్రిప్ మనతోనే ఉండబోతున్నాడు!” చెప్పేడు రాజేష్
“అంటే. . నీకు ఏమిటి అర్ధమైంది?” అమోల్ ప్రశ్న
ఉదయాన్నే ఈ వెధవ క్విజ్ ప్రోగ్రామొకటి, అని మనసులోనే విసుక్కుని, పైకి “రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి. . ఫస్ట్. . మన ప్రాజెక్ట్స్ మీద ఏదైనా కంప్లైంట్ ఉండి, దాన్ని గురించి డిస్కస్ చెయ్యడానికి. . సెకండ్. . మన వర్క్, రేట్స్ తో చాలా ఇంప్రెస్ అయ్యి, ఇన్ఫోసిస్, విప్రో వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మనకే ఇచ్చే అవకాశం డిస్కస్ చెయ్యడం” అన్నాడు రాజేష్
“గుడ్. . మన ప్రాజెక్ట్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ ఏమీ లేవు కాబట్టి, నువ్వు చెప్పిన సెకండ్ పాజిబిలిటీ కే ఎక్కువ ఛాన్స్” అన్నాడు అమోల్
“యా. . ఇంకొక్క వారం మాత్రమే టైం ఉంది. . ఎజెండా కరెక్ట్ గా ప్లాన్ చెయ్యాలి, రోజూ సీనియర్ మేనేజ్మెంట్ తో మీటింగ్స్ పెడతాను, అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళు, విప్రో వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ తాలూకు స్కిల్స్ మన దగ్గిర కూడా ఉన్నాయి అని గట్టిగా ఎస్టాబ్లిష్ చేసేలా డగ్లస్ తో మీటింగ్స్, డెమోలు ప్లాన్ చేస్తాను” చెప్పేడు రాజేష్
“గుడ్. . నువ్వు కరెక్ట్ గానే ఆలోచిస్తున్నావు. . డగ్లస్ కి వాళ్ళ కంపెనీలో చాలా పేరుంది. . అతన్ని సరిగా ఇంప్రెస్ చేసేమంటే, మన కాంపిటీషన్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ మనకే వచ్చేస్తాయి. . అన్నట్టు, తనకి ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. . ప్రతి రోజూ, హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ హోటల్స్ కి తీసుకువెళ్ళండి” అంటూ ఫోన్ పెట్టేసేడు అమోల్.
సీనియర్ మానేజ్మెంట్ కి ఈ విషయమై మెయిల్ పెట్టి, డగ్లస్ వచ్చే ఆ మూడు రోజులూ, తమ మానేజ్మెంట్ లో ఎవరెవరు అతన్ని కలవాలి, ఏ ఏ టాపిక్స్ మీద ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, హైద్రాబాద్ లో ఏ ఏ హోటల్స్ కి తీసుకెళ్ళాలి లాంటి విషయాలతో ఆ వారం అంతా బిజీ బిజీగా గడిచిపోయింది రాజేష్ కి. పైపెచ్చు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ అడ్డాని హడావిడిగా హాస్పిటల్ గా మార్చేసిన టైపులో, తమ ప్రాజెక్ట్ ఫ్లోర్ అంతా డగ్లస్ వాళ్ళ కంపెనీ తాలూకు పోస్టర్లు, బ్యానర్లు కట్టేసేరు.
రాజేష్ వాళ్ళ బాస్ నారాయణన్ ముందే చెప్పేసేడు, “మన టీమ్ అందరిలోకి డగ్లస్ నీకే క్లోజ్. . కాబట్టి, అతన్ని ఇంప్రెస్ చేసి ఆ విప్రో, ఇన్ఫోసిస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ మనకే వచ్చేలా చూసేవంటే, నీ అప్రైజల్, ప్రమోషన్ నేను చూసుకుంటాను !” దీంతో రాజేష్ కి ప్రెషర్ మరింత పెరిగింది !
మొత్తానికి డగ్లస్ హైదరాబాద్ వచ్చేడు. అతన్ని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని, స్పెషల్ గా బుక్ చేసిన మర్సిడిస్ బెంజ్ కారులో ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ కి తీసుకువచ్చేరు రాజేష్ వాళ్ళ టీం !
“మీరు నన్ను ఓ ఇండియన్ మహారాజా లాగ ట్రీట్ చేస్తున్నారు” అన్నాడు డగ్లస్, “భలే జోకే”వంటూ గాఠిగా నవ్వేరు రాజేష్ అండ్ టీం.
“డగ్లస్. . మీ ఇండియా స్టే మర్చిపోలేనిదిగా చేసే పూచీ నాది. . రేపు సాయంత్రం మీకు డిన్నర్ ట్రైడెంట్ హోటల్లో అరేంజ్ చేసేను, అలాగే ఇక్కడ ‘తాజ్ ఫలక్ నామా ‘ అనో గొప్ప హోటల్ ఉంది. . ఒకప్పుడు హైదరాబాద్ నిజాం తన అతిధులకోసం ఆ ప్యాలస్ ని గెస్ట్ హౌస్ లా ఉపయోగించేవాడు. . మీకు బాగా నచ్చుతుంది. . ఆ రోజు, మా సీనియర్ మానేజ్మెంట్ మీకు అక్కడ డిన్నర్ ఇవ్వబోతూంది” అన్నాడు రాజేష్
“వెరీ నైస్. . స్ప్లెండిడ్.” అంటూ తన హోటల్ రూమ్ లోకి వెళ్ళడానికి లేచేడు డగ్లస్ !
ఆ తర్వాత రెండు రోజులూ బిజీ బిజీగా గడిచేయి. తమ కంపెనీలోని బెస్ట్ టెక్ లీడ్స్ తో ప్రెజెంటేషన్స్ ఇప్పించేడు రాజేష్. ఆ ప్రెజెంటేషన్స్ అన్నీ చాలా ఆసక్తిగా విన్నాడు డగ్లస్. ట్రైడెంట్ లో డిన్నర్ విపరీతంగా నచ్చేసింది డగ్లస్ కి.
అదే మాట అతను రాజేష్ తో చెబితే, “రేపు రాత్రి ఫలక్ నామాలో డిన్నర్ ఇంకా బావుంటుంది” అన్నాడు రాజేష్
“అవునవును. నేను కూడా రేపు సాయంత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తు న్నాను. . మీ సీనియర్ మేనేజిమెంట్ అంతా వస్తున్నారు కదా?” డగ్లస్ ప్రశ్న
“యా. . యా. . అందరూ వస్తున్నారు” ఉత్సాహంగా బదులిచ్చేడు రాజేష్, అతని మనసులో అప్పటికే నిర్ధారణ చేసేసుకున్నాడు, ఇంకొన్ని రోజుల్లో తమ ప్రత్యర్థి కంపెనీల ప్రాజెక్టులు తమకే రాబోతున్నాయని !
మర్నాడు సాయంత్రం అందరూ తాజ్ ఫలక్నామాకి బయల్దేరేరు. బయల్దేరేముందు, డగ్లస్ రాజేష్ ని అడిగేడు, “నువ్వు నా కార్లో వస్తావా?” అని.
“ష్యూర్ డగ్ల” అని రాజేష్, డగ్లస్ తో అతని మెర్సిడెస్ ఎక్కేడు. మిగతా మేనేజర్లు వాళ్ళ ప్రకాష్ రావు అని వాళ్ళ కార్లు ఎక్కేరు.
“ఎలా ఉంది ఈ ట్రిప్?” కార్ బయలుదేరగానే అడిగేడు రాజేష్
“చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. . ఈ రెండు రోజులూ బాగా గడిచేయి. . టైం వెల్ స్పెంట్” అన్నాడు డగ్లస్
“థాంక్ యు డగ్లస్” అన్నాడు రాజేష్
“అయ్యో. . నేనే మీకు థాంక్స్ చెప్పాలి. . ఓ విషయం చెప్పు. . ఇవాళ నేను కలవబోయే మీ మేనేజర్స్ లో కీ పర్సన్ ఎవరు?”
రాజేష్ సాలోచనగా అన్నాడు, “నా మేనేజర్ నారాయణన్ మీకు తెలుసు కదా. . అతని మేనేజర్ ప్రకాష్ రావు అని ఉన్నారు. . ఆయన కీ పర్సన్. . ఇవాళ డిన్నర్ కి ఆయన వస్తున్నారు”
“వావ్. . ఇవాళ ఆయన్ని కలవాలి. . ఇక్కడికి వచ్చే ముందు కనుక్కున్నాను. . ఇన్ఫోసిస్, విప్రో కన్నా మీ కంపెనీ వాళ్ళు బాగా పే చేస్తారట కదా. . నాకు మా కంపెనీ పెద్దగా నచ్చట్లేదు. . ఆ ప్రకాష్ ని కలిసినప్పుడు, అమెరికాలో మీ కంపెనీ లో పని చేసే అవకాశం ఉందేమో కనుక్కోవాలి. . . ఈ ట్రిప్ పర్పస్ అదే.” అంటూ చెప్పుకుపోతున్నాడు డగ్లస్!

* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *